Thursday, July 31, 2014

అంతర్మథనం



ఈ నెల పాలపిట్టలో నా కథ "అంతర్మధనం" (చాన్నాళ్ళ క్రితం రాసి పంపిన కథ ఇప్పటికి పబ్లిష్ అయింది) చాలా మంచి పత్రిక అని మీ అందరికీ తెలుసు. ఆదరించాలని ఆ పత్రిక మనల్నందరినీ కోరుతోంది. చందా వివరాల కోసం చూడండి ప్లీజ్.... http://palapittabooks.blogspot.in/
===============================================================

"టోటల్ కొలెస్ట్రాల్ చాలా ఎక్కువగా ఉంది టాబ్లెట్స్ వేసుకుంటే మంచిదేమో - ఏమంటావు మాధవీ?" అంది మా ఫ్యామిలీ డాక్టరు.

ఈ అల్లోపతీ మందులు ఒకసారి వాడటం మొదలు పెడితే ఇక ఆపలేం కదా ఒకసారి నేచురోపతి సెంటర్ కి వెళ్ళి చూద్దాం అనుకుని సెంటర్ కి ఫోన్ చేసి ఇరవై రోజులకి రూమ్ బుక్ చేసుకున్నాను.

ఎకానమీ డబుల్ రూమ్ ఇచ్చారు నాకు. అంటే నాతో పాటు నా రూమ్ లో మరొకరు ఉంటారు. నాతో పాటు ఉండే ఆమె కూడా ఆంధ్రప్రదేశ్ నుండే వచ్చిందనీ, ఆమె పేరు పౌర్ణమి అనీ రిసెప్షనిస్ట్ చెప్పగానే నాకు రిలీఫ్ కలిగింది హాయిగా బోలెడన్ని కబుర్లు చెప్పుకోవచ్చని.

నేను రూమ్ లోకి వెళ్ళేసరికి ఆవిడ పడుకున్నదల్లా లేచి "హలో" అంది. అబ్బ! ఎంతందంగా ఉంది!!? కళ్ళు తిప్పుకోలేకపోయాను. నేను కూడా "హల్లో" అంటూ విశాలమైన ఆవిడ కళ్ళల్లోకి చూశాను. నవ్వుతున్న ఆమె కళ్ళల్లో లోలోతుల్లో నీలినీడలు - ఎందుకో పాపం!

ఆవిడతో మాట్లాడుతూ బ్యాగ్ లో నుండి బట్టలు తీసి అలమరాలో సర్దుకున్నాను. ఆమె ఇక్కడకి రావడం ఇది మూడో సారిట. ఇక్కడ చేసే ట్రీట్ మెంట్స్ గురించి చెప్తూ ఆవిడ లేచి మోకాలు మీద చేయి పెట్టుకుని కుంటుతూ బాత్ రూమ్ లోకి వెళ్ళింది. - ఆమెకి పోలియో!!! - ఏదో మాట్లాడుతున్న నేను హతాశురాలినై పోయాను.

ఇంత అందమైన ఈమెకి పోలియోనా? మూసుకున్న బాత్ రూమ్ తలుపు వైపే చూస్తూ ఉండిపోయాను అలాగే చాలా సేపు. ఆమె కళ్ళల్లో కదలాడే దిగులు ఆమె కుంటిదవడం వల్లనా? - కాదు కాదు - అది కాదు - ఏదో బాధ. మనకెలా తెలుస్తుంది?

తలుపు చప్పుడయింది. చూపులు తిప్పుకుని అప్రయత్నంగా నా ల్యాప్ టాప్ తీసుకుని ఏదో టైప్ చేస్తున్నట్లు నటించాను. ఏమిటో ఈ మానవ బుద్ధి - ఇలాంటి వారిని మామూలుగా చూడనివ్వదు. అనవసరమైన సానుభూతి చూపిస్తూ కొందరు, ఎగతాళి చేస్తూ కొందరు, అవమానిస్తూ కొందరు వాళ్ళ లోపాన్ని ఎత్తి చూపిస్తూనే ఉంటారు.

బాత్ రూమ్ లోంచి వస్తూ "ఏంటి టైప్ చేస్తున్నారు? " అంది.

"ఓ! నా గురించి చెప్పలేదు కదూ! నేను కథలు రాస్తుంటాను. నిన్ననే ఓ కథ పూర్తయింది. దాన్ని టైప్ చేసి ఇ-మెయిల్ ద్వారా పత్రికలకి పంపుదామని" అన్నాను.

"కథలు రాస్తుంటారా! " ఆనందం ఆమె కళ్ళల్లో. నేనేమీ మాట్లాడకుండా ఆమె వైపు చూశాను.

"నేను ఒక కథ చెప్తాను - నా కథ - నాలాంటి ఆడపిల్లలు తెలుసుకోవాల్సిన కథ. నేను ఒక ప్రమాదం నుండి తప్పించుకుని వచ్చానని అనుకుంటున్నాను. మీకు చెప్పాలి. సాయంత్రం వరకు మనకు ట్రీట్ మెంట్స్ ఏమీ లేవుగా చెప్పనా" అంది.

చలించిపోతున్న ఆమె గొంతు ద్వారా ఆమె మనసులోని దు: ఖం నాకు అర్థం అవుతుంది. ఉద్వేగ తీవ్రతలో ఉన్న ఆమె ఇప్పుడు తన కథని చెప్తే దానిలో స్పష్టత ఉండదని నాకు తెలుసు.

