Thursday, February 6, 2014

అమ్మాయిలూ ఆలోచించండి! - సారంగ ప్రచురణ

- రాధ మండువ


“శైలా! ఓ శైలా! మీ ఎంకమ్మత్త నిన్ను రమ్మంటంది” ప్రహరీ గోడకి ఆనుకుని ఉన్న అరుగుమీదకెక్కి కేకలు వేస్తూ నన్ను పిలిచి చెప్పింది నాగరత్నమ్మ.

“ఎందుకంటా? సిగ్గూ, ఎగ్గూ లేకుండా అది నా కూతురిని పిలవమంటే నువ్వెట్టా పిలుస్తున్నావు? పైగా అరిచి చెప్తుంది చూడు నలుగురూ వినలేదని” అంది మా అమ్మ ఈసడింపుగా.

”నాకెందుకులే తల్లా మీ మద్దెన. ‘పాలు పిండుకు రావడానికి కొట్టం సాయ పోతున్నావు గదా! అట్టా మా శైలజని రమ్మని చెప్పు నాగరత్తమ్మా’ అంటే వచ్చా. ఏందో అమెరికా దేశం నుండి కోడలు వచ్చిందంటే చూడాలని ఉండదా? చిన్నప్పుడు ఎత్తుకుని పెంచిన మురిపం ఎక్కడకు పోద్దీ” అనుకుంటా అరుగు దిగి వెళ్ళిపోయింది నాగరత్నమ్మ.

“మురిపం అంటా మురిపం. లేచిపోయింది పోయినట్లుండక ఆస్తి కోసం పుట్టింటి పైనే కేసు వేసింది. మొగుడ్ని వదిలేసి లేచిపోయిన దానికి ఆస్తి ఎట్టా వచ్చిద్దని కోర్టు బాగా బుద్ధి చెప్పింది. అయినా దరిద్రం వదల్లా. కూతురు సక్కరంగా కాపరం చేసిద్దని ఊళ్ళో ఇల్లు కట్టి పోయిందిగా ఆ మహాతల్లి. ఇన్నాళ్ళకి మళ్ళీ ఆ ఇంటికి చేరింది. తూరుప్పక్క బజారుకి పోదామంటే సిగ్గేత్తంది దీని మొకం చూడలేక” అంది అమ్మ మజ్జిగ చిలుక్కుంటూ.

అమ్మ మాటలకి నాకు బాధ కలిగింది. అమ్మ ఆవేదనలో కూడా అర్థం ఉంది. మామని వద్దని లేచిపోయిన ఎంకమ్మత్త ఎవరి ప్రోద్బలంతో మా మీద కేసు వేసిందో, ఎందుకు వేసిందో నాకు అర్థం కాని ప్రశ్న. తాతని ఫోన్లో అడిగాను కాని ‘నువ్వు ఇండియాకి వచ్చినపుడు మాట్లాడుకుందాంలే తల్లీ’ అన్నాడు. అత్తని కలిసినపుడు తప్పకుండా అడగాలి. ‘అమ్మకి తెలియకుండా అత్త దగ్గరకి వెళ్ళాలి ఈరోజు’ అని అనుకున్నాను. 

అత్త జ్ఞాపకాలు నా మనస్సు నిండా…




***

మోకాళ్ళ పైదాకా బుట్టబొమ్మ లాంటి గౌనులు కుట్టేది నాకు అత్త. అవి వేసుకుని స్టీలు పెట్టెలో పుస్తకాలు, పలక పెట్టుకుని స్కూలుకి వెళ్ళే నన్ను చూసి ‘నువ్వెవరి పిల్లవే’ అని అడిగే వారు నాకు మామ వరస అయ్యే వారు. ‘ఎంకమ్మత్త కోడలిని’ అనేదాన్ని. ఎప్పుడూ కూడా మా నాన్న పేరో, అమ్మ పేరో చెప్పేదాన్ని కాదు. ‘బాగా చదువుకుని పెద్ద డాక్టర్ వి అవ్వాలి బంగారూ! అమెరికాకి వెళ్ళి పై చదువులు చదవాలి‘ అనేది అత్త.

