Monday, December 23, 2013

ఆకాశమల్లి

  -   మండువ రాధ

గుట్టదారిలో వెళ్ళే వాళ్ళందరూ నన్ను దాటుకునే వెళ్ళాలి. నా కుడివైపుగుండా పోయే ఆ దారిలో వసంత కాలమంతా పూలు రాలుస్తూనే ఉంటాను. చాలామంది ఆగి పువ్వులను ఏరుకుంటారు కానీ ఒకరన్నా ఒక్కసారన్నా తల పైకెత్తి నా కొమ్మలను, పువ్వులను చూడరు. చంద్రుడికి మాత్రం నేనంటే ఎంత ఇష్టమో! నా కొమ్మల మధ్యకే వచ్చి కూర్చుంటాడు. ఆకాశ మల్లెలలోని తెల్లదనాన్నంతా గ్రోలి ధరణికి ఇవ్వాలని ఆశ అతనికి. వసంతంలో అయితే నన్ను అసలు వదలడు.

ఇవాళ తీరిగ్గా వచ్చిన చంద్రుడు "ప్రియ నేస్తమా! ఎందుకు ఎప్పుడూ ఎవరికోసమో ఎదురుచూస్తూ ఉంటావు? రోజూ నీ దగ్గరకు వస్తున్న నాతో స్నేహం చేయలేవా?'' అని అడిగాడు

"చంద్రమా! నేను నీతో స్నేహం చేయలేదా? నిజం చెప్పు. నేను కదా ఎదిగి ఎదిగి నీ స్నేహం కోసం నీకు దగ్గరగా వచ్చిందీ? నీ స్నేహ సౌభ్రాత్రంతోనే కదా ఆకాశమల్లెలు ఇంత అందంగా, తెల్లగా ఉన్నాయి! అయినా ఎందుకో మరి- ఎవరైనా నన్ను కళ్ళెత్తి చూడాలనీ, మల్లెలతో అలంకరింపబడిన నా కొమ్మల అందాన్ని మెచ్చి నన్ను ఆలింగనం చేసుకోవాలనీ ఇటీవల కోరికగా ఉంది'' అన్నాను.

ఆ వసంత తొలి ఝాము వేళ నెమ్మదిగా కదులుతున్న గాలి ఆగి నా మాటలను వింది. మంచులో తడుస్తున్న పచ్చని లేత చిగుళ్లు, అరవిచ్చుతున్న పువ్వులు నా మాటలకు కళవళపడ్డాయి. చంద్రుడు దిగులుపడుతూ తప్పుకున్నాడు. సూర్యుడు మెల్లమెల్లగా పైకి సాగుతూ చెట్లకు రంగులద్దాలని ప్రతి రెమ్మ తేమనీ తుడుస్తున్నాడు.

తడిసిన నేల ఆరుతున్నపుడు వచ్చే వాసనని ఆస్వాదిస్తూ నన్ను నేను ఉత్సాహపరుచుకుంటున్నాను. మరిన్ని పువ్వులను విప్పారుస్తున్నాను. గుట్టలో ఉన్న జంతువులన్నీ ఒళ్ళు విరుచుకుంటున్నాయి. పక్షులు బయటకు వెళుతూ పిల్లలకు జాగ్రత్తలు చెపుతున్నాయి. సీతాకోక చిలుకలు నన్ను దాటి పైకి ఎగరాలని ప్రయత్నిస్తున్నాయి. మల్లెల మీద కాసేపు కూర్చుని మళ్ళీ లేస్తున్నాయి. ఎంతందంగా ఉందో ఆ దృశ్యం! తెల్లని నా ఆకాశ మల్లెల మీద రంగురంగుల సీతాకోక చిలుకలు. తనివి తీరా చూద్దామనుకునే లోపు ఎగిరిపోతున్నాయి. అబ్బబ్బ! నిలకడ ఉండదా వీటికి?

