Monday, February 10, 2014

గతం - మ్యూజింగ్స్ - 1 - సారంగ ప్రచురణ

                                                                                                                 ~ రాధ మండువ


" అక్కా! అక్కా! ” అని అరుచుకుంటూ వచ్చాడు అభినవ్ నా గదిలోకి.

అప్పుడు సాయంత్రం 5 అయింది. నా స్నేహితురాలు విజయలక్ష్మి తో ఫోనులో మాట్లాడుతున్నాను.

ఫోనులో మాట్లాడుతుంటేనేమి? నిద్రపోతుంటేనేమి? నేను పలికిందాకా ‘అక్కా! అక్కా!' అని చెవి కోసినపిట్టల్లాగా అరుస్తూనే ఉంటారు పిల్లలు.

మాది పెద్ద బోర్డింగ్ స్కూల్. మా స్కూల్ లో మూడు వందల యాభై మంది పిల్లలు ఉంటారు. నేను ఇక్కడతెలుగు టీచర్ని. మా స్కూల్లో లేడీ టీచర్స్ ని పిల్లలు ‘అక్కా‘ అని పిలుస్తారు. స్కూల్లో ఇరవై హాస్టల్స్ఉన్నాయి. ఒక్కో హాస్టలికీ అనుబంధంగా ఉండే ఇంట్లో ఒక టీచర్ ఉంటారు. మా హాస్టల్ లో ఐదు,ఆరుతరగతుల పిల్లలు 18 మంది ఉన్నారు.

ఫోన్లో మాట్లాడుతున్న నేను   "ఉండమ్మా విజ్జీ లైన్లో” అని విజయలక్ష్మికి చెప్పి  "ఏంటి చెప్పు అభీ” అన్నాను.

"అక్కో! నిన్న మనం హైక్ కి వెళ్ళాం గదా! అప్పుడు పొద్దున్నే డైనింగ్ హాల్ వాళ్ళు దోశలు పొట్లం కట్టిచ్చారుకదా! ఆ దోశ తినేదా? భలే ఆకలేస్తుంది”  అని అన్నాడు.

ఫోనులో విజ్జితో సంభాషణ – లోకంలోని మనుషులు, వారి కోపాలూ, అసూయలూ దగ్గర మొదలై రమణమహర్షి, జిడ్డు కృష్ణమూర్తి, ఆత్మ, ధ్యానం దగ్గర ఆగిపోవడంతో ఓ రకమైన తాదాత్మ్యంతో ఉన్న నాకు వాడుచెప్పింది సరిగ్గా అర్థం కాక  "నిన్న తిన్నట్లు దోశ తినాలని అనిపిస్తుందా? ఈ రోజు డిన్నర్ లో ఇవ్వరుకదా! గురువారం బ్రేక్ ఫాస్ట్ లో ఇస్తారులే. తిందువుగాని” అని అన్నాను. ఏ రోజు ఏ భోజనం పెడతారో మాకుముందుగానే మెను చార్ట్ ద్వారా తెలుస్తుంది. ( ఇలా తెలియడం వల్ల జీవితంలో నూతనత్వాని కోల్పోతున్నాంకదా! అనిపిస్తుంటుంది నాకు.)

"అది కాదక్కా! నిన్న ప్యాకెట్టు మొత్తం తినలేదు. మిగిలినది బ్యాక్ పాక్ లో పెట్టుకున్నా.  అది ఇప్పుడుతినేదా!" అన్నాడు.

"ఓరోయ్! ఓ నాయనోయ్! ఛీ! ఛీ! – నువ్వు ఫోను పెట్టెసెయ్ విజ్జీ! – ఫోరా ఫో. పోయి తీసుకురా ఆ ప్యాకెట్టుని" అని అరిచాను.

వాడు చాలా ముద్దుగా ఉంటాడు. వాడి తరగతిలో అందరికంటే వాడే పొట్టి. ఇంతలేసి కళ్ళు. నేనన్నమాటలకి మూతి ముడుచుకుని ‘ ఎందుకు అక్క అరుస్తోంది ‘ అన్నట్లుగా ముఖం పెట్టి గునగునా పరిగెత్తాడుహాస్టల్ లోకి.