అత్త భలే బాగుండేది. సినిమాల్లోని భానుమతి లాగా. మోచేతి దాకా ఉండే జాకెట్టూ, ఆ జాకెట్టుకి మెడచుట్టూ అంచూ, పూసలూ వేసి కుట్ట్టుకునేది. ఒంటిపొర పైట వేసుకుని పిన్ను పెట్టుకునేది. అంత అందమైనఅత్తని పన్నెండేళ్ళప్పుడే తనకంటే ఇరవై ఏళ్ళు పెద్దవాడైన మామకిచ్చి పెళ్ళి చేశారు. అత్తేమో రాణి లాగాపొడవు, పొడవుకి తగ్గ అందమూ. మామేమో పొట్టి. బుడ్డోడులాగా ఉండేవాడు. అయినా నాయనమ్మకిమనసు ఎట్లా ఒప్పిందో అంత అందమైన కూతురిని అనాకారి తమ్ముడికిచ్చి కట్టపెట్టడానికి? తన పుట్టింటిఆస్తిని కూడా తనింట్లోనే కలుపుకోవచ్చనో, కూతుర్ని తన దగ్గరే ఉంచుకోవచ్చు అనో చేసి ఉంటుంది. రోజుకోరకంగా అలంకరించుకుని పొగాకు గ్రేడింగ్ కి పోయేది అత్త. అక్కడ ఒక పొగాకు బయ్యర్ తో స్నేహం చేసింది. నాన్నకి, తాతకి తెలిసి, కట్టడి చేసి ఇంట్లో కూర్చో పెట్టారు. కొన్నాళ్ళు బాగానే ఉన్నట్లు నటించి తననగలన్నీ తీసుకుని ఆ పొగాకు బయ్యర్ తో లేచి పోయింది. 

అతడైనా సరైన వాడా అంటే అదీ లేదు. అతనికి అప్పటికే పెళ్ళాం, కూతురు ఉన్నారు. ఊళ్ళో అందరూతాత నాయనమ్మల ముఖం ఎదుటే తుపుక్కు తుపుక్కు మని ఊశారు. నాన్న అయితే చాలా రోజులుబయటికి రాలేకపోయాడు. మామకివేమీ పట్టలేదు. ఆయనకి మొదటినుండీ కూడా పొలమే పెళ్ళాం, గొడ్లేబిడ్డలు. 

చాన్నాళ్ళ తర్వాత నేను ఏడో తరగతిలో ఉండగా స్కూలు నుండి వస్తున్న నన్ను దారిలో జువ్వి చెట్టు కిందకలుసుకుంది మా నాయనమ్మ. “మీ అత్తొచ్చిందే. దానికి నిన్ను చూడాలని ఉందంట దా” అని నన్నుచెరువు కట్ట దగ్గరకి తీసుకెళ్ళింది. అబ్బో! ఎంకమ్మత్త ఎంత బాగుందో. అచ్చం పట్నం దొరసాని లాగాఉంది. మిన్నాగు చర్మం లా ఆమె చర్మం ఆ సాయంత్రపు ఎండలో మిల మిలా మెరుస్తుంది. అత్తని చూస్తేఅప్పుడు నాకు భలే గర్వం కలిగింది. అత్త తన హాండ్ బ్యాగ్ లో నుండి బంగారు కాగితపు అట్టలో పెట్టినహల్వా, చేగోడీలు ఇచ్చింది. నన్ను ఎత్తుకుని ముద్దు పెట్టుకుని కన్నీళ్ళు కారుస్తూ వెళ్ళిపోయింది. ఇంటికివచ్చేప్పుడు నాయనమ్మ “ఎవరికీ చెప్పొద్దేయ్. మీ అమ్మకి అస్సలు చెప్పబాక తిట్టిద్ది” అంది. చెప్పననిఅడ్డంగా తలూపాను.

