Thursday, April 17, 2014

భయం - మ్యూజింగ్స్ - 2

                                                          
రోజూ లాగే ఈరోజు కూడా వేకువ ఝామున 5. 30 కే లేచాను. నిద్ర లేవగానే రమణ మహర్షి ఫొటో వైపు చూడటం నాకలవాటు. కిటికీ తెరలు తొలగించి తలుపులు తీశాను. శీతాకాలపు చల్లనిగాలి సుగంధ పరిమళంతో నా ముఖాన్ని తాకింది. ఆ చల్లని గాలిని గుండెలనిండా పీల్చుకుంటూ కళ్ళు మూసుకుని కాసేపు ధ్యానం చేసుకున్నాను. పెదాలపై నవ్వు ఎందుకో - మళ్ళీ రమణుడిని చూడాలనిపించింది. ఆయన కళ్ళల్లో ఎంత దయ?

బయటకు వచ్చి గుమ్మంలో నిలబడగానే ఆవరణలోని మామిడి, ఉసిరి, సీతాఫలం,సపోటా, జామ చెట్ట్లు నన్ను చూసి పలకరింపుగా నవ్వాయి. నేను కూడా నవ్వి తామర కొలను వైపుకి చూశాను. ఈరోజు రెండు తామరలు విచ్చుకున్నాయి. కొలనుకి రెండు ప్రక్కలా ఉన్న బోగన్ విల్లా చెట్లు వంగి తామరలతో మాట్లాడుతున్నట్లు ఉన్నాయి. నేను గమనిస్తున్నానని గ్రహించాయేమో మందంగా తలలు ఊపాయి. తామరలు మాత్రం సిగ్గుతో తలవంచుకునే ఉన్నాయి. ఎవరో చిత్రకారుడు రచించిన సుందర దృశ్యంలా ఉన్న మా ఇంటి ఆవరణ అంటే నాకెంతో ఇష్టం.

మా స్కూల్ క్యాంపస్ లో ఉన్న అన్ని ఇళ్ళూ, హాస్టల్స్ దాదాపు ఇలాగే ఉంటాయి. ఉదయాన్నే ఆర్థ్రతతో కూడిన శీతవాయువుని పీల్చుకుంటూ సీనియర్ పిల్లలు జాగింగ్ కి వెళుతున్నారు. ఆవరణ చుట్టూ ఎత్తుగా పెరిగిన చింత, తంగేడు, మందార, తుమ్మ, కానుగ చెట్ల ఫెన్సింగ్ మీదుగా కనబడుతున్న కొండలకీ , కొండల వెనుక నుండి వస్తున్న బాలభానుడికీ నమస్కరించి లోపలకి వచ్చాను.

వార్డెన్ పిల్లలను ఒక్కొక్కరినీ మృదువుగా తట్టి లేపుతున్నట్లుంది. చప్పుళ్ళు లీలగా వినిపిస్తున్నాయి. బాత్ రూమ్ లో ముఖం, కాళ్ళూ చేతులూ కడుక్కుని కాఫీ పెట్టుకుందామని వంటింట్లోకి వచ్చాను.

"అక్కా! అక్కా!" అని పెద్దగా అరుపులు. దబదబా మెట్లు దిగుతున్న శబ్దం. పై గదిలో ఉన్న తొమ్మిది మంది పిల్లలూ నా గదిలోకి పరిగెత్తుకుంటూ వచ్చారు. అందరి కళ్ళల్లో భయం.

"ఏమిటి? ఏమయింది?" అని నేను అంటుండగానే ఈ అరుపులు విని "పామా ఏమిటి? ఏమయింది?” అంటూ వార్డెన్ , క్రింద గదిలో ఉండే పిల్లలూ కూడా నా గదిలోకి వచ్చారు. మా క్యాంపస్ లో తరచుగా పాములు కనిపిస్తూ ఉంటాయి. అవి కనపడ్డప్పుడల్లా అలా పిల్లలు అరవడం మామూలే.

గసపోసుకుంటూ పిల్లలు గందరగోళంగా, గోలగోలగా మాట్లాడుతున్నారు. నాకు ఒక ముక్కన్నా అర్థం కాలా. " ష్ ! ష్! ఒకరు మాట్లాడండిరా!" అన్నాను కంగారుని గొంతులో కనబడనీయకుండా.

"అక్కా! దయ్యం డ్రాయర్. నకుల్ ని ఫాలో చేస్తుంది" అన్నాడు వంశీ భయం భయం గా.

"ఔనక్కా! నకుల్ బెడ్ పైన ఉంది. పారేస్తే కూడా మళ్ళీ మళ్ళీ వస్తుంది వాడి దగ్గరకు" అన్నాడు గుసగుసగా అభినవ్.

అందరూ మళ్ళీ గోలగోలగా మాట్లాడటం మొదలు పెట్టారు. ఏదో పెద్ద వింత జరిగినట్లుగా, మాకే గాంగ జరిగింది అన్నట్లుగా స్పీచ్ ఇస్తున్నారు పైన గదిలోని పిల్లలు కింద ఉండే వాళ్ళకి.

"ష్ ! అరవొద్దురా! తల పగిలిపోతుంది బాబోయ్! ఒక్కరు చెప్పండి" అంటూ పెద్దగా అరిచి తలపట్టుకునేటప్పటికి అందరూ నోళ్ళు మూసుకుని నా వైపు చూశారు.

"నకుల్! ఏమిటిది? ఏం జరిగిందో వివరంగా చెప్పు. ముందు అందరూ కూర్చోండి" అని అందరినీ కూర్చోపెట్టాను. బుద్ధిగా అందరూ కూర్చున్నారు. నిద్రమత్తుతో, చింపిరి జుట్టుతో ఒక్కొక్కడూ ఒక్కో పిల్ల బఫూన్ లా ఉన్నారు.

