Monday, November 11, 2013

సాహచర్యం



ప్రచురణ - సారంగ ఇ పత్రిక

నా చుట్టూ ఇంతమంది ఉన్నా నేను ఎప్పుడూ ఒంటరితనాన్ని కోరుకుంటాను. నాలోకి నేను చూసుకోవడానికి నేను ఏర్పరుచుకున్న ఈ ఒంటరితనం నన్ను శిఖరానికి చేరుస్తుందా లేక లోయల్లోకి జారవిడుస్తుందా? ఏదైతే మాత్రమేం? నన్ను నేను తెలుసుకున్నాక. అంతా ఒకటే అప్పుడు. అసలు నాలోనే ఉన్న ' నేను ' ను వెతుక్కోవడానికి ఎందుకు ఇంత బాధ? సహజంగా - మామూలుగా, అతి మామూలుగా, మంచి నీళ్ళు తాగినంత సులభంగా నాలోని నేనుని గుర్తించలేనా? కళ్ళెత్తి చూశాను గర్భగుడిలో ఉన్న ఆ దేవదేవుడి వైపు - నా ప్రశ్నకి సమాధానం ఏమిటి అన్నట్లు.


నవ్వుతున్నాడు చిద్విలాసంగా. అతని ప్రక్కనించి మెల్లగా నడిచి నా వైపే వస్తున్న ఆమెని చూడగానే సమాధానం కోసం ఆతృత పడబోతున్న నా మనసు నెమ్మదించింది. సంతృప్తితో కూడిన సౌందర్యంతో వెలుగుతున్న ఆమె ముఖంలోని చిరునవ్వు ఎంతో ఆకర్షణీయంగా ఉంది.


" హారతి తీసుకోండి " అంది నాకు దగ్గరగా వచ్చి. ఆమె ఏమందో ఆమె పెదవుల కదలికల ద్వారా అర్థమైన నేను ఆమె చేతులవైపు చూశాను. అప్రయత్నంగా హారతిని కళ్ళకద్దుకున్నాను. కొబ్బరిముక్కను నా చేతిలో పెట్టి మెట్లు దిగి వెళ్ళి నందీశ్వరుడి విగ్రహం ప్రక్కగా వెలుగుతున్న హారతిని వదిలేసింది. వెలుగుతున్న హారతిని చూస్తూ మళ్ళీ మెట్ల మీదకు వచ్చి కూర్చుంది నాకు కొంచెం ఎడంగా.


గోపురం మీద నుండి సూర్యుడు పైకి ఎగబాకుతున్నాడు. గూళ్ళలోని పావురాలు మా ప్రక్కగా వాలి కువకువలాడుతున్నాయి. ఆమెని పలకరించాలని, ఆమె ఎవరో తెలుసుకోవాలని తపనగా ఉంది.


" మీరు - మిమ్మల్ని ఇక్కడ ఎప్పుడూ చూడలేదు. ఈ ఊరికి కొత్తవారిలా ఉన్నారు " అన్నాను.


" అవును. గుడికి మీరు రోజూ వస్తుంటారా? "


" ఊ " అన్నాను ఆమె వైపే చూస్తూ - నా ప్రశ్నకి సమాధానం అది కాదు అన్నట్లుగా ముఖం పెట్టి.


" నేను ప్రెసిడెంట్ రాఘవరావు గారి చిన్న చెల్లెల్ని " అంది. నిర్లిప్తత ఆమె కంఠంలో స్పష్టంగా తెలుస్తోంది.


" నువ్వా! " అన్నాను అప్రయత్నంగా.


" మీరు - నువ్వులోకి మారింది చూశారా! నా గురించి చెప్పగానే" అంది ఆవిడ నవ్వుతూ. ఆమెకేమీ సమాధానం చెప్పలేకపోయాను.