నేను ఏడునుంచి పదో తరగతికి వచ్చిందాకా అప్పుడప్పుడూ నాయనమ్మతో వెళ్ళి అత్తని కలుస్తూనేఉన్నాను. అత్త ఎందుకో చాలా దిగులుగా ఉన్నట్లు నాకు తెలుస్తోంది. నాయనమ్మ అత్త వచ్చినప్పుడంతాచక్రాలో, పులిబొంగరాలో, అరెసెలో చేసి నీళ్ళ బిందెలో పెట్టుకుని తెచ్చి కూతురికి పెట్టేది. అమ్మకి నాన్నకితెలిసినా తెలియనట్లు ఉండేవారు. తాత కూడా మాతో వచ్చి చెరువు కట్టకింద అత్తని కలుసుకునేవాడు. ఆరోజుల్లో అతని గురించో లేక మరేం బాధలో తెలియదు కాని తాతకి, నాయనమ్మకి ఏదో చెప్పి అత్త ఏడుస్తూఉండేది. ఒకసారి అత్త ఒక రెండు జళ్ళ పిల్లని వెంటబెట్టుకుని వచ్చింది. అతని కూతురట. పదిపన్నెండేళ్ళుంటాయేమో. ఎంత బాగుందో ఆ పిల్ల. మూతి బిగించుకుని మా వైపు చూస్తున్న ఆ పిల్ల చాలాతెలివైనదని అనిపించింది నాకు. అక్కడ ఉన్న కొద్దిసేపులో ఆ అమ్మాయి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ‘రోజా! వదినతో ఆడుకో‘ అంది అత్త నావైపు చూపిస్తూ. ఆ పిల్ల నా వైపు కూడా చూడకుండా కింద పడ్డచింతకాయలను ఏరుతుంది. వెళ్ళేటప్పుడు మాత్రం అత్త ‘టాటా చెప్పు‘ అంటే యాంత్రికంగా చెయ్యిఊపింది. అంతే ఆ తర్వాత నేను అత్తని చూడలేదు. 

నా పదవ తరగతి తర్వాత అత్త ఇక మా ఊరికి రాలేదు. నాయనమ్మ కూతురి మీద బాగా దిగులేసుకుంది.పొగాకు నారుకి వెళ్ళేవారో, మా ఊరి బయ్యర్లో అత్తని ఒకసారి రాజమండ్రిలో చూశామని, మరోసారి కాకినాడలోచూశామని చెప్పేవారు. చనిపోయే ముందు రాదని తెలిసీ నాయనమ్మ కూతురిని చూసుకోవాలని ఆఖరినిమిషంలో కూడా ఎదురు చూసింది.

కాలప్రవాహం అత్తని గురించి పూర్తిగా మరిచేట్లు చేసింది. నేను ఎం. ఏ ఫైనల్ లో ఉండగా మాకు అత్త నుండిలాయర్ నోటీసు వచ్చింది. ఇంట్లో ఆ రోజు తాత మీద, నాన్న మీద అమ్మ అరిచిన అరుపులు ఇప్పటికీ నా చెవుల్లో మోగుతున్నాయి. పుట్ట్టింటి ఆస్తిలో తనకూ హక్కు ఉందనీ, తన భర్త ఆస్తి కూడా తనకే రావాలనీ ఆ నోటీసు సారాంశం. భర్తతో కాపురం చేయకుండా లేచిపోయిందని చెప్పడానికి బోలెడంత మంది సాక్షులు బయలుదేరారు అత్త నోటీసు అయితే ఇచ్చింది కాని వాయిదాలకి రానే లేదుట. కోర్టు ఆమెకి ఆస్తిలో హక్కు లేదని తీర్పు ఇచ్చింది. 