మధ్యాహ్నమయింది. సూర్యకిరణాలతో గుట్ట వేడెక్కుతోంది. పొదల మధ్య ఉన్న కాలిబాటమీద మనుషుల అలికిడి వినిపించగానే పక్షులు, పిట్టలూ గాఢ నిశ్శబ్దంలోకి వెళ్లిపోయాయి. ఆకులు కూడా కదలకుండా చూస్తున్నాయి. ఉడతలు మాత్రం ఏదో పెద్ద పని ఉన్నట్లు ఆ చెట్టుకీ ఈ చెట్టుకీ మధ్య గిరికీలు కొడుతూ తిరుగుతున్నాయి. వచ్చేది ఎవరో చూద్దామని మెడని నిక్కపరుచుకుని చూసాను. ఉహు! నాకు కనపడలేదు. వాళ్లు ఇంకా కింద రాళ్ళగుట్టనే దాటలేదు. అది దాటితే గాని నాకు కనపడరు.

ఆ దారిలో పోయే వాళ్లందరినీ ఆసక్తిగా గమనిస్తుంటాను. నా పువ్వులను మృదువుగా ఏరుకుంటున్న వాళ్ళలో ఎవరైనా ఆ చేతులతో నన్ను చుట్టేసి నా వైపు చూస్తే వారి వదనాన్ని నా మల్లెలతో అభిషేకించాలని నా కోరిక. అది ఎప్పటికైనా తీరేనా? గుండె గొంతులో కొట్లాడింది. అదుగో! కనపడ్డారు ఇద్దరు. ఆహా! ఆ అమ్మాయి ఎంతందంగా ఉందీ! పక్కన అతను ఆమెను ఆనుకుని, పొదువుకుని నడుస్తున్నాడు. మధ్యలో ఇద్దరూ నిలబడి ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఏవేవో కబుర్లు చెప్పుకుంటున్నారు. ఆమె సిగ్గుతో అతని భుజం మీద వాలిపోయి నవ్వుతోంది.

"ఇప్పుడే ఇక్కడే నువ్వు నాకు కావాలి'' అంటున్నాడు.

"ఉహు! వద్దు'' అంటూ నా వైపుకి పరిగెత్తింది ఆ అమ్మాయి. ఇంకొక్క అడుగు వేస్తే కింద పరుచుకుని ఉన్న ఆకాశ మల్లెలలో ఆమె పాదాల గుర్తులు పడేవే. కాని అతను వచ్చి ఆమె నడుముని పట్టేసుకున్నాడు. ఆమెని తన వైపుకి తిప్పుకుని ఆమె మెడలో తల దాచుకున్నాడు. చెవి కొనను మునిపంటి తో కొరుకుతూ "ప్లీజ్ రేణూ! ఇప్పుడే'' అంటున్నాడు.

మేఘాలు సూర్యుడిని కప్పేసాయి. గాలి చెట్లకిందకి చేరి మెల్లగా మందంగా ఊగుతోంది. ఇద్దరూ వంగి పూలు ఏరుకుని ఒకరిపై ఒకరు చల్లుకున్నారు. తలమీద పడిన పూలతో ఆమె అందం ద్విగుణీకృతమైంది. పూల సుగంధం ఆమె మేనుని మైమరిచేట్లు చేసిందేమో! మత్తుగా కళ్లు మూసుకుంది. ఆమెనే చూస్తున్న అతని కళ్ళలో ఉద్రేకం స్పష్టంగా కనిపిస్తోంది. సింహం లేడిని లాక్కుని పోయినట్లుగా అతడు ఆమెను నా ఎడమవైపుకి లాక్కొచ్చాడు. ఒత్తుగా పరుచుకుని ఉన్న మల్లెలపైన ఆమెని పడవేసి ఆమె పక్కన చేరాడు. అతడి చేతులు ఆమెని ఎక్కడెక్కడో తడుముతున్నాయి. అతని చేతిలో ఆమె బొమ్మలాగా ఒదిగిపోతోంది. సన్నని నిట్టూర్పులూ, మోహావేశపు మూలుగులూ ఆ మధ్యాహ్న నిశ్శబ్దానికి కొత్తగా ఉన్నాయి.