"ప్రయాణం లో బాగా అలిసిపోయి ఉన్నాను. మీకేమీ అభ్యంతరం లేకపోతే డిన్నర్ తర్వాత చెప్పుకుందాం సరేనా" అన్నాను.

ఏడు గంటలకే డైనింగ్ హాల్ కి వెళ్ళి ఇద్దరం భోంచేసి వచ్చాం. ఆమె మాట్లాడటం మొదలు పెట్టింది నా అనుమతి తీసుకోకుండానే - నేను ఆమెని ఆపలేదు …..
...............................

1.

అసిస్టెంట్ మానేజరుగా ప్రమోషన్, దాంతో పాటు ట్రాన్స్ ఫర్ ని తీసుకుని కొత్త బ్యాంక్ లోకి అడుగుబెట్టాను.

టేబుల్స్ శుభ్రం చేస్తున్న అటెండర్ నన్ను చూడగానే చేతిలో పని ఆపేసి విసురుగా నా దగ్గరకి వచ్చాడు. చేతిని నా మోకాలుకి ఆనించుకుని వంగి కుంటుతూ వచ్చే నన్ను చూస్తూ "ఇంకా ఎవరూ రాలేదమ్మా - ఇంకాసేపు ఆగాక రా" అన్నాడు.

నవ్వి నేనెవరో చెప్పగానే అతని ముఖంలో రంగులు మారాయి. గొంతులో మర్యాదొచ్చింది. "సారీ మేడం! రండి - ఇదే మీ సీటు" అంటూ నా సీటు చూపించాడు.

పల్లెలన్నింటికీ కలిపి సెంటర్ గా ఉండే ఆ బ్యాంక్ సదుపాయాలతో బాగుంది.

అక్కడకి దగ్గరగా ఉండే ఊళ్ళో అన్ని వసతులూ ఉన్న ఇల్లు కూడా దొరకడం తో నేను సంతోషంగా ఉన్నాను. ఆవరణ నిండా రకరకాల వృక్షాలతో ఉంది ఇల్లు. నా పడగ్గది కిటికీలో నుండి కనిపించే వేపచెట్టు ప్రక్కనే రేగిమాను వేపచెట్టు మెడ వంపులో ఎన్నాళ్ళ బట్టో రాసుకుని రాసుకుని సగం అయింది.

విరిగి పోతానని తెలిసీ ఈ రేగిమానుకెందుకింత పిచ్చి - తన కొమ్మలని మరో వైపుకి తిప్పి ఈ వేప చెట్టునుండి దూరంగా జరగొచ్చుగా. ఇంట్లో ఉన్నప్పుడు వాటిని చూస్తూ వాటిని గురించి ఆలోచించుకోవడం బాగుంది.

చార్జి తీసుకోకుండా పనేమీ చేయలేము కాబట్టి స్టాఫ్ కోసం ఎదురుచూస్తూ ఆలోచనల్లో పడ్డ నాకు అటెండర్ టీ తెచ్చి ఇచ్చాడు.

"ఇంకా ఎవరూ రాలేదే వెంకటరమణా" అని అంటుండగానే "అరుగోనమ్మా మేనేజర్ గారు వస్తున్నారు" అన్నాడు.

పొడవుగా, సన్నగా ఉన్న అతను హుందాగా నడుస్తూ నా టేబుల్ దగ్గరకు వచ్చాడు. నేను లేచి నిలబడి అతనికి నమస్కారం చేశాను. అతనికి ముందే తెలుసేమో నేను హాండీక్యాప్డ్ అని. నా కాళ్ళ వైపు చూస్తూ "నమస్కారం. కూర్చోండి పౌర్ణమి గారూ! మీరు ఇంత త్వరగా వచ్చేస్తారనుకోలేదు" అన్నాడు నవ్వుతూ.

"మొదటి రోజు కదండీ" అన్నాను. ఇంకేమనలో తెలియలేదు.

అతని చూపుల్లో నా పట్ల ఆరాధన. నాకిది మామూలే. నన్ను చూడగానే ఎంతో మంది మగవాళ్ళు కళ్ళు తిప్పుకోలేనట్లుండే నా అందాన్ని ఆరాధనగా చూస్తారు. నేను కుంటిదాన్ని అని గ్రహించగానే ఆ ఆరాధనంతా మాయమైపోతుంది. ఆ స్థానంలో కొంతమందికి జాలి వస్తే మరికొంతమందికి అనాసక్తి కలుగుతుంది. చెప్పుకోవలసిన విషయం ఏంటంటే చాలా మందికి నా మీద కోపం వస్తుంది. నేనేదో వారికి ఆశ కలిగించి దూరమైనట్లుగా ఓ రకమైన క్రోధం వాళ్ళ కళ్ళల్లో.

"మీ ఫైళ్ళన్నీ నా క్యాబిన్ లో ఉన్నాయి చూస్తారా?" అన్నాడు అతను.

"అలాగే సర్!" అన్నాను అతని క్యాబిన్ వైపు నడుస్తూ.

"నా పేరు శశిధర్ అండీ పౌర్ణమి గారూ. శశీ అని పిలవండి. ఈ సర్ లు గిర్ లు నాకు పడవు" అన్నాడు తల తిప్పి నా వైపు చూస్తూ.

