Monday, November 11, 2013

సానుభూతి


(ఈ కథ సార౦గ లో ప్రచురి౦చబడి౦ది)
“సరోజా! ఇటు రా! “ బీరువా ముందు నిలబడి పనమ్మాయి సరోజని పిలిచింది విమల.
“ఏంటమ్మా?” అంది సరోజ విమల గదిలోకి వస్తూ.
“రేపు పార్టీకి ఏం చీర కట్టుకోమంటావు?” అంది నాలుగు చీరలు తీసి మంచం మీద పడేస్తూ.
“మీరు ఏం చీర కట్టుకున్నా బాగానే ఉంటారమ్మా!” అంది సరోజ.
“ఊ! నిన్ను అడగటం నాదే బుద్ధి తక్కువ. నేనేది కట్టుకున్నా ఆరాధనగా చూస్తావు” అంటూ చీరలన్నీ కలబెట్టింది విమల.
దొంతరలు దొంతరలుగా పేర్చి ఉన్న చీరల్లో ఒక్కటీ నచ్చలేదు ఆమెకి.
“అబ్బ! ఒక్కటన్నా బాగా లేదు. బజారుకి వెళ్ళి కొత్త చీర తెచ్చుకుంటా. నువ్వు సాయంత్రం ఇంటికెళ్ళేప్పుడు రంగా కి బ్లవుజ్ ఇచ్చి ఉదయానికి రెడీ చేయమని చెబ్దువుగాని. నేను వచ్చేప్పటికి పని పూర్తి చేసుకుని ఉండు” అంటూ హడావుడిగా బ్యాగ్ తీసుకుని బయటకు వెళ్ళింది విమల.
విమల కొత్త చీర కొనుక్కుని వచ్చి వంట చేస్తున్న సరోజకి చూపించింది. నెమలి రంగు చీర మీద పసుపు పూల లతలతో ఆ చీర చాలా బాగుంది. “చాలా బావుందమ్మా! “ అంది సరోజ.
“బావుందా! సరే నువ్వు బ్లవుజ్ కుట్టమని రంగా కి చెప్పి ఇంటికెళ్ళిపో. రేపు ఉదయం వచ్చేటప్పుడు బ్లవుజ్ తీసుకురా – మర్చిపోకుండా” అంది విమల.
కుట్టాల్సిన రవికా, ఆది రవికా ప్లాస్టిక్ కవర్లో పెట్టుకుంటూ “ఎందుకు మర్చిపోతానమ్మా? రేపే కదా మీ పుట్టినరోజు” అంది సరోజ. 
      
                                                            **
తర్వాత రోజు సరోజ తన కూతురు చిట్టిని తీసుకొచ్చింది. చిట్టిని వరండా చివర కూర్చోపెట్టి రవికల కవరు తీసుకుని లోపలకి వెళ్ళింది.
సూర్యుడు గబగబా ఏదో కొంప ముంచుకుపోయినట్లు పైకి ఎగబాకుతున్నాడు. వరండాలో కూర్చుని ఉన్న చిట్టికి బాగా ఆకలిగా ఉంది. అమ్మ కోసం, ఆమె తెచ్చే అన్నం కోసం ఎదురు చూస్తోంది. ఆ ఇంట్లోకి ఎవరెవరో వస్తున్నారు, వెళుతున్నారు. ఇంట్లోకి వెళ్ళే వాళ్ళని గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు చిట్టి. కాని లోపల నుంచి బయటకు ఎవరైనా వస్తున్న చప్పుడైతే మాత్రం ఆత్రంగా తల ఎత్తి చూస్తోంది తన అమ్మేమోనని. లోపల నుండి నవ్వులూ, మాటలూ వినపడుతున్నాయి. వంటింట్లో నుండి వచ్చే వాసనల వల్ల చిట్టికి ఆకలి ఇంకా ఎక్కువవుతోంది.
ఇంతలో ఇద్దరు పిల్లలు బుట్టెడు ఆట సామాన్లతో వరండాలోకి వచ్చారు. బుట్టలో నుండి రకరకాల బొమ్మలు తీసి వరండాలో సర్దుతున్నారు. చిట్టి ఆకలిని మర్చిపోయి వాళ్ళ వైపే చూస్తోంది ఆసక్తిగా. చివరగా పెళ్ళి కూతురు, పెళ్ళి కొడుకు బొమ్మలను తీసిన చిన్న పాప “అక్కా! పెళ్ళి ఆట ఆడుకుందామా?” అంది.
“సరే” అంది పెద్ద పాప.