నాకు పెళ్ళి సంబంధం వచ్చింది. అత్తకు రావలసిన ఎనిమిదెకరాలూ నాకు కట్నంగా ఇచ్చి నా పెళ్ళి చేశారు. నేను డాక్టర్ ని అవ్వాలనే అత్త కోరిక తీర్చలేకపోయినా నాకు అమెరికాలో పనిచేసే డాక్టర్ మొగుడే దొరికాడు. పెళ్ళయ్యాక నేను అమెరికాకి వెళ్ళిపోయాను. రెండేళ్ళ క్రితం తాతకి ఫోన్ చేసినపుడు “అత్త మనూరికి వచ్చిందమ్మా!” అని చెప్పాడు. నాకు చెప్పాలని నా ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాడని ఆయనకంఠంలోని ఆతృత వల్ల అర్థం చేసుకున్నాను. “అత్తకి కట్టించిన ఇంట్లో ఉంటుంది. అత్త పరిస్తితి ఏమీ బాగా లేదు. వ్యవసాయం చేసేటప్పుడు నా చేతుల్లో డబ్బు ఆడేది. పొలం కౌలుకి ఇచ్చాం గా అమ్మా! దాన్ని డాక్టరుకి చూపిద్దామన్నా నా దగ్గర డబ్బు లేదు. తినడానికి మాత్రం బియ్యం మీ అమ్మకి తెలియకుండా ఇస్తున్నా“ అన్నాడు. కళ్ళ నీళ్ళు తిరిగాయి. వెంటనే గుంటూరులో ఉండే నా స్నేహితురాలు విజ్జికి ఫోన్ చేసి దాని ద్వారా తాతకి బ్యాంక్ అక్కౌంట్ ఓపెన్ చేయించి డబ్బు పంపాను. చాలానే పంపాను ఆయన ఏ బాధా పడకుండా. ఈ రెండేళ్ళలో అత్త ఆరోగ్యం బాగయింది. సరియైన తిండి లేకనో, దిగులుతోనో శుష్కించిపోయినఆమె తేరుకుంది. 

ఊళ్ళో అందరూ అమ్మతో సహా అత్తని లేవదీసుకుపోయినతను అత్తకి బాగా డబ్బు మిగిల్చి చనిపోయాడని అనుకుంటున్నారనీ, అత్త చేతిలో నాలుగు డబ్బులున్నాయని తెలియడంతో పలకరించే వాళ్ళు ఎక్కువయారనీ తాత సంతోషంగా చెప్పాడు. తాత కూడా ఎవరికీ భయపడకుండా కూతురికీ మంచీ చెడ్డా చూసుకుంటున్నాడంట. మామ మాత్రం తన మేనకోడలి మీద ప్రేమతో అత్త ఎదురైతే పలకరిస్తాడంట.


*** 

పది గంటలప్పుడు అమ్మ పొలం వెళ్ళాక తాత, నేను అత్త దగ్గరకి వెళ్ళాం. అత్త నన్ను వాటేసుకుని ఏడ్చింది. నాకు ఆమె ఎవరో అనిపించింది. ఈమె మా అత్తేనా అనిపించేట్లుగా మారిపోయింది. నేను ఆమెకి కొత్తగా అనిపించకపోవడానికి కారణం – ఆమె నా ఫొటో చూసి ఉంటుంది. కాని నాకు మా అత్తని చూస్తే చెప్పలేని ఏదో భావం. తెల్లజుట్టుని పీట ముడేసుకుని ఉంది. ఏమయింది ఆ భానుమతి అంత అందం? అందం ఇంత అశాశ్వతమా అనిపించింది.

“ఏంటత్తా! ఇలా అయిపోయావు? ” అన్నాను. అత్త నిర్లిప్తంగా నవ్వింది. 

“డాక్టర్ దగ్గరకి తీసికెళ్ళకూడదా తాతా” అన్నాను. 

“రాకపోతే నేనేం చేసేది? ఎందుకులే బాగానే ఉన్నాను అంటుంది ఎన్ని సార్లు రమ్మన్నా” అనుకుంటాబయటికి వెళ్ళిపోయాడు తాత. నేను అత్త జీవితాన్ని గురించి అడుగుతానని ఊహించి మమ్మల్నిద్దరినీఅలా వదిలేసి వెళ్ళిపోయాడని అత్త, నేను గ్రహించాము.

“ఎట్టుండేదానివి ఎట్లా అయిపోయావత్తా” అన్నాను. 

అత్త కళ్ళల్లో ఆగకుండా కన్నీరు. “ఊరుకో అత్తా! ” అన్నాను.

ఏడుపు ఆపుకుని పైటతో కళ్ళు తుడుచుకుంటూ “మీ ఆయన బాగున్నారా? నీతో రాలేదే? చాలా మంచివాడంటగా అమ్మా – తాత చెప్పాడు“ అంది.

