Monday, November 10, 2014

తెర తీయగరాదా!

కౌముది లో ప్రచురణ

పొద్దుట మొదలైన సన్నని వర్షం సాయంత్రమయ్యేప్పటికి ఎడతెగకుండా కురుస్తోంది. ఆరు కూడా కాకుండానే ఇల్లంతా చీకట్లు ముసురుకున్నాయి. పడక్కుర్చీలో నుండి లేచి లైట్ వేసి పూజ గదిలోకి వెళ్ళారు రాఘవయ్యగారు సంధ్య దీపం వెలిగించడానికి...

"దీపం జ్యోతి పరబ్రహ్మం
దీపం సర్వ తమోపహం
దీపేన సాధ్యతే సర్వం
సంధ్యాదీపం నమోస్తుతే"

దీపం వెలిగించి శ్లోకం చెప్పుకుంటున్నాయనకి తలుపు చప్పడయినట్లనిపించి చెవులు రిక్కించి విన్నారు వాన శబ్దంలో వినపడదని కాబోలు తలుపుని ఎవరో బాదుతున్నారు. పీట మీద నుండి దిగ్గున లేచి వెళ్ళి తలుపు తీశారాయన.

ఎదురుగ్గా మనమడు కృష్ణుడు. వాడితో పాటే వాడి వయసే ఉన్న అమ్మాయి - ఒకే గొడుగులో ఒకరినొకరు ఆనుకొని ఉన్నారు.

బావున్నావా తాతయ్యా!” అన్నాడు లోపలికొస్తూ - వాడి వెనకే బిడియంగా ఆ అమ్మాయి. ముచ్చటగా ఉంది. ఆకుపచ్చని చీర కట్టుకొని ఉన్న ఆ పిల్ల మామి చిగురుల మధ్యన కలిసిపోయి తొంగి చూస్తున్న పచ్చని చిలుకలా అనిపించింది ఆయన కళ్ళకి.

రుక్మిణి తాతయ్యా!” అన్నాడు కృష్ణుడు. కూతురునే చూస్తున్నట్లనిపించింది. “రుక్మిణి" గొంతులో ఏదో అడ్డం పడ్డట్టయ్యి గద్గదంగా అన్నారాయన.

ఇప్పుడే బట్టలు మార్చుకొని వస్తాం తాతయ్యా" అంటూ కృష్ణ రుక్మిణిని తీసుకొని గదిలోకి వెళ్ళాడు.

పూజ పీట మీద కూర్చుని యాంత్రికంగా అగరొత్తులు వెలిగించి హారతి ఇచ్చారు – ఆయన తలపుల నిండా భార్య వైదేహి.

మనసంతా రుక్మిణి, కృష్ణుడి రథం ఎక్కే ఘట్టం ... మందగమనంబున గంధసింధురంబులీలంచనుదెంచి చను కంఠీరవంబుకైవడి నిఖిలభూపాలగణంబుల గణింపక తృణీకరించి రాజకన్యకం దెచ్చి హరి తన రథంబు మీద నిడికొని.....

వైదేహీ! నీ కోరిక తీరింది. చూశావా! నీ మనమడు భలే వాడు కదూ! రాముడిలా విల్లు విరిచి మర్యాదగా తీసుకొస్తాడనుకుంటే ఏకంగా ఎత్తుకొచ్చేశాడు. సార్థకనామధేయుడు - అందుకే పెట్టుకున్నావులే ఇద్దరికీ ఆ పేర్లు పట్టుబట్టి మరీ -

రాఘవయ్య కళ్ళల్లో పల్చటి కన్నీటి తెర

***

రుక్మిణీకృష్ణులు బట్టలు మార్చుకుని పూజగదిలోకి వచ్చారు.

తాతయ్యా! ఒకసారి లేచి నిలబడు" అన్నాడు కృష్ణుడు

ఎందుకురా?”

లే! తాతయ్యా!”

మనమడికి సగంలో సగంగా నిలబడ్డ ముగ్దని చూస్తూ లేచి నిలబడ్డారు రాఘవయ్య గారు.

సంచి లోంచి తాంబూలమూ, పూలు బయటకి తీసి ఆయన చేతిలో పెట్టాడు కృష్ణుడు. ఇద్దరూ వంగి ఆయన కాళ్ళకి నమస్కరించారు.

దీర్ఘాయుష్మాన్ భవ! పుత్ర పౌత్రాభిరస్తు! ..... ఏమ్మా! నీ పేరేమిటీ?” అడిగారాయన వాళ్ళని దీవించి రుక్మిణి వైపు చూస్తూ.