ఆ సమయంలో వాళ్ళు నా వైపు చూడరని తెలిసి కూడా చూస్తారేమోనన్న ఆశతో నా కొమ్మలను ముందుకు వంచి వారినే చూస్తున్నాను. అతడు ఆమెని లోబరుచుకున్నాడు. నా చుట్టూ ఏదో మార్పు. వంగి ఉన్న నేను ఉలిక్కిపడి తల పైకెత్తాను. దిగులు నన్ను కమ్మేసింది. చైతన్యంలో ఊగిసలాడవలసిన ప్రకృతి విభ్రాంతినొందుతోంది. సూర్యుడు మండిపడుతూ మబ్బుల్లోంచి బయటపడ్డాడు. గాలిసెగలు రేపుతోంది. పక్షులన్నీ ఆందోళనతో కూడిన గొంతుతో కీచుమంటున్నాయి. మైకపు అలలతో ఈదులాడుతున్న ఆ ఇద్దరికీ ఇవేమీ పట్టలేదు. ఈది అలిసిన శరీరాలు బరువెక్కాయో తేలికయ్యాయో గాని నిశ్చలంగా పడి ఉన్నాయి. వెల్లకిలా పడుకుని కళ్ళు మూసుకుని ఏవేవో లోకాల్లో విహరించిన వాళ్ళిద్దరూ ఒక్కసారిగా కళ్ళు తెరిచి నన్ను చూసారు. విభ్రాంతినొందిన ప్రకృతిలో భాగంగా మ్రాన్పడిపోయిన నేను వాళ్ళు నా వైపు చూసినా నా మల్లెలతో అభిషేకించలేకపోయాను. 


ఎన్నాళ్ళగానో ఎదురుచూస్తున్న నా కోరిక తీరిందనే విషయాన్ని కూడా నేను గుర్తించలేదు.

సూర్యుడు అలిగినట్లుగా కొండల వెనక్కి మరలిపోతున్నాడు. ఆమె లేచి కూర్చుని బట్టలు సర్దుకుంది. అతని గుండెలపై చెయ్యివేసి "చక్రీ! ఆలస్యమవుతోంది వెళదాం పద'' అంది నిలబడుతూ. అతనూ లేచాడు. ఆమె జడకీ, బట్టలకీ అతుక్కున్న పూలని యాంత్రికంగా దులిపాడు. వచ్చేటప్పుడు అపురూపంగా పట్టుకుని ఆమెని నడిపించిన అతను ఇప్పుడు ఆమెని పట్టించుకోకుండా వడివడిగా నడుస్తున్నాడు. మెల్లగా, అలసటగా నడుస్తున్న ఆమె అతనిని అందుకోవాలని విఫలయత్నం చేస్తోంది.

నడుస్తూ నడుస్తూ మధ్యలో ఆగిన ఆమె కోసం ఎక్కడివాడక్కడే నిలబడ్డాడు కాని వెనక్కి తిరిగి ఆమె దగ ్గరకు రాలేదు. అతని ఉదాసీనతని గమనించిన ఆమె అతడిని ఏవో బంధాల్లో ఇరికించాలనే తాపత్రయంతో ఆగిన చోటే కూలబడి చేతులతో ముఖం కప్పుకుని ఏడవసాగింది. అతడు తప్పదన్నట్లుగా ముఖం పెట్టి వెనక్కి ఆమె దగ్గరకి వచ్చాడు. ముఖంమీద నుండి ఆమె చేతులను తొలగించాడు. ఏదో చెప్తున్నాడు. ఆమె కళ్ళు తుడిచి తన గుండెలకి హత్తుకున్నాడు. దుఃఖాన్ని మరిచి ఆమె అతని వెనక నడిచింది. కసాయివాడిని నమ్మి అనుసరించే గొర్రె గుర్తొచ్చింది నా కెందుకో ఆ క్షణంలో.


2

తర్వాత చాలా రోజుల వరకూ ఆ దారిలో ఎవరు వచ్చినా వాళ్ళిద్దరేమోనని నేను ఆశగా చూస్తూనే ఉన్నాను. వాళ్ళకోసం ఎదురుచూస్తూ- చూస్తూ నేను నిరాశలో మునిగిపోయానో లేక మొట్టమొదటిసారి కళ్లెత్తి నన్ను చూసిన వాళ్ళని నా పూలతో అభిషేకించలేకపోయాననో- ఎందుకో తెలియదు గాని ఆ రోజు వాళ్ళు వెళ్ళిపోయినప్పటి నుండీ ఏదో దిగులు నన్ను కమ్మేసింది. సీతాకోక చిలుకలు నా దిగులుని పోగొట్టాలని ఈ మధ్య నా పూలపైనే ఎక్కువ సమయం గడుపుతున్నాయి. చంద్రుడు నిశ్చలంగా నా కొమ్మల్లోనే దాగి నా పూలకి మరింత తెల్లదనాన్ని అద్దుతున్నాడు. ఇవేమీ పట్టని నేను నా ఆలోచనలతో మౌనినయ్యాను.

