Monday, April 14, 2014

జవాబేది!!!? - (స్కెచ్) చినుకు మాసపత్రిక లో ప్రచురణ



అక్కో! ఓ రమక్కా! చూస్తివా పక్కింటక్క ఏం చేసిందో! 'కొత్తగా వచ్చింది పాపం ఆ అక్కకి ఎవరూ తెలియదు కరుణా! వాళ్ళకి బాత్ రూమ్ అంటా కడిగిపెట్టు' అని నన్ను పనికి పంపావా? సరేలే నువ్వు చెప్పావు గదా అని పని చేసుకుంటుంటిని. పనికి చేరి నాలుగు నెల్లు అయిళ్ళా - ఈరోజు చూడు పుసుక్కున ఎంత నిందేసిందో! నిన్న వాళ్ళ బాత్ రూమ్ కిటికీలో పెట్టిన తలకేసుకునే రబ్బరు బాండ్లు కనపడటం లేదంట. ఒక్కోటీ వందేసి రూపాయలంట. ఇంట్లో పని చేసే సీతిని అడిగిందంట....

ఆ నా సవితి తీస్తే తీశానని చెప్పాల లేకపోతే నాకు తెలియదక్కా అనాల. అది నా మీదకి నెట్టింది చూడు రమక్కా. సందు దొరికింది గదా అని... అది 'ఇంత మంది ఎందుకు లేక్కా ఒకింట్లో పనిచేయడం ఏమైనా పోతే నా మీదకు వచ్చిద్ది నేనే కడుగుతాలే బాత్ రూమ్ లు - ఆ రెండొందలూ నాకే ఇయ్యి' అందంట.

ఈ అక్క నైసు నైసుగా 'ఇంట్లో ఇద్దరు పనిచేస్తున్నప్పుడు రబ్బరు బాండ్లు ఎవరు తీశారో ఎట్టా తెలిసిద్ది. అయ్యి మా ఆడబడుచు అమెరికా నుండి పంపించింది. ఒక్కరే పని చేస్తే ఏం పోయినా అడగొచ్చు. బాత్ రూమ్ లు కూడా సీతే కడుగుతుందంటలే - నువ్వొద్దులే కరుణా! రేపటినుండి పనికి' అంటా మాట్లాడతంది.

చూస్తివా! అంటే ఆ రబ్బరు బాండ్లు నేను తీశాననేగా అర్తం? ఆ సీతిని బాగా కడిగేసి వస్తుండా - నీకెట్టా సిగ్గులేదమ్మే? నువ్వేమైనా మా కులంలో పుట్టావా దొడ్లు కడగటానికి అని. నలుగురిలో మానం చెడకుండా ఉండటానికి 'నేను కడుగుతానని అనలా - ఆ అక్కే కడగమంది' అని చెప్తాంది కోడిలా తల ఏలాడేసుకోని. సరే - ఆ అక్కే అందనుకో దీని బుద్ది ఏడకుబోయింది 'ఆ పనులు నేను చేయనక్కా! అది ఆ కులపోళ్ళ పని' అనొద్దూ!?

నువ్వంటావులే 'కులమేంది కరుణా!' అని - ఈ కులం పేరు ఎత్తకపోతే ఈ నా సవుతులు మేం చేసే పనులకి కూడా తయారయిపోతారక్కో! ఇంక నా బిడ్డా పాపలకి నేనేం పెట్టుకోవాల? వాళ్ళని ఎట్టా చదివించుకోవాల? మీలాగా నాకు చదువూ లేకపాయా. ఈ బాగిసేటి వాటి లాగే ఇళ్ళల్లో పని చేస్తామంటే ఆ కులపోళ్ళ చేత ఎట్టా చేయించుకుంటారని మాకు అడ్డం పడుతుంటిరి - అట్టాంటప్పుడు మా పనులు వాళ్ళు చేస్తామంటే ఏ కులం పేరు చెప్పి మమ్మల్ని ఇళ్ళల్లో పని చేయనీయడం లేదో ఆ కులం పేరే చెప్పి వాళ్ళ నడ్డి ఇరగ్గొట్టొద్దూ నువ్వు చెప్పు!!? నేను కాట్లోకి పోయినాకేక్కో ఈ కులం నన్ను వదిలేది.... నా బిడ్డలకి ఈ బాధ కలగకూడదనే గదా ఇట్టాంటి మాటలన్నీ పడతా కూడా పని చేసుకుంటంది!? చదివించుకుంటంది!!?

అయినా చదువుకున్నదానికి ఆ అక్కకైనా తెలియక్కర్లా...... ఇన్నాళ్ళబట్టీ మీ ఇంట్లో పని చేస్తన్నా ఏ పొద్దన్నా నువ్వు ఇది పోయింది అది పోయిందని అన్నావా? పోయే ఉంటాయిలే పాపం చిన్నా చితకా - అంత మాత్రాన కడుపు మీద కొట్టావా? ఏమైనా కావాలంటే నన్ను అడగండి ఇస్తా అంటావు. మాకు ఆశ కలిగిందని చెబితే ఎన్ని పెట్టలేదు నువ్వు మాకు! మేమేమైనా నగలు నాణాలు అడుగుతామా - ఏ యాపిలు కాయో, స్వీటు పెట్టె చూస్తే స్వీటో అడుగుతాము.

ఆ ఇంట్లోకి వాళ్ళొచ్చినపుడు వాంతొచ్చే ఆ దొడ్డిని యాసిడ్ పోసి పువ్వులాగ కడిగాననైనా ఉందేమో చూడు ఆ అక్కకి. ఆ అక్కదేముందిలే ఈ నా సవితి నాకు దొంగతనం అంటగట్టి నా పని లాక్కుంది రెండొందలూ దాని ఎదాన పోసుకునేదానికి - ఎన్నాళ్ళు కులికిద్దిలే -

సాయంకాలం అది ఇంటికి రావాల ఊళ్ళో అందరి ముందూ కడగాల. బిత్తరకపోయి తెల్లారేటప్పటికి ఆ అక్క దగ్గరకొచ్చి 'నేను ఆ పని చేయకూడదులే అక్కో' అని చెప్పాల.

నీకు ఇంకోటి చెప్పాలక్కో! నేను మళ్ళీ ఆ అక్క గడప తొక్కను. ఇవాళ బాండ్లు పోయాయంది రేపు నోట్లు పోయాయంటే ఏం చేసేది? ఊరంతా గబ్బయ్యి ఉన్న నాలుగిళ్ళల్లో పని లేకుండా పోతే నా బిడ్డలని ఎట్టా సాక్కునేది?

వద్దు దేవుడా వద్దు. పొట్ట మీద కొట్టే వాళ్ళ దగ్గరకి పోనే వద్దు. నువ్వేమీ అనుకోగాకక్కో! దయగల తల్లివి - ఏం చెప్పినా సానుబూతితో ఇంటావు - అందుకే నీకు చెప్తి. వస్తా అక్కా!


******

No comments:

Post a Comment

P