పెళ్ళి ఆట అనగానే చిట్టి ఉత్సాహంగా వారి వైపే చూడసాగింది.
పెళ్ళికూతురినీ, పెళ్ళికొడుకునీ ప్రక్క ప్రక్కనే కూర్చోపెట్టారు. పురోహితుడి బొమ్మని వాటికెదురుగా పీట వేసి దాని పైన పెట్టారు. ఆడవాళ్ళనీ, మగవాళ్ళనీ, జంతువులనీ, పక్షుల్నీ వాళ్ళ దగ్గర ఉన్న బొమ్మలన్నింటినీ ఎదురుగ్గా అలంకరించారు. పెద్ద పాప లోపలకి వెళ్ళి స్టీలు గిన్నెలో ఏవో తెచ్చి ప్రక్కన పెట్టింది.
అవేమైనా తినేవేమో అనుకున్న చిట్టికి నోట్లో నీళ్ళూరాయి. ఇద్దరూ ఏవేవో మంత్రాలు చదువుతూ బొమ్మలకు పెళ్ళి చేశారు.
“పెళ్ళయింది. ఇక భోజనాలు పెట్టాలి చుట్టాలకి” అంది చిన్న పాప.
“ఆ! అందరూ భోజనాలకు లేవండి” అంది పెద్ద పాప ఎదురుగ్గా అలంకరించిన బొమ్మల వైపు చూస్తూ.
చూస్తున్న చిట్టి అప్రయత్నంగా లేచి వాళ్ళ దగ్గరకి వెళ్ళి “భోజనాలా?“ అంది.
తలతిప్పి చిట్టి వైపు చూసిన పిల్లలిద్దరూ “ఎవరు నువ్వు?” అన్నారు ఇద్దరూ ఒకేసారి.
“మా అమ్మ ఈ ఇంట్లో పని చేస్తుంది” అంది చిట్టి.
“సరోజక్క కూతురివా?” అంది పెద్ద పాప.
తల ఊపింది చిట్టి.
“దా! నీ పేరేమిటీ?” అన్న చిన్న పాపను చూస్తూ “చిట్టి” అంది చిట్టి.
“నా పేరు శరణ్య. ఇది మా అక్క సాహితి” అని అక్కని వేలితో చూపించి “నువ్వు ఎన్నో తరగతి?” అంది మళ్ళీ.
“నాలుగో తరగతి” అంది చిట్టి.
“నేను కూడా నాలుగే.. దా! కూర్చో!” అంది చిన్న పాప.
చిట్టి కూర్చోలేదు. అలాగే నిలబడి ఉంది.
“కూర్చో. ఆడుకుందాం” అని పెద్ద పాప అనడంతో వాళ్ళకి కొద్ది దూరంలో కూర్చుంది చిట్టి బిడియంగా.
“స్టీలు గిన్నెలో నుండి కేకులు, చిప్స్ తీసి ప్లేట్లల్లో సర్దుతోంది పెద్ద పాప. చిట్టి వాటి వైపే రెప్ప వాల్చకుండా చూస్తోంది. దానికి నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి ఆగకుండా. బొమ్మలన్నింటినీ వరసగా కూర్చోపెడుతున్న చిన్న పాప చిట్టి వైపు తిరిగి “నీకు కూడా ఇలాంటి బొమ్మలున్నాయా?” అని అడిగింది.
చిట్టి తల అడ్డంగా ఊపింది లేవన్నట్లు.
“లేవా?” అని ఆశ్చర్యంగా చూసి “ఇంకేమైనా బొమ్మలున్నాయా మరి?”
“అస్సలు నాకు బొమ్మలే లేవు” అంది చిట్టి మామూలుగా. దాని గొంతులో ఏమీ బాధ లేదు. కళ్ళు మాత్రం చిప్స్ వైపే చూస్తున్నాయి.
“నేను నీకు కొన్ని బొమ్మలిస్తానుండు. ఇది ఇవ్వనా?“ అంటూ అమ్మాయి బొమ్మ ఇవ్వబోయింది. వద్దు అన్నట్లుగా తల ఆడించింది చిట్టి. “పోనీ ఇది ఇవ్వనా? ఇది ఇవ్వనా” అంటూ రకరకాల బొమ్మలు చూపిస్తోంది. ఆ పాప ఏది చూపించి అడిగినా “వద్దు – వద్దు” అంటున్న చిట్టిని చూసి “పెళ్ళికూతురూ, పెళ్ళికొడుకూ బొమ్మలు మాత్రం ఇవ్వను. ఇంకేం కావాలన్నా తీసుకో“ అంది చిన్న పాప విసుగ్గా.