వంగి మోకాలు పట్టుకుని కుంటుతూ నడుస్తున్న నేను అతని కళ్ళల్లోకి చూశాను. అది నా కలవాటు. నేను కుంటుతున్నప్పుడు చూసే వారి కళ్ళల్లో ఏ భావం ఉందో తెలుసుకోవాలి కదా! ఆశ్చర్యం! అతని కళ్ళల్లో నా పట్ల మరింత ఆరాధన. తడబడిపోయి నా కళ్ళని అతని కళ్ళనుండి మరల్చుకున్నాను. నా గుండెలో ఏదో కొత్త భావం అలుముకుంది.

ఆ ఉదయమంతా అతని క్యాబిన్ లోనే కూర్చుని బ్యాంక్ కు సంబంధించిన విషయాలు మాట్లాడుకున్నాము. అక్కడకే స్టాఫ్ ని పిలిచి అందరికీ పరిచయం చేశాడు అతను. ఆ మధ్యాహ్నం అందరం కలిసి భోంచేశాక నా సీట్ కొచ్చి పనిలో పడిపోయాను.

2.

అతని మాట తీరూ, అందరినీ ఆప్యాయంగా పలకరించడమూ చూస్తుంటే అతడు స్నేహమయి అని తెలుస్తోంది కాని నా పట్ల అతడు చూపిస్తున్న అభిమానం, నన్ను చూపులతో పలకరించే విధానంలో మాత్రం ఏదో ప్రత్యేకత ఉందనిపిస్తోంది. చిత్రంగా అది నాకు ఆనందాన్ని కలిగిస్తోంది. అతని సాన్నిధ్యంలో ఉండాలని మనసు ఉవ్విళ్ళూరుతుంది.

మధ్యాహ్నం వచ్చే ఆ భోజనాల వేళ కోసం ఉదయం పూట సమయం నిదానంగా గడుస్తుందేమో అనిపిస్తుంది. అతను భోజనం హోటల్ నుండి తెప్పించుకుంటాడు. అవేమీ బాగుండవని అతనికిష్టమైన కూరలు చేసి తెచ్చిపెట్టడం, భోంచేస్తూ కబుర్లు చెప్పుకోవడం నాకు చాలా బాగుంది.

ఆరోజు మధ్యాహ్నం భోజనాళ వేళ అతని సెల్ మోగింది. "ఆ! చెప్పు హేమా! ఊ! సరే నువ్వు సాయంత్రం హాస్పిటల్ కి వచ్చేసెయ్. నేను నేరుగా హాస్పిటల్ కి వస్తా" అంటున్నాడు.

"ఏమయింది సార్?" అన్నాడు క్యాషియర్ రవి.

"మా అబ్బాయికి జ్వరంగా ఉందిట" అన్నాడు అతను.

"మీకు పెళ్ళయిందా" అన్నాను ఆశ్చర్యంగా. నా గొంతులో బాధతో కూడిన జీరని గుర్తించిన అతను నావైపు కుతూహలంగా చూశాడు. నేను నా కళ్ళను దాచుకున్నాను.

"అయ్యో! మేడమ్ - శశి సార్ కి ఇద్దరు పిల్లలు కూడా" అన్నాడు రవి.

"అవునా!! నేనేంటో నా లోకంలో నేనుంటాను. ఎవరి విషయాలూ తెలుసుకోను. నాకన్నీ తెలుసేమో అనుకుని నాకు ఎవరూ ఏం చెప్పరు" అని ముఖం మీదికి నవ్వు తెచ్చుకుని "ఏం చదువుతున్నారు పిల్లలు?" అన్నాను అతను వైపు చూస్తూ.

నా కళ్ళల్లో దేనికోసమో మరి వెతుకుతూ "అబ్బాయి సెవెంత్ క్లాస్, అమ్మాయి ఈ సంవత్సరం పది పరీక్షలు రాస్తోంది" అన్నాడు. నాకింకేమీ వినాలనిపించలేదు. చేతులు కడుక్కోవడానికి అన్నట్లుగా లేచి అక్కడ నుండి వచ్చేశాను.

మధ్యాహ్నం పనిలో నిలకడ లేకుండా పోయింది. బాగా తలనొప్పి వచ్చేసింది. పర్మిషన్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాను. ఆ రాత్రంతా అతని గురించిన ఆలోచనలే.

ఎంత చిన్నవాడిలా ఉన్నాడు? పదో తరగతి చదివే కూతురుందంటే నమ్మ బుద్ధి కావడం లేదు. ఏం చేస్తుంది వాళ్ళావిడ. ఎక్కడైనా ఉద్యోగమా? భర్తకి క్యారియర్ ఎందుకు కట్టివ్వదు? రేపు పెందరాడే వెళ్ళి వెంకట రమణని అడగాలి అనుకుంటూ కళ్ళు మూసుకున్నాను.

3.

రోజు కంటే ముందే బ్యాంక్ కి వెళ్ళి వెంకట రమణని అడిగాను. నేరుగా అడగడానికి మొహమాటం. 'ఎలా ఉందిట శశి సార్ వాళ్ళబ్బాయికి' అంటూ మొదలుపెట్టి అన్ని వివరాలూ తెలుసుకున్నాను. వాళ్ళావిడ వేరే ఊళ్ళో మా బ్యాంక్ బ్రాంచిలోనే క్లర్క్ ట. ఆవిడ చాలా మంచిదనీ, ఇద్దరూ అన్యోన్యంగా ఉంటారనీ చెప్పాడు.