ఎండాకాలపు సూర్యుడు వేడిని కుమ్మరిస్తూనే ఉన్నాడు. గాలి సూర్యుడి తాపానికి కుతకుతా ఉడికిపోతోంది. రోజులు గడుస్తున్నాయి. పచ్చని ఆకులు రకరకాల రంగుల్లోకి మారిపోతున్నాయి. గుట్టలోని చెట్లు క్రమంగా మోడులయిపోతున్నాయి. నేను నా పువ్వులను కోల్పోతున్నాను. చిటారుకొమ్మన మిగిలిన రెండు పువ్వులూ నా మౌనాన్ని అసహనంగా చూస్తున్నాయి. "ఎందుకిలా ఉన్నావు? కనీసం మాకు వీడ్కోలు చెప్పాలనైనా లేదా? నువ్వెందుకు దిగులుగా ఉన్నావో మాకు తెలుసు. కాని వచ్చే పువ్వులు నిన్ను చూసి ఎంత బాధ పడతాయి? నీకు పుట్టినందుకు అవి సంతోషం అంటే ఏమిటో తెలియక నిర్భాగ్యులుగా మారిపోవా? సొగసుగా, అందంగా వెలిగిపోవలసిన పువ్వులు వడలినట్లు అయిపోవా?'' అంటూ ఆ రెండూ కూడా ఒకేసారి రాలిపోయాయి.

'వడలినట్లు' అన్న మాటలు నన్ను ఎంతో బాధ పెట్టాయి. ఆరోజు వారిద్దరి కలయికని మెచ్చని సూర్యుడు ఎంత మండిపడ్డాడు! ఆ ఎండకో, మరెందుకో వడలిపోయిన ఆమె ముఖం గుర్తొచ్చి నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఆకాశం ఒక్కసారిగా ఉరిమింది. రివ్వున వీస్తున్న చలిగాలితో ముసురు. వదలకుండా హోరున వాన కురుస్తూనే ఉంది. నా కన్నీళ్ళు వానలో కలిసిపోయాయి. కిందపడ్డ పువ్వులు మెత్తగా అయి వరద వెంబడి వెళ్ళిపోయాయి. రాత్రంతా కురిసిన వాన నన్ను ప్రక్షాళించి వేకువ ఝామున వీడ్కోలు తీసుకుంది. ఆకాశం ఉండుండి మెరుస్తోంది. వాన చినుకులు కొమ్మలనుండి బొట్లు బొట్లుగా రాలుతున్నాయి.

కన్ను పొడుచుకున్నా కానరాని చీకట్లో దారి చేసుకుంటూ రెండు లైట్లు గుట్టదారిలో వెలిగాయి. అడుగుల చప్పుడు వినిపించింది.

ఆమే-మెరుపులో స్పష్టంగా చూసాను-ఆ అమ్మాయే. చేతిలో గుడ్డలో చుట్టిన శిశువు. గుండెకు అదుముకుని నడుస్తోంది. పక్కనే ఒక మధ్యవయస్కురాలు. ఆమె పోలికలతో ఆమె లాగే ఉన్న ఆవిడ ఆమె అమ్మేమో! ఇద్దరూ నాకు దగ్గరగా వచ్చారు. నా గుండె నిండా ఏవేవో భావాలు. వాళ్ళేం చేయబోతున్నారోననే ఆందోళనతో కూడిన ఉత్కంఠ నన్ను చుట్టేసింది. తన చేతిలో ఉన్న శిశువుకి ముద్దిచ్చి కన్నీళ్ళు కారుస్తూ శిశువుని తన అమ్మకిచ్చి అతనితో కలిసిన చోటే మెత్తని గుడ్డ పరిచింది. ఆమె అమ్మ శిశువుని గుడ్డమీద పడుకోబెట్టింది.పైగుడ్డ తొలగించి విదిల్చి చక్కగా బాబుకి చుట్టింది. బాబే. గుడ్డ తొలగించినపుడు చూసాను. కళ్ళూ, గుప్పెళ్ళూ మూసుకున్న ఆ బాబు ముఖంలో ఎంత నిశ్చింత? హాయిగా,అమాయకంగా నిద్రిస్తున్నాడు. అక్కడే కూర్చుని నిశ్శబ్దంగా ఏడుస్తున్న ఆమెని పట్టి లేపుతూ "పద! తెల్లవారితే ఎవరైనా చూస్తారు'' అంది ఆమె తల్లి.

