Thursday, November 27, 2014

చివరి చూపు

ఈ ఆదివారం ఆంధ్రజ్యోతిలో  ప్రచురణ
- రాధ మండువ

1.

నేనంటే మా ఊరోళ్ళకీ, నా భార్య ఊరైన ఈ ఊరోళ్ళకీ కోపం. ఆఖరికి ప్రకృతికి కూడా కోపమేమో నాకు ఇల్లు లేకుండా పోయిన ఈరోజే హోరున ఈదురు గాలితో నన్ను ఈడ్చి ఈడ్చి కొడుతోంది. భూమి ఆకాశం ఏకమైపోయినట్లుగా వర్షం ఎడతెరిపి లేకుండా ధారగా కురుస్తోంది. కరెంటు ఎప్పటి నుంచో లేదు. చిమ్మచీకట్లో ఎలిమెంటరీ స్కూలు వరండాలో ముడుక్కుని కూర్చుని ఉన్నాను.

గాలి విసురుకి జల్లులు ఎంత మూలకి ఒదిగి కూర్చున్నా నా మీదకి వచ్చి పడుతున్నాయి. పరిస్థితి చూస్తే ఇది తుఫానుగా మారే ప్రమాదం కనిపిస్తోంది. తెల్లవారితే టెంకాయల పండగ. పండగ పూట నా పెళ్ళాం, కొడుకూ ఉన్నట్లయితే ఎంత బావుండేది? ట్రాక్టర్ మామనడిగి డబ్బులిప్పిచ్చుకోని దానికి చీర, కొడుక్కి చొక్కా లాగూ కొనివ్వాల.

నేను ఇలా ఆలోచించే సమయానికి ఇంకా చనిపోలేదు. నాకే ఆశ్చర్యం వేసింది. బతికున్నప్పుడు నా పెళ్ళానికి బిడ్డకి ఏదైనా కొనివ్వాలను కోవడం ఇదే మొదటిసారి. ఎందుకో దిగులుగా అనిపిస్తోంది కాని దానికి వ్యతిరేకమైనదైన ఉద్రేకం కూడా నా మనసుని ఆక్రమించుకుని ఉంది. అ ఉద్రేకంతో కూడిన దిగులే నేను చావడానికి కారణమైందేమో!

2.

చెత్తను ట్రాక్టర్ మీద కెక్కించి ఊరి శివార్లలో పారేసేయడం, మట్టి, ఇటుకలు, రాళ్ళు, సిమెంటు ట్రాక్టర్ మీదేసి కావాలన్న వాళ్ళకి తోలడం లాంటి పనులు చేస్తాను నేను. ఎంత కష్టమైన పనైనా, ఏ పనైనా చేయగలను. ట్రాక్టర్ యజమాని నా భార్య చిన్నాన్నే. అందరికీ రోజుకూలీ మూడు వందలైతే నాకు ఓ యాభై ఎక్కువిస్తాడు. మా చిన్నమామ అని ఇస్తాడనుకునేరు.... డబ్బులకీ వాడికీ విడదీయరాని లంకె. బంధుత్వాలు చూసి ఇచ్చే రకమేమీ కాదు. నేను బాగా పని చేస్తానని, నన్ను సరిగ్గా చూసుకోపోతే వేరే చోటకి పనికి పోతానని ఇస్తాడు.

ఆకాశం ఉరిమింది. ఉరుముతో పాటు మెరుపు. వరండా అంతా తడిసిపోయింది. సుధక్క చెప్పినట్లు విని ఉంటే ఈపాటికి వెచ్చగా పెళ్ళాం పక్కలో పడుకుని ఉండేవాడిని. ఎక్కడికెళ్ళిందో నా పెళ్ళాం? అది రావాలీ..... వస్తుందా? రాకెక్కడికి పోతుంది? వస్తే నా కొడుకు అంజిగాడి సాక్షిగా దాన్ని నరికెయ్యాల.... అసలు ఆ రోజే పరిగెత్తుతున్నప్పుడే దాని కాళ్ళ మీద ఏసేయాల్సింది వేటు. పారిపోకుండా ఇంట్లో పడి ఉండేది.

