Friday, February 7, 2014

చెవిలో పువ్వు - కౌముది ప్రచురణ                                                               మండువ రాధ


అక్కా! మీ అత్త నిన్ను తీరిక చేసుకుని ఫోన్ చేయమంది" అంది మా పనమ్మాయి శ్యామల. శ్యామల మా ఇంట్లోను మా అత్తగారింట్లోను కూడా పని చేస్తుంది. అక్కడి విషయాలు ఇక్కడకి, ఇక్కడ విషయాలు అక్కడకి భలే తెలివిగా చేరేస్తుంటుంది.

పండక్కి నేను చీర కొనుక్కున్నట్లు మా అత్తగారికి వార్త చేరేసి ఉంటుంది అందుకే ఫోన్ చేయమని శ్యామల చేత కబురు చేసింది అనుకుంటూ అత్తగారికి ఫోన్ చేశాను. 'ఎన్ని చీరలు కావాలని అడుగుతుందో' అనుకుంటూ -

హల్లో! అత్తయ్యగారూ ఫోన్ చేయమన్నారుట" అన్నాను అవతల ఖచ్చితంగా ఆవిడే ఫోన్ ఎత్తుతుందని తెలుసు కాబట్టి.

మా అత్తగారిని వెయ్యింగ్ మిషన్ మీద నిలబెడితే మిషన్ లో ఉండే సూచి జరజరా గిర్రున ఒక రౌండ్ తిరిగి ఇరవై దగ్గర ఆగుతుంది. ఆమెకీ మధ్య చాలా జబ్బు చేసి ఆవిడ స్వర్గానికి, మేము నరకానికి వెళ్ళి వచ్చాం. ఇక లావు తగ్గకపోతే కుదరదని హై లెవెల్లో బంధుమిత్రుల సమక్షంలో తీర్మానించేశాము. దానిలో భాగంగా ప్రతి ఆదివారం కొడుకు అంటే మా ఆయన పదకొండు గంటలకి ఠంచనుగా అక్కడకి హాజరయిపోయి ఆమెకి బరువు తూస్తాడు. ఆవిడ చూపించుకోవడం అయ్యాక 120 అని డైరీలో రాస్తూ "ఏమండీ! మీరూ రండి బరువు చూపించుకోండి" అని మా మామగారిని దబాయిస్తుంది.

ఆయన నిదానంగా సోఫా కుర్చీలో నుండి లేచి మిషన్ మీద నిలబడతారు. “ఎంత?” అంటుంది - మా ఆయన “56” అంటారు. "నా బరువు ఎప్పుడూ అంతే" అని మా మామగారు మిషన్ దిగుతారు. “ఆఁ అంతే మీరు లావు ఎక్కరు నేను లావు తగ్గను" తగ్గను అనే మాట ఎవరికీ వినిపించకుండా గొణుక్కుంటూ 56 అని మామయ్య గారి పేరు కింద ఆయన బరువు నోట్ చేస్తుంది.

అంత బరువున్న మా అత్తగారు ఉదయం 9 గంటలకి శ్యామల వెళ్ళి లేపిందాకా నిద్ర లేవదు. శ్యామల ఆవిడని నిద్ర లేపి చిన్నగా బాత్ రూమ్ లోకి నడిపించి అన్ని కార్యక్రమాలూ పూర్తి చేయించి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెడుతుంది. టేబుల్ మీదే ఓ ప్రక్క ఆమె రాసుకునే డైరీ (మా అత్తగారు డైరీ రాస్తారులెండి), ఫోన్, రేడియో పెట్టి ఉంటాయి. టిఫిన్ తిని ఆరోజు ఏం టిఫిన్ తిందో, దాన్లో కరివేపాకు వేశారో లేదో, దోశ కాలిందా లేదా ఇలా డైరీలో రాస్తుంది. రేడియో వింటూ మధ్య మధ్యలో వచ్చే ఫోన్ లు ఎత్తుతూ ఉంటుంది. మధ్యాహ్నమన్నమయ్యాక నిద్ర మళ్ళీ 3 గంటలకి లేచి 9 గంటల దాకా అక్కడే కూర్చుని ఉంటుంది. ఆమె టైమ్ టేబుల్ తెలుసు కాబట్టి ఫోన్ చేస్తూనే చెప్పండి అత్తయ్యగారూ అన్నాననమాట.