‘మిగిలిన నిన్నటి దోశ ఇప్పుడు తినేదా ‘ అన్నప్పుడు కోపం వచ్చినా, వాడు పెట్టిన ఆశ్చర్యకరమైన ముఖాన్ని చూడగానే నాకు నవ్వు ఆగలేదు. పెద్దగా నవ్వుతూ నా గదిలోనుండి హాస్టల్ లోపలకి వెళ్ళాను. నా నవ్వు విని ఎదురుగా ఉన్న గదిలో నుండి వార్డెన్ పరిగెత్తుకుంటూ వచ్చింది. జరిగింది చెప్పగానే ” అబ్బే” అని ముఖం జుగుప్సగా పెట్టింది. నాకు మాత్రం నవ్వు ఆగడం లేదు. ఈ లోపు అభి ప్యాకెట్ ని పట్టుకునివచ్చాడు. వాడి ముఖం లో ప్రశ్నార్థకం కనిపిస్తూనే ఉంది.

"పారేసెయ్! పారేసెయ్! ” అన్నాను దగ్గరకు రాకుండానే.

"ఎక్కడ పారేసేది? ” అన్నాడు అమాయకంగా.

"ఎక్కడ పారేసేదేందబ్బాయ్? చెత్తబుట్టలో వెయ్! ” అంటూ ముక్కుకి పైట చెంగు అడ్డం పెట్టుకుని తనే వాడిచేతిలోనుంచి ప్యాకెట్ లాక్కున్నట్టు తీసుకుని బయట పారేయడానికి వెళ్ళింది వార్డెన్.

"నిన్నటిది ఈ రోజు తినొచ్చా? పాడయిపోయింది తింటే జబ్బులు వస్తాయి” అని అన్నాను నేను.

"నాకు ఆ సంగతి తెలియదు అక్కా! ” అన్నాడు.

"సరేలే! ఇంకెప్పుడూ అలా మిగిలిన తిండిని బ్యాక్ పాక్ లో దాచుకోకు. వెళ్ళు. వెళ్ళి చేతులు కడుక్కునిలాకర్లో నుంచి రెండు బిస్కెట్ లూ, ఒక చాక్లెట్ తీసుకుని తిను” అని అన్నాను.

"వాడికి ఆకలేస్తుందట. చూసుకోమ్మా” అని వార్డెన్ తో చెప్పి నా గదికి వచ్చాను.

విజయలక్ష్మికి ఫోన్ చేద్దామని ఫోన్ చేతిలోకి తీసుకున్నానో లేదో మళ్ళీ  "అక్కా…!” అని పిలుచుకుంటూవచ్చాడు అభి.

‘ఏమిటి' అన్నట్టుగా చూశా వాడి వైపు.  "మరీ, చాక్లెట్లూ, బిస్కెట్లూ కూడా నిన్నటివే కదా! అవిపాడైపోలేదా” అని అడిగాడు. వాడు అడిగే ప్రశ్నకి, వాడు అడిగిన తీరుకీ భలే ముచ్చటేసింది. అభినిహత్తుకుని ముద్దు పెట్టుకున్నాను. పక్కనే కూర్చోబెట్టుకుని  "కొన్ని రోజులకి పాడవకుండా ఉండటానికివీటిల్లో కెమికల్స్ కలుపుతారు. ఇవి కూడా మంచివి కావు కాబట్టే ఎక్కువ తినొద్దు అని చెప్పేది. రేపు సైన్స్క్లాస్ లో ఈ టాపిక్ నే డిస్కస్ చేయండి. ఆమె చక్కగా అర్థం అయ్యేట్లు చెప్తుంది. నేను కూడా సుమతి అక్కకి(సైన్స్ టీచర్) చెప్తాలే. వెళ్ళు. వెళ్ళి ఆడుకో” అన్నాను.

వాడు సంతోషంగా ముఖం పెట్టి బయటికి పరిగెత్తాడు తను గ్రహించిన విషయాన్ని అందరితో చెప్పడానికి.

'నిన్నటి ఆహారం శరీరానికి విషం. అది అందరూ ఒప్పుకుంటారు. కాని నిన్నటి గతం మనసుకి విషం అనిఎందుకో తెలుసుకోలేకపోతున్నారు.  నిన్నటి నిందను ఈరోజు తలుచుకొని ద్వేషాన్ని లేదా బాధనిపెంచుకుంటారు. అలాగే నిన్నటి చాక్లెట్ లాంటి పొగడ్తని తలుచుకొని ఆనందపడతారు. రెండూ ప్రమాదమే. అసలు గతమే మనసుకి విషం, మాయ అని గ్రహిస్తే ఆత్మ ప్రకాశిస్తుంది. శాశ్వతమైన ఆనందం లభిస్తుంది'


***No comments:

Post a Comment

P