“ఔనత్తా! బాగా చూసుకుంటాడు నన్ను. చాలా బిజీ. అమెరికాలో డాక్టరు గదా మరి. నేను నిన్ను చూడాలని ఒక్కదాన్నే వచ్చానత్తా” అన్నాను. నా మాటలకి అత్త కళ్ళల్లో అమిత సంతోషం కదలాడింది. తనకంటూఎవరూ ఉండరని భావం కొంత, ఆత్మ న్యూనతా భావం కొంతా ఉన్న వాళ్ళల్లో ‘తన కోసం ఒకరున్నారనితెలిస్తే కలిగే సంతోషమా అది అనిపించింది. ఏమో!? అత్త గురించి నాకు తెలిస్తే నా మాటలకిఆమెకెందుకంత సంతోషం కలిగిందో చెప్పగలనేమో!

“పిల్లల గురించి ఏమీ ఆలోచించలేదా? ” అంది.

“పెళ్ళయి మూడేళ్ళేగా అత్తా. వచ్చే సంవత్సరం చూద్దాంలే. నాకు అమ్మాయి పుడితే చిన్నప్పుడు నాకుకుట్టిచ్చినట్లు బుట్ట బొమ్మ గౌన్లు కుట్టియ్యాలత్తా నువ్వూ!” అన్నాను.

“నేను నిన్ను మర్చిపోయానురా బంగారూ! కాని నువ్వు నన్ను మర్చిపోలేదు. నీ మీద ఉండే ప్రేమ నంతారోజా మీద చూపించాలనుకున్నాను. ‘నువ్వొద్దు – నీ ప్రేమా వద్దూ‘ అంటూ అది నన్ను అసహ్యంచుకునేది. అది అసహ్యించుకునే కొద్దీ నాకు దాని ప్రేమను సంపాదించుకోవాలని పట్టుదల కలిగేది. ఆఖరికి అది నన్నుబానిసను చేసి ఆడించినా ఏమీ అనలేని స్థితిలో పడ్డాను. బహుశా దాని తండ్రిని తల్లిని విడదీశానన్న బాధదానికన్నా నాకు ఎక్కువగా ఉండటం వల్లనే నేను అది ఆడించినట్లుగా ఆడానేమో!“

అత్త ఇంకా ఏదో చెప్పబోతుంది కాని ‘రోజా ఎవరా‘ అని ఆలోచిస్తున్న నాకు అత్త చెప్పిన చివరి వాక్యం వినగానే రెండు జళ్ళ క్లవర్ గర్ల్ రోజా గుర్తొచ్చి “ఇప్పుడెక్కడుందత్తా ఆ అమ్మాయి?“ అన్నాను ఆతృతగా– అరె! ఇన్ని రోజులూ ఆ అమ్మాయి అస్సలు గుర్తుకు రాలేదే అనుకుంటూ. వేటగాడి బాణం గుండెల్లోగుచ్చుకున్నప్పుడు పక్షి కళ్ళల్లో కనపడే వేదన – కాదు నిస్సహాయత - కాదు కాదు నేను వర్ణించలేను నాకుమాటలు రావు – అలాంటి చూపుతో అత్త నన్ను నిశ్చేష్టపరిచింది. నేను గొంతు పెగుల్చుకునిమాట్లాడబోయేంతలో అత్త లేచి వెళ్ళి మంచం క్రింద నుండి సూట్ కేస్ బయటకి లాగింది. లోపల జిప్ లోనుండి ఒక కవర్ తీసి “చదువు. నీకు అన్ని విషయాలూ తెలుస్తాయి” అంది ఏడుస్తూ. ఆ ఏడుపు హృదయవిదారకంగా ఉంది. ఆతృతగా కవర్ లో నుండి కాగితాలు బయటకి లాగాను.