నీకు తెలుసులే తాతయ్యా! నేను చెప్పడమెందుకు?”

గడుసుదే ..... గడుసుదేనే నీ మనవరాలు" గోడకు తగిలించిన భార్య ఫొటో చూస్తూ అన్నారు పెద్దగానే.

మనమడు ఫొటో దగ్గరకి వెళ్ళి నాయనమ్మకి నమస్కరింస్తుంటే రుక్మిణి కూడా ఒద్దికగా భర్తను అనుసరించింది. రాఘవయ్య గారి హృదయం ఆనందంతో ఉప్పొంగింది. ఒద్దికతో కూడిన భార్యతో కాపురం బావుంటుంది. నా మనమడికి ఇక జీవితమంతా సంక్రాంతే! ఆయన ముఖం పై నవ్వు.

ఒరే రిజిష్టరీ పెళ్ళి చేసుకున్నావా? లేదా?” అడిగారు రాఘవయ్య గారు మనమడిని తన గదిలోకి లాక్కెళ్ళి వాళ్ళకని తెప్పించిన కొత్త బట్టలు కృష్ణుడి చేతిలో పెడుతూ.

చేసుకున్నా తాతయ్యా!”

సరే! ఈ పట్టు బట్టలు కట్టుకుని పూజ గదిలోకి రండి. ఆ సర్వసాక్షి ఎదురుగా పసుపుతాడు కడుదువుగాని నా మనమరాలికి" అన్నారు రాఘవయ్య గారు.

బట్టలు తీసుకొని తాతయ్యని ఆప్యాయంగా కౌగలించుకున్నాడు కృష్ణుడు.

***

బయట వర్షం నెమ్మదించింది. చెట్లు వణుకుతూ చల్లని గాలిని వీస్తున్నాయి.

భర్త దండ మీద తల పెట్టుకొని పడుకున్న రుక్మిణిని పొదుపుకుంటూ "నాన్నకి ఈ ఊరి నుండి టా్రన్స్ ఫర్ అయిన దగ్గర నుండీ పాపం తాతయ్య ఒక్కడే వండుకుంటూ తంటాలు పడుతున్నాడు. మా దగ్గరకి రమ్మంటే రాడు ఊరినీ, ఇంటినీ వదల లేనురా అంటూ. 'ఈరోజు మీ ఆవిడ కమ్మని భోజనం పెట్టిందిరా' అని తాతయ్య ఎన్ని సార్లు మెచ్చుకున్నాడో నిన్ను" అన్నాడు కృష్ఞుడు.

"తాతయ్యే నన్ను తీసుకొచ్చేయమన్నాడా?”

తాతయ్య చెప్పినంత మాత్రాన సరిపోతుందా రుక్కూ! మనిద్దరకి కూడా నచ్చాలిగా?"

"నచ్చానా మరి?"

"నచ్చావు కాబట్టేగా అన్ని మేఘ సందేశాలూ, ఫోన్లూ!

నువ్వు నా పక్కనే ఉండటం చాలా బావుంది కాని నేను వాటిని మిస్ అవుతున్నాను. చేతులు ఊరుకోనంటున్నాయి"

ఈ మూడు రోజులూ వాటితో నాకు చాలా పనుంది. తర్వాత ఆఫీసుకెళ్ళి పోతానుగా అప్పుడు గంటకో మెసేజ్ పెడుదువుగాని"

శ్రీముఖం తీసుకొని ఇంటికి రావడానికా?”

శ్రీముఖం తీసుకొని వచ్చినా, తీసుకొని రాకపోయినా నీకు సంతోషమేలే"

ఎలా?"

శ్రీముఖం వస్తే నీ మీద నాకెంత ప్రేమో తెలిసి సంతోషం. రాకపోతే రెంటినీ సమర్థవంతంగా నెగ్గుకొచ్చేవాడు దొరకాడని సంతోషం"

ప్రణయాక్షరాలని డిలీట్ చెయడమో, చూడకపోవడమో చేసి ఉంటాడని అనుకోవడానికి కూడా అవకాశం ఉందిగా?”

దాన్ని నువ్వు ఈజీగా కనిపెట్టేయొచ్చు - నేను నీతో ఉన్న ఒంటరి క్షణాల్లో.....”

ఊఁ ఇప్పుడే తెలుస్తుందిలే సమర్థుడవని గదిలో నాకు, బయట ముసిముసి నవ్వులు నవ్వుతున్న 'మీ' తాతయ్యకి.