విన్న నాకు చేదు తిన్నట్లుగా అయింది. ఆ రోజంతా అతని వైపు చూడాలనిపించలేదు. భోజనం గదికి కూడా నడిచే ఓపిక లేదని వంక చెప్పి నా టేబుల్ దగ్గరే భోంచేశాను. రెండు మూడు సార్లు బ్యాంక్ కు సంబంధించిన విషయాలు మాట్లాడుకోవలసి వచ్చినా నేను ముభావంగా సమాధానం ఇవ్వడం తో అతను నా వైపు వింతగా చూస్తూ "మీకు ఆరోగ్యం బాగానే ఉంది కదా పౌర్ణమీ" అని అడిగాడు.

"ఆ! బాగానే ఉంది" అన్నాను కంప్యూటర్ వైపే చూస్తూ.

నా మనసు మూగగా ఏడుస్తోంది. ఏమిటిది? నేను అతని గురించి ఏదో ఆలోచించుకుని గాలిలో మేడలు కట్టుకోవడమేమిటి? తాపత్రయపడటమేమిటి? ఆలోచించే కొద్దీ నా మనస్సులో వచ్చే ఆలోచనల పట్ల నాకే రోత కలిగింది. కళ్ళల్లో ఆగకుండా కన్నీళ్ళు.

ఖర్చీఫ్ తో తుడుచుకుంటూ బాత్ రూమ్ లోకి వెళ్ళాను. చల్లని నీళ్ళతో ముఖం కడుక్కుని వస్తూ వద్దనుకుంటూనే అతని క్యాబిన్ వైపు చూశాను. అద్దాల లో నుండి నన్నే చూస్తున్న అతన్ని చూసి తడపడటం నా తడి కాలు జారి కిందపడటం ఒకేసారి జరిగాయి.

పెద్దగా కేకేసి కూలబడ్డ నా దగ్గరకి అందరూ పరిగెత్తుకొచ్చారు. అవిటి కాలుకే దెబ్బ తగిలింది. వెంకటరమణ నన్ను పట్టుకుని లేపాడు. అతను కూడా నా మరో భుజాన్ని పట్టుకుని ఆసరా ఇస్తూ నన్ను నడిపించాడు. అతని భుజం మీద తల దాచుకోగానే కాలు నొప్పి, మనసులోని బాధతో సహా తగ్గినట్లు అనిపించింది. అతని కార్లోనే హాస్పిటల్ కి తీసుకెళ్ళి కట్టు కట్టించి ఇంటి దగ్గర దిగబెట్టాడు. ధన్యవాదాలు చెప్పాను.

"మనలో మనకి థాంక్స్ ఎందుకురా - బాగా రెస్ట్ తీసుకో" అన్నాడు. వదలడం ఇష్టం లేనట్లుగా బాధపడుతూ వెళ్ళిపోయాడు.

మా అమ్మ నాకు సహాయానికి ఊరు నించి వచ్చింది. పనేమీ లేక ఒకటే ఆలోచనలు అతని గురించి. అతని గురించిన ఆలోచనలు 'వద్దు' అనుకుంటే దు:ఖం కలుగుతుంది. అతని తలపులు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. నా ఆనందానికి మరొక వ్యక్తి మీద అందులోనూ పెళ్ళయిన పరాయి వ్యక్తి మీద ఆధారపడుతున్నందువల్లనేమో మనశ్శాంతి లేకుండా పోయింది. నిద్ర మాత్ర వేసుకుని నిద్రలోకి జారిపోయాను.

సాయంత్రం ఆరవుతుండగా నా సెల్ మోగింది. చూస్తే అతని నంబరే. ఆత్రంగా తీశాను. "పౌర్ణమీ! ఎలా ఉన్నావ్?" అతని గొంతులో ఆరాధన నన్ను తాకింది. నాకు తెలియకుండానే నాలో ఉత్సాహపు అలలు ఉవ్వెత్తున ఎగుస్తున్నాయి.

"బాగానే ఉన్నాను. మీరెలా ఉన్నారు? మీ అబ్బాయి జ్వరం తగ్గిందా?" అన్నాను.

"పౌర్ణమీ ఎన్ని సార్లు ఫోన్ చేశానో! కనీసం వంద సార్లు చేసి ఉంటాను" అన్నాడు.

"బాగా నిద్ర పోయాను - సారీ. ఇంకా ఇంటికి వెళ్ళలేదా?" అని అడిగాను.

"పౌర్ణమీ! ఐ లైక్ యు. కాదు కాదు ఐ లవ్ యు" అన్నాడు.
నేనేమీ మాట్లాడలేదు. నాకు ఒక వైపు సంతోషంగా ఉంది. మరోవైపు మనసు అంతర్మధనానికి లోనవుతోంది.

"పౌర్ణమీ! పౌర్ణమీ - ఏమయింది? ఉన్నావా? వింటున్నావా?" అతని గొంతులో ఆందోళన.

"కాని మీరు …" ఆపేశాను. 'పెళ్ళయిన వారు' అని అనడానికి కూడా నాకు ఇష్టం లేకే ఆ వాక్యం ఆగిపోయింది.

ఎంత ఈర్ష్య నాకు? అతనికి ఎప్పుడో పెళ్ళయింది. అదెందుకు నా మనసు అంగీకరించలేకపోతుంది? నా మీద నాకే జాలేసింది. ఫోన్ పెట్టేయాలనిపిస్తోంది కాని పెట్టలేకపోతున్నాను.