***


ఎంకీ –

ఎలా ఉన్నావు? నిజానికి నువ్వు ఎలా ఉన్నావు అని అడగాలని లేదు నాకు. నువ్వు అంటే నాకు అసహ్యం. ఇన్నాళ్ళ తర్వాత కూడా, నా జీవితం నాశనం అవడానికి కారణం నువ్వు కాదు – నేనే – కేవలం నేనే – అనితెలిసే వయసు, అనుభవం వచ్చాక కూడా నువ్వంటే నాకు అసహ్యం తగ్గకపోగా పెరిగింది. మా నాన్ననన్ను, అమ్మని వదిలి వెళ్ళే నాటికి నాకు ఏడేళ్ళు. నాకు పన్నెండేళ్ళప్పుడు మా అమ్మ చనిపోయింది. ఈఐదేళ్ళలో మా అమ్మ ఏడవని రోజు లేదు అంటే నమ్ముతావా? దానికి కారణం అయిన నీ దగ్గరకి నాన్ననన్ను తీసుకొచ్చాడు. నిన్ను ‘అమ్మా! ‘ అని పిలవాలట. నిన్ను ప్రేమగా మాట్లాడాలని నాన్న కట్టడిచేశాడు. నీ వల్ల మా అమ్మ చనిపోయిందని తెలిసిన దాన్ని నేను నిన్ను అమ్మా అని పిలవడమా?ప్రేమించడమా? ఛీ! ఛీ - నేను అసహ్యించుకుంటున్నానని తెలిసీ నువ్వు నన్ను ఎంతో ప్రేమగా చూశావు. మాఅమ్మ కంటే ఎక్కువగా ప్రేమించావేమో కూడా. కాని నాకు మీ దగ్గరున్నంత కాలం జైల్లో ఉన్నట్లుగా ఉండేది. బయటికి వెళ్ళలేని వయసు. ఏం చేయాలో తెలియని నిస్సహాయత. ఆ కసి నాన్న లేనప్పుడు నీ మీదచూపించేదాన్ని. మీ దగ్గర నుండి స్వేచ్ఛగా ఎగిరిపోవడానికి త్వరగా పెద్ద దాన్ని అవాలని కోరుకునే దాన్ని. నా కోరిక తీరింది ఎంకీ. చాలా పెద్ద దాన్నయిపోయాను. త్వరలో ఈ లోకం నుండే శాశ్వతంగా వదిలిపోయేంతగా.

మీ గురించి హీనంగా మాట్లాడి స్నేహితుల దగ్గ్గర అభిమానం సంపాదించాను అనుకున్నాను కాని నా జీవితాన్ని గోప్యత లేకుండా ఆరబోసుకుంటున్నానని గ్రహించలేకపోయాను. పిచ్చి పిచ్చి ఆలోచనలతో నా చుట్టూ భ్రమా వలయాలు ఏర్పరుచుకున్న నన్ను వంచించడానికి శరత్ కి ఎక్కువ సమయం పట్టలేదు.వాడికి దుబాయ్ వెళ్ళాలని కోరిక. ప్రేమించానని, పెళ్ళి చేసుకుంటానని, నన్ను కూడా తనతో మీకు దూరంగా దుబాయ్ కి తీసుకెళతానని నన్ను నమ్మించాడు. నమ్మాను ఎంకీ. జంతువులు అమ్మే అంగడి నుండి ఒకపిల్లవాడు వచ్చి పక్షిని కొనుక్కుపోతుంటే ఆ పక్షికెంత ఆనందం కలుగుతుందో అంత ఆనందం కలిగింది నాకు. పక్షి మళ్ళీ మరో పంజరంలోకి వెళ్ళబోతుందని ఊహించదు కదా!

నన్ను వాడి మోహం తీరేవరకు అనుభవించి ఈ కంపెనీ వాళ్ళకి అమ్మేసి ఆ డబ్బుతో దుబాయ్ వెళ్ళిపోయాడు. అయితే వీడు మా నాన్న కంటే చాలా నయం ఎంకీ. వీడికి పెళ్ళాం లేదు. నా లాంటి కూతురూ లేదు. నన్నే మోసం చేశాడు. నా పట్ల కూడా నాకు జాలి కలగడం లేదు. ఎందుకంటే నీలా నేను మరో ఆడదాని జీవితాన్ని, మరో చిన్నపిల్ల జీవితాన్ని నాశనం చేయలేదు. దానికి నేను భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.