మా తాతయ్యకి ఎప్పుడో తెలుసు నా సంగతి - లేకపోతే నిన్ను తెచ్చేయమని చెప్పడు"

ఎందుకు మన కుటుంబాల మధ్య ఇంత శత్రుత్వం?"

"మనుషుల మధ్య - ముఖ్యంగా కుటుంబాల మధ్య మాట పట్టింపులు రావడం, శత్రుత్వాలు పెంచుకోవడం మరీ ఎక్కువవుతోంది. కారణాలు ఎన్నైనా, ఏవైనా అవొచ్చు - ఒకటని చెప్పలేం" దిగులుగా అన్నాడు మంచం దిగి కిటికీలోంచి బయట నిట్ట నిలువుగా కురుస్తున్న వర్ష ధారని చూస్తూ.

అతని దగ్గరకి నడిచి అతని భుజం మీద తల వాల్చి “ఎన్నిసార్లడిగినా దాటేస్తున్నావు. రేపు అందరి ముందూ నాకు ఎలాగూ తెలుస్తుంది. నువ్వు చెప్తే అది ఎలాంటి విషయమైనా అర్థం చేసుకోగలను కృష్ణా!" అంది.

మీ నాన్న మా నాన్న చాలా మంచి స్నేహితులు. ఈ ఊరి కో ఆపరేటివ్ బ్యాంక్ లో మా నాన్న మేనేజర్. అప్పుడు మీ నాన్న అదే బా్యంక్ లో క్యాషియర్. మా ఇంటిలోనే ఎక్కువగా ఉండే వాడుట.

మా అమ్మ మా అత్తయ్యని తన అన్నయ్యకిచ్చి చేయమని అడిగింది. అప్పటికే అత్తయ్య మీ నాన్న ప్రేమించుకున్నారు. ముహుర్తాలు పెట్టుకునే సమయానికి ఇద్దరూ బయట పడి విషయం చెప్పారుట.

నాన్న, తాతయ్య సంతోషంగా అత్తయ్యని మీ నాన్నకిచ్చి చేశారు.

నువ్వు పుట్టిన తర్వాత నాలుగేళ్ళదాకా మనం అందరం కలిసే ఉండేవాళ్ళం. నువ్వు పుట్టినప్పుడు నాయనమ్మ 'కృష్ణుడికి పెళ్ళాం పుట్టింద'ని అంది తెలుసా!” రుక్మిణిని మంచం దగ్గరకి తీసుకొస్తూ అన్నాడు కృష్ణుడు.

! ఏం సంతోషమో ముఖంలో..... తర్వాత" అంది రుక్మిణి మంచం మీద కూర్చుని భర్తని కూర్చోమని సైగ చేస్తూ.

కృష్ణుడు ఆమె పక్కన కూర్చుని "మీ నాన్న ఓ దుర్బల క్షణంలో ఒక కస్టమర్ అకౌంట్ లో దొంగ సంతకం పెట్టి డబ్బులు తీసుకున్నాడు. మేనేజర్ గా నాన్న మామయ్య చేసిన పనిని బయటకి రాకుండా చేయగలడు కాని తనే స్వయంగా మామయ్యని చట్టానికి పట్టించాడు.

మీ నాన్న జైలు నుండి వచ్చాక నిన్నూ, అత్తయ్యనీ మీ ఊరికి తీసికెళ్ళిపోయాడు - ఎట్టి పరిస్థితుల్లోనూ అత్తయ్య పుట్టింటి గడప తొక్కకూడదనే కండిషన్ తో.

ఎండ కన్నెరుగని కూతురు పొలం పని చేసుకుంటుంటే పాపం నాయనమ్మ ఇక్కడ బాధపడుతూ ఉండేది. 'ఒరేయ్ కృష్ఞుడూ! నువ్వే ఈ రెండు కుటుంబాలు కలిసేట్లు చేయగలవురా! రుక్మిణిని పెళ్ళి చేసుకుని' అనేది. ఎప్పుడు సెలవలకి ఇంటికి వచ్చినా అదే మాట - 'అత్తయ్య కూతురు రుక్మిణిని చేసుకుంటావుగా - చేసుకుంటావుగా' అని.

నాయనమ్మ చనిపోయినపుడు కూడా మీ నాన్న నిన్ను పంపలేదు. ఆయనా రాలేదు. అత్తయ్య మాత్రం ఒక గంట ఉండి వెళ్ళిపోయింది"

మనం చేసిన పనికి ఇప్పుడు వీళ్ళింకా దూరం అవుతారేమో కృష్ణా - భయంగా ఉంది" అంది రుక్మిణి ఆందోళనగా.

