Sunday, June 12, 2016

నేను - నువ్వు

భావోద్వేగంతో మనసుని
తడుముతున్న నిన్ను
వసంతయామిని కోయిలలా
ఆర్తిగా తాకుతున్నాను.

నీ మనసు పొరల్లోని సంచలనాన్ని
తర్జుమా చేయడానికి
నువ్వు తడపడుతున్నప్పుడు
నీ ముందు వాలిపోయాను

నన్ను నువ్వు చుట్టుకుంటూ
నీ వేళ్ళనుండి జారవిడుస్తున్నపుడు
కస్తూరిపువ్వుల పరిమళమై
అలంకరించుకున్నాను

కొంగొత్తగా చెలరేగుతున్న
నీ ఊహల సముదాయాన్ని
గమనిస్తూ నన్ను నీ గుండెల్లో
స్మృతిగా దాచిపెట్టుకోనిచ్చాను.

కలకలం, కలవరం లేకుండా
నిశ్శబ్దంగా నాలోకి ప్రవహిస్తున్న
నిన్ను నేను గుర్తుపట్టేసి
ప్రేమతో కౌగలించుకున్నాను.

అద్భుతమైన లోకాలని నువ్వు
నా ద్వారా పరిచయం చేస్తూ
నీ గుండె ఆగి కాలం స్తంభించినప్పుడు
నీ పెదవులపై ఓ అలలా నర్తించాను

నన్ను విశ్వసంగీతంగా మలచి
భగవంతునికి అర్పిస్తున్నపుడు
అద్వితీయమైన మౌనమూర్తినై
శాంతిగా సెలవు తీసుకున్నాను.

ఆ దేవదేవుని స్తుతించే
చివరి స్వరం నువ్వైనప్పుడు
నీతో నేను కలిసిపోయి మళ్ళీ
నీ గుండెలపైనే కీర్తిపుష్పంగా వాలాను.

***

'నాకు మాత్రమే' అర్థమయ్యే నిన్ను
'నేను మాత్రమే' అనుభూతించగలను
మహోజ్వలితనై నిను ప్రేమించగలను

*****
- రాధ మండువ

No comments:

Post a Comment

P