ఆమె ముఖంలో ఏ మాత్రం తొట్రుపాటు కాని, చేసిన పనికి పాశ్చాత్తాపం కాని లేవు. అదే సుందర దరహాసం. శివుడి కోసం వచ్చిన పవిత్ర గంగలా అంత స్వచ్ఛంగా ఎలా ఉంది? ఆమె గురించి నేను విన్నవన్నీ నిజమేనా? ఇంట్లో పని చేసే పాలేరుతో లేచి వెళ్ళిపోయిందనీ, అతన్ని కూడా వదిలేసి మరెవరితోనో ఉందనీ, పాపం ఆ పాలేరు ఏ రైలు కిందో పడి చనిపోయాడనీ - మరి ఆమె ముఖంలో ఆ సంతృప్తి , కళ్ళల్లో కాంతి ఎలా సంభవం? - ఏమిటిది? లేచి పోయినంత మాత్రాన ఆమెలో సంతృప్తి ఉండకూడదా? -


నా ఆలోచనల్లో నేనుండగానే ఆమె మెట్లు దిగుతూ "వెళ్ళొస్తానండీ " అంది.


నేను కూడా ఆమె వెంట నడిచాను. ముఖద్వారం దాటుతూ ఆమె ప్రక్కనే నడుస్తున్న నన్ను చూస్తూ " మీ గురించి ఇప్పుడే పూజారి గారు చెప్తే విన్నాను " అంది.


" మీ గురించి నాకూ తెలుసుకోవాలని ఉంది " అన్నాను ఆమెకి సమాధానంగా. ఆమె మౌనంగా ఉంది. ఏమీ మాట్లాడలేదు.


" మీ ఊళ్ళోని బడిలో ఉపాధ్యాయునిగా చేరి పదేళ్ళు అయింది. వరదల్లో భార్యాబిడ్డని పోగొట్టుకుని ఒంటరివాడిని అయిందీ ఇక్కడే. నాకు చేతనైనంతలో అందరికీ సాయం చేస్తున్నాను. అయినా నాలో సంతృప్తి లేదు. దాని కోసం నిరంతరాన్వేషణలో ఉన్నాను. మీలో ఆ సంతృప్తిని చూశాను కనుకనే మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను " అన్నాను.


నిదానంగా మాటలు పేర్చుకుంటూ ఏదో అలౌకికంగా మాట్లాడుతున్నాననేమో నన్ను గౌరవంగా చూస్తూ " నాక్కూడా నా గురించి మీకు చెప్పాలని ఉంది. ఒకే అన్వేషణలో ఉన్న బాటసారులే ఒకరినొకరు అర్థం చేసుకోగలరు " అని ఆగి "ఇప్పుడు సమయం లేదు. ఇంటికి వెళ్ళి వంట చేసుకునే పని ఉంది. క్షమించండి మిమ్మల్ని మా ఇంటికి పిలవలేను. పరాయి పురుషుడిని ఇంటికి తీసుకొచ్చిందని లోకం కూసే కూతలు వినే ఓపిక ఇక నాకు లేదు. అంతేగాని భయం మాత్రం కాదు " అంది.


ఏవో జ్ఞాపకాలు ఆమె కళ్ళను తడి చేశాయి. ఆమె కళ్ళలోని ఆ తడిని నేను చూడకూడదన్నట్లుగా తలవంచుకుని " రేపు ఇక్కడే మాట్లాడుకుందాం. వస్తానండీ " అంటూ త్వరత్వరగా నడుస్తూ వెళ్ళిపోయింది.


ఆమె పేరు అపురూప. నిజంగానే ఆమె అపురూపంగా ఉంది. స్కూల్లో పిల్లలకి పాఠాలు చెప్తున్నా కూడా ఆమె జ్ఞాపకాలు నాలో వేళ్ళాడుతూనే ఉన్నాయి. చిత్రంగా ఆ రాత్రి హాయిగా నిద్రపోయాను. నిద్ర లేవగానే మళ్ళీ నాలో ఆమె జ్ఞాపకాలు. ఆమె స్నేహభావం, నిస్సంశయంగా ఆమెని ఆమె వ్యక్తీకరించుకున్న విధానం, ఆమె కళ్ళల్లోని కాంతి తల్చుకుంటూ అలాగే పడుకున్నాను. స్త్రీ లోని స్నేహభావాన్ని మొట్టమొదటి సారిగా చవి చూడటం వల్లనో లేక హాయిగా నిద్రించినందువల్లనో తెలియదు కాని నా అంతరంగం పురి విప్పిన నెమలిలా ఉంది.


