Thursday, May 1, 2014

నిర్లక్ష్యం - మ్యూజింగ్స్ - 4


నాల్గవ తరగతి బుజ్జి పిల్లలకి ప్రతి బుధవారం మొదటి పీరియడ్ తెలుగు. ఆ క్లాస్ లో తెలుగు కథలు ముఖ్యంగా భారత, భాగవత, రామాయణ కథలు చెప్తాను. ఈ వారం ఏం కథ చెప్పాలా అనుకుంటూ నా పుస్తకాల ర్యాక్ దగ్గరకి వెళ్ళా. ర్యాక్ పైన పెట్టి ఉంది రమణ మహర్షి జీవిత చరిత్ర. యధాలాపంగా పుస్తకం తెరిచాను. ' తండ్రీ! నీ అనుజ్ఞ ప్రకారం వచ్చేశా' అంటున్నాడు రమణుడు అరుణగిరినాధుడి దగ్గర నిలబడి.

ఎందుకనో మనమందరం తండ్రి మాట జవదాటం. అదే అమ్మైతే - మనం చెప్పినట్లు ఆమెని వినమంటాం. ఈరోజు పిల్లలకి శ్రావణ కుమారుడి కథ దగ్గర నుండీ రాముడు అడవులకి వెళ్ళడం వరకు చెప్పాలనుకున్నాను.

మా స్కూల్ లో రెండో భాషగా తెలుగు కాని హిందీ కాని తీసుకోవాలి. ఇక్కడ మన రాష్ట్ర పిల్లలే కాక ఇతర రాష్ట్రాల పిల్లలూ, అమెరికా, లండన్ లాంటి దేశాలలో నివసించే మన వాళ్ళ పిల్లలూ ఉంటారు. మన తెలుగు వాళ్ళకి తెలుగుని రెండవ భాషగా తీసుకుంటే మంచిదని సలహా ఇస్తాం. 4 వ తరగతిలో ఉన్న ఇరవై మంది పిల్లలలో ఎనిమిది మంది తెలుగు తీసుకున్నారు. ఎనిమిది మందీ లాంగ్వేజ్ రూమ్ లోకి వచ్చారు. ఈరోజు కథల రోజు అని తెలుసుగా అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు.

"అక్కా! ఈరోజు ఏం కథ చెబుతావు?" అన్నాడు పార్థు.

"చెబుతావు అని అనకూడదు - చెబుతారు అనాలి" అంది లక్ష్మి.

పార్థు అమెరికా నుండి వచ్చాడు. వాడికి అస్సలు తెలుగు రాదు. సాయంత్రాలు రెమిడియల్ క్లాసెస్ తీసుకుని తెలుగు నేర్పాను. రెండు నెలల్లో బాగా నేర్చేసుకున్నాడు. ఇప్పుడు తన తరగతి పిల్లలకంటే బాగా రాయగలుగుతున్నాడు. తెల్లని కాగితాన్ని మనకిస్తే మనకి ఏం కావాలంటే అది రాసుకోవచ్చు కదా అనిపిస్తుంది నాకు వాడిని చూస్తుంటే. భాషను తప్పుగా నేర్చుకుని వచ్చిన పిల్లలని కరెక్ట్ చేయడమే చాలా బాధ.

అయితే చాలా పెద్ద అక్షరాలు రాస్తున్నాడు వాడు. పెద్ద పెద్ద బండ అక్షరాలు. నెల రోజులకే నోట్సు అయిపోగొడుతున్నాడు. ఎన్ని సార్లు చెప్పినా ప్రయోజనం లేదు. "అబ్బబ్బ! ఎన్ని సార్లు చెప్పేదిరా! చిన్న చిన్న అక్షరాలు రాయరా!" అని విసుక్కున్నాగాని, రాసేటప్పుడు పక్కనే నిలబడి ‘చిన్నవి - చిన్నవి’ అంటున్నాగాని లాభం లేదు. నేను చెప్పిందే చెప్తున్నాను. వాడు రాసిందే రాసి ఇప్పటికి మూడు నోట్సులు అయిపోగొట్టాడు. కాపీ రైటింగ్ రాయించినా (ఈ కాపీ రైటింగ్ పిల్లలకి శిక్ష బాబూ - ఇది ఎవరు కనిపెట్టారో గాని) నోట్సు దగ్గరకు వచ్చేప్పటికి యధాప్రకారం బండ అక్షరాలే.

సరే! ఈ బుధవారం అనుకున్నట్లుగానే శ్రావణ కుమారుడి కథ, అతడి తల్లిదండ్రులు దశరధుడికి ఇచ్చిన శాపం, తండ్రి మాట మేరకు రాముడు అడవులకు వెళ్ళడం వరకు చెప్పాను.

"మీరు కూడా పెద్దవారయ్యాక మీ అమ్మా నాన్నలకు శ్రావణ కుమారుడిలాగా సేవ చేయాలి. అలాగే రాముడిలా తల్లిదండ్రులు చెప్పిన మాటలను శ్రద్ధగా వినాలి " అని చెప్పాను.

"సరే! అక్కా!" అన్నారు అందరూ ఒక్కసారిగా.

"మా నాన్న చెప్పినట్లే వింటా నేను ఎప్పుడూ" అన్నాడు పార్థు.

"నేను కూడా" అంది లక్ష్మి.

"నేను మా నాన్న చెప్పినట్లు వింటా మళ్ళా మా అమ్మ చెప్తే కూడా వింటా" అన్నాడు కార్తిక్.

"నేను కూడా. నేను కూడా" అంటూ అందరూ అరిచారు. "ష్! ష్!" అని నేను అంటుండగానే
బెల్ మోగింది. అందరూ క్లాస్ లోకి వెళ్ళిపోయారు.