బాబుని వెనక్కి తిరిగి చూసుకుంటూ, హృదయ విదారకంగా ఏడుస్తూ తన తల్లితో కలిసి వెళ్ళిపోయింది. వాళ్ళు వచ్చినపుడు ఆగిన నా గుండె వాళ్ళు రాళ్ళగుట్ట దిగి వెళ్ళగానే కొట్టుకోవడం ప్రారంభించింది. 'అయ్యో! బిడ్డను వదిలి వెళుతున్నారేమిటి?' ఆవేశంతో, ఆక్రోశంతో నా గుండెలు ఎగిసిపడుతున్నాయి. నా కొమ్మలు బరువై బాబునే చూస్తూ వాలిపోతున్నాయి.

ప్రభాత భానుడు తన కిరణాలతో తడిని పీల్చుకోవడానికి వస్తున్నాడు. ఆకాశంలో ఒక్క మబ్బు తునక కూడా లేదు. గాలి కూడా వేడెక్కి బాబుకి వెచ్చదనాన్నివ్వాలని ఊగుతోంది. పిట్టలూ, పురుగులూ, పక్షులూ, ఉడతలూ నిశ్చేష్టపడి కదలకుండా బాబునే చూస్తున్నాయి. భయవ్యాకులమైన నా మనస్సు నా స్వాధీనంలో లేదు. సహాయం కోసం చుట్టూ చూస్తున్న నాకు పిచ్చిపట్టిన దానిలా వెనక్కి పరిగెత్తి వస్తున్న ఆమె కనిపించింది. ఆమె వెనకనే ఆమె అమ్మ "ఆగమ్మా! నా మాట విను'' అంటూ ఆమెని వెంబడిస్తోంది. పరిగెత్తి పరిగెత్తి అలిసిన ఆమె అలాగే నేలమీద చతికిలపడి బిడ్డని కౌగిలించుకుని నిద్రపోతున్న బిడ్డకి ఎగిసిపడుతున్న రొమ్ముని అందించింది. కాసేపట్లో అక్కడికి చేరిన ఆమె అమ్మ కూతురిని చూస్తూ స్థాణువై నిలుచుంది.


"అమ్మా! ఎవరేమైనా అనుకోనీ! నేను నా బిడ్డను వదలను. వాడు నన్ను మోసం చేస్తే నేనెందుకు సిగ్గుతో తల వంచుకోవాలి? దానికి నా బిడ్డెందుకు బలవ్వాలి? చెప్పమ్మా!'' అంది.

ఆమె మాటలు వింటున్న నాకు లోపల పెద్దపెట్టున వేడి ఉత్పాదకం వచ్చినట్లయింది. 'మోసగాడు'-నా కొమ్మలు కోపంతో పటపటలాడాయి. ఆ శబ్దానికి బాబు నిద్రలోంచి ఉలిక్కిపడ్డట్టుగా లేచి ఏడవసాగాడు. ఆమె బాబుని సముదాయిస్తూ లేచి నిలబడింది. అమ్మతో కలిసి మెల్లగా నడుచుకుంటూ వెళుతున్న ఆమె నడకలోని స్థిరత్వం నాకు ఆనందాన్ని కలిగించింది. తేలికపడ్డ నా హృదయంలో నుండి గాఢ నిట్టూర్పు వెలువడింది.