! ఇంత జరిగినా మళ్ళీ బుద్ధి లేకుండా ఆలోచిస్తున్నాను. ఆ సుధక్క అంటానే ఉంటుంది..... సుధక్కేందిలే.... అందరూ అంటున్నారు...... "నువ్వు తాగితే మృగానివేరేయ్, నువ్వేం చేస్తన్నావో, ఏం మాట్లాడతన్నావో నీకే తెలియదు" అని. నిజమే కదా! అయితే తాగకుండా మానేదెట్లా? “మందులు ఇప్పిస్తానబ్బాయ్ డాక్టర్ దగ్గరకి పోదాం రా" అంటుంది సుధక్క. సరేనని ఒకసారెళ్ళా.... “నీలో మారాలనే కోరిక గట్టిగా ఉండాలి, అప్పుడే మేమేమైనా చేయగలం" అంటాడే ఆ డాక్టరు! ఐదొందలు కొట్టేశాడు పాపం సుధక్క దగ్గర.

సుధక్క ముఖం చూసి ఊరుకున్నాను గాని “నాకు కోరికుంటే నువ్వెందుకయ్యా? నీ దగ్గరకెందుకొస్తాం ఐదొందలూ వదిలిచ్చుకోడానికా?” అని అడుగుదామానిపించింది. ఆరోజే నా పెళ్ళాం "ఇంట్లో కరెంటు పోయినప్పుడు గబ్బగీముగా ఉంటుందక్కా! పిల్లాడేడుస్తున్నాడు" అంటే మంచి టార్చిలైటు గూడా కొనిచ్చింది. అదెక్కడో సామాన్లల్లో పడిపోయి ఉంటుంది. ఇల్లు ఖాళీ చేపిచ్చి వరండాలో పారేసిన సామానంతా ఈ వానకి తడిసి పోతా ఉందో ఏం పాడో.....

3.

ఎవురురా అక్కడ?” గోపాలన్న కేకేశాడు. బడి పక్కనే నాతో పని చేసే గోపాలన్నిల్లు.

నేనేనన్నా.... సూరిని" అరిచాను. ఆ గాలిలో వినపడలేదులాగుంది. వరండా మెట్ల దగ్గరకొచ్చి "ఎవురంటే పలకరేమిరా....” అన్నాడు.

నేనేనన్నో"

"ఒరేయ్ నువ్వేనా సూరిగా!" అన్నాడు. ఆ చీకట్లో మనిషి కనపడలేదు గాని సారాయి వాసన గప్పున కొట్టింది.

ఔనన్నా! ఇల్లు ఖాళీ చేపించారు ఎక్కడికి పోవాలో తెలియక" మెత్తగా నసిగాను కాని లోపల ఊరోళ్ళందరి మీద మంటగా ఉంది.

నిన్ను ఊరికే బెదిరించే దానికి ఇల్లు ఖాళీ చేయించారులేరా! మీ పెద్దమామ వాళ్ళింట్లో ఉందంట నీ పెళ్ళాం. రేపు పంచాయితీలో బుద్ధిగా ఉంటానని చెప్తే మళ్ళీ ఇస్తారులే ఇల్లు. వాళ్ళివ్వకపోతే మీ మామ ఇంట్లోనే ఉందువుగాని" అన్నాడు ముద్దముద్దగా. ఈ సారి సారాయి వాసన నాకు దిమ్మెక్కేట్లుగా కొట్టింది. ఆ వాసనకి నా నరాలు జివ్వుమన్నాయి.

సరేలే అన్నా! సారాయి ఎక్కడిదీ" అన్నా ఆత్రంగా.

వాన ముసురుకి జనం అంతా దీని మీదే పడతారని శీనుగాడికి తెలుసు.... దండిగా తెప్పిచ్చాడు. అప్పుకిచ్చేస్తన్నాడు. తీపేమి? రేపు కూలి డబ్బులిచ్చే రోజు గదా నిలబెట్టి వసూలు చేస్తాడు" తుపుక్కున ఉమ్మేసి “ఒరేయ్ నువ్వు పోయేవు నీకివ్వకూడదని చెప్పిందంట ఆ సుధక్క" అన్నాడు.