ఆఁ ఏం లేదు గాని భోంచేశావా?” అంది తటపటాయిస్తూ.
11 గంటలకే ఏం భోజనం అండీ" అన్నాను.
తినాలి - తినకే సన్నగా అయిపోతున్నావు" అంది.
ఇంత లావుంటే సన్నం అంటారే"
నీ ముఖం - ఇప్పటి నుండి మొదలు పెడితే చిన్నగా నమిలి 12 కి పూర్తి చేసి కాస్త విశ్రాంతి తీసుకోవచ్చు.....”
సరే ఏంటి ఫోన్ చేయమన్నారుట" అన్నాను కట్ చేయకపోతే దంపుడు ఆపదని.
సంక్రాంతికి 3 పట్టు శారీస్ భోగికొకటి, సంక్రాంతికీ, కనుమకీ మొత్తం మూడు కావాలని వాళ్ళకి ఆర్డర్ ఇచ్చా" అంది.
ఎవరికీ?” అన్నాను ఆశ్చర్యపోతూ.
పేపర్ లో శారీస్ షాప్ వాళ్ళు ఫోన్ నంబరు ఇచ్చారు - వాళ్ళకి ఫోన్ చేసి ఆర్డర్ ఇచ్చా" అంది ఏమిటో చంద్రమండలం దాకా వెళ్ళొచ్చినంత గొప్పగా.
డబ్బులు ఎలా ఇచ్చారు? బ్యాంక్ అక్కౌంట్ నంబరు ఇవ్వలేదు కదా" అన్నాను ఆందోళనగా.
హ హ హ! నేనంత తెలివి తక్కువదాన్నా ఏమిటే? - వి. పి. పి కి ఆర్డరిచ్చా" అంది.

అమ్మో! చాలా విషయాలు తెలుసుకుందే అనుకుంటూంటే తనే "పోస్ట్ వాళ్ళు మనింటికొచ్చి శారీస్ చూపించి డబ్బులు కట్టించుకుంటారుట. చూశావుటే మనకి నచ్చినవి ఇంట్లోనే కూర్చుని కొనుక్కోవచ్చు. శారీస్ కొనాలని బజారుకెళితే సాయంత్రం దాకా తిరిగినా మంచి శారీ దొరకదు నీకు"
అంది.
అయ్యో అత్తయ్యగారూ పోస్ట్ వాళ్ళు పార్సిల్ విప్పి ఎందుకు చూపిస్తారండీ? మీరు డబ్బులు కడితే పార్సిల్ ఇచ్చేసి పోతారుగాని" అన్నాను.
"ఆ చీరల షాప్ అబ్బాయి ఫోన్ లో అలా చెప్పాడే మరి" అంది. పాపం భయంలో శారీ కాస్తా చీరయింది.
ఉండండి నేను వస్తున్నాను అక్కడకి" అని ఫోన్ పెట్టేసి అత్తగారింటికి వెళదామనుకుంటుండగా ఫోన్ లో మా సంభాషణ వింటున్న మా అబ్బాయి "మమ్! ఆకలేస్తుంది నాయనమ్మ దగ్గరకెళితే ఎప్పటికొస్తావో కాని అన్నం పెట్టి వెళ్ళు" అన్నాడు.

'13 ఏళ్ళకే ఎంత వ్యంగ్యంగా, ఇన్ డైరెక్టుగా మాట్లాడతాడో వీడు' అనుకుంటూ భోజనాల ఏర్పాట్లలో పడిపోయా. భోంచేసేటప్పటికి రెండు దాటింది. గబగబా తెముల్చుకుని నాలుగు వీధులవతల ఉన్న అత్తగారింటికి వెళ్ళేప్పటికి అత్తగారు రగ్గు కప్పుకుని గురక పెడుతుంది. సోఫా కుర్చీలో కునికి పాట్లు పడుతున్న మామగారిని చీరల షాప్ వాళ్ళ ఫోన్ నంబరు గురించి అడిగాను - ఆవిడ లేవకముందే ఫోన్ చేసి ఆర్డర్ కాన్సిల్ చేద్దామని. ఆయన అయోమయంగా చూశారు నా వైపు బాపు గారి ఫక్తు భర్త ఫోజులో.

