“వచ్చే వారం
అంతా కాలేజీకి రాను శిరీషా!”
అన్నాను కాలేజీ
నుండి బస్టాండ్ కి వచ్చేటప్పుడు.
“తెలుసులే.
మీ అక్క పెళ్ళి
కదా ఎలా వస్తావు?” అంది
శిరీష. పద్మిని,
శ్రావణి మా వెనగ్గా
నడుస్తున్నారు.
“మీ బావకి
ఫర్నిచర్ షాపుందంటగా సౌజన్యా,
భలే అందంగా కూడా
ఉంటాడంట, కానీ
కట్నం లేకుండా చేసుకుంటున్నాడంటగా
మా ఇంట్లో చెప్పుకుంటుంటే
విన్నా” అంది పద్మిని మా
వెనక నడస్తున్నదల్లా మా
దగ్గరకొచ్చి మా పక్కన నడుస్తూ.
“అవును.
కుమారత్త,
మా అమ్మ వెళ్ళి
చూసొచ్చారు. కుమారత్తే
కుదిర్చింది ఈ సంబంధం” అన్నాను.
“ఈ షాపులు
జరిగితే పర్వాలేదు కాని
లేకపోతే కష్టమట. అంతకు
ముందు చూసిన ఆ కండక్టర్ సంబంధం
అయితే బావుండేది అని మా అమ్మ
అంటోంది. మీ
అమ్మకి కూడా చెప్పిందంటగా”
అంది శ్రావణి. వాళ్ళు
మాకు బంధువులు.
“అవును కదా
సౌజీ, ఎందుకని
అది కుదరలేదు?” అంది
శిరీష
“వాళ్ళు చాలా
కట్నం అడిగారు శిరీ,
ఎక్కడ నుండి తేవాలి?”
అన్నాను.
అక్క,
నేను ఇద్దరం ఆడపిల్లలం.
నాన్నకి జబ్బు
చేసి చనిపోయినప్పటి నుండీ
ఇంటిని అమ్మే సంభాళించుకుంటుంది.
మా తాత తమ్ముడు
కూతురు కుమారత్తోళ్ళే మాకు
ఆ ఊళ్ళో అండ.
“అక్కకి పెళ్ళి
కుదిరాక అమ్మ ముఖం ఒక ప్రక్క
సంతోషంతో వెలిగిపోతుంది కాని
నాన్నని తల్చుకోని ఏడ్చుకుంటూనే
ఉంది శిరీ” అన్నాను.
“పోన్లే సౌజన్యా,
మీ అక్కకే పెళ్ళైతే
అన్నీ మీ బావే చూసుకుంటాడుగా,
మీకిక దిగులుండదు”
అంది శిరీష.
“మగదిక్కులేని
సంసారం. అల్లుడివైనా,
కొడుకువైనా నువ్వే
అని మా గురించి కుమారత్త
చెప్పిందంట మా బావకి” అన్నాను.
“అవును భలే
నెమ్మదస్తుడంట కాని గవర్నమెంట్
ఉద్యోగం అయితేనే హాయి” అంది
పద్మిని
నేనేమీ మాట్లాడలేదు.
'అలా మాట్లాడకూడదన్నట్లుగా'
పద్మిని వైపు చూస్తూ
కళ్ళు ఆర్పింది శిరీష.
మేము నలుగురం
కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం
చదువుతున్నాము. ఒకే
ఊరి వాళ్ళం. శిరీష
వాళ్ళది మా ప్రక్కిల్లే.
మేమిద్దరం బెస్ట్
ఫ్రెండ్స్ మి కూడా.
కాలేజీ అయ్యాక
బస్సు పట్టుకుని ఊరికొచ్చేప్పటికి
ఏడవువుతుంది. మళ్ళీ
ఉదయాన్నే ఎనిమిది కంతా మా
ఊర్లో బస్సు పట్టుకోని కాలేజీకి
రావాలి.
మేము మాట్లాడుకుంటూ
బస్టాండుకి వచ్చేప్పటికి
మా ఊరి బస్సు ఆగి ఉంది.
మాటలు ఆపి గబగబా
బస్సు ఎక్కాము.
