Sunday, April 3, 2016

సహస్రం - రాధ మండువ


దాదాపు సంవత్సరం పాటు సాయంకాలాలు - ఆఫీసునుండి ఇంటికి వచ్చాక వివిధ దేశాల జానపదకథలనీ, చిన్నపిల్లల కథలనీ అనువాదం చేసుకుంటూ ధ్యానం చేసుకోవడానికి సమయం కేటాయించుకోలేకపోయాను. పదిరోజులు రమణాశ్రమంలో ఉండి వచ్చాక ఆత్మను దర్శించడంలో ఉన్న ఆత్మానందాన్ని విడవకూడదని అనిపించింది.

ఇంట్లో మా ఆవిడ చూసే టివి సీరియల్ సౌండ్ నీ, మా ఇద్దరి పిల్లల అల్లరినీ ఆపమనడం ఎందుకులే అనుకొని నేనే సాయంకాలం టీ తాగాక బీచ్ కి రాసాగాను. ఇది అందరికీ సౌకర్యంగా ఉంది.

రెండు వారాలు గడిచాయి. ధ్యానం లో చాలా ఆనందాన్ని పొందుతున్నాను. ఆరోజు సూర్యుడు 'తొందరేముందిలే, నిదానంగా వెళతాను' అన్నట్లుగా ఇంకా వెలుగుని విరజిమ్ముతున్నాడు. బీచ్ లో నేను ధ్యానం చేసుకునే ప్రదేశానికి వచ్చే దారిలో కొంతమంది స్కూలు పిల్లలు నీళ్ళల్లో మునుగుతూ, అలలతో ఆడుకుంటూ, నవ్వుకుంటూ గంతులేస్తున్నారు. వాళ్ళని చూస్తుంటే నాకు కూడా కాసేపు సముద్రంలోకి వెళ్ళాలనిపించింది. ప్యాంట్ ని పైకి మడుచుకుని నీళ్ళల్లో నడుస్తూ, అలలు కాళ్ళ దగ్గరకి వచ్చినపుడు వంగి నీళ్ళని తీసుకుని పైకి విసురుతూ నడవసాగాను.

కొంత దూరం నడిచాక నా వెనుక నాలుగుడుగుల దూరంలో ఎవరో స్త్రీ నడవడం, నేను వంగినపుడు ఆమె కూడా వంగి నీళ్ళని తీసుకుని పైకి చల్లడం గమనించాను. ఆగి వెనక్కి తిరిగి ఆమెని పరిశీలనగా చూస్తూ పలకరింపుగా నవ్వాను. నేను ఈ రెండు వారాల్లో ఎప్పుడో ఆవిడని బీచ్ లో చూసినట్లే గుర్తు. అప్పుడు ప్రక్కన ఎవరన్నా ఉన్నారో లేరో గమనం లేదు కాని ఇప్పుడు మాత్రం ఒక్కత్తే ఉంది.

నేను నీళ్ళల్లో నుండి బయటకు వచ్చి నా బ్యాగ్ లో నుండి ధ్యానం చాపని తీసి ఇసుకలో పరుచుకుని కూర్చున్నాను. ఆవిడ మాత్రం అక్కడక్కడే తచ్చట్లాడుతున్నట్లుంది. నేను పట్టించుకోకుండా ధ్యానం లో మునిగిపోయాను.

***

తర్వాత రోజు నా బ్యాగ్ లో నుండి చాపని తీస్తున్నప్పుడు "ఏమండీ, ఎక్స్ క్యూజ్ మీ" అని వినిపించి వెనక్కి తిరిగి చూశాను. ఆమే! ప్రక్కన వేరుశనక్కాయలు అమ్ముకునే అవ్వ గంపతో నిలబడి ఉంది. “మీరు ఏమీ అనుకోకపోతే పది రూపాయలు ఇస్తారా? నేను డబ్బులు తీసుకురావడం మర్చిపోయాను, రేపు మీకు ఇచ్చేస్తాను" అంది.

ఓ ష్యూర్, నో ప్రాబ్లమ్" అంటూ పర్సు లోంచి పది రూపాయల నోటు తీసి ఇచ్చాను.

అవ్వ పది రూపాయలు తీసుకుని వెళ్ళిపోయింది.

"నేను కూడా ధ్యానం చేసుకుంటాను. మధ్యాహ్నం ధ్యానం లో కూర్చుని అన్నం తినడం కూడా మర్చిపోయాను. సాయంత్రం చీకటి పడుతుండగా తెలివి వచ్చింది - అదిగో చూడండి! ఆకాశం సముద్రుడిని దిగంతాలలో వంగి కలుసుకుంటున్న ఆ దృశ్యాన్ని చూడకపోతే రాత్రికి నిద్రపోలేను. ఎక్కడ సూర్యాస్తమయం అయిపోతుందో అనే తొందరలో డబ్బులు తీసుకురావడం మర్చిపోయాను" అంది ఆవిడ అక్కడే నిలబడి.