శ్యామల వంటింట్లో ఏదో పని చేసుకుంటున్నది నా మాట విని చేతులు కొంగుకు తుడుచుకుంటూ హాల్లో కొచ్చింది. “అక్కా! అమ్మ నన్ను ఊరికే తిడుతుంది నేను పని మానేస్తా అట్ల తిడితే" అంది గుసగుసగా.
నువ్వూరుకో తల్లీ! ఇక్కడ పనికి చేరినపుడే నీకు ఆవిడ గురించి చెప్పాగా - ఆమెకి కాస్త ......” అన్నా చెయ్యి కణత దగ్గర పెట్టి గుండ్రంగా తిప్పుతూ.
కాదక్కా వీపు పగలకొడతా అంది ఇవాళ పొద్దున" అంది.
అలా ఎందుకందీ? పాపం అలా అనే మనిషి కాదే నువ్వేదో అని ఉంటావు" అన్నా
గులాబీ పువ్వులు తెచ్చింది ఇవాళ పూల శాంత. తీసుకుని చెవి పక్కగా పెట్టుకుంది. అది చూసి నవ్వాను. అట్లా పెట్టకుంటే నవ్వు రాదా చెప్పక్కా" అంది మళ్ళా కిస కిస నవ్వుతూ.

చెవి ప్రక్కన గులాబీ పువ్వు పెట్టుకున్న మా అత్తగారిని ఊహించుకోగానే నాకూ నవ్వు ఆగలేదు. పెద్దగా నవ్వాను.
"ఇ హి హి! ఇట్లా నవ్వాననే పొద్దున తిట్టింది" అంది శ్యామల ఇకిలిస్తూ.
సరే ఆమె లేచాక కనుక్కుంటాలే" అని పేపర్ తీసి చీరల అడ్వర్ టైజుమెంట్ల కోసం వెతకసాగాను.

మా అత్తగారు లేచినట్లుంది "ఏమండీ! ఏమండీ!” అంటూ మా మామగారిని కేకేసిం ది. నేను రాగానే పని పిల్ల బాధ్యత నేను తీసుకుంటాననుకుని కునికిపాట్ల నుండి నిశ్చింతగా నిద్రలోకి జారుకున్న మా మామగారు కళ్ళు కూడా తెరవలేదు.
ఈయనొకరు చెవిటి మిషన్ కొనుక్కోమంటే కొనుక్కోరు - శ్యామలా ఓ శ్యామలా" అని అరిచింది.
శ్యామల తాపీగా నడుచుకుంటూ వెళ్ళి "వినతక్క వచ్చింది" అని చెప్పింది బెదిరిస్తున్నట్లుగా.
వచ్చిందా! సరే పద బాత్ రూమ్ కి తీసుకెళ్ళు ముఖం కడుక్కుంటా" అంది.

ముఖం కడిగి పౌడర్ రాసుకుని బొట్టు కాటుక దిద్దుకుని చెవి పక్కగా గులాబీ పువ్వు పెట్తుకుని తన రూమ్ లో నుండి గునగునా బయటకి వస్తున్న మా అత్తగారిని చూసేటప్పటికి నాకు నవ్వు ఆగలేదు.

