Wednesday, May 21, 2014

....... చరిత్ర సమస్తం


అడవిలోని జంతువులన్నీ సింహం గుహ ముందు కొలువు తీరి ఉన్నాయి. సింహం తన గుహ ప్రక్కగా ఉన్నఎత్తైన రాయి మీద కూర్చుని ఉంది. దాని అనుచరుడు నక్క ప్రక్కనే చేతులు కట్టుకుని నిలబడి ఉంది. కుక్క సింహం ఇచ్చే ఆజ్ఞలను తీసుకోవడానికి ఎదురుగ్గా కూర్చుని ఉంది.

జంతువులలో నుండి చిరుత పులి "మహాప్రభూ! ఎవరో వేటగాడు మన అడవిలోకి చొరబడి విచ్చలవిడిగా జంతువులను వేటాడుతున్నాడు" అంది.

"ఔను ప్రభూ! వాడి దగ్గర తుపాకీ ఉంది. దాన్ని ఎక్కు పెట్టాడంటే పారిపోవడానికి కూడా వీలు లేకుండా పటపటా అన్ని జంతువులూ రాలిపోతున్నాయి" అంది ఖడ్గమృగం మూతి తిప్పుకుంటూ.

ఇంతలో ఏనుగు ముక్కుతూ, మూలుగుతూ గున గున నడుస్తూ వచ్చింది. దాని కాలుకి కట్టు ఉంది. "నిన్న తుపాకీ గుండు రవ్వ నా కాలుని తాకింది. అబ్బ! ప్రభూ! ప్రాణం పోయిందంటే నమ్మండి" అంది వణుకుతూ.

"పరిగెత్తితేగా నువ్వు - ఎప్పుడు చూసినా తిండి ధ్యాసే నీకు" అంది పులి వెటకారంగా.

పులి మాటలని పట్టించుకోకుండా 'ఎవరీ వేటగాడు? ' అని ఆలోచించసాగింది సింహం.

దూరం నుండి కుక్కలు పరిగెత్తుకు వస్తున్న చప్పుడు వినపడింది. రొప్పుతూ వచ్చిన నాలుగు కుక్కలు సింహం ముందు ఆగి గసపోసుకున్నాయి. సింహానికి వినయంగా నమస్కరించి "ప్రభూ! ఆ వేటగాడు సామాన్యుడు కాదు. ఇలాంటి వాళ్ళు అక్కడ చాలా మంది ఉన్నారు. మన ఆనుపానులన్నీ వాడికి తెలుసట. వాడి అనుచరులతో ఎక్కడెక్కడ ఎవరెవరిని ఎలా కాల్చి చంపాలో, ఎలా దోచుకోవాలో చెప్తుంటే విన్నాము" అన్నాయవి ఆందోళనగా.

'అయ్యో! ఈ అడవికి రాజుని నేను. అంతా వీడు కాజేసుకుని వెళితే నాకేం మిగులుతుంది బూడిద. వీడి పని పట్టాలి' అనుకుంది సింహం మనసులో.

సాధు జంతువులన్నీ ఆ సంభాషణ అంతా మౌనంగా వింటున్నాయి. వాటికి ఈ వేటగాడి వల్ల పెద్ద నష్టమేమీ వాటిల్లలేదు. వాళ్ళ జాతిని సింహమే ఎక్కువ శాతం కాజేసింది గాని. అయినా అవి అక్కడ నుండి లేచి వెళ్ళకుండా వింటూ కూర్చుని ఉన్నాయి.