నేను మొహమాటంగా నవ్వాను.

ఆమె నన్నేమీ పట్టించుకోనట్లుగా సముద్రపు ఆ చివరి అంచుని తీక్షణంగా చూస్తూ "నీలాకాశపు ప్రియురాలి గాఢమైన కౌగిలిలో సముద్రుడు పొందిన నిశ్చలత కదా సమాధి స్థితి అంటే - ఎంతదృష్టవంతుడో!?” అంది.

నేనేమీ మాట్లాడలేదు. ఆమె ముఖాన్నే పరీక్షగా చూస్తూ ఉండిపోయాను. ఆమె నా వైపుకి తిరిగి మళ్ళీ "అన్నం తినలేదు కదా, ఆకలేసి శనక్కాయలు కొనుక్కున్నాను" అని కొన్ని శనక్కాయలు నా చాప మీద పోస్తూ "తినండి" అంది.

అయ్యో, ఫరవాలేదండీ" అంటూ శనక్కాయలని చాపలో ఒక మూలకి నెట్టేసి కూర్చున్నాను.

ఆమె అక్కడనుండి వెళ్ళిపోయిందో, నా ముందే బీచ్ లో అటూ ఇటూ తిరుగుతూ ఉందో నాకు చూడాలనిపించింది. ఊగిసలాడే మాయ తెరను వేస్తున్న నా మనసును చూసి లోలోపలే నవ్వుకుంటూ తలవంచుకుని కళ్ళు మూసుకున్నాను.

***

ఏమండీ, ఏమండోయ్! నేనండీ మధురనీ, మిమ్మల్నే!” కేకలు వినిపించి వెనక్కి తిరిగి చూశాను. ఆమె వేగంగా నా ఎదుటకి వచ్చి నిలబడి "సారీ, మీ పది రూపాయలు తీసుకు రావడం మర్చిపోయాను" అంది.

ఫరవాలేదులెండి, ఇవ్వకపోతే ఏమీ మునిగిపోదు కానీ మీ పేరు మధురా?” అన్నాను. మధురమీనాక్షి నాకిష్టదైవం - ఆమెనే తల్చుకుంటూ...

అవును. మధురవాణి" మూతిని సున్నాలా చుట్టి తలని కొంచెంగా ఊపుతూ, పెదవిని చిన్నగా విరగతీస్తూ అంది.

నాకు నవ్వొచ్చింది కాని ఆపుకున్నాను.

కొంతమందికి 'మధుర' అని చెప్తాను మరికొంతమందికేమో 'వాణి' అని చెప్తాను. బాగా దగ్గర వాళ్ళకే 'మధురవాణి' అని చెప్తా" అంది. కొంటెగా నవ్వుతున్నాయి ఆమె కళ్ళు కాని ఆ కళ్ళల్లో - లోలోతుల్లో నీరసం స్పష్టంగా కనిపిస్తోంది.

అక్కో, ఓ మధురక్కో!” అంటూ పూలమ్ముకునే ఓ పదిహేను పదహారేళ్ళ పిల్లవాడు మా దగ్గరకి పరిగెత్తుకుంటూ వచ్చాడు.

ఇయిగో పూలు తీసుకో, ఇయ్యాల పెందలాడే రమ్మంది అమ్మ – బాహుబలి సినిమాకి పోతన్నాం" అన్నాడు. పళ్ళన్ని బయటపెట్టి సంతోషంగా నవ్వుతున్న వాడి తల నిమురుతూ "వద్దులేరా శీనా, ఇప్పటికే నీకు చానా బాకీ" అంది.

ఇంటికి తీసకపోతే తెల్లారేలకి వాడిపోయే పూలేగా అక్కా, ఏం బాగ్గెం? ఉన్నప్పుడే ఇద్దువులే ఇయిగో పెట్టుకో" అన్నాడు వాడు - తట్టలో మిగిలిని పూలన్నీ ఆమె చేతుల్లో పెడుతూ.

అంత చిన్నపిల్లవాడి మాటల్లో వేదాంతం వినిపించింది నాకు. పేదరికం వాళ్ళకిచ్చే భాగ్యం అదేనేమో అనిపించింది. ఆమె పూలను తీసుకుని తల్లో తురుముకుంది. “నేనుగూడా వస్తా ఉండురా" అని జాకెట్ లోంచి పేపర్ తీసి "బాగా నీరసంగా ఉంటోందండీ, రేపు ఇక్కడకు రాగలనో లేదో మీరే మా ఇంటికి రండి. మీ పది రూపాయలూ ఇచ్చేస్తాను. ఇక్కడకి దగ్గరే... అదిగో ఆ లైట్ స్తంభం దాటిన తర్వాతొచ్చే మొదటీధిలో మూడో నంబరిల్లు. నీలం రంగు రేకు గేటు మీద పసుపురంగుతో మూడు అని నంబర్ వేసి ఉంటుంది. ధ్యానంలో పడి మర్చిపోతారని అడ్రస్ ఈ కాగితంలో రాశా, ఇదిగోండి" అంటూ పేపర్ ని నాకు ఇచ్చింది.