చెప్పిందిలే నువ్వు నోరుమూసుకుని పా" అన్నాను.

నీతో నాకేమిటికిలేరేయ్, నువ్వసలే మంచోడివి గాదు" వెళ్ళిపోయాడు.

4.

'శీనుగాడు అప్పుకిచ్చేస్తన్నాడు' గాలి హోరులో ఆ మాటలు గింగురుమంటున్నాయి. రాజి గుర్తొచ్చింది. దాని వల్లే మా ఊరు వదిలి ఈ ఊరు రావాల్సొచ్చింది. పెళ్ళాం పుట్టినూరిలో కాపురం ఉండకూడదు. వాళ్ళోళ్ళని, ఈ సుధక్కని చూసుకోనే అది కొవ్వు పట్టింది. రాజికి పట్టిన గతే దీనికీ పట్టిచ్చాల.

రాజి మా ఊళ్ళో మందు అమ్ముతుంది. మందుతో పాటు బజ్జీలు, పుల్లట్లు, పకోడీలు ఉంటాయని అందరూ దాని కొట్టుకే వెళతారు. నేను మాత్రం అక్కడికి పోయేవాడిని కాను. అప్పుడు చిన్న పిల్లోడిని పంతొమ్మిదేళ్ళుంటాయేమో! ఇప్పుడు నేనేదో పెద్దోడిని అనుకునేరు ఇరవై ఏడుంటాయి. వాసు గాడి షాపులోంచి తెచ్చుకోని ఇంట్లో తాగేవాడిని.

ఆరోజు ఇలాగే వర్షం. ఇంత లేదు గాని చిత్తడి చిత్తడి గా చేసే ముసురు. ఆ ముసుర్లో పనేమీ లేక ఇంట్లో కూర్చుని తాగుతున్నాను.

మరిదో! మందు బేరం అంతా వాసుగాడికే ఇచ్చేస్తన్నావే నేనేం పాపం చేశాను" అంటా వచ్చి కింద పడుకోనున్న నా మీద పడింది కాలు జారి పడినట్లు యాక్షన్ చేస్తా. పడితే పడింది లేచిద్దనుకుని పక్కకు పొర్లాను. పొర్లినవాడిని దానివేపుకి తిప్పుకోని నన్ను వాటేసుకుంది. పిట పిటలాడుతుంది దాని ఒళ్ళు. తాగినదానికంటే కైపెక్కేసింది. "ఏమీ తెలియదే..... తాగడం మాత్రం తెలుసు వందలు వందలకి" అంటా నా రెండు చేతులనీ మీదేసుకుంది.

అది సారాయి గూడా అమ్మేది. దాని రుచి, సారాయి రుచీ మరిపింది. సారాయి తాగితే నా ముందు ఎవరూ ఆగలేరు. ఆ సమయంలో నేనే రాజుని. చక్రవర్తిని. నాకు ఏనుగుల బలం వస్తుంది అది తాగితే. మీకా అనుభవం కావాలంటే దాని చేత్తో తాగి చూడండి.

ఇప్పుడిట్లా ఉదారంగా అంటున్నాగాని అప్పుడు చలపతి గాడు దాన్ని చూశాడనీ......

అక్కడ కూడా ట్రాక్టర్ మీదే పనిచేసేవాడిని. ఆరోజు ట్రాఫిక్ ఇన్సె్పక్టరు లైసెన్స్ లేదని ట్రాక్టరు తీసుకుపోయాడు. వస్తా వస్తానే టౌన్లో తాగా. రాజి దగ్గరకి పోవాలినిపించి దానింటికెళ్ళేప్పటికి చలపతి గాడితో సరసాలాడతంది. నాతో ఉండింది నాతోనే ఉండాలి గాని నాతో ఉంటా వాడిని మరిగిద్దా..... నా రక్తం సలసలా మరిగింది. పొయ్యి మీదున్న నూనె బాండీ ఎత్తి పోశా. వాడు తప్పించుకున్నాడు. మొత్తం నూనెంతా దాని మీద పడింది.