ఇంటికొచ్చేప్పటికి
అత్తా, పెద్దమ్మ,
ఇంకా చాలా మంది
బంధువులు ఉన్నారు. పెళ్ళి
పనులతో అంతా హడావుడిగా ఉంది.
పెళ్ళికొడుకు
సాయంత్రమే వచ్చి కుమారత్త
ఇంట్లో విడిది దిగాడంట.
పుస్తకాలు ఇంట్లో
పడేసి పరిగెత్తాను బావని
చూద్దామని.
బావ చాలా
బాగున్నాడు. చూడగానే
మంచివాడనిపించింది.
మాట్లాడించాలని
అనుకున్నాను గాని పొద్దున్నే
పెళ్ళి అవడంతో ఏవేవో కార్యక్రమాలు
చేస్తున్నారు. పని
మీద వచ్చిన అమ్మ నన్ను అక్కడ
చూసి “సౌజీ, పద
ఇంటికి, త్వరగా
స్నానం చేసి మంచి బట్టలు
వేసుకో చుట్టాలకి భోజనాలు
వడ్డిద్దువుగాని” అంది.
***
పెళ్ళి మాకున్నంతలో
బాగానే జరిగింది. పెళ్ళయి
నెలయినా ఇల్లరికం తింటూ ఇక్కడే
ఉన్నాడు కాని అక్కని వాళ్ళూరికి
తీసుకెళతాననడం లేదు బావ.
పెళ్ళయిన తర్వాత
రోజే మా ఇంట్లో, ఆ
తర్వాత పది రోజులకి మా ఊళ్ళో
అందరికీ తెలిసిపోయింది...
బావకి ఫర్నిచర్
షాప్ ఉండటం కాదు కదా దాన్లో
ఉద్యోగం కూడా చేయడని.
అది అతని ఫ్రెండ్
షాప్ అయితే టైమ్ పాస్ కి ఊరికే
అక్కడకి వెళ్ళి కూర్చుని
ఉంటాడంట.
“వంద అబద్ధాలాడి
ఒక పెళ్ళి చేయమంటారు గాని
కుమారొదినా మరీ ఇంత మోసమా?”
అని అమ్మ ఏడ్వని
రోజు లేదు.
ఇంట్లో ఓ రకమైన
నిశ్శబ్దం. బావ
ఇల్లరికం ముచ్చట్లు,
ముదిగారాలూ క్రమంగా
తగ్గుముఖం పట్టాయి.
మాకున్న మూడెకరాల
పొలం పనే చేస్తున్నాడు.
కుమారత్త తెలిసిన
వాళ్ళ షాపులో బావని పనికి
పెట్టించింది కాని చేయలేక
నాలుగు రోజుల్లోనే మానేశాడు.
అమ్మ బావని
సూటిపోటి మాటలు అంటోంది.
'అవి వింటుంటే
చాలా బాధగా ఉంది కాని నేనేమనగలను?
నాకే ఇంత బాధగా
ఉంటే బావ ఎలా ఓర్చుకుంటున్నాడో
పాపం!' అనుకున్నాను.
అప్పటికీ 'ఊరుకోమ్మా'
అని అంటుంటాను.
నా మాటంటే ఆమెకేమైనా
లెక్కా ఏమన్నానా? ఉన్న
పొలంలో కూరలు పండుతాయి.
బర్రెలు పాలు
ఇస్తాయి. జరగుబాటుకి
ఏమీ బాధ లేదు. ఒక్క
మనిషి ఎక్కువయినందుకే ఇంత
సాధించాలా? అని
నాకు అమ్మ మీద విపరీతమైన కోపం
వస్తోంది.
అక్క ప్రెగ్నెంట్
అయ్యాక అమ్మ కాస్త సణుగుడు
ఆపి అక్కని జాగ్రత్తగా
చూసుకుంటుంది.
నాకు పరీక్షలయ్యాయి.
ఇంటర్ సెకండ్ ఇయర్
లో చేరాను. అక్కకి
బాబు పుట్టాడు. బాబు
పుట్టినప్పటి నుండీ అమ్మ
బావని మరీ సాధిస్తోంది.