"మరీ అక్కా! ఎవరిదో ఒక తెల్ల డ్రాయర్ మొన్న నా మంచం మీద పడేసి ఉంది. ఎవరిదోనని అందరినీ అడిగాను. వీళ్ళు 'నాది కాదు అంటే నాది కాదు ' అన్నారు. దాన్ని తీసికెళ్ళి బాత్ రూమ్ లోని కమ్మీ మీద పడేశా. నిన్న సాయంత్రం స్నానం చేసి బట్టల కోసం అల్మారా తీశానా ఆ డ్రాయర్ నా బట్టల మీద పెట్టి ఉంది. 'ఎవర్రా దీన్ని నా అల్మరాలో పెట్టింది ' అని అడిగితే ' నేను కాదంటే నేను కాదని ఒట్టేసి మరీ చెప్పారు. అప్పుడేమో రాజు ' దీనిలో దయ్యం ఉందేమోరా! అది నిన్ను ఫాలో అవుతుందిరా ' అని అన్నాడక్కా! అందరికీ భయమేసి దాన్ని కర్రతో పట్టుకుని కిటికీలో గుండా బయట పారేశాం. అందుకే రాత్రి అందరం మంచాలు దగ్గర దగ్గరగా వేసుకుని పడుకుంది"

మంచాలు రాత్రి ఎందుకు జరిపారో అని నేను అడుగుతానని తెలుసు కదా! అందుకని పనిలో పనిగా దానికి కూడా ఎక్స్ ప్ల నేషన్ ఇచ్చాడు . "ఇప్పుడు నిద్ర లేచి చూస్తే ఆ డ్రాయర్ నా కాళ్ళ దగ్గర ఉంది అక్కా! అందరికీ చూపించానా - అర్జున్ పెద్దగా అరిచి పరిగెత్తాడు మీ దగ్గరకి. మేము కూడా పరిగెత్తాం" అని చెప్పాడు. వాడి గొంతులో భయం స్పష్టంగా తెలుస్తోంది.

పెద్దగా నవ్వాను. వార్డెన్ పల్చగా నవ్వింది. పిల్లలు మాత్రం అస్సలు నవ్వలేదు. భయంగా చూస్తున్నారు. వార్డెన్ ను పైకి వెళ్ళి ఆ డ్రాయర్ ని తెమ్మన్నాను.

ఆమె చేతిలోని డ్రాయర్ ని చూడగానే "ఇది నాదక్కా! దీని కోసం మూడు రోజులుగా వెతుక్కుంటున్నా!" అన్నాడు క్రింద గదిలో ఉండే నిర్మాణ్.

"మరి నకుల్ బెడ్ మీదా, అల్మరాలో ఎవరు పెట్టారు?” అని అడిగాను . ఎవరూ పలకలేదు.

వార్డెన్ కూడా "నాకు తెలియదక్కా! రమేమైనా పెట్టిందేమో అడుగుతా" అని డ్రాయర్ ని మిడిల్ టేబుల్ మీద పెట్టి "రమా! రమా! " అని మా స్వీపర్ అక్కని పిలిచింది.

చీర కుచ్చెళ్ళు పైకి దోపుకుని, చీపురు కట్టతో సహా వచ్చిన మా రమ టేబుల్ మీద ఉన్న డ్రాయర్ ని చూసి పంచాయితీ ఆ డ్రాయర్ కోసమే అని గ్రహించింది. "చూడమ్మా ఈ నకుల్ బాబు ఈ డ్రాయర్ ని ఎక్కడంటే అక్కడ పారేస్తున్నాడు. నేను ఎత్తి పెట్టనూ, ఈ బాబు పారేయనూ - మీకు చెబుదామనుకుంటానా మళ్ళీ మర్చిపోతున్నా పనిలో బడి " అంది.

"నకుల్ దని ఎందుకు అనుకున్నావు" అని అన్నాను.

"ఈ బాబేగా అమ్మా! ఎప్పుడూ వస్తువులు పారేసుకునేది , మీ చేత తిట్టించుకునేదీ. అందుకే ఆయనది అనుకుంటి . ఆ బాబుది కాదంటనా!" అంది.

నకుల్ వైపు సాలోచనగా, దిగులుగా చూశాను. నా చూపులను అర్థం చేసుకున్న నకుల్ "ఇంకెప్పుడూ వస్తువులు పారేసుకోనక్కా! ఇకనుండీ జాగ్రత్తగా పెట్టుకుంటా" అన్నాడు.

అందరినీ పంపేసి సోఫాలో కూలబడ్డాను అలోచిస్తూ - ఇంత చిన్న పిల్లలకి 'దయ్యాలు' అనే మాట, భావం ఎలా తెలుస్తుంది? ఎవరు చెప్తారు? పుస్తకాలు చదివి ఊహించి ఉంటారా? కొన్ని యుగాల పాటు దయ్యం, భూతం అనే మాటలను నిషేధిస్తే బావుండు. అయినా మాటలను నిషేధించినంత మాత్రాన భావం నిషిద్ధమవుతుందా? ' తెలియని ' దాని పట్ల భయం అనేది మానవుడికి పుట్టుకతోనే వచ్చిన సహజాతం - అలాంటప్పుడు దాన్ని ప్రేమ, దయ చూపడం ద్వారా తొలగించగలం కాని మాటలను నిషేధిస్తే ఏమవుతుంది నా పిచ్చి గాని - లేచి వంటింట్లోకి నడిచాను కాఫీ కలుపుకోవడానికి.


*********

No comments:

Post a Comment

P