లేచి గబగబా కాలకృత్యాలు , స్నానం ముగించుకుని రోజూ వెళ్ళే సమయం కంటే ముందే గుడికి చేరుకున్నాను. లోపలకి వెళ్ళాలనిపించలేదు. నిన్న కూర్చున్న చోటే మెట్ల మీద కూర్చున్నాను.


చల్లని ఉదయపు గాలి, పక్షుల కిలకిలారావాలు స్థిర ప్రశాంతతను కలిగిస్తున్నాయి. గర్భగుడిలో పూజారి చదువుతున్న లింగాష్టకం లీలగా వినిపిస్తుంది. కొద్దిసేపటికి అపురూప హారతి పళ్ళెంలో కొబ్బరికాయ, పుష్పాలు, అగరొత్తులతో వచ్చింది. నేరేడు రంగు పట్టు చీర, బంగారు రంగు జాకెట్టులో మెరిసిపోతుంది. వదులుగా వేసిన జడలో మందారం తురుముకుంది. నలభై ఏళ్ళ వయసులో కూడా ఆమె దేహం లావణ్యంతో కాంతులీనుతోంది. నన్ను చూసి స్నేహపూర్వకంగా నవ్వింది.


లోపలికి వెళ్ళి పూజ ముగించుకుని వచ్చి నా ప్రక్కనే కూర్చుని "మీ పూజ అయిందా " అని అడిగింది. ఆమెకి సమాధానం చెప్పాలనిపించలేదు. గోపురం గూళ్ళల్లో ఉన్న పావురాలను చూస్తూ " ప్రకృతిలో తెలియరాని రహస్యమేదో ఉంది. విశ్వేశ్వరుని స్వరూపాన్ని సాక్షాత్కరించుకోవాలంటే ఆ రహస్యాన్ని ఛేధించాలి. ఆ లీలా రహస్యం మీకు అవగతమైనట్లుంది కదూ! " అన్నాను.


నా మాటలకు సమాధానం లేదు. తలతిప్పి ఆమె వైపు చూశాను. మోకాళ్ళ పైన గడ్డం ఆనించి తలవంచుకుని కూర్చుని ఉంది. ఆమె ఏడుస్తున్నట్లు నాకు అనుమానం కలిగింది.


" ఏమైనా తప్పుగా మాట్లాడానా అపురూపా! " అన్నాను ఆందోళనగా.


ఆమె పేరు నా నోటి నుండి వినడంతోనే తల ఎత్తి నా వైపు చూసింది. ఆ తడి కళ్ళల్లో కూడా వెలుగే. సందేహం లేదు. ఈమె అనుభవించిన జీవితం అమెకీ వెలుగునిచ్చి ఉంటుంది. నడి సముద్రంలో జరిపిన ఒంటరి యాత్రలో ఆమె దు: ఖాన్ని జయించగలిగి ఉంటుంది.


తూర్పు దిక్కున బాలభానుడు సింధూరపు రంగును పూసుకుని ఉదయిస్తున్నాడు. చల్లని ప్రభాతవాయువులు మందబడుతున్నాయి.