తాగిన మత్తులో పోశాను గాని అదేసిన కేకకి మత్తు దిగిపోయింది. దాని బాధ చూసి విలవిలలాడిపోయాను. నేనే హాస్పిటల్ కి తీసుకుపోయా..... ఆరతా ఉండిన నూనె కాబట్టి బతికిపోయింది.

పోలీసులు నన్ను కొట్టే కొట్టుడు చూడలేక మా నాయన వాళ్ళకి దండిగా లంచాలిచ్చి ఇంటికి తీసుకొచ్చాడు. “ఊళ్ళో లేకుండా పంపించు నాయాల్ని మళ్ళీ కనిపించాడంటే ప్రాణం తీస్తాం" అన్నారు.

5.

మా అమ్మమ్మోళ్ళూరిది. మా నాయన ఇక్కడికి తీసుకొచ్చేప్పుడు "ఒరేయ్ సూరీ, తాగుడు నీ ఒంటికి పడదురా! తాగితే తగాదాలు, కొట్టుకోవడాలు బూతులూ ఏందిరా? మేమూ తాగుతున్నాం ఈ గొడవలున్నాయా? తాగినోడివి మెదలకుండా వచ్చి పడుకోవాల గాని ఇట్లా చేస్తే ఎట్లారా? మీ రెండో మామ కూతురునిస్తాడంట. పెండ్లి చేసుకోని సుఖంగా ఉండు" అన్నాడు ఏడుస్తా.

'సరే'నన్నాను. పెండ్లి చేశాడు మా ఊళ్ళో జరిగిన సంగతులు ఇక్కడెవరికీ తెలియకముందే.

పెళ్ళయిన కొత్తల్లో నా పెళ్ళాం తాగొద్దని బ్రతిమాలేది. అది చెప్పినంత సేపూ సరేలే అంటాగాని మళ్ళీ మామూలే....

ఎట్లా కుదిరిద్దసలు? మా నాన్న తాగుబోతు, మా తాత, మా చిన్నాన్నలు, ఆఖరికి నాకు పిల్లనిచ్చిన మా మామ అందరూ తాగుబోతులే. పదిహేనేళ్ళకే నాకు అలవాటయింది. అడిగినోళ్ళు లేరు. నాయన జేబులోంచి డబ్బులు దొంగతనం చేసి తాగేవాడిని, అమ్మని వేధించి డబ్బులు తీసుకుపోయి తాగేవాడిని. అవన్నీ కుదరకపోయేప్పటికి పది పరీక్షలు కూడా రాయకుండా స్కూలు మానేసి పనికి చేరి డబ్బులు సంపాదించుకుని దర్జాగా అందరి ముందే తాగేవాడిని. అసలు ఆ మందులో వచ్చే హుషారు ముఖ్యంగా సారాయిలోని మజా దీనికేం తెలుసు?

అబ్బ! తల్చుకుంటుంటే శీనుగాడి కొట్టుకి వెళ్ళాలనిపిస్తోంది.

ఎవ్వరూ మందివ్వద్దండీ సూరికి...... అసలు మందు ఎవరెవరు అమ్ముతున్నారో చూసి చెప్పండి పోలీసులకి కంప్లయింట్ చేద్దాం" అంది సుధక్క చాలా కోపంగా - నా పెళ్ళాం వెళ్ళిపోయిన రోజు.