ఆమె ఏమంటుందో అర్థం అయ్యి 'వద్దు' అని అందామని అనుకుంటూనే అప్రయత్నంగా చెయ్యి చాపి ఆ పేపర్ ని అందుకున్నాను.

గబగబా నడుస్తూ వెళ్ళిపోతున్న వాళ్ళని వెనుక నుంచి చూస్తూ నిలబడ్డాను. కొంత దూరమెళ్ళాక ఆమె ఆ పిల్లవాడి భుజాల మీదకి వంగి ఏదో చెప్పింది. వాడు వెనక్కి తిరిగి నన్ను చూసి నవ్వి మళ్ళీ ఆవిడతో మాట్లాడాడు. ఆమె వెనక్కి తిరిగి చేతులు పైకెత్తి తన తల్లో పూలని సర్దుకుంటూ నన్ను చూసి నవ్వింది.

నేను ఆమెని గమనించనట్లుగా నింగి వైపుకి చూపుని మరల్చుకున్నాను. ఆకాశం బూడిదరంగు తెర వేసి చిన్న చిన్న చిత్రాల్లాంటి తెల్లని మేఘాలను ప్రదర్శిస్తోంది. నా మెదడులో ఆమెని గురించిన ఆలోచనలు దారాలు దారాలుగా సాగిపోతున్నాయి. నా కళ్ళు చెమ్మగిల్లి ఇక ధ్యానానికి సహకరించనంటున్నాయి. అలాగే కూలబడినట్లుగా ఇసుకలో కూర్చుండిపోయాను.

***

ఆలోచనలను చెదరగొడుతూ నా సెల్ మో్రగింది. తీసి చూశాను - ఇంటి నుంచి - నా భార్య వేద. “హలో!” అన్నాను.

ఎక్కడున్నారండీ, ఇంతాలస్యమయిందేం?” అంది.

ఈరోజు ధ్యానం చేయకుండానే త్రిపురాంబికను దర్శించాను వేదా. సహస్రనామావళి సమర్పించుకుంటున్నాను" అన్నాను.

లలిత చదువుతున్నారా? మీకేం వచ్చూ!?” అంది.

రోజూ పొద్దున్నే నువ్వు చదువుతుంటే వింటున్నానుగా, గుర్తుకి వచ్చినంతవరకూ చదువుతున్నానులే" అన్నాను.

ఊరుకోండి. లలితా సహస్రనామం అంటే వేళాకోళం కాదు. మొదలు పెట్టారంటే ఫలశ్రుతితో సహా చదవాలి" అంది వేద చిరుకోపంగా.

నేను చిన్నగా నవ్వుతూ "ఆ ఫలశ్రుతేదో నువ్వు చదువు. నేను 'ఈ చీకట్లో దారి తప్పకుండా' నీ దరికి చేరడం అనే ఫలితం నీకు దక్కుతుంది" అన్నాను.

వేద పెద్దగా నవ్వి "సర్లే త్వరగా రండి" అంది.

***

నా చుట్టూ అలుముకున్న చీకట్లను ఛేదిస్తూ బీచ్ రోడ్లో ఒక్కసారిగా లైట్లు వెలిగాయి. లేచి నడవసాగాను. దీపస్తంభం దాటి మొదటి వీధిలోకి తిరిగాను. మూడో నంబర్ ఇల్లు - చిన్నదే. బహుశా ఒక గది ఉంటుందేమో! గది ముందు వరండా. ప్రహరీకున్న రేకు గేటు వరకూ నాలుగు నాపరాళ్ళు - దారి కోసం వేసి ఉన్నాయి. గేటు ప్రక్కన ప్రహరీ మీదికి సన్నని సన్నజాజి తీగ పాకి ఉంది. పూలు కోయకుండా నిర్లక్ష్యంగా వదిలేసినట్లుంది విచ్చిపోయి కొన్ని, వాడిపోయి కొన్ని కొమ్మల్లో వేలాడుతున్నాయి.

మెల్లగా శబ్దం కాకుండా రేకు గేటు తీసుకుని వరండాలోకి వెళ్ళాను. తలుపు సందులోంచి సన్నని వెలుగు బయటకి కనిపిస్తోంది. వెయ్యి రూపాయల నోటుని పర్సులోంచి తీసి మడతతోనే తలుపు సందులో గుండా లోపలకి నెట్టేసి వీధిలోకి వచ్చేశాను. రెండో వీధి మలుపు తిరుగుతుండగా గుర్తొచ్చింది - రేకు గేటు తలుపు మూయలేదని.

'పర్వాలేదండీ, నో ప్రాబ్లమ్' అని ఆమె అంటున్నట్లయి నవ్వుకుంటూ ముందుకి నడిచాను.


*******


2 comments:

P