" నా గురించి మీరేం విన్నారో నాకు తెలియదు. అహంకారం,అధికారం, డబ్బు నాకు పుట్టుకతోనే వచ్చాయి. నా చుట్టూ ఉన్న వాళ్ళూ అంతే. వాళ్ళ ద్వారా నా అహం తృప్తి పొందేది కాదు. నేను చెప్పే ప్రతి మాటకూ తల ఊపుతూ నన్ను పొగుడుతూ అందలం ఎక్కించే మా పాలేరు చంద్రం దగ్గర నా అహం అణిగేది. వాడికి నా పట్ల ఉన్న భయాన్ని పోగొట్టి నా చుట్టూ తిప్పుకోవాలనో లేక యవ్వనపు పరువాల మైకంతోనో నా జీవితభాండాన్ని పొగరుతో ఒలకబోసుకున్నాను. ఇంట్లో వాళ్ళకి తెలిసింది. అర్థరాత్రి నా గది కిటికీలో నుండి నేను చూస్తూనే ఉన్నాను. అరవకుండా చంద్రం నోట్లో గుడ్డలు కుక్కి గొడ్డుని బాదినట్లు బాది చంద్రాన్ని చంపేశాడు నా అన్న. అప్పుడు భయంతో నేను వేసిన కేకకి నా మాట పడిపోయింది. రాత్రికి రాత్రే నన్ను హైదరాబాదులో ఉన్న మామయ్య ఇంటికి పంపాడు. చంద్రం చచ్చిపోతాడని ఊహించని నా అన్న తన పైన పోలీసు కేసు లేకుండా చేసుకోవడానికి చంద్రంతో చెల్లెలు లేచిపోయిందని పుకారు వేయడానికి కూడా వెనుకాడలేదు.


ఎప్పుడూ బిజీగా ఉండే మా ఎం. పి మామయ్య ఇంట్లో నా గురించి పట్టించుకునే తీరిక ఎవ్వరికీ లేదు. నాకు నా అంటూ అక్కడ ఎవరూ లేరు. ఆ నగర జీవితం నన్ను ఒంటరిని చేసింది. చంద్రం చనిపోయిన సంఘటన వల్ల నాలో అహంకారం తగ్గింది కాని జీవితేచ్ఛ తగ్గలేదు. ఆ ఇచ్ఛే నన్ను ఒకరోజు ఇంట్లో నుండి బయటకు వచ్చేట్లు చేసింది. షాపింగ్ కి వెళ్ళొస్తానని మామయ్యతో చెప్పి కారులో బయల్దేరాను. మామయ్య డ్రైవర్ కి పుస్తకాల పిచ్చి. నవలలు మార్చి కొత్త నవలలు తెచ్చుకుంటానమ్మా అంటూ కారుని లైబ్రరీ ముందు ఆపి లోపలకి వెళ్ళాడు. గమ్యం లేని నాకు లైబ్రరీకి వెళితేనేం అని అనిపించింది. నాకు తెలియదు అదే - ఆ నిర్ణయమే నా జీవితాన్ని మార్చేస్తుందని.


లోపల చల్లగా ఉంది. చాలా మంది నిశ్శబ్దంగా చదువుకుంటున్నారు. డ్రైవర్ నన్ను చూసి " ఆ గదిలోనారాయణ బాబు గారి ప్రసంగం జరుగుతోందమ్మా, లోపలకి వెళ్ళండి " అంటూ ఓ గదిని చూపించాడు. లోపలకి వెళ్ళి తలుపు ప్రక్కనే ఉన్న కుర్చీలో కూర్చున్నాను.


" ప్రతి మనిషీ తనకేది సుఖాన్నిస్తుందో దానినే కోరుకోవడం సహజం. ఈ మనస్సు ఆ కోరిక వైపు పరిగెత్తుతుంది. అది దొరికాక మరొక దాని కోసం పరిగెత్తుతుంది. ఈ కోరికలకి అంతూ పొంతూ ఉండదు. కాబట్టి ఈ కోరికలు ఎక్కడనుండి పుడుతున్నాయో కనుక్కో. పుట్టే చోటుని వెతికితే చాలు ఆశ్చర్యంగా అన్ని కోరికలూ, సందేహాలూ ఆగిపోతాయి " సన్నగా, పొడుగ్గా లాల్చీలో ఉన్న అతని మాటల్లో కొత్తదనం -ఎప్పుడూ ఊహించను కూడా ఊహించని మాటలు. నాలో ఏదో శాంతి.