"అవును పౌర్ణమీ! నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఎంతగా అంటే నిన్ను నిన్నుగా నీ అవిటితనం గుర్తుకు రానంతగా - ఇదీ అని చెప్పలేను - నిర్మలమైన భావాన్ని మాటల్లో పెట్టలేను. పెళ్ళయిన నాకు నీ మీద కలిగినది ప్రేమా లేక ఆకర్షణా అని నన్ను నేను ప్రశ్నించుకున్నాక అర్థం అయింది పౌర్ణమీ నీతో బాంధవ్యం ఏర్పరుచుకోకుండా ఉండలేనని.

నాకు పెళ్ళయిందని తెలిసినప్పటినుండీ నీ మానసిక స్థితిని నేను గమనిస్తూనే ఉన్నాను. నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావని అర్థం చేసుకున్నాను కాబట్టే ధైర్యంగా చెప్పగలుగుతున్నాను నేను నిన్ను ప్రేమిస్తున్నానని"

అతని మాటలు నా హృదయాన్ని రెండుగా చీలుస్తున్నాయి. నాకు ఏం జవాబు చెప్పాలో అర్థం కావడం లేదు. అతని విషయంలో స్పష్టత లేని నేను మాట్లాడటంలో - ముఖ్యంగా ఆ సమయంలో - అర్థం లేదనిపించింది. "తర్వాత మాట్లాడనా! అమ్మ వస్తోంది" అని ఫోన్ పెట్టేశాను.

4.

ఏదో నిస్తేజం నన్ను ముంచేసింది. ఆలోచనలు - ఒకటే ఆలోచనలు. తెలియకుండానే నాలో వేడి నిట్టూర్పులు. ఎవరైనా నా పట్ల జాలి దయ చూపిస్తే కోపం. ఎవరి కళ్ళల్లోనైనా ఆరాధనో, కామపు వాంఛో చూసినపుడు మాత్రం పెళ్ళి చేసుకోవాలనీ, అన్ని సౌఖ్యాలు అనుభవించాలనీ అనిపిస్తుంది.

నా అవిటితనాన్ని చూసి నన్ను నన్నుగా కావాలనుకునేవారు ఎవరుంటారు? నా ఉద్యోగాన్నో, నాకున్న డబ్బునో చూసి నన్ను పెళ్ళి చేసుకుంటారు గాని అనే ఆలోచన వెంటనే పొంచి నన్ను వేటాడుతుంది.

ఇక ఆ ఆలోచన వచ్చిందంటే భయంతో నా మనసు మూగబోతుంది. అతడు ఫోన్ లో మాట్లాడిన మాటలు గుర్తొచ్చాయి. మనసు సంతోషంతో ఊగిసలాడింది. కాసేపటికే ఆ సంభాషణ పేలవమైనట్లుగా అనిపించింది. కాని నాలో ఏదో తృప్తి. అవిటిదాన్ని కూడా ప్రేమించేవాళ్ళున్నారన్న ఆలోచన వల్ల కలిగిన తమకం అది. పెళ్ళి అయిన వాడు ప్రేమిస్తున్నానని చెప్తే సంతోషం దేనికి? అతడు భార్యాబిడ్దలని వదిలి నా కోసం రాలేడని తెలుస్తుందిగా. రాకపోయినా పర్వాలేదా? అయినా ఇన్ని ఆలోచనలేంటి నాకు - అతడు నిర్మలమైన ప్రేమ అంటున్నాడుగా అదేంటో దాన్ని కూడా చూద్దాం అని అనుకోగానే నా మనసు తేలికపడింది.

తర్వాత రోజు బ్యాంక్ కి వెళ్ళాలనిపించి లేచి ఆటో అబ్బాయికి ఫోన్ చేసి తయారయ్యాను. "ఎలా వెళతావే డాక్టర్ రెస్ట్ ఇవ్వమన్నారుగా కాలికి" అంది అమ్మ.

"రెస్ట్ కాక నేనేం నడుస్తున్నానమ్మా? ఈ అవిటితనం వచ్చినప్పటినుండీ కాళ్ళకి రెస్టేగా" అన్నాను అసహనంగా. అమ్మ ఏమీ మాట్లాడలేదు.

నన్ను చూసి అందరూ నా చుట్టూ మూగారు. 'రెస్ట్ తీసుకోకుండా ఎందుకండీ రావడం' అన్నారు. అతని కళ్ళల్లో స్పష్టంగా సంతోషం - దాచుకుందామన్నా దాచుకోలేకపోతున్నాడు.

నేనేమీ ఆలోచనలు పెట్టుకోకుండా పనిలో లీనమయ్యాను.

సాయంత్రం ఇంటికి బయలు దేరుతున్న నా దగ్గరకి వచ్చి "పౌర్ణమీ మీకేమీ అభ్యంతరం లేకపోతే నేను మీ ఆటోలో వచ్చి మిమ్మల్ని డ్రాప్ చేసి ఆటో తీసికెళతాను. నా కారు సర్వీసింగ్ వాళ్ళకి ఇవ్వాలి ఈరోజు" అన్నాడు.

నా ఎదురుగ్గానే సర్వీసింగ్ వాళ్ళకి ఫోన్ చేసి కారు బ్యాంక్ దగ్గ్గరుంది తీసికెళ్ళమని చెప్పాడు. కారు తాళాలు వెంకటరమణకిచ్చి సర్వీసింగ్ వాళ్ళు వస్తే ఇవ్వమని నా ఆటో ఎక్కాడు.