చిట్టి ఏమీ మాట్లాడలేదు. “ఏం కావాలో అడుగు భయపడకుండా” అంది పెద్ద పాప చిట్టికి దగ్గరగా వచ్చి. చిట్టికి ఏదైనా ఇవ్వాలని వాళ్ళిద్దరికీ చాలా కోరికగా ఉంది.
“ఆకలేస్తుంది. ఆ రొట్టె కావాలి” అంది చిట్టి కేకును చూపిస్తూ.
“అయ్యో! ఆకలేస్తుందా?” అని గిన్నె దగ్గరకి పరిగెత్తినట్లుగా వెళ్ళింది పెద్ద పాప.
చిన్న పాప నవ్వుతూ “అది రొట్టె కాదు కేకు” అంది.
కేకు, చిప్స్ ఉన్న ప్లేట్ తీసి చిన్న పాపకిచ్చి “చిట్టికి ఇవ్వు. అమ్మని పిలుచుకొస్తా” అంటూ లోపలకి పరిగెత్తింది పెద్ద పాప.
పెద్ద పాప ‘అమ్మని పిలుచుకొస్తాన’న్న మాటకి చిట్టికి భయమేసింది. నాలుగు రోజుల క్రితం జరిగినది గుర్తొచ్చింది.
నాలుగు రోజుల క్రితం చిట్టి తన గుడిసె ముందు కోర్చోనుంది. వాళ్ళ పక్క గుడిసెలో ఉండే గౌరి, కిట్టా వాళ్ళ నాన్న అరటి పళ్ళు తీసుకుని లోపలికి వెళ్ళాడు. చిట్టి తనకి కూడా నాన్నుంటే ఏదో ఒకటి తెచ్చేవాడు కదా అనుకుంటూ వాళ్ళ గుడిసె వైపే చూస్తూ ఉంది. గౌరి, కిట్టా అరటి పండు తెచ్చుకుని తింటుంటే వాళ్ళ దగ్గరకి పరిగెత్తుకుని వెళ్ళి గౌరిని కాస్త పెట్టమని అడిగింది. గౌరి సగం తుంచి పెట్టింది. కిట్టా లోపలకి వెళ్ళి వాళ్ళమ్మకి చెప్పాడు. వాళ్ళమ్మ పెద్దగా అరుస్తూ బయటకొచ్చి చిట్టి వీపు మీద నాలుగు దెబ్బలేసి రెక్క పట్టుకుని చిట్టి గుడిసె దగ్గరకు లాక్కొచ్చింది. “అన్నం పెట్టుకోలేక ఊళ్ళో వాళ్ళ మీదకు తోలతన్నావా పిల్లని? మాకే గతి లేక చస్తా ఉంటే నా పిల్ల దాని చేతిలోది తీసుకుని తింటంది ఇది” అని చిట్టి అమ్మని తిట్టింది. చిట్టి అమ్మ ఏమీ చేయలేక చిట్టి వీపు మీద నాలుగు గుద్దులు గుద్ది చిట్టినే వాటేసుకుని ఏడ్చింది. అది గుర్తొచ్చిన చిట్టి చిన్న పాప ఇస్తున్న కేకుని తీసుకోకుండా వణికిపోసాగింది.
పెద్ద పాప లోపల్నించి వాళ్ళమ్మని తీసుకొచ్చింది. నెమలి రంగు చీర మీద పసుపు పూల లతలున్న చీర కట్టుకున్న ఆమె చాలా అందంగా ఉంది. చిట్టి ఆమె వైపు భయంగా చూసింది. ఆ చూపులోని భయాన్ని, వణుకునీ, కలవరాన్నీ చూసిన విమల సముదాయింపుగా “ఎందుకు భయపడుతున్నావు? తీసుకో – తిను” అంటూ చిన్న పాప చేతిలోని కేకుని తీసుకుని చిట్టికి పెట్టింది.
చిట్టికి భయం తగ్గింది. “సరోజా! ఇలా రా” అంటూ కేకేసింది విమల.
సరోజ పరిగెత్త్తుకుంటూ బయటకు వచ్చింది. “పాపకి ఆకలేస్తుంటే అన్నం పెట్టకుండా ఏం చేస్తున్నావ్?” అంది విమల.
“మీ భోజనాలయ్యాక పెడతాలేమ్మా” అంది సరోజ.
“అదేంటీ? ఇంట్లో వండలేదా” అంది విమల ఆశ్చర్యంగా.
చిన్న పాప, పెద్ద పాప చిట్టి వైపు దిగులుగా చూస్తున్నారు.