బావ ఏదో తనకి
చేతనైనంత సహాయం చేస్తాడు
కాని ఇంటి బాధ్యతలు తీసుకునేంత
సమర్థుడు కాడు. తెలిసి
కూడా బావకి బాధ్యతలు ఒప్పచెప్పి
పొలంలో పత్తి వేయించి మూటలు
సంపాదిస్తాడని అమ్మ కుమారత్తతో
మాట్లాడి అగ్రికల్చర్ లోన్
తెప్పించింది.
“వద్దమ్మా,
ఆయనకేం తెలుసు?”
అని అక్క అంటూనే
ఉంది. బావని
నమ్ముకుని పొలంలో పత్తి
వేయించింది అమ్మ. బావకి
కూడా పాపం ఆశ కలిగింది.
తెలియక ఎక్కువ
ఎరువులు వేశారంట. చెట్లకి
విపరీతమైన ఆకు పడి పత్తి పూయనే
లేదు. డబ్బు
మట్టిపాలయింది. ఇంట్లో
ఒకటే ఘర్షణ. ఎప్పుడు
చూసినా తప్పిపోయిన కండక్టర్
పెళ్ళికొడుకుని తల్చుకుని
అమ్మ వాపోతుంది.
బ్యాంకు నుండి
లోను కట్టమని నోటీసు వచ్చినప్పుడు
అమ్మ బావ మీద విరుచుకు పడింది.
బావ అన్నం తిననని
అలిగితే అమ్మ “సంపాదించుకుని
తింటే అన్నం విలువ తెలుస్తుంది,
ఆ కట్నమేదో పారేసి
పిల్లని ఆ కండక్టర్ కి ఇచ్చినా
సుఖపడేవాళ్ళం” అంది.
ఆరోజు బావకి
విపరీతమైన కోపం వచ్చిందేమో
అమ్మని ఏమీ అనలేక అక్కని
కొట్టాడు.
అక్క ఏడవడం
చూడలేక “ఎందుకమ్మా,
జరిగిపోయిన దానికి
అట్లా మనుషులని బాధ పెడతావు”
అన్నాను కోపంగా.
“నీకేం తెలుసు
నోరు మూసుకో” అని కసిరింది
అమ్మ.
“నువ్వు ముందు
మాట్లాడకుండా ఉండటం నేర్చుకుంటే
నేను నోరు మూసుకుంటాను.
ఇప్పుడు నీకేం
తక్కువయిందనీ, ఎప్పుడు
చూసినా వాగుతానే ఉంటావు.
మనశ్శాంతి లేకుండా
చేస్తున్నావు” అన్నాను ఇంకా
పెద్దగా.
“ఊరుకో సౌజీ,
అమ్మ బాధని కూడా
మనం అర్థం చేసుకోవాలి కదా?”
అంది అక్క.
ఆమె గొంతులోని
నిస్సహాయతకి నాకేడుపొచ్చింది.
ఆ రాత్రి శిరీష
వాళ్ళమ్మ దగ్గరకి వెళ్ళి
అక్క ఏడ్చిందంట. తర్వాత
రోజు నాకా సంగతి చెప్పింది
శిరీష. నాకు
బాధనిపించింది. సాయంత్రం
కూడా ఇద్దరం మా ఇంట్లో గొడవని
గురించి మాట్లాడుకుంటూ
బస్టాండ్ కి వచ్చేప్పటికి
చాలా ఆలస్యమైంది. అప్పటికే
పద్మిని, శ్రావణి
వచ్చేసి మా కోసం బస్ ఆపించారు.
కండక్టర్ మా దగ్గరకి
వచ్చి పాస్ అడిగాడు.
అతను కొత్తవాడు.
పాస్ తీసుకుంటూ
చేతులు అనవసరంగా తాకించిన
అతన్ని చూస్తే చిరాకు కలిగింది.
“ఛీ, ఒట్టి
ఇడియట్ లా ఉన్నాడే జొల్లు
వెధవ, పాత
కండక్టర్ ఏమయ్యాడో?”
అన్నాను.
“పాత కండక్టర్
రిటైర్డ్ అయితే ఇతన్ని ఈ రూట్
లో వేశారట” అంది పద్మిని.
డ్రైవర్
ప్రక్కనున్న సీట్ ఖాళీగా