ఎంకీ నా ఒళ్ళు హూనం అయింది. జబ్బు ముదిరిపోయి ఆఖరి దశకు చేరుకున్నాక నేడో రేపో కుప్పతొట్టి దగ్గరకు విసిరివేయబడతాను. ఇప్పుడు ఈ ఉత్తరం రాయడానికి కారణం నన్ను మీ దగ్గరకి తీసికెళ్ళమని చెప్పడానికి రాయడం లేదు. నువ్వు నాకేమీ చేయక్కర్లేదు. మనిద్దరి జీవితాల గురించి పదిమందికీ తెలియచెయ్యి. ‘పెద్దలు తప్పులు చేసినా మనం మన జీవితాన్ని సరియైన విధంగా మలుచుకోవాలి కాని వాళ్ళు తప్పు చేశారని వాళ్ళ మీద ద్వేషం పెంచుకుని అదే తప్పు మనం చేయడం, మన జీవితాలని నాశనం చేసుకోవడం సబబా‘ అని ఈ అమ్మాయిలను ఆలోచించుకోమంటున్నానని చెప్పు. ‘మీరు ఇప్పుడు చేసే పనుల వల్ల రేపు మీ పిల్లల జీవితాలు ఏమవుతాయో తెలుసుకోమని‘ నువ్వూ నీ జీవితాన్ని విప్పి చెప్పు. 

అంతే ఎంకీ, నాలా మరో ఆడపిల్ల జీవితం నాశనం అవకూడదనే ఆవేదనతో ఈ ఉత్తరం రాశా. నిన్ను క్షమించి మాత్రం కాదు. నిన్ను అసహ్యించుకుంటూనే మరణిస్తా.

మరణించాక కూడా నిన్ను క్షమించలేని

నీ రోజా.

ఉత్తరం పట్టుకుని దాని వైపే చూస్తూ మంచంలో కూలబడ్డాను నిస్సత్తువగా. ఎందుకింత అమాయకంగా ఉన్నారు ఈ అమ్మాయిలు. ప్రేమిస్తున్నాను, పెళ్ళిచేసుకుంటాను అని అంటే నమ్మవచ్చు. అంతకంటే మంచి వాళ్ళు దొరకరు అని అనుకుంటే పెళ్ళి చేసుకోవచ్చు. తప్పులేదు. ఎందుకంటే పెళ్ళి తర్వాత ఎక్కువశాతం మందిలో ప్రేమ కలుగుతుందని, బంధం ఏర్పడుతుందనీ నమ్ముతాం కనుక. కాని ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా వాళ్ళని నమ్మి ఎలా వెళ్ళిపోతున్నారు? సమాజంలో సాటి స్త్రీలకి జరుగుతున్న అన్యాయాలని చూసి కూడా స్త్రీ మళ్ళీ మళ్ళీ ఎలా మోసపోతుంది? అయినా మనల్ని ఇంతగా నమ్మి వచ్చిన స్త్రీని మోసం చేయడానికి, వంచించడానికి మగవాడికి మనసెలా ఒప్పుతుందో!!?

ఉత్తరం వల్లో, జెట్ లాగ్ వల్లో తెలియలేదు కడుపుని ఎవరో కెలికినట్లుగా వాంతి. దొడ్లోకి పరిగెత్తి వాంతి చేసుకున్నాను. దొడ్డి వాకిట్లో వీరడి సహాయంతో తాళ్ళు పేనుతున్న తాత, ఇంట్లో నుండి అత్త ఇద్దరూ నా దగ్గరకి పరిగెత్తారు. “ఏమయింది తల్లీ!” అన్నాడు తాత ఆందోళనగా. అత్తకి ఏడ్చీ ఏడ్చీ మాటపెగలడంలేదు. “వీరడిని పంపి ఫకీరు షాపులో కాఫీ తెప్పించు తాతా! తలనొప్పిగా ఉంది. అమెరికా నుండి వస్తే వారం రోజులు ఇలాగే ఉంటుందని నీకు తెలుసుగా. కంగారేం లేదు“ అన్నాను. వీరడు నీళ్ళు తెచ్చి ఇచ్చాడు. శుభ్రం చేసుకుని అత్త, నేను లోపలకి వెళ్ళాం. ఉత్తరం అత్త చేతికిస్తూ తర్వాతేమయింది అన్నట్లుగా ఆమె వైపు చూశాను.