దూరం కారు కాని ప్రస్తుతం అంటీ ముట్టనట్లుంటారు తర్వాత ఆప్యాయతలు వాటంతట అవే వచ్చి చేరతాయి - అయితే భవిష్యత్తులో నువ్వు మా అమ్మ దగ్గర చాలా నేర్పుగా ఉండాలి" అన్నాడు కృష్ణుడు పడుకుంటూ.

ఏమిటో ఆ నేర్పు"

చెప్తా ఇలా రా" అని రుక్మిణిని తన కౌగిలిలో లాక్కుని "ఆమె చెప్పినట్లు వింటూ, నీకే అన్నీ తెలుసత్తయ్యా! అంటూ ఉండాలి అప్పుడప్పుడూ - సరేనా!" అన్నాడు.

నేర్పించే వాళ్ళున్నప్పుడు చిలక పలుకులు పలకడానికేమిలే"

కలికి చిలకల కొలికి మా మేనత్త – అమాయకురాలు. నువ్వలా కాదులే గడుసుదానివి. నెగ్గుకురాగలవు. నేను నేర్పించక్కర్లా"

సమర్థులకి గడుసు వాళ్ళే దొరుకుతారు మరి"

ఊఁ" ఆమెనిక మాట్లాడనివ్వలేదు కృష్ణుడు

***

తెల్లవారింది. తూరుపు చుక్క పుట్టీ పుట్టగానే చిరు వెలుగులని ప్రసాదిస్తోంది. నిద్ర లేచిన రాఘవయ్య గారికి తన హృదయంతో పాటు ఇల్లంతా ఏదో కొత్తదనంతో కూడిన ప్రశాంతత ఆవరించుకున్నట్లుగా ఉంది.

'తెల్లవారిందాకా ఏంటింత మొద్దు నిద్రపోయాను! పిల్లలు లేవలేదు కదా!' అనుకుంటూ మధ్య గదిలోకి వచ్చారు. వాళ్ళ గది తలుపులు మూసే ఉన్నాయి. నవ్వుకుంటూ కాలకృత్యాలు ముగించుకుని పూజకి పూల కోసం ఆవరణలోకి నడిచారు.

నీళ్ళను కుమ్మరించి కుమ్మరించి కడుక్కున్న మేఘాలు ఆకాశంలో స్వచ్ఛంగా మెరుస్తున్నాయి. నీళ్ళను కడుపారా తాగేసిన భూమాత మెత్తగా, సంతృప్తిగా ఉంది. మల్లెమొగ్గలు నీళ్ళ చుక్కలతో సరాగాలాడుతున్నాయి. ఆ తడి పువ్వులను కొయ్యాలనిపించలేదాయనకి. రెండు మందారాలను తెంపుకుంటుండగా గేటు తీసుకొని వస్తున్న కొడుకు, కోడలు కనిపించారు. వాళ్ళ వెనకే కూతురూ, అల్లుడూ.

నాన్నా! కృష్ణుడొచ్చాడా?” కొడుకు ఆనంద్ గొంతులో కంగారు.

! రుక్మిణి కూడా వచ్చింది - ఏమ్మా బాగున్నావా" కొడుక్కి సమాధానం చెప్పి కూతుర్ని పలకరించారాయన.

బాగున్నారా నాన్నా! మీ ఆరోగ్యం బాగుందా?” అంటూ వచ్చి కూతురు లక్ష్మి తండ్రి చెయ్యి పట్టుకుంది ఆప్యాయంగా.

బాగున్నానమ్మా! రండి అల్లుడు గారూ! అమ్మాయ్ కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళివ్వమ్మా!” అన్నారు లోపలకి వస్తూ. చాలా ఏళ్ళ తర్వాత వాళ్ళని చూసిన ఆనందంతోనో మరి ఆందోళనతోనో తడబాటు ఆయన మాటల్లో.

ఆయన వెనకే లోపలకి వస్తూ “మీ దగ్గరకి పిల్లలు వచ్చారని కబురైనా చేయలేదేమండీ?" అన్నాడు అల్లుడు నిలిదీస్తున్నట్లుగా.

ఇంత వర్షంలో నాన్న ఎలా కబురు చేయగలరు బావా? వాళ్ళని బయటకి రానివ్వండి అడుగుదాం" అన్నాడు ఆనంద్ గది వైపు చూస్తూ.