పార్థు నా దగ్గరకి వచ్చి "అక్కా! మరీ శ్రావణకుమారుడు అమ్మని నాన్నని కావిడిలో కూర్చోబెట్టుకున్నాడు కదా! ఆ కావిడి ఎక్కడ దొరుకుతుంది?" అన్నాడు.

"ఎందుకూ?" అన్నాను ఆశ్చర్యంగా.

"మా అమ్మని నాన్నని దాన్లో కూర్చోపెట్టుకుని అన్ని ప్లేస్ లూ చూపిస్తా. అప్పుడు పాపం వాళ్ళు నడవలేరు కదా!" అన్నాడు. అప్పుడు అంటే వాడి ఉద్దేశం అమ్మానాన్న ముసలి వాళ్ళయ్యాక అని.

పెద్దగా నవ్వాను. "ఓరినీ! ఈరోజుల్లో కావిడి ఎందుకూ కార్లు, మోటర్ సైకిళ్ళు ఉన్నాయిగా!" అన్నాను.

"కార్లో నుండి దిగాక దాన్లో కూర్చోబెట్టుకుంటా అక్కా!" అన్నాడు తను అన్న దాన్ని సమర్థించుకుంటూ.

"వీల్ చైర్స్ ఉన్నాయిగా. అయినా ఇప్పుడు అవన్నీ ఆలోచించక్కర్లే. ఇప్పుడు అమ్మ నాన్న చెప్పినట్లు విని శ్రద్ధగా చదువుకోవడం చెయ్యి. అన్నిటికంటే ముఖ్యంగా అక్షరాలు కుదురుగా, చిన్నవిగా రాయడం నేర్చుకో" అన్నాను - 'ఆ చివరి మాట ఇప్పుడు అనకుండా ఉండాల్సింది. ఛ! ఈ మానవ మనస్తత్వం అవకాశం దొరికితే తప్పులు ఎన్నుతుందే ' అని బాధ పడ్డాను కాసేపు.

అతడు స్కూల్లో చేరి మూడు నెలలు అవుతోంది. వాడి బండ అక్షరాలు నన్ను బాధిస్తూనే ఉన్నాయి.

ఆ రోజు వాళ్ళ నాన్న గారు విజిట్ కి వచ్చారు. విజిట్ కి వచ్చినప్పుడు పేరెంట్స్ తప్పనిసరిగా ప్రతి టీచర్ తో మాట్లాడాలి. మధ్యాహ్నం లంచ్ అయ్యాక పార్థు నాన్నగారు నాతో మాట్లాడటానికి వచ్చారు.

"చాలా బాగా నేర్చుకున్నాడండీ తెలుగు. మీరేమీ నేర్పించకుండా తెల్లని కాగితాన్ని నాకు ఇచ్చారు. నాకు కావలసినట్లు నేను చక్కగా నేర్పించుకున్నాను. ఇప్పుడు వాడి క్లాస్ లెవెల్ లో ఉన్నాడు. కాని అక్షరాలు మాత్రం బండవి రాస్తున్నాడు" అన్నాను.

"వాడి నోట్సులు చూశానండీ" అన్నాడు ఆయన.

"ఇంకో నెలలో ఇంటికి వస్తాడు కదా! ఎవరైనా హాండ్ రైటింగ్ స్పెషలిస్ట్ దగ్గరికి పంపిస్తే మంచిదేమో! అయినా మీరు 'టీచర్స్ దగ్గర నుండి కంప్లైంట్ వచ్చింది' అని వాడికి చెప్పి చూడండి" అన్నాను.

తర్వాత రోజు తెలుగు క్లాస్ లో చాలా చక్కగా, కుదురుగా (అయితే నిదానంగా) రాస్తున్న పార్థుని చూసేటప్పటికి ఇది కల కాదు కదా అనిపించింది. నేనే కాదు క్లాస్ లోని పిల్లలందరూ 'వావ్ పార్థూ. వాటె గ్రేట్ చేంజ్ ' అంటూ అరిచారు.

"నా నాన్నతో నువ్వు కంప్లైంట్ చేశావుగా అక్కా! నాన్న నాకు చెప్పాడు. నిన్న నువ్వు నాన్న చెప్పినట్లు వినాలని చెప్పావుగా. ఇంక బాగా రాస్తా" అన్నాడు పార్థు. భలే ముచ్చటేసింది.

వాడి క్లాసులోని పిల్లలు కూడా వాడిని చూసి కుదురుగా రాయడం మొదలుపెట్టారు. వాడికి తెలియకుండా వాడి నోట్సుని - బాగా రాయలేని 9, 10 తరగతి పిల్లలకి చూపిస్తే వాళ్ళు కూడా అశ్చర్యపోయారు. మా స్కూల్లో ఇప్పుడు వాడు బాగా రాయలేని వాళ్ళకి ఆదర్శం అయిపోయాడు.

మనకి కూడా మన లోపలి తండ్రి మనం తప్పు చేసినప్పుడల్లా సరియైనదేదో తెలుసుకోమని అనుజ్ఞ ఇస్తూనే ఉన్నాడు. స్వీకరించే స్థితిలో మనం లేము. ఉంటే లోకంలో ఎందుకింత హింస, బాధ, దు: ఖం ?


                                                                     **

4 comments:

  1. Great.. Ante ee rojullo kuda sravana kumarulu unnaru. Saraina guruvule avasaram. Talli tandri manchi elaanu cheptaru. Etochi vallu cheppinattu vinamani nerpe guruvule avasaram.

    ReplyDelete
  2. అవును. నేనెప్పుడూ అదే చెప్తాను. టీచర్స్ లో నిబద్ధత ఉన్నప్పుడు తప్పకుండా మంచి influence బిడ్డలపైన ఉంటుంది

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete

P