సుధక్కకి ఇంత కోపం రావడం ఇంతకు ముందు ఎవ్వరూ చూడలేదంట... "నిన్ను చూస్తంటే అసహ్యం వేస్తందిరా.... ఆమెకి అంత కోపం తెప్పిచ్చినోడివి ఇక నువ్వేం బాగుపడతావు? మొగుడూ పెళ్ళాలకిద్దరికీ నెలకి పదిహేను వేలు దాకా వస్తాయి. ఇన్నేళ్ళ సర్వీసుంది, చదువుంది నాకే లేదు అంత ఆదాయం. ఆ సుధక్క దగ్గరే ఖర్చులకి పోను మిగిలింది దాచుకోని ఇల్లుకట్టుకోని ఎంత బాగుండొచ్చు? తాగుబోతు వెధవా వెధవాని..... ఇప్పుడైనా వెళ్ళి మీ మామకి, ఆ సుధక్కకి మాటివ్వు ఇక తాగనని” స్కూలు మాష్టారు నారాయణయ్య ఏం తిట్టాడో మొన్న. ఆయన మాటలన్నా విన్నానా? వింటే ఇదిగో ఈ చలిలో తడుస్తా ఉండాల్సిన ఖర్మ పట్టేది కాదు. పదోతరగతి మానేసినప్పుడు శివయ్య పంతులు గూడా ఇట్లాగే బాధ పడ్డాడు. "నువ్వు చాలా గొప్పోడివి అవుతావురా..... నా మాటినురా..... తెలుగు నువ్వు రాసినట్లు మన బడిలో ఒక్కరు రాయలేరు" అన్నాడు. ఆయన మాట వినుంటే పేపర్లో 'రాసే ఉద్యోగం' పట్టి ఉండేవాడిని.

కన్నీళ్ళు కారిపోతన్నాయేంది ఎప్పుడూ లేంది...... !

7.

జుట్లు జుట్లు పట్టుకోని అరుచుకున్నాక ఇంట్లోకి పోయి మళ్ళీ జరిగినదంతా తల్చుకోని తల్చుకోని వరస పెట్టి తిడుతున్నట్లు ఈదురు గాలి తగ్గి వర్షం ఒకే ధారగా కురుస్తోంది. కాస్త కునుకు తీద్దామంటే నాలుక లాగేస్తంది. ఒక్క గ్లాసన్నా పడితే గాని నిద్ర పట్టదు.

అయినా ఈ సుధక్కకెందుకు మా సంగతులు? నా పెళ్ళానికి వయసు వచ్చినప్పటినుండీ సుధక్కింట్లోనే పని చేస్తందంట. దండిగా ఉన్నోళ్ళు. పైగా ఎమ్మార్వో ఉద్యోగం సుధక్కకి. నేను సంపాదించే దానికి డబల్ జీతం ఇస్తుంది దానికి. అంతా బాగానే ఉంది గాని నేను తాగితే ఈమెకెందుకు? అప్పటికీ ఒకసారి ఆమెంటి మీదకి పోయి అడిగా....

ఏం కోపం తెచ్చుకోకుండా “ఎందుకేంటి సూరీ! నేను కా్యంపుకెళ్ళినపుడు నువ్వు తాగొచ్చి గడ్డపార తీసుకోని ఆ పిల్ల తల పగలగొట్టావు. అంతకు ముందు పడేసి కొడుతుంటే అడ్డమొచ్చాడని మీ బావమరిది చెయ్యి విరగ్గొట్టావు. మొన్నటికి మొన్న దాని గొంతుని గాట్లు పడేట్లు పిసికావు.

మాకెంత ఇబ్బందయేది ఆ పిల్ల చచ్చిపోయుంటే. ఆ భయం మా అత్తగారికి ఇంత వరకూ తగ్గలేదు. అయినా మా సంగతి వదిలెయ్...... లక్ష్మి చచ్చి నిన్ను పోలీసులు పట్టుకెళ్తే నీ బిడ్డ అనాధవడూ!!?” అంది.

ఎప్పుడైనా వాళ్ళింటికి పోతే “అసలు ఈ కంపెట్లా భరిస్తున్నావబ్బాయ్? విప్పు ఆ చొక్కా దరిద్రం" అని వాళ్ళాయనదో, వాళ్ళ మామదో ఏదో ఒక చొక్కా ఇస్తుంది. “అమ్మాయ్ లక్ష్మీ! నీ మొగుడికి ఇడ్లీ తెచ్చి పెట్టు..... కడుపు చూడు తిండి తినకుండా తాగి తాగి ఎట్లా లోపలకి పీక్కుపోయిందో" అని నా పెళ్ళాం చేతే టిఫిను పెట్టిస్తుంది.