“ఉత్తరం వచ్చాక పోస్టల్ అడ్రస్ పట్టుకుని రోజాని అతి కష్టం మీద ఇంటికి తీసుకొచ్చాం. చాలా డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అది ఇంటికి వచ్చిన నాలుగు రోజులకే వాళ్ళ నాన్న గుండె ఆగిపోయింది దాన్ని గురించిన ఆలోచనలతో. దాన్నైనా బ్రతికించుకోవాలని డబ్బు కోసం తాతకి, మీ నాన్నకి చాలా ఉత్తరాలు రాశాను. ఆఖరికి సిగ్గు విడిచి మీ అమ్మకి కూడా రాశాను. సమాధానం లేకపోతే నేను నేరుగా మన ఇంటికి రావలసింది. అది చేయకుండా ఆవేశంతో – అది చచ్చిపోతుందన్న భయంతో - లాయరు నోటీసు ఇస్తే డబ్బు పంపుతారని నోటీసు పంపాను. మళ్ళీ మరో తప్పు చేశాను. నా పుట్టింటి వాళ్ళు, ఊళ్ళో వాళ్ళు నన్ను మొదటిసారి కంటే ఎక్కువగా అసహ్యించుకున్నారు. ‘ఎంకీ! నాకు బ్రతకాలనుంది‘ అని అది అంటుంటే ఏమీ చేయలేక తల బాదుకుని ఏడ్చాను. వాళ్ళ నాన్న పోయిన కొన్ని రోజులకే అది – నన్ను ఎక్కువ బాధించకుండానే - రోజా చనిపోయింది.

బంగారూ! అది కోరిన కోరిక నేను తీర్చలేను. నాకు ఆ శక్తి లేదు. నువ్వే మా ఇద్దరి జీవితాలని గురించి స్త్రీ జాతికి తెలియచేయి. మరో ఆడది మాలా బాధ పడకూడదనే నేను నిన్ను ఈ పని చేయమంటున్నానురా బంగారూ!“ అంది అత్త.

అత్త మాట్లాడుతుండగానే ఏం చేయాలా అనే నా ఆలోచనలు ఒక రూపు దిద్దుకున్నాయి. “తప్పకుండా తెలియచేస్తానత్తా. కాని అదేంటో మరి కథలు చదివీ, ఇంకొకరి జీవిత అనుభవాలు తెలిసీ కూడా స్త్రీ మోసపోతూనే ఉంది. వంచింపబడుతూనే ఉంది. తెలియచేయడం సంగతి కన్నా ముఖ్యంగా మనం కొంత మందికైనా మన పరిథిలో సహాయం చేద్దామత్తా. నీ పొలానికి చాలా విలువ వచ్చింది. పొలాన్ని అమ్మి తక్కువ ధర ఉన్న చోట స్థలం కొని స్త్రీ సదనం కడదాం. అభాగ్యులని చేరదీసి నీ జీవితాన్ని సార్థకతచేసుకుందువుగాని“ అన్నాను.

మెరుస్తున్న కళ్ళతో అత్త నన్ను వాటేసుకుని కిందకు నా కాళ్ళ మీదకు జారింది. “తప్పు అత్తా! పెద్దవాళ్ళు పిల్లల కాళ్ళు పట్టుకోకూడదు“ అంటూ అత్తని లేవదీశాను.

మా అమ్మకీ, మా ఊరి వాళ్ళకీ నా పొలాన్ని అత్తకి ఎక్కువ ధరకి అమ్మినట్లుగా చెప్పాను. అత్త ఇప్పుడు స్త్రీ సదనంలోని వారందరికీ తల్లి. ఇప్పుడు అమ్మ కూడా అత్తని బాగా పలకరిస్తుందట. అత్త నాతో ఫోన్లో మాట్లాడినప్పుడు ఆమె గొంతులోని సంతోషం వల్ల ఆమె అణువణువులో వెలుగుతున్న మెరుపుని చూడగలుగుతున్నాను.

మా అత్త ఎప్పుడూ మెరుస్తూనే ఉండాలి. నాకు గర్వాన్ని కలిగించాలి - ఇది నా కోరిక.


***


—-మండువ రాధ

2 comments:

  1. ఇది రియల్ జీవితం ..............

    ReplyDelete
  2. అంటే నా కర్థం కాలేదు మీ కామెంట్. ఇలాగే ప్రవర్తిస్తున్నారు పిల్లలు అంటున్నారా? లేక ఇది నిజంగా జరిగిందా అని నన్ను అడుగుతున్నారా?

    ReplyDelete

P