“లేదమ్మా. నాకు మీరిచ్చింది సరిపోతుంది. చిట్టికి స్కూల్లో పెడతారు. బంద్ అని స్కూలు తెరవడం లేదు. అందుకని వారం రోజుల నుండీ ఇక్కడ తీసికెళ్ళిందే ఇద్దరం తింటున్నాం” అంది. మళ్ళీ తనే “బంద్ ఎందుకోసమమ్మా?” అని అడిగింది.
“రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని బంద్ చేస్తున్నారు. నీకర్థం కాదులే – ఇట్లా చెప్తే. ఇప్పుడూ మీ పేట ఉందనుకో – పెద్దమనుషులు దాన్ని రెండుగా చేసి కొంతమంది అటు ఉండండి కొంతమంది ఇటు ఉండండి అని విడదీశారనుకో. విడిపోవడం ఇష్టం లేని వాళ్ళు ‘అందరం కలిసి ఉందాం’ అని గొడవ చేస్తారు కదా! అలా మన తెలుగు రాష్ట్రాన్ని వేరు చేస్తున్నారని కలిసి ఉండాలనే వాళ్ళు బంద్ చేస్తున్నారు” అని విమల సరోజకి వివరంగా చెప్పింది.
“కలిసి ఉన్నవాళ్ళని విడిపొమ్మనడం ఏంటమ్మా? కలిసి ఉండండి అని చెప్పాలిగాని” అంది సరోజ.
“అటుప్రక్క వాళ్ళు విడిపోవాలంటున్నారుగా” అంది విమల.“ఇదేదో అత్తా కోడళ్ళ తగాదా లాగా ఉందమ్మా. పెత్తనం తనకే ఉండాలని అత్త కలిసి ఉందాం అంటుంది. అత్త ఉంటే పెత్తనం రాదు కాబట్టి విడిపోవాలంటది కోడలు. మా ఇళ్ళల్లో ఎన్ని జరగడం లేదు ఇట్టాంటి తగాదాలు. అయినా పెద్దోళ్ళు గొడవ పడతా పిల్లలకి బడి లేకుండా చేస్తే ఎట్టమ్మా? మద్యాన్నమన్నం లేకుండా పోయింది” అంది సరోజ. సరోజ కళ్ళల్లో సన్నని నీటి పొర.
ఈ సమస్య గురించి అవగాహన లేని వాళ్ళకి దీని లోతులు అంత తేలిగ్గాఅర్థంకావనుకున్నవిమల “సరోజా! నువ్వనుకున్నంత చిన్న సమస్య కాదు ఇది కాని నువ్వన్నట్లు పిల్లలకి బడి లేకుండా చేయడం వల్ల ఎంతమంది చిన్నారులు ఆకలితో బాధపడుతున్నారో పాపం” అంది.
ఆ మాటలకి సరోజ కళ్ళల్లోని నీళ్ళు బుగ్గల మీదకి జారాయి. విమల సరోజ భుజం మీద చేయి వేస్తూ సరోజా! మీ పిల్లదానికి అన్నం ఇక్కడ పెడితే నేనేమైనా అంటానా? స్కూలు తెరిచిందాకా రోజూ ఇక్కడే అన్నం పెట్టు” అంటూ చిట్టిని సరోజతో వంటింట్లోకి పంపించింది.
వాకిట్లో నిలబడి అంతా చూస్తున్న ఆమె స్నేహితులు కొందరు “ఇలా వాళ్ళని ఇంట్లో చేర్చావంటే నెత్తికెక్కుతారు. ఎక్కడిదీ చాలదు” అన్నారు.
“ఫరవాలేదు. మనం కొనే ఒక చీర ఖరీదు లేదు వాళ్ళు తినేది. ఎక్కడిదీ చాలకపోవడానికి మనం వాళ్ళకేమైనా చీరలు సారెలూ ఇస్తున్నామా లేక జీవితమంతా పోషిస్తున్నామా? వాళ్ళ పట్ల సానుభూతితో ‘మీకు కష్టం వచ్చినపుడు మేము ఉన్నాం’ అని అనడమే వాళ్ళకు మనం చేసే గొప్ప సహాయం. అది వాళ్ళకి ఎంతో ధైర్యాన్ని, ఓదార్పుని ఇస్తుంది” అంది విమల.
ఇలాంటి తన స్నేహితురాళ్ళని మెప్పించడం కోసం, వారి మెరమెచ్చుల కోసం తను నిన్న అప్పటికప్పుడు కొని కట్టుకున్న చీర బరువైపోయినట్లుగా అనిపించసాగింది విమలకి.
                                                                         ***

No comments:

Post a Comment

P