నవ్వుని దగ్గుగా మార్చి "బావున్నారా?” అంటూ ఆవిడ ముఖాన్ని అప్పుడే పరిశీలనగా చూస్తున్నట్లు చూస్తూ "ఇదేమిటండీ గులాబీ పువ్వుని చెవి పైన పెట్టుకున్నారు" అన్నాను.
నీకేమీ ఫ్యాషన్ తెలియదు - నేనే నయం. నిన్న మధ్యాహ్నం వచ్చిన ప్రేమనగర్ సినిమాలో వాణిశ్రీ గులాబీ పువ్వు చెవి ప్రక్కగా పెట్టుకోలా" అంది.
చూడక్కా పువ్వు ఇట్లా పెట్టుకుందని పొద్దున నవ్వా. దానికి అమ్మ ఎన్ని మాటలందో" అని మధ్యలో దూరింది మా శ్యామల.
ఆఁ నువ్వేమంటే తిట్టాను? 'భలే పెట్టావే పువ్వు కుర్రదానిలాగా' అంది నన్ను - దానికెందుకు నేను ఎట్లా పెట్టుకుంటే" అంది మా అత్తగారు గయ్యిన లేస్తూ.
నేనెప్పుడన్నా కుర్రా ముసలీ అని" అంది శ్యామల.
ఆఁ అన్నావు - ఇక నుంచీ టేప్ రికార్డర్ లో మాటలు రికార్డ్ చేస్తా - నాకు తెలియదనుకుంటున్నావేమో రికార్డు చేయడం ఆఁ - అప్పుడు తేలుతుంది ఎవరేమన్నారో" అంది.
శ్యామలా! పెద్ద వాళ్ళని పట్టుకుని అలా మాట్లాడొచ్చా - పో లోపలకి వెళ్ళి కాస్త టీ పెట్టుకురా పో" అని శ్యామలని అక్కడ నుండి తరిమేశాను.
ఇదే గాదు మొన్న జాకెట్ కి వెనక తాళ్ళు కుట్టమని టైలర్ కి చెప్తుంటే వాడితే చేరి నవ్వడం. మొత్తం రికార్డు చేసి వినిపిస్తా ఉండు నీకు ఈసారి" అంది.
నాయనోయ్ ఉన్నవి చాలు మళ్ళీ కొత్త రామాయణం నేనెక్కడ వినేది అనుకుంటూ "అబ్బే వాళ్ళ మాటలు మన టేప్ రికార్డులో రికార్డు చేయడం ఎందుకులెండి నేను చెప్తాలే శ్యామలకి - ఏదీ ఎవరికి ఆర్డర్ ఇచ్చారు చీరలు పంపమని? ఎంతట ఒక్కో చీర?” అని మాట మార్చాను.
ఇదిగో" అంటూ భగవద్గీత తీసింది.
నంబరు అడిగితే పేపర్ తీయకుండా భగవద్గీత తీసిందేమిటా అనుకుంటూ చూస్తున్న నాచేతిలో భగవద్గీతలో నుండి తీసిన ఒక ఫ్లయ్యర్ పెట్టి "చూడు ఎంత బావున్నాయో - మూడు శారీస్ కలిపి పదిహేను వేలేనే. పండగ సేల్ పెట్టి తక్కువ ధరకే ఇస్తున్నారట. అందుకే ఆర్డర్ చేశా" అంది చాలా తెలివైన పని చేసినట్లు మురిసిపోతూ.

రంగురంగుల పట్థు చీరలు కట్టి నిలబడ్డ అమ్మాయిల ఫొటోలు అవి. వాళ్ళల్లో ఓ అమ్మాయి చెవి ప్రక్కన గులాబీ పువ్వు పెట్టుకోనుంది. ఆ అమ్మాయిని చూసే మా అత్తగారు చీరలకి ఆర్డర్ ఇచ్చేసి ఉంటారు అనుకుని నవ్వుకుంటూ ఫ్లయ్యర్ చూస్తున్న నన్ను చూడగానే మా అత్తగారు ఆ చీరలని చూసి సంతోషపడుతున్నాననుకుని "నువ్వు కూడా రెండు శారీస్ కి ఆర్డర్ ఇవ్వరాదుటే - నీకు మంచి పట్టు శారీసే లేవు" అంది నన్ను జాలిగా చూస్తూ.

ఆ ఫ్లయ్యర్ లో ఇచ్చిన నంబరుకి మా అత్తగారి ల్యాండ్ లైన్ లో నుండి ఫోన్ చేశాను. ఎవ్వరూ ఎత్తలేదు. ఎన్ని సార్లు చేసినా ఎత్తకపోయేటప్పటికి "ఇదేమిటండీ ఎవరూ ఎత్తడం లేదు" అన్నాను.
పాపం ఆర్డర్లు తీసుకుని తీసుకుని ఇప్పుడే భోజనాలకి వెళ్ళి ఉంటారు కాసేపయ్యాక చేద్దువుగానీలే టీ తాగి" అంది.
టైమ్ ఐదవుతోంది ఇప్పుడేం భోజనాలండీ? అయినా పార్సిల్ విప్పి చూపిస్తారని వాళ్ళు చెప్తే ఎలా నమ్మారు" అన్నాను అసహనంగా.
ఆ మాట అడుగుదువుగానీలే అయినా నిన్న 3 గంటలకి చేశా. ఆర్డర్లు వస్తుంటే ఏం చేస్తారు పాపం టైమ్ కి తినడం వాళ్ళకి కుదురుతుందా" అంది తపతపలాడుతూ. ఆమెకి కూడా అనుమానం వచ్చినట్లుంది లేకపోతే తపతపలాడదు.