ఉదయం దయతో వెలిగిన సింహం కళ్ళు మధ్యాహ్నం అయ్యేటప్పటికి కౄరంగా మారడం గమనించిన కొన్ని నక్క లాంటి తెలివైన జంతువులు ఏదో పెద్ద పని ఉన్నట్లు మెల్లగా తప్పుకుంటున్నాయి. అవి తప్పుకోవడం చూసి సంగతి గ్రహించిన మరి కొన్ని చిన్నగా వెనక్కి సర్దుకుంటున్నాయి. పాపం వేలకొలదీ ఉన్న అమాయకపు జంతువుల మంద సింహంతో తమకున్న వివిధ కష్టాలను చెప్పుకోవాలని నోళ్ళు తెరుచుకుని సింహం వైపు చూస్తూ కొన్ని, ఆపసోపాలు పడుతూ కొన్ని, కునుకు తీస్తూ కొన్ని అక్కడే కూర్చుని ఉన్నాయి.

ఇంతలో హడావుడిగా సింహం భార్య వచ్చి సింహం చెవిలో "పిల్లలు ఆకలితో నకనకలాడుతున్నారు. నీ రాచరికం మండినట్లే ఉందిలే - పిల్లల సంగతి చూడు" అంది.

సింహం కుక్క వైపు చూసింది. ఆ మాటలు కుక్కకి కూడా స్పష్టంగా వినిపించాయి. సింహం తన వైపు చూడగానే కుక్క లేచి "కుక్క సోదరులారా! మీతో ఈ వేటగాడి గురించి అత్యవసరంగా మాట్లాడాలి. అందరూ నా వెంట రండి" అంటూ తన జాతినంతా దూరంగా తీసుకుపోయింది.

మధ్యాహ్నం అయింది. సింహం నిర్లజ్జగా అందరి ఎదురుగ్గానే పంజాని విసిరి తన ఎదురుగా కూర్చుని కునికిపాట్లు పడుతున్న ఎద్దుని చంపి తన గుహలోకి ఈడ్చుకుపోయింది.

ఈ దృశ్యాన్ని చూసిన కొన్ని జంతువులు ఇది మామూలేనన్నట్లు ఒక దాని ముఖం ఒకటి చూసుకుని అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాయి. పాపం ఇప్పుడిప్పుడే పెద్దవవుతున్న జంతువులు మాత్రం దిగా్భ్రంతితో దిక్కులు చూసి అక్కడి నుంచి భయంగా పరిగెత్తాయి.

***


మర్నాడు జంతువులన్నీ వాటి జాగ్రత్తలో అవి ఉన్నాయి. యధాప్రకారం తమ తమ పిల్లలకి వేగంగా పరిగెత్తడంలో, దాక్కోవడంలో శిక్షణ నిస్తున్నాయి. అపాయాల నుండి రక్షించుకునే ఉపాయాలు విశదంగా వివరిస్తున్నాయి.

ఇంతలో వేటగాడు కాలవ ఒడ్డున చనిపోయి పడి ఉన్నాడనే వార్త అడవి అంతా మార్మోగేట్లు కావ్ కావ్ మని అరుస్తూ చెప్తోంది కాకి. అది విన్న జంతువులన్నీ తమ తమ పనులన్నింటినీ వదిలేసి కాలవ ఒడ్డుకి పరిగెత్తాయి.

వేటగాడి శరీరం నిండా రక్తం. అతని ఆయుధం తుపాకి అతని భుజాన్నే వేళ్ళాడుతోంది. జంతువులు అతడి చుట్టూ గుంపుగా చేరి అతడినీ, అతని తుపాకీని ఆశ్చర్యంగా చూస్తున్నాయి.

"మహాప్రభువుల వారు వస్తున్నారు. అందరూ ప్రక్కకి తప్పుకోండి" అనే నక్క అరుపులు వినపడి అన్నీ ప్రక్కకి తొలగి సింహానికి దారి ఇచ్చాయి. కొన్ని జంతువులు ఎందుకైనా మంచిదని సింహానికి దూరంగా వెళ్ళి నిలబడ్డాయి. అమాయకులైన జంతువులు యధావిధిగా మందలా - నిట్టూరుస్తూ కొన్ని, 'పాపం' అనుకుంటూ కొన్ని, రాజు గారు ఏం చెప్తారో విందామన్నట్లుగా కొన్ని అక్కడే తచ్చట్లాడుతున్నాయి.