పెట్టి తిట్టే మనిషిని ఏమంటాం? ఆ అక్క నా మంచి కోసమే అంత మధన పడతా చెప్తుంటే నాకు తాగొద్దనే అనిపిస్తుంది. అక్కతో మాట్లాడిన రోజు కష్టపడి ఎట్టానో తాగకుండా ఉండగలుగుతా కాని తర్వాత రోజుకి ఇక దేవుడొచ్చినా ఆపుకోలేను తాగకుండా....

"నువ్వు తాగటం మానలేవు. తాగితే తాగావులే కదలకుండా పడుకో... గోల చెయ్యొద్దు ఆ పిల్లని కొట్టొద్దు" అని కూడా చెప్తుంది ఈ మధ్య. నేను మానలేనని తెలుసుకుంది ఎట్లయినా చదువుకున్నోళ్ళు కదా......

తాగుడే కాదుగా నా బాధ..... ఇంకోటి కూడా ఉంది. సుధక్కకి ఎట్లా చెప్పేది? ఇది కూడా ఆ రాజి లాగా ఎవడితోనైనా తిరిగిద్దేమోనని నా అనుమానం. అంట్లు తోముకునే దానికి ఆ సోకులెందుకు? అద్దంలో ఏం తిప్పుకుంటా చూసుకుంటదో! రోజూ పొద్దున్నా, సాయంత్రం స్నానం చేస్తుంది. అదేమంటే 'శుభ్రంగా ఉండకపోతే సుధక్క ఊరుకోదు' అంటది. ఇది బతుకుతుందే సుధక్క కోసం గామాల.... అట్లా కొట్టిచ్చుకుంటదా పొద్దున్నే టింగురంగా అంటా సోకులు చేసుకుని పోతుంది. ఈ మధ్య అద్దం ముందు నిలబడి పాటలు పాడటం కూడా నేర్చుకుంది.
'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' అంటా పాడతంది. మండిపోయి చూరులో ఉన్న గడ్డపార తీసేశా నెత్తి మీద. అంబులెన్స్ వచ్చి దాన్ని హాస్పిటల్ కి తీసుకోని పోయింది. పేపర్లో వార్త వేశారు. పోలీసోళ్ళకి దొరక్కుండా పారిపోదామనుకుంటే మా మామ, చిన్న మామాలూ, వాళ్ళ పెళ్ళాం పిల్లలతో సహా అందరూ కలిసి నన్ను కొట్టి చెట్టుకి కట్టేశారు.

సుధక్కే ఫోన్ చేసింది "వదిలేయండి వాడు తాగితేనే చెడ్డవాడు.... వాడే మారతాడు" అని అందరికీ నచ్చ చెప్పింది.

అప్పుడు అక్క మంచితానానికి ఆమె చెప్పినట్లు మంచిగా మారాలనుకున్నా. అప్పుడే నా అంతట నేనే వెళ్ళి "డాక్టర్ దగ్గరకి తీసికెళ్ళక్కా" అంటే తీసికెళ్ళింది. అయినా లాభం లేదు. ఈ మందు కోసం నాలుక పీక్కుపోతుంటే ఆ మందులేం పని చేస్తాయి? మళ్ళీ మామూలే.....

8.

'వర్షం తగ్గింది.... వెళ్ళొస్తా శీనుగాడి దగ్గరకి.... ఏమంటాడో? మందు ఇస్తాడో లేదో చూద్దాం' లేచి బొంత కప్పుకోని బయల్దేరాను.

ఊరంతా నిద్రపోతోంది. వర్షం నీళ్ళు కాళ్ళ కిందుగా పారిపోతున్నాయి. కప్పలు బెకబెకమంటూ ఒకటే రొద పెడుతున్నాయి. మధ్యాహ్నం తాగింది దిగిపోయినా కాళ్ళు తడపడుతున్నాయి, చలిని తగలెయ్య.....

