Sunday, March 22, 2015

సర్దుకోవాలి


- రాధ మండువ

జీవన సౌందర్యాన్ని
తనివి తీరా ఆస్వాదించి
ఆపాదించుకుని 
అది చూసుకుని
మురిసిపోకూడదని తెలుసుకొని
నిశ్చల ధ్యానంతో
ఇంకాసేపట్లో రాలిపోతానన్న
స్పృహతో
పయనమవాలి


సిద్ధాంత రాద్ధాంతాలనన్నింటినీ 
రద్దు చేసేసి
నిశ్శబ్దగాన తరంగిణిలో
నాట్యమాడుతూ
అంతరంగ కుదుళ్ళలో
ప్రేమ శక్తిని ప్రవహింపచేస్తూ
చివరి వీడ్కోలుకి
రంగులద్దుకోవాలి

అపరితమైన ఆనందంతో
ఉత్పన్నమవుతున్న సుగంధ పరిమళాన్ని
దోసిళ్ళతో అందుకుని
ఆఘా్రణించాలి
లోపల్నుంచి ఉబికి వచ్చే
మానవతా ఏక సూత్ర ప్రశాంతతని
అనుభవించాలి
నావలో బరువు
రెండు వైపులా సమానంగా ఉందా
చూసుకోవాలి
తెడ్డుని తిప్పుతూ
ఏదో జరుగుతుందని జరగబోతుందని
మానసికరేవుల్లో తేలియాడే ఆలోచనని
ఆపుతూ సాగిపోవాలి

మృతి లేని నిశ్శబ్దపు
ఆవలి తీరాన్ని చేరాలి
అక్కడికి చేరాక
తెలియని తీరులో ఉన్న మనసు
తెలుసుకుంటుందా
అక్కడేమీ లేదని!
అంతా నేనేనని!!
*****

No comments:

Post a Comment

P