Wednesday, February 11, 2015

మౌన గీతం (రైటర్స్ డైరీ - 2)

- రాధ మండువ

ఏంటో తెలియడం లేదు కాని అన్ని సంబంధాల్లోనూ స్తబ్దాత్మకమైన మార్పు - కూలిపోతూ, కదలి జారిపోతున్న ఫీలింగ్. మెదడూ, తలా, శరీరం, సత్తా - అన్నీ నిస్త్రాణలో నానుతున్నట్టుగా..... కాదు కాదు 'నేను' నానుతోంది.... జారుకుంటుంది.... చుట్టూ ఉన్న ప్రపంచం నుంచి...

వెనక్కి ఈదుతున్నాను కాలం లోకి... యవ్వనం, బాల్యం... పులుపూ తీపి వగరూ మైమరచి కలవరిస్తూ ఇంకా ఇంకా అడుగడుక్కి. ఏదో శక్తి నరనరాన్నీ తీగలాగించి అణువణువునూ కూర్చి లోపలి దాన్ని దేన్నో బయటికి లాక్కువస్తోంది. దాన్ని చప్పున రెండు చేతులతో ఒడిసి పట్టుకొని అడిగాను........

***

“ఎవరు నువ్వు? ఎవరు నువ్వు" అరుస్తున్నాను గట్టిగా...

“నీకు తెలీదా?”

“తెలుసనే అనుకున్నాను ఇన్నాళ్ళూ... నాలోకి నిన్ను రానీయకూడదనే అనుకున్నాను. నాకు నువ్వు నిజంగా తెలిసినట్లయితే రానిచ్చేదాన్ని కాదు కదా! తెలియకే చురుగ్గా తప్పించుకుని తిరుగుతున్న నిన్ను పట్టుకోలేకపోయాను. నాకేం కావాలో నాకే తెలియని స్థితిలోకి తోయబడ్డాను. జీవనపథంలో గాయాలను ఏర్పరచుకున్నాను. నీ వల్ల ఈనాడు ఆ గాయాల మచ్చలు తప్ప నాకింకేమీ మిగలలేదు"

“ఎంత పొరపాటుగా మాట్లాడుతున్నావు? ఎక్కడో అడుగున నివసిస్తున్న నన్ను పైకి తెచ్చుకున్నది నువ్వే. నేను అనుక్షణమూ అణిగి మణిగే ఉన్నాను. నీకెంత సేపటికీ ఏదో సాధించాలని ఆరాటం, విపరీతమైన కాంక్ష.... రోజులు గడిచేకొద్దీ మరింత మెటీరియలిస్టిక్ గా మారావు, ప్రేమ పట్ల, ఆఖరికి స్నేహం పట్ల కూడా నీకెప్పుడూ అనుమానమే”

"లేదు. నాలో ఉన్నది నా పట్ల ఆత్మవిశ్వాసం . నన్ను నువ్వు మెటీరియలిస్టిక్ అంటే నేనేమీ చెప్పలేను"

"నాకూ దానికీ ఉన్న సన్నని గీతని గుర్తించలేక నాకే ఆత్మవిశ్వాసమనీ, ఆత్మగౌరవమనీ పేర్లు పెట్టుకుని అందలమెక్కించావు. అందుకే నువ్వెప్పుడూ లేమిలోనే ఉంటావు.

"నీకు తెలిసే మాట్లాడుతున్నావా? ఏమనుకుంటున్నావు నన్ను నువ్వు. నా జీవితం పరిపూర్ణంగా ఉంది. నాకే లోటూ లేదు"

“నిజమే చిల్లులున్న పాత్రలో నీళ్ళు పోస్తూ నిండుగా ఉందనుకుంటున్నావు. అది ఎప్పటికీ నిండదు. అంతా లోటే"

“నా నిరంతర ప్రయత్నంతో నేను నాకు కావలసినట్లుగా ఎదిగాను. నాకేమీ అక్కర్లేదు. నేను ఎవరి నుండీ ఏమీ ఆశించడం లేదు. నేను సంతోషంగా ఉన్నాను. నిండుగా ఉంది నా జీవితం"

అవును. నువ్వు కావాలని అడగవు కాని చాపిన నీ చేతిలో బిక్షాపాత్ర ఉంది. దానిపైన గుడ్డ కప్పి పెట్టావు. నీకు కావలసిన అనురాగాన్ని, ఆప్యాయతని అందిస్తున్నా అందుకోకుండా నిండుగా ఉన్నానని భ్రమ పడుతున్నావు"

“ఏ ఆధారంతో అనగలుగుతున్నావీ మాటలు?”

"నీలో ఉండే నాకు ఆధారాలతో పనేల? నీకు నువ్వు తెలుసుకోలేవా? నేను నీలో ఉండటం వలనే నీకెవరూ 'దగ్గర కారు' అన్న విషయం చెప్పకపోతే అది నా తప్పు అవుతుంది కదా! అందుకే చెప్తున్నాను - నువ్వెప్పుడూ ఒంటరివే"

“ఆఁ"

"నువ్వు స్త్రీవి. చాలా మంచిదానివి. కాని నువ్వు సహజ స్త్రీత్వంలో ఉండే ప్రేమని నిర్లక్ష్యం చేస్తున్నావు . నీపై పేరుకుపోయిన మంచు గడ్డలను విదిలించుకో. నీలోని పచ్చదనాన్ని పదిమందికీ పంచు. అప్పుడు ప్రేమించడం లోని మాధుర్యాన్ని తెలుసుకుంటావు. అందరిలో గొప్పగా ఉండటం గురించే ఆలోచిస్తావు తప్ప వాళ్ళ నుండి ఆప్యాయతానురాగాలని పొందాలని నువ్వు అనుకోవు. అసలు నీక్కావల్సింది అవే అయినా అక్కర్లేదనుకుంటావు. అందుకే నువ్వెన్ని సాధించినా నీలో జీవం ఉండదు. నీ పాత్ర సమృద్ధవంతంగా నిండుతనాన్ని సంతరించుకోదు. నువ్వంటున్న ఆ జీవం లేని నిరంతర ప్రయత్నం నీ జీవితాన్ని సఫలీకృతం చేయలేదు"

“ఇప్పుడు నేనేం చేయాలి?”

“ఏమీ చేయొద్దు. నీలో పడిన 'నన్ను ప్రశ్నించాలనే' బీజాన్ని అంకురించనీ"

***

శరీరం మీద జ్వరం కురిసి వెలిసింది. అంతా కొత్తగా చురుగ్గా ఉంది.

******

No comments:

Post a Comment

P