ఈ ఫోన్ తో చేస్తే ఎత్తర్లే అనుకుని నా సెల్ తో చేశాను. అవతలి వైపు నుండి "ఏం కావాలండీ?” అంటూ స్వీట్ గొంతు.
నిన్న మా అత్తగారు చీరలకి ఆర్డర్ ఇచ్చారండీ - ఆమె తెలియక ఆర్డర్ ఇచ్చారు కా్యన్సిల్ చేద్దామనీ.. ఆమె పేరు .......”

ఒకసారి ఆర్డర్ ఇచ్చాక క్యాన్సిల్ చేయడం కుదరదండీ" అంటూ నా మాట పూర్తిగా వినకుండానే
టప్పున ఫోన్ పెట్టేసింది. ఏం కావాలండీ అన్న స్వీట్ గొంతులో ఈసారి చీదర స్పష్టంగా వినిపించింది.

అదేమిటే అలా వాళ్ళకి నాకు తెలియదని చెబుతున్నావు? నాకెందుకు తెలియదూ?” అంది కోపంగా.
ఊరికేలే అత్తయ్యగారూ! అలా చెప్తే త్వరగా పంపిస్తారనీ .....” అన్నాను.
మా అత్తగారి నషాళానికి అంటిన కోపం దెబ్బకి దిగింది. “నీకేమీ తెలియదు అనుకుంటా గాని ఎవరికి ఏం చెప్పాలో నీకు భలే తెలుసు" అంటూ నన్ను మునగచెట్టు ఎక్కించేసింది.

మామగారి వైపు కళ్ళెగరేసి చూపిస్తూ డబ్బులు అడుగు అంటూ బొటనవ్రేలిని చూపుడువేలి కేసి తాటిస్తూ సైగలు చేస్తోంది.

కళ్ళు మూసుకుని తన్మయానందం పొందుతున్న మామగారిని "మామయ్య గారండీ చీరలు పోస్ట్ లో వస్తాయి పదిహేను వేలు బ్యాంక్ నుండి తీసుకురమ్మని మీ అబ్బాయికి చెప్పండి" అన్నాను మావారి సెల్ కి నా సెల్ కలిపి ఇస్తూ.

మా మామగారు మా అత్తగారి వైపు చూస్తూ "పదిహేను వేలా!?” అన్నాడు నోరు వెళ్ళబెట్టి.
ఆఁ పదిహేనువేలే - మీకేం తెలుసు శారీస్ సంగతి? కోడలు చెప్పిందిగా మాట్లాడండి వాడితో" అంది గదమాయిస్తూ.

అన్నీ ఫోన్ లో అటువైపు నుంచి విన్న కొడుకు "ఆఁ తెస్తానులే పదిహేను వేలు రేపు" అన్నాడు నాతో ఫోన్ మామయ్య గారికి ఇవ్వకుండానే.
తెస్తారటలే అత్తయ్యగారూ" అన్నాను.
ముఖం చాటంత చేసుకున్న మా అత్తగారు "ఓ శ్యామలా అయ్యగారు లేచారు ఆయనకి టీ ఇవ్వు. నువ్వు కూడా ఇంకో కప్పు తాగరాదుటే - ఏమిటో తిండి సరిగ్గా తినవు" అనుకుంటూ మళ్ళీ దంపుడు మొదలుపెట్టింది.
వెళ్ళొస్తా అత్తయ్యగారండీ ఇంట్లో చాలా పనుంది" అంటూ లేచి వచ్చేశాను.

వారం తర్వాత "పార్సిల్ వచ్చిందే త్వరగా రా" అంటూ ఫోన్ చేసింది. ఆమె గొంతులో పట్టరాని సంతోషం. నా క్కూడా భలే హుషారు వచ్చింది. నాలుగు వీధులవతల ఉన్న మా అత్తగారింటికి నాలుగంగల్లో వెళ్ళాను.

లోపల .......

ఐదొందల రూపాయల ఖరీదు కూడా చేయని మూడు నైలాన్ శారీస్ డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుని వాటి వైపే దిగాలుగా చూస్తూ మా అత్తగారు, నడుమున చెయ్యి పెట్టుకుని మా మామగారు, వాళ్ళ వెనగ్గా నిలబడి ఇ హి హి హి అంటూ నవ్వుతున్న శ్యామల .........


                                             ********

1 comment:

  1. Radha gaaru, chaalaa baagundi Katha:-):-):-) mee blog ippude chusanu.chaalaa baagundi:-):-)

    ReplyDelete

P