అతనితో మాట్లాడటం ఇష్టం లేనట్లుగా అల్లుడు ముఖం తిప్పుకున్నాడు. అంతకంటే తీవ్రంగా చూస్తోంది కోడలు కూతురి వైపు. రాఘవయ్య గారు చేతిలో మందారాలను టీపాయ్ మీద పెట్టి నిస్సత్తువగా తన పడక్కుర్చీలో చేరగిలపడ్డారు.

కొడుకూ కోడలు లోపలికి ఆయన గదిలోకి వెళ్ళారు. అల్లుడు ముఖం ధుమధుమలాడించుకుంటూ వరండాలో ఉన్న మంచం వాల్చుకొని పడుకున్నాడు. కూతురు వంటింట్లోకి నడిచింది.

రాఘవయ్య గారు పూజ చేయడం కూడా మర్చిపోయి అలాగే వాలిపోయి కళ్ళు మూసుకున్నారు. కూతురు ఫిల్టర్ లో డికాషన్ వేసినట్లుంది కమ్మని వాసన ఇల్లంతా. ఆయన ఆలోచనలు గతంలోకి వెళ్ళిపోయాయి.

నాన్నా! కాఫీ!”

ఆలోచనల్లోంచి బయటపడి "లేదమ్మా ఇంకా పూజ అవలేదు" అన్నారాయన.

ఈ రోజుకి నేను చేస్తానులే నాన్నా తాగేయండి"

చక్కెర .... కృతజ్ఞతలు.... సరిపోయిందా నాన్నా?” అంది లక్ష్మి - కృతజ్ఞతలు అనే మాట ఆయనకి మాత్రమే వినిపించేట్లుగా. ఆయన ముఖంలోకి సంతోషం వచ్చి చేరింది. కూతురు చేతిలోంచి కప్పు లాక్కున్నట్లుగా తీసుకుని తాగుతూ "చాలా బాగుందమ్మా కాఫీ" అన్నారు.

వరండాలో ఉన్న భర్తకి కాఫీ ఇచ్చి " అన్నయ్యా, వదినా కాఫీ" అంది గది బయట నిలబడి.

ఆనంద్ బయటకి వచ్చి "వదినకి వద్దటలేమ్మా! పడుకుంది" అంటూ తండ్రి పక్కకొచ్చి కూర్చున్నాడు. అతనికి కాఫీ ఇచ్చి అన్నయ్య కాళ్ళకి నమస్కరించింది లక్ష్మి. రాఘవయ్య గారికి వెనకటి సంగతి గుర్తొచ్చింది.......

ఆ రోజు కూడా ఇలాగే అన్న కాళ్ళకి నమస్కరించింది తన భర్తని క్షమించమని. “ఈ నిర్ణయం తీసుకున్న నేను శిక్ష అనుభవించే వాడి కంటే ఎక్కువ శిక్ష అనుభవించానమ్మా..... నన్ను క్షమించు. మనస్సాక్షికి వ్యతిరేకంగా నడవలేను" అన్నాడు. ఈ రోజేమంటాడో..... రెప్ప వాల్చకుండా కొడుకు వైపే చూస్తున్నారు రాఘవయ్య గారు.

కప్పు కింద పెట్టి చెల్లెలి తల పైన చెయ్యి వేసి ఆమె భుజాలను పట్టుకొని "లేమ్మా! దిగులెందుకు? సంతోషపడాలి గాని" అన్నాడు ఆనంద్ గుసగుసగా.

ఆనంద్ ముఖంలో మునుపెన్నడూ కానరాని ఆనందాన్ని చూసిన రాఘవయ్య గారి గుబులు పూర్తిగా ఎగిరి పోయింది.

కూతురు పూజ చేసి హారతి ఇస్తుండగా...... గంట శబ్దంతో పాటు ఆయన సంతోష పూరిత కంఠం గమకాలతో గంభీరంగా పలుకుతోంది.

ఓం భద్రం కర్ణేభి: శ్రుణుయామ దేవా: భద్రం పశ్యేమాక్ష భిర్యజత్రా:
స్థిరై రంగై స్తుష్టువాగ్ం సస్తనూభి: వ్యశేమదేవహితం యదాయు:
స్వస్తి న ఇంద్రో వృద్ధ శ్రవా: స్వస్తి న: పూషా విశ్వ వేదా:
స్వస్తిన స్తార్ క్ష్యో అరిష్టనేమి: స్వస్తి నో బృహస్పతిర్దధాతు
ఓం శాంతి: శాంతి: శాంతి:”

*******

No comments:

Post a Comment

P