"మా ఇంటికి వెళదాం పౌర్ణమీ. ఈరోజు మా ఇంట్లోనే నీకు డిన్నర్. మా ఆవిడ ఊరెళ్ళింది సో డిన్నర్ నువ్వే ప్రిపేర్ చేయాలి" అన్నాడు నవ్వుతూ. అతని కళ్ళల్లో ఈసారి ఆరాధనతో కూడిన సంతోషం. అందరిలో ఉన్నప్పుడు నన్ను 'మీరు' అనడం ఒంటరిగా ఉన్నప్పుడు 'నువ్వు' అనడం గమనించాను.

మీ ఇంటికి వద్దులెండి అని చెప్పాలనిపించలేదు. మర్యాదల వలలో ఇరుక్కుపోయి కాదు - నాకే అతని సంగతి తెలుసుకోవాలని కాంక్ష.

ఆటోను లోపల వరండా మెట్ల దగ్గర ఆపించి నన్ను నడిపిస్తూ లోపలకి తీసికెళ్ళాడు. ఇల్లు చాలా బావుంది. నీట్ గా ఎక్కడవి అక్కడ సర్ది ఉన్నాయి. ఆమె చాలా సౌందర్యాభిలాషి అని సర్దిన తీరు చూస్తుంటే తెలుస్తుంది. నన్ను సోఫాలో కూర్చోమని లోపలకి వెళ్ళి రెండు గ్లాసులనిండా మామిడి రసం తెచ్చాడు. లుంగీలోకి మారిన అతను నాకు కొత్తగా ఉన్నాడు.

"తీసుకో పౌర్ణమీ" అంటూ చనువుగా నా ప్రక్కన కూర్చున్నాడు. హఠాత్తుగా నా ముఖాన్ని దగ్గరకి తీసుకున్నాడు. ఏం జరుగుతుందో తెలుసుకోలేనంత మైకం నన్ను చుట్టేసింది. నేనేమీ పదహారేళ్ళ యవ్వనం లో లేను. అయినా ఏమిటిది? ఏ అనుభవం కోసం నేనింత మత్తులో పడుతున్నానో ఆ మత్తు వదిలాక పర్యవసానం - మన చర్యలు మన జీవితాలనే కాదు అవతలి వారి జీవితాలనీ అశాంతి పాలు చేస్తాయి. విదుల్చుకుని లేచాను. నడవలేక క్రింద కూలబడ్డ నన్ను లేవదీయకుండా అతనూ సోఫాలోంచి క్రిందకు నా ప్రక్కకు జారాడు.

అతని వైపు చూస్తే - అతని కళ్ళల్లోని ఆరాధనని చూస్తే - నేనేమవుతానో నాకు తెలుసు. అతన్ని తోసేసి గుమ్మం వైపు చూస్తూ 'శీనూ, శీనూ' అని పెద్దగా అరిచాను.

"ఆ! మేడమ్ వస్తున్నా" అన్నాడు వరండాలోనే కూర్చుని ఉన్న శీను. అతను హడావుడిగా లేచి నన్ను లేపి నిలబెట్టి ఏదో పనున్నట్లు గదిలోకి వెళ్ళిపోయాడు.

లోపలకి వచ్చిన శీనుతో "ఇక వెళదాం శీనూ" అన్నాను.

"ఉండండి ఒక్క నిమిషం" అంటూ అతను కుంకుమ భరిణతో వచ్చాడు. "తీసుకుని బొట్టు పెట్టుకోండి. మా ఆవిడ ఉంటే ఇవన్నీ చేసేది" అన్నాడు.

ఆటో డ్రైవర్ కి అనుమానం కలగకుండా అతను చేస్తున్న ఈ చర్యలకి నాకు అసహ్యం వేసింది. కుంకుమ తీసుకొని బొట్టు పెట్టుకున్నాను. వాళ్ళిద్దరి సాయంతో ఆటోలో కూర్చున్నాను.

ఈసారి అతని పట్టులో అసహనం. అతనికి కనీసం వెళ్ళొస్తానని కూడా చెప్పాలనిపించలేదు. అతనే 'బై' అని చెయ్యి ఊపుతున్నాడు.

యాంత్రికం గా చెయ్యి ఊపుతూ శ్రీను వైపు చూశాను. శ్రీను ఆటో స్టార్ట్ చేశాడు.

5.

అమ్మ ఊరు వెళ్ళింది. అమ్మ లేకపోతే నాన్నకి ఇబ్బంది. "మామయ్యని చేసుకోవడం గురించి ఆలోచించమ్మా! వాడు నిన్ను చేసుకోవాలని అనుకుంటున్నప్పుడు కాదనడం బాగాలేదు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో! " అంది అమ్మ వెళుతూ.

రోజులు గడుస్తున్నాయి. అతని చూపుల్లో నా పట్ల ఆరాధన ఏ మాత్రమూ చెక్కు చెదరలేదు. నేను ఆ ప్రవాహపు వడిలో జారి పోకూడదని నిలదొక్కుకొని నిలబడి ఉన్నాను. కాని నాలో ఏదో అశాంతి. 'నాది' అంటూ నాకేదో ఉండాలనే తపన.