ప్రతిరోజూ అదే సమయంలో నారాయణబాబు ప్రసంగం ఉంటుందని తెలిసింది. ఎవరితో మాటలు లేవు. నిశ్శబ్దంగా ఆయన ప్రసంగం వినడం, వాటిని గురించి ఆలోచించడం. నాకు తెలియకుండానే నాలో మార్పు. నా తలనిండా సందేహాలు నా మౌనాన్ని విడిచేట్లు చేశాయి. నారాయణ బాబుతో చర్చలు -గంటలు నిమిషాల్లా గడిచేవి. ఈ సారి నా తప్పేమీ లేదు. నారాయణ బాబే నా సందేహాలు తీరుస్తూ నాకు దాసుడయ్యాడు. స్వేచ్ఛ కోసం ఎదురు చూస్తున్న నేను, నా జీవితం నాకుండాలని తపన పడుతున్న నేను - ధైర్యంగా అతనితో నిజంగానే లేచిపోయాను. నా ఉనికే భరించలేని నా కుటుంబం


' పీడా వదిలింది ' అనుకుంది. పాలేరుని కూడా వదిలేసి మరోడితో లేచిపోయింది. పాపం వాడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు అని మరో పుకారు లేపి ఊపిరి పీల్చుకుని ఉంటాడు మా అన్న.


నారాయణబాబు ఏదో ఫ్యాక్టరీలో ఉద్యోగం చేసేవాడు. పగలంతా ఇంటిపని చేసుకుని ధ్యానం లేదా పుస్తకాలు చదువుకోవడం. సాయంత్రం లైబ్రరీలో అతని ప్రసంగాలు - నాకు జీవితం అంటే ఏమిటో తెలిసింది.


ఆరోజు - ఆఫీసు నుండి ఇంటికి వస్తూండగా నారాయణ బాబుని లారీ గుద్దింది. ఎంత మందికో జీవన రహస్యాలని విశదీకరించిన నారాయణ బాబు రహస్యం గానే విశ్వంలో కలిసిపోయాడు.


'నేను నీకంటే ముందు చనిపోతే నువ్వు మీ ఊరికి వెళ్ళిపో -స్వచ్ఛమైన ఆ పల్లెలో ప్రశాంతంగా బ్రతకొచ్చు. ఎవరో ఏదో అంటారనే భయం నువ్వు తప్పు చేస్తేనే కలుగుతుంది. సమాజ నీతిని నిర్లక్ష్యం చేస్తే కలుగుతుంది ' అని బ్రతికుండగా నారాయణ బాబు చెప్పిన మాటలే నన్ను మళ్ళీ మా ఊరికి చేర్చాయి " ఏకబిగిన మాట్లాడిన ఆమె ఊపిరి పీల్చుకోవడానికన్నట్లు క్షణం ఆగింది.


" నా గురించి నా వెనక ఏం మాట్లాడుకుంటున్నారో, ఇంత కాలం ఎలాంటి కథలు అల్లారో నాకు అనవసరం ప్రసాద్ గారూ! నా పూర్వజన్మ సుకృతం వల్లనో, నారాయణ బాబు సాహచర్యం వల్లనో


' నేను ' ను తెలుసుకుంటున్నాను. ఈ పెంజీకటి కావల ఏముందో తెలుసుకోవాలని మీలాగే తపన పడుతూ అన్వేషిస్తున్నాను " అంది. ఆమె గొంతులోని ఆర్తి రెపరెపలు నన్ను కదిలించాయి. నేనేమీ మాట్లాడలేదు. అసలు నాకు మాట్లాడాలనిపించలేదు. దాదాపు గంట సేపు మా ఇద్దరి మధ్యా మౌనం భాషను తరంగాల రూపంలో ప్రసారం చేసింది.


" వెళ్ళొస్తానండీ " అంటూ నా అనుమతి కోసం చూడకుండా కనీసం నా వైపైనా చూడకుండా మెట్లు దిగింది. ఎర్రగా కాలినట్లున్న ఆమె జడలోని మందారాన్నే చూస్తున్నాను. హఠాత్తుగా ఏదో మరిచిపోయిన దాని మల్లే వెనుదిరిగి ఆమె నాకు దగ్గరగా వచ్చింది. పళ్ళెంలోని కొబ్బరి ముక్కను నా చేతిలో ఉంచి కదిలిపోయింది.


