Friday, February 20, 2015

అల్లదీ, అవతల

జంధ్యాల గారు తీసిన 'బాబాయ్ అబ్బాయ్' సినిమాకి మాతృక 'వద్దంటే డబ్బు' అని చాలా మందికి తెలిసే ఉంటుంది. 'వద్దంటే డబ్బు' చాలా మంచి సినిమా అయినా కూడా కాలగర్భంలోనే (యు ట్యూబ్) ఉండిపోయిందనిపిస్తుంది. ఈ సినిమాకి సంగీతం టి ఎ కళ్యాణం. అన్ని పాటలూ జనరల్ గా బాగానే ఉన్నా బాగా గుర్తుండిపోయే పాట మాత్రం "అల్లది, అవతల, అదిగో నా ప్రియ కుటీర వాటిక" ఈ మాటలని విడిగా అనుకున్నా, చదివినా ఎబ్బెట్టుగా తోచి ముందే సిద్ధపరచిన ట్యూన్ కి అర్థం పర్థం లేకుండా కిట్టించేసినవి అయి ఉంటాయనీ, డబ్బింగ్ పాట స్థాయిలో ఉంటుందనీ అనిపిస్తుంది. కాని ఈ మాటలని ట్యూన్ లో విన్నప్పుడు "కిట్టించారన్న" మాట మరుపుకు వస్తుంది. ముఖ్యంగా జిక్కీ కంఠం లోని ఆ "మలుపులు" వింటుంటే పాటలోని సాహితీ విలువల లేమి మనసుకి పట్టదు. రైము కాని రీజను కాని పెద్దగా లేని ఈ పాట కేవలం ట్యూను వల్ల, గాయకురాలి ప్రతిభ వల్ల రాణించింది.

'బాబాయ్ అబ్బాయ్' సినిమాకి 'వద్దంటే డబ్బు' సినిమా కథ యొక్క మూలమైన పాయింటుని తీసుకుని జంధ్యాల తనదైన శైలిలో సన్నివేశాలను అల్లుకుని ఉంటారు అనుకుంటాం. అయితే సుత్తి వీరభద్రరావు పైపులు ఎక్కడం, హీరో - హీరోయిన్ కి(బాలకృష్ణ, అనిత) కాఫీ కలిపి ఇచ్చే కామెడీ సన్నివేశం లాంటివి కూడా 'వద్దంటే డబ్బు' నుంచి దాదాపుగా అలానే తీసుకుని జంధ్యాల వాడుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

ఎన్ టి ఆర్, షావుకారు జానకి లు 'కాఫీ కామెడీ' సన్నివేశంలో చాలా సహజంగా నటించి సన్నివేశాన్ని అద్భుతంగా రక్తి కట్టించారు. ముఖ్యంగా ఈ సన్నివేశంలో అత్యంత సహజంగా నవ్వుతూ షావుకారు జానకి చూపిన నటనా కౌశలం - 'కన్యాశుల్కం' లో సరసంగా సుదీర్ఘంగా నవ్విన సావిత్రి ప్రతిభకూ, 'చలిచీమలు' లో నూతనప్రసాద్ టెలిఫోన్ లో మాట్లాడే సుదీర్ఘ సన్నివేశంలో అతని ప్రక్కన అతి సున్నిత శృంగార భావప్రకటన చేస్తూ ముగ్ధంగా ముసిముసిగా నవ్విన నటి (పేరు తెలియదు) ప్రతిభకూ ఏ మాత్రమూ తీసిపోదనిపిస్తుంది. పాట వినండి ఫ్రెండ్స్...

-రాధ రాజశేఖర్

https://www.youtube.com/watch?v=gCe3KtXYoB8 

No comments:

Post a Comment

P