కళ్ళు కనపడనీయకుండా చేసే అతని ఆరాధనా జిలుగు నన్ను ముంచేయకముందే ఏదో చేయాలి. ట్రాన్స్ ఫర్ కి పెట్టుకున్నా ఉపయోగం లేదని నాకు తెలుసు. వాంఛ కలగనే కూడదు - కలిగాక వ్యవస్థ మీద తిరుగుబాటు చేయడానికి దానికి అన్ని హక్కులున్నట్లు అది ప్రవర్తిస్తుంది. మనసు లోతుల్లో ఉండే మంచి చెడ్డలనే సున్నిత ప్రకంపనలు దానికి అందవు.

"పౌర్ణమీ! మీ అమ్మగారు ఊర్లో ఎలా ఉన్నారు?" అంటూ నా సీట్ దగ్గరగా వచ్చి "సాయంత్రం మీ ఇంటికి రానా?" అన్నాడు.

నీలి రంగు షర్ట్, నలుపు ప్యాంట్ లో చాలా అందంగా ఉన్నాడతను. ఆరాధన కళ్ళనిండా నింపుకుని అడుగుతున్న అతన్ని కాదనడానికి మాటలు రావసలు. నవ్వి ఊరుకున్నాను.
సాయంత్రం ఆటో వైపుకి నడుస్తున్న నన్ను చూస్తూ "ఖచ్చితంగా 7 గంటలకి మీ ఇంట్లో ఉంటాను" అన్నాడు.

ఏం చేయాలో అర్థం కాలేదు. శ్రీనుని బస్టాండ్ కి తీసికెళ్ళమన్నాను. బస్సెక్కి నాలుగు రోజులు శలవు చీటీ రాసి శ్రీను చేతికిచ్చి బ్యాంక్ లో ఇచ్చేయమన్నాను.

కందిరీగల్లా ముసురుకుంటున్న ఆలోచనలు నాలో - ఎందుకని నేను అతనికి 'ఇవన్నీ నాకిష్టం లేదు' అని స్పష్టంగా చెప్పలేకపోతున్నాను? అతని స్నేహం, అతడి కళ్లల్లో నా పట్ల కనిపిస్తున్న ఆరాధన నాకు తియ్యని అనుభూతిని కలిగిస్తున్నాయి. ఆ తమకంలో నా అవిటితనాన్ని - నన్ను నిత్యమూ బాధించే ఈ లోటుని మర్చిపోగలుగుతున్నాను. అవన్నీ పోతాయని భయమా?
అయినా ఇదేమిటి ఇతడు - నిర్మలమైన స్నేహం అంటూ ఎందుకు నన్ను కాంక్షిస్తున్నాడు? ఏమో నాలో కూడా అతని పట్ల ఉన్న మోహాన్ని గుర్తించాడేమో!

అతనితో శారీరకంగా సంతృప్తి పడిన ఈ కాంక్ష ఊరుకుంటుందా? జీవితాన్ని బీటలుగా చీల్చదా? నేను అతని ఆరాధనని శంకిస్తున్నానేమో - నాతో జీవితాంతమూ తోడుగా ఉండేంత ప్రేమ అతను నా పట్ల పెంచుకున్నాడేమో - ఊహు అతని ప్రవర్తన అలా లేదే. తెలుసుకోవడం ఎంత సేపు...... ఒక్క ఫోన్ కాల్ చాలదూ???

బ్యాగ్ లోంచి సెల్ తీశాను. ఆన్ చేయగానే 26 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. 'ఎక్కడున్నావు పౌర్ణమీ' అంటూ మెసేజ్. అతనికి డయల్ చేశాను.

"ఎక్కడున్నావ్? " ఆతృత అతని కంఠంలో.

"మీరూ? " అన్నాను.

"మీ ఇంటి దగ్గరే - ఎక్కడున్నావ్ చెప్పూ" అన్నాడు.

"బస్టాండ్ లో ఉన్నాను. మా ఊరికి వెళుతున్నా. నాకు పెళ్ళి మామయ్యతో ఫిక్స్ చేస్తున్నారట ఈరోజు. త్వరగా రమ్మని అమ్మ ఆర్డర్. మీకు చెప్దామనుకుంటే ఇక్కడ సిగ్నల్ దొరకడం లేదు" అన్నాను.

ఈ చిన్న అబద్దం నా అంతర్మధనాన్ని తొలగించి శాంతిని ప్రసాదిస్తుందనే ఆశ నాలో.

"పెళ్ళా! పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదు - నా జీవితం ఇలా ఒంటరిగా గడిచిపోవలసిందే అన్నావుగా. ఇదేంటి సడన్ గా ఈ నిర్ణయం? నిజమేనా? జోక్ కాదు కదా" అతని గొంతులో కోపం నాకు స్పష్టంగా తెలుస్తోంది.

"లేదండీ! నిజమే చెప్తున్నాను. మామయ్యని ఒప్పించినట్లుంది మా అమ్మ" అన్నాను.

"ఏం మాట్లాడుతున్నావ్? నిన్ను నిన్నుగా ఎవరు చేసుకుంటారు? నీ డబ్బు కోసమో, నీ ఉద్యోగాన్ని చూసో ఒప్పుకొని ఉంటాడు. అలాంటి వాడు నీకు సంతోషాన్ని ఎలా ఇవ్వగలడు? ఆలోచించుకోవా?" ఆగాడు నా సమాధానం కోసం అన్నట్లుగా. నేనేమీ బదులివ్వలేదు.

"పౌర్ణమీ! ఇంత హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడానికి నేను కారణం కాదు కదా! " అతని గొంతులో మార్దవం నా మౌనాన్ని వీడేట్లు చేసింది.