ఇది పోయి నాలుగురోజులవలా? పెద్దమామింటికి పోయిందంట. పెద్దమామ టౌన్లో కోర్టులో గుమాస్తా. ఆ మామ వాళ్ళింటికి పోతే...? పోలీసులని పిలవనంపి పట్టిచ్చడం ఖాయం. దీన్నక్కడికి మా మామే పంపి ఉంటాడు. అడిగితే తెలియనట్లు యాక్షన్ చేస్తన్నాడు.

డాక్టర్ దగ్గరకి వెళ్ళి వచ్చాక రెండు నెలలు బాగానే ఉన్నా.

ఆరోజు పొయ్యిలోకి కట్టెలు తెస్తానని పోయింది కట్టెలేరుకోని తొందరగా రావాల గదా! ఎంత సేపటికీ రాకపోతే గుట్టకి పోయా పిల్చకొద్దామని..... ఆ పరమేశ్వర గాడితో ఇకఇకలు పోతా వాడి అడుగులో అడుగేస్తా వస్తంది. మోపుని నెట్టేసి మోపులోని కొడవలిని లాగా..... ఇద్దరినీ ఏసేసి ఉండే వాణ్ణే..... మోపులు అక్కడ పారేసి కేకలు పెడతా లగెత్తారు.

నేనిక్కడుంటే చంపేస్తాడక్కో.... నేను వాడి ముఖం చూడను. వాడు నాకొద్దు. గడ్డపార తీసుకోని తల పగలకొట్టినప్పుడే జైలుకి పంపియ్యనియ్యకుండా చేశావు" అందంట సుధక్కతో. కొడుకుని తీసుకోని పోయింది.

సుధక్క నన్ను పిలిపిస్తుందనుకున్నా.... పిలవనంపలేదు. నేను కావాలని కనపడినా ఏమీ మాట్లాడలేదు. నిప్పుకణిక మండేటప్పుడు నివురేసినట్లు మెదలకుండా ఉంది. పనికి వేరే మనిషిని పెట్టుకుంది.

9.

శీనా! ఓ రెండు గ్లాసులు ఇవ్వు, రేపు డబ్బులు రాగానే ఇచ్చేస్తా" కిటికీలోంచి కేకేసి అడిగా....

హుష్ అరవగాక... నీకివ్వడానికేమి? డబ్బులు పువ్వుల్లో పెట్టిస్తావు.... ఆ సుధక్కకి తెలిసిద్దనే భయం - ఇదిగో.... తొందరగా పో ఇక్కడి నుంచి" అంటా బాటిల్ ఇచ్చాడు.

తెలియదులే ఇవ్వు" లాక్కున్నట్లుగా తీసుకున్నాను.

ఒక్కో గుక్కా తాగుతా మళ్ళీ బడిలోకి వచ్చాను. హాయిగా ఉంది. వర్షం పూర్తిగా తగ్గింది. చల్లని గాలి పారిపోయి ఒళ్ళు వెచ్చపడుతోంది. మత్తు తలకెక్కి అక్కడే పడిపోయాను. కరెంటు వస్తాపోతా ఉంది. ఇప్పుడు నా పెళ్ళాం పొందుంటే స్వర్గం అందేది గదా! దాన్ని ఎట్లయినా రప్పించాల..... ఎట్లా ఇంటికి రప్పించేది!?

ఆఁ ఒకటే మార్గం. కరెంటు స్తంభం ఎక్కి బెదిరిస్తే...? సుధక్కని పిల్చకొస్తారు జనం. అప్పుడా అక్కే నా పెళ్ళాన్ని పిలిపిస్తుంది. అంతే..... వచ్చాక నరికేద్దామా? వద్దులే బెదిరిద్దాం. అది లేకపోతే ఎట్లా....
లేచాను. ఒళ్లు తూలిపోతోంది. బడి వెనకున్న ట్రాన్స్ ఫార్మరున్న స్తంభం పైకి ఎక్కాను. పెద్దగా అరిచా.... “ఓ అన్నో, గోపాలన్నో, మామో, చిన్నమామో, శీనో, మంగమ్మత్తో..... సుధక్కని పిలవండి. నేను చచ్చిపోతున్నానని చెప్పండి” అరుస్తున్నాను.