వెనుదిరిగి నా దగ్గరకి వచ్చే ఆమెని చూసి నేనేం ఊహించానో మరి నా మనసు తీవ్ర ఆశాభంగానికి లోనయింది. ఓ దీర్ఘ నిట్టూర్పు నాలోనుండి వెలువడింది. నా మనసేమిటో నాకు తెలిసింది.


" అపురూపా! ఒక్క క్షణం ఆగు " ఆమెని పిలుస్తూ మెట్లు దిగి ముఖద్వారం వైపు పరిగెత్తాను. నా గొంతులోని ఆతృతకి ఆమె ఆశ్చర్యంగా నా వైపు చూసింది. నేను పరిగెత్తిన అలికిడికి ఒక్కసారిగా అరిచి పైకి లేచిన పావురాలు నిశ్శబ్దంగా మళ్ళీ మెట్ల మీద వాలాయి. గుడి గోపురం నీడ మా ఇద్దరినీ కప్పేసింది.


" నీ గురించి ఇన్నేళ్ళూ ఈ జనం ఏం మాట్లాడారో, ఇప్పుడు నీ వెనక ఏం మాట్లాడుకుంటున్నారో నాకు తెలుసు అపురూపా! ఈ జనం నోళ్ళు మూతలు పడేట్లుగా అందరి ఎదుటా, వేదమంత్రాల సాక్షిగా నిన్ను స్వీకరిస్తాను. అప్పుడే నారాయణ బాబు నీకందించిన సంతృప్తి మసి బారకుండా ఉంటుంది. నీతో పాటు నా జీవితం సఫలమవుతుంది " అంటూ ఆమె అనుమతి లేకుండానే అప్రయత్నంగా ఆమె చేతిని అందుకుని నా చెంపకి ఆనించుకుని కళ్ళుమూసుకున్నాను.


ఆమె సున్నితంగా తన చేతిని విడిపించుకుంది. " క్షమించండి. కాలం మించిపోయింది. చిన్నతనంలో చేసిన తప్పులను,గాయాలను లెక్కచేయం. యవ్వనంలో జరిగిన భావోద్రేకాలకూ భయపడం. కాని ఇప్పుడు చిన్న గాయం గాని, తప్పుడు భావం గాని సహించడం చాలా కష్టం. నా వల్ల మీరు ఈ సమాజంలో గౌరవం కోల్పోయినప్పుడు - నా సంతృప్తిని మసిబారకుండా చేయాలన్న మీ ప్రయత్నం సంగతి అలా ఉంచండి - ఇద్దరం అశాంతి పాలవుతాం" అని నా సమాధానం కోసం అన్నట్లుగా ఆగింది. నేనేమీ మాట్లాడలేకపోతున్నాను. నా మనసంతా శూన్యంలో ఉన్నట్లుగా ఉంది.


"నా నిర్ణయాన్ని మీరు గౌరవిస్తారని నాకు తెలుసు. వస్తానండీ " అంటూ ముఖద్వారం దాటి మలుపు తిరిగి వెళ్ళిపోయింది.


ఆమె వెళ్ళిపోయిందన్న స్పృహ కూడా లేకుండా అలాగే నిలబడిపోయాను. నా మనసు ఆమె మాటల లోతుల్లో ఉన్న గాఢత్వాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఆమె విచక్షణా జ్ఞానం ముందు తలవంచుతోంది. గుడి గోపురమూ, పావురాల కువకువలూ, ఆమె రూపమూ అన్నీ నాలో ఐక్యమై ఎన్నడూ కలగని శాంతి కలగసాగింది.


అప్పుడు - ఆ క్షణం అర్థమయింది - ‘ నేను’ ని కనుక్కోవడానికి ఎంత గాఢత కావాలో.


                                                            *****

No comments:

Post a Comment

P