"శశి గారూ, నాకు వయసు వచ్చినప్పటినుండీ నన్ను నన్నుగా ఎవరైనా ప్రేమిస్తారనే నమ్మకం ఏర్పడింది. అది ఎందుకు కలిగిందో నేను చెప్పలేను. అప్పటినుండీ మగవాళ్ళని గమనిస్తున్నాను. నా అందాన్ని చూసిన వెంటనే వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆరాధన నా అవిటితనం చూడగానే ఆరిపోయేది.

కాని మీరు నన్ను నన్నుగా ఆరాధించారు నాకు తెలుసు. మీ మంచి మనసు చూసి మిమ్మల్ని నేను కోరుకున్నాను. నా కల నిజమవుతున్నదని అలవికాని ఆనందాన్ని పొందాను. కాని మీకు పెళ్ళి అయిందని తెలిశాక మీనుంచి నేను కోరుకుంటున్నది మీ స్నేహాన్ని మాత్రమే" ఆగాను. అతనేమీ మాట్లాడలేదు.

"ఇంత హఠాత్తుగా ఈ నిర్ణయం అంటారా - నిజమే మిమ్మల్ని చూశాకే నాకూ ఓ తోడు - రాత్రి పూట ఉలిక్కిపడి లేస్తే నా వెన్ను తట్టి నన్ను కౌగలించుకునే తోడు కావాలనే కోరిక మాత్రం ఖచ్చితంగా మీ వల్లే కలిగింది. అది మీరు ఇవ్వలేరని తెలుసు - అసలు మిమ్మల్ని అలా చూడటమే తప్పు - అందుకే మామయ్యని పెళ్ళి చేసుకుందామనుకుంటున్నాను" అన్నాను.

"నీ మనసులో ఏముందో నాకు చెప్పాలి కదా పౌర్ణమీ. నీకు భయంగా ఉందని చెబితే ఆరోజు రాత్రికి నేను రానా … ఇంట్లో ఏదో చెప్పి…."

"వద్దు వద్దు మీరు అలా మాట్లాడొద్దు" అంటూ ఫోన్ పెట్టేశాను. అసహ్యంతో శరీరం వణికింది. నన్ను ఎక్కడికో ఈడ్చుకెళ్ళాలని రింగవుతున్న ఫోన్ ని అభావంగా చూస్తుండిపోయాను తప్ప ఎత్తలేదు.

--------------------------

"మాధవి గారూ, మామయ్యని పెళ్ళి చేసుకోవాలని నేను తీసుకున్న నిర్ణయం మంచిదో కాదో భవిష్యత్తు నిర్ణయిస్తుంది కాని మామయ్యని చేసుకుంటున్నానని అతనితో చెప్పడం మాత్రం చాలా మంచిదయింది.

ఎందుకో ఆ సమయంలో నాకు మా ఆవరణలోని వేపచెట్టు మెడ వంపులో రాసుకుపోతున్న రేగి చెట్టు కళ్ళముందు కదలాడింది. 'ఊరి నుంచి రాగానే కర్రల సాయంతో రేగి చెట్టుని నిటారుగా నిలబెట్టించాలి' అని అనుకున్నాను.

రేగి చెట్టునైతే నిలబెట్టగలను కాని ఇతని ఆరాధనా జిలుగులో నుండి బయటకి రావాడానికి నాకెన్ని రోజులు పడుతుందో ? " - ఆమె స్వరం లో ఆవేదన నన్ను మౌనంలోకి నెట్టేసింది. నేనేమీ మాట్లాడలేదు. ఆమె వివేకాన్ని మెచ్చుకుంటూ ఆమె నైరాశ్యాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాను.

"అతనితో మాట్లాడి ఫోన్ పెట్టేశాక ఊరికి వెళ్ళాలనిపించలేదు. ఒంటరిగా ఉండాలనిపించి ఇటు వచ్చాను. నా స్థితి నాకు తెలిసీ నేనూ ప్రేమింపబడాలనే ఆతృత చూశారా నన్నెంత వేదనకి గురి చేస్తుందో" అంది నీళ్ళు నిండిన కళ్ళెత్తి నా వైపు చూస్తూ.

"ప్రేమించటానికి, ప్రేమించబడాలని కోరుకోవడానికి అర్హత అనర్హతలు ఉంటాయంటారా పౌర్ణమీ - ఎందుకు అలా అనుకుంటారు? మీరు చాలా వివేకంగా ప్రవర్తించారు. వివేకంతో, విచక్షణా జ్ఞానంతో మనం ఉండాలని తెలియచేస్తున్న మీ కథని అందరూ తెలుసుకోవాలి - రాస్తాను పౌర్ణమి గారూ - ఇప్పుడే రాసి పత్రికకి పంపుతాను.

ఇంకో విషయం 'ఎన్నాళ్ళు పడుతుందో ఈ జిలుగు నుండి బయటపడటానికి' అని మీరంటున్నారు. నిర్మలమైన భావనతో వచ్చినదే ఈ బరువు. ఇది మీలో చైతన్యాన్ని కలగచేస్తుందే తప్ప మిమ్మల్ని నీలినీడల వెనక్కి తోసేయదు" అన్నాను.

నా మాటలకి ఆమె విశాల నయనాలు మరింత విశాలమై ఒక్కసారిగా వెలిగాయి.

******

1 comment:

  1. వెరీ వెరీ నైస్ కథ చాలా బావుంది రాధ గారు

    ReplyDelete

P