ఒక్కళ్ళు బయటికి రాలా.... లాభం లేదు.... అందర్నీ లేపి వాళ్ళు చూస్తుండగా ఎక్కాలనుకుని దిగబోయాను. అప్పుడు జరిగింది అది. పోయిన కరెంటు వచ్చినట్లుంది. ఒక్కసారిగా నా ఒళ్ళు అంతెత్తున ఎగిరింది. అంతెత్తునుండి కిందికి పడేటప్పుడు కూడా అనుకున్నాను నాకేం కాదని. కింద పడీ పడగానే నా ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.

పొద్దున తూలతా బయటికని వచ్చిన గోపాలన్న నన్ను ముందు చూశాడు. నన్ను చూడగానే వాడికి రాత్రి తాగిన మత్తు దెబ్బకి దిగిపోయింది. పెద్దగా కేకలు పెట్టి అందరినీ పిలిచాడు. జనం అంతా వచ్చారు. మామలు, చిన్నాన్నలు, అత్తలు, చిన్నమ్మలు చూస్తా నిలబడ్డారు గాని ఒక్కరన్నా నన్ను చూసి 'పాపం' అనలేదు. పైగా 'చస్తే చచ్చాడు దేశానికి నష్టమేమీ లేదు' అని ఒకరంటే 'దాని బతుకు అది హాయిగా బతుకుతుందని' ఇంకొకరు అంటున్నారు.

నా పెళ్ళాన్ని, కొడుకునీ చూడాలనిపిస్తోంది. పాపం అది ఎంత మంచిది? నన్ను మార్చుకోవాలని నేనెంత ఏడిపిచ్చినా ఓర్చుకునేది.

నా ఆత్మ ఏడుస్తోంది. నా గురించి ఒక్క మంచి మాట వినాలని తపన పడతా అక్కడక్కడే తిరుగుతోంది.

సుధక్క వచ్చింది పరుగు పరుగున. నన్ను చూస్తూ “నేనారోజు పోలీసులకి పట్టిచ్చినా బ్రతికి ఉండేవాడివేమో సూరీ!” నుదురు మీద కొట్టుకుంటూ "తప్పు చేశాను" అంది. కళ్ళ నిండా నీళ్ళు నింపుకుని అంటున్న ఆమెని చూసి అక్కడున్న వాళ్ళు "నువ్వేం చేశావక్కా! ఊరుకో" అంటా సుధక్కని ఓదారుస్తున్నారు. దిగులుతో నా మనశ్శరీరాలు రెండూ కుంచించుకుపోసాగాయి.

అదిగో...... మా అత్త, ట్రాక్టర్ మామ వస్తున్నారు. పక్కన నా పెళ్ళాం. నా కొడుకు ట్రాక్టర్ మామ భుజాన నిద్ర పోతున్నాడు. నా శవాన్ని చూడగానే నా పెళ్ళాం ఏం చేస్తుంది?

దగ్గరకొస్తోంది.....

ఏడుస్తుందా? దరిద్రం వదిలిపోయిందని సంతోషిస్తుందా?

పూర్తిగా దగ్గరకొచ్చేసింది.

నా కొడుకు సందడికి లేచి ఏడవసాగాడు. వాడి ముఖం చూసిన నాకు కళ్ళమ్మట నీళ్ళు కారిపోసాగాయి. "నన్ను క్షమించండి" అని ముందుగా నేనే అందరితోనూ అనాలనుకున్నాను. ముఖ్యంగా నా పెళ్ళాంతో అనబోయేంతలో నా ఆత్మ ప్రకృతిలో కలిసిపోయింది.


*****

2 comments:

P