Friday, February 20, 2015

మన దేశం

చక్కటి సంస్కృత పదాలతో మన దేశం గురించి రాసిన పాటలలో చాలా మంది తెలుగు వారికి తెలిసిన పాట "జయ జయ జయ ప్రియభారత జనయిత్రీ దివ్యధాత్రి" అనేది (దేవులపల్లి వారి రచన). ఇలా సంస్కృత పదాలతో మన దేశాన్ని నుతిస్తూ రాసిన మరో చక్కటి పాట "జయ జననీ పరమపావనీ" - ఇది "మనదేశం" అనే సినిమాలోని బృంద గానం.

ఈ సినిమా సీనియర్ ఎన్ టి ఆర్ నటించిన తొలి సినిమా అని చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ పాట సినిమా మొదట్లో టైటిల్స్ పడేటప్పుడు వస్తుంది. నేపధ్య సంగీతంతో సహా సినిమా మొత్తానికి సంగీత దర్శకత్వం వహించిన తొలి సినిమా ఘంటసాల గారికి ఇదే. ఈ పాట పొడుగూతా నేపధ్యంలో వినపడే ఒక తాళ వాయిద్యం యొక్క శబ్దం (జలతరంగిణి శబ్దాన్ని పోలి ఉన్నది) చాలా బాగుంటుంది. పల్లవి రావడానికి ముందు ఘంటసాల వినిపించిన ఒక మ్యూజిక్ బిట్ విన్నప్పుడు తర్వాతెప్పుడో ప్రసిద్ధమైన "పడవ సాగిపోతోంది" అనే లలిత గీతం గుర్తొస్తుంది. ఈ చిత్రంలో ఘంటసాలకి సంగీత సహాయకుడు అవధానం కృష్ణమూర్తి (విజయా కృష్ణమూర్తి).

పాటలో తాళపు దెబ్బ తరవాత ఎత్తుకునే పంక్తులు వినడానికి చాలా బావుంటాయి. కేవలం నాలుగు పొట్టి పంక్తులే రెండు చరణాల్లోనూ ఉన్నా అద్భుతమైన ట్యూను, ఆర్కెస్ట్రేషన్ వల్ల మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది.

ఈ సినిమాలోని పాటలన్నీ రాసింది సీనియర్ సముద్రాల గారే. హీరోయిన్ కృష్ణవేణి తన పాటలు తనే పాడుకున్నారు. ఆమె గొంతులో కొంచెం ఎస్ వరలక్ష్మి కంఠపు tinge వినపడుతుంది. సినిమాలో ఉన్న అద్భుతమైన డ్యూయట్ (యు ట్యూబ్ లో 42:42 దగ్గర వస్తుంది) "ఏమిటో సంబంధం ఎందుకో ఈ అనుబంధం" అనేది. ఈ పాటని కృష్ణవేణి, ఎం ఎస్ రామారావు పాడారు. దీనిలో కూడా ఈ పాట పర్యంతమూ వెనక చిడతల్లా వినిపించే ఒక తాళ వాయిద్యం ముచ్చటగా ఉంటుంది. పాట మధ్యలో కృష్ణవేణి ఒకచోట పాడటం ఆపి వేసి "అదే" అంటుంది. పాట ఆగినా తాళ వాయిద్యం ఆగకుండా వినిపించడం లో ఘంటసాల ప్రతిభ ద్యోతకమవుతుంది. ఈ పాట పిక్చరైజేషన్ లో మరో విశేషం ఉంది - పాట మొదలవడానికి ముందు హీరో (నారాయణరావు) తన గది తలుపు తట్టినట్లు, పిలిచినట్లు హీరోయిన్ భ్రమ పడుతుంది. నేను పిలవలేదు నువ్వు కలగన్నావేమోనని హీరో ఆమెతో అన్న తర్వాత ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత చల్లగా, మెల్లగా ఒక హమ్మింగ్ తో పాట ప్రారంభమవుతుంది. పాటంతా అయ్యాక ఇది కలగానైనా లేదా నిజంగానైనా ప్రేక్షకుడు ఊహించుకునేలా ఈ పాట చిత్రీకరించబడింది. అయితే పాట అయిన తర్వాత ఇంట్లో ఉన్న పెద్దావిడ వచ్చి తొంగి చూసే షాట్ లేకపోయినట్లైతే పాటంతా హీరోహీరోయిన్ ల మనసుల్లో ఊహింపబడిందా లేక నిజంగా పాడుకున్నదా అనే విషయం ప్రేక్షకుల ఊహకు వదిలివేసినట్లుగా ఉండేది.

టైటిల్స్ అయిపోయిన వెంటనే ఘంటసాల తన 'లేత ఖంగు' కంఠంతో భారత స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రని క్లుప్తంగా చెప్పారు. ఇంకా సినిమాలో ఒక సీన్ లో వినపడే రేడియో అనౌన్సర్ కంఠం బహుశా ఘంటసాలదే. సినిమాలో నాగయ్య గారిది నిడివి ఉన్న పాత్ర. ఆయన డైలాగులు ఆయనే చెప్పుకున్నా ఒక్క సన్నివేశంలో ఒక డైలాగ్ కి మాత్రం ఘంటసాల తన గొంతు అరువిచ్చినట్లుగా అనిపిస్తుంది. (యు ట్యూబ్ లో 1:32:04 దగ్గర) తల్లి ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నప్పుడు నాగయ్య చెప్పే డైలాగ్ - "నన్ను కూడా తల్లి లేని వాడి్న చేస్తావా అమ్మా!" అనేది ఘంటసాల గొంతులా వినపడుతుంది. ఏదో టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఈ సీనులో ఈ ఒక్క డైలాగు ఘంటసాల డబ్ చేశారేమో!?

ఒక హాస్య సన్నివేశంలో వంగర గారు చెప్పే ఆంజనేయ దండకంలో "నీ నీటు నీ గోటు" అనిపించారు సముద్రాల సీనియర్. తిట్ల లాగా వినపడినా ఈ రెండు మాటలకి మంచి అర్థాలే ఉన్నాయి. వినండి ఫ్రెండ్స్..

- రాధ రాజశేఖర్
https://www.youtube.com/watch?v=rawe3gb7f94

No comments:

Post a Comment

P