3

జీవితచక్రం గిర్రున తిరుగుతోంది. ఎన్నో వసంతాలు వచ్చాయి. పోయాయి. నా మనసు మాత్రం ఆమె స్థిరత్వాన్ని చూసినప్పటినుండి సంతృప్తికరమైన వెలుగుతో నిండుగా ఉంది.

ఆ రోజు ఉషోదయం వేళ నుంచే సూర్యుడు చిరువేడితో మమ్మల్ని ఆహ్లాదపరుస్తున్నాడు. ఆ వెచ్చదనంలో ప్రాణులన్నీ విశ్రాంతి తీసుకుంటున్నాయి. గుట్టంతా ప్రశాంత నిశ్శబ్దంలో ఓలలాడుతోంది. మనుషులు రావడం మానేసాక పొదలతో ఇరుకుగా మారిన ఆ గుట్టదారిలో చాన్నాళ ్ళకి మళ్లీ మనుషుల అడుగుల చప్పుడు. ఆనందంతో మెడ నిక్కపొడుచుకుని చూసాను. ఆమే! చెవుల దగ్గర జుట్టు కాస్త తెల్లబడింది. ఆమె పక్కన హుందాగా నడుస్తూ ఆమె పోలికలతో ఉన్న యువకుడు. ఆమె కొడుకే-సందేహం లేదు. సంతోషంతో గుండె ఉయ్యాలలూగింది. ఆమెనీ, బాబునీ అందుకోవాలని నా కొమ్మలు విశాలమయ్యాయి. ఊగుతూ ఆహ్వానం పలికాయి. 'వీళ్ళు వస్తున్నట్లు నాకు కాస్త ముందే తెలిసినట్లయితే ఎంత బావుండేది? మరిన్ని మల్లెలని రాల్చేదాన్ని కదా!' అనుకుంటూ నేను వాళ్ళ వైపే రెప్పవాల్చకుండా చూస్తున్నాను.

ఇద్దరూ నా దగ్గర ఆగారు. మల్లెలపై మృదువుగా అడుగులేస్తూ నా ఎడమవైపుకి వచ్చిన ఆమె "బాబూ! ఈ సమాజానికి భయపడి నిన్ను ఇదిగో ఇక్కడే వదిలేసాను రా. ఆనాడు నేను అమ్మమ్మని ఎదిరించి నిన్ను తీసుకుని వెళ్ళడానికి వెనక్కి రాకపోయినట్లయితే నిన్ను కోల్పోయి ఉండేదాన్నే. నిన్నే కాదు నా జీవితాన్నీ కోల్పోయి ఉండేదాన్ని'' అంది రుద్ధమైన కంఠంతో. జ్ఞాపకాల కన్నీళ్ళు ఆమె బుగ్గలపై దొర్లాయి.


ఆ యువకుడు ఆమెని పొదువుకొని "ఊరుకోమ్మా" అన్నాడు.

ఆమె కొడుకుని సంతోషంగా చూసుకుంది.  "నేను నిన్ను వదిలి వెళ్ళిన తర్వాత కొంతసేపు ఈ చెట్టే నిన్ను తల్లిలా కాపాడింది" అంటూ నాకు దగ్గరగా వచ్చి నన్ను ఆప్యాయంగా కౌగిలించుకుని తల ఎత్తి నా కొమ్మలవైపు చూసింది. ఆహా! ఇన్నాళ్ళకి, ఇన్నేళ్ళకి నా కోరిక తీరింది. నా అంత ఎత్తుకి ఎదిగిన ఆమె కళ్ళలోని స్వాతిశయాన్ని చూస్తూ నేను నా మల్లెలతో ఆమెను అభిషేకించాను.

****

(ఆంధ్రజ్యోతి ఆదివారం 15.12.2013 ప్రచురణ)6 comments:

 1. కథ చాలా బాగుంది, రాద గారూ, మీ శైలి బాగుంది.

  ReplyDelete
 2. Beautiful narration Radha garu! I read this one in facebook when someone posted.
  Now I happened to check your comment in vaakili and came to your blog from there.

  ReplyDelete
 3. Nijame Gorre Kasayi vaadine nammutundi ....kadhanam baagundi Radha ji

  ReplyDelete
  Replies
  1. థాంక్ యు నీలిమ గారూ.

   Delete

P