"పాపం. ఎలా చనిపోయాడో" అంది కుందేలు.

"ఎవరో వెనక నుండి దాడి చేసి చంపేశారు కదా ప్రభూ!" అంది జింక సింహం వైపు చూస్తూ భయంగా.

"దాడి ఎవరూ చేయలేదు. అతడు గుండె ఆగి మరణించాడు" అంది సింహం కుక్క, నక్క, పులి, చిరుతల వైపు చూస్తూ.

కుక్క గంభీరంగా ఔనన్నట్లుగా తల ఊపింది.

"అంతే అంతే. సరిగ్గా కనిపెట్టగలరు మీరు" అంటూ ఊదరగొట్టింది నక్క.

సింహం సంతోషంతో వికటాట్టహాసం చేస్తూ "ఇలాంటి కౄరులని భగవంతుడే శిక్షిస్తాడు. ఏదైతేనేం ప్రజలారా! నాకన్న బిడ్డలారా! మనమిక ప్రశాంతంగా జీవించవచ్చు. ఇతనిని అతడి తుపాకీతో సహా శ్మశానికి తీసికెళ్ళి తగలబెట్టండి" అంది.

వెళుతూ వెళుతూ గొర్రె వైపు చూస్తూ నక్కకి సైగలు చేసింది.

"నిన్ను ప్రభువులు వారు రమ్మంటున్నారం"టూ నక్క గొర్రెని నడిపించుకుంటూ సింహంతో వెళ్ళిపోయింది.

"పాపం గొర్రె" అనుకున్నాయి తెలివైన జంతువులు.

"పని పూర్తి చేయండి" అంటూ పులి, చిరుత, ఏనుగు మొదలైన బలవంతులైనవన్నీ బలహీనమైన జంతువులకి పని పురమాయించి అక్కడ నుండి సంతోషంగా వెళ్ళిపోయాయి.

జింకలూ, ఎలుగులూ పాడెని ఎత్తుకున్నాయి. గొర్రెలూ, మేకలూ, లేళ్ళూ, కుందేళ్ళూ, కోళ్ళూ, అన్ని రకాల పక్షులూ ధారాపాతంగా కన్నీళ్ళు కార్చుకుంటూ -

"అయ్యో! వేటగాడా! నువ్వున్నట్లయితే మాకు భయం ఉండేది కదా! మేము జాగ్రత్తగా ఉండటం నేర్చుకునే వాళ్ళం కదా!" అని ఒక కుందేలు అంటే -

"కొంతమంది ఆటలు కాస్త కట్టడి అయ్యేవి కదా వేటగాడా!" అని ఓ చిలుక ఏడ్చింది.

"ఎవరి బిడ్డవో కదా! ఈ అడవిలో దిక్కు లేని చావు చచ్చావు" అని పావురం అంటే -

"మా పిల్లలకి నీ గురించి చెప్పి ప్రపంచంలో మంచిచెడ్డలు ఎలా ఉంటాయో తెలియజెప్పుకుంటున్నాం వేటగాడా! " అని పిల్లి రోదించింది.

అన్నీ ముక్కులు ఎగబీల్చుకుంటూ శవయాత్రలో పాల్గొన్నాయి.

ఇదంతా చూస్తూ దూరంగా నిలబడ్డ జిరాఫీ, జీబ్రా, పెంగ్విన్, ఆసి్ట్రచ్ లు వాటి ఏడుపుకు ఆశ్చర్యపోయి "వేటగాడు చనిపోతే మీరెందుకు ఏడుస్తున్నారు? అతడు మీకు రాజా? లేక మేలు చేసేవాడా? " అన్నాయి.

"మేలా పాడా? వీళ్ళూ, వాళ్ళూ అందరూ అందరే. ఎవరైనా చచ్చినపుడు అలా మాట్లాడుకుని, ఇలా ఏడవడం మా ఆచారంలే" అంది కాకి ఈసడింపుగా.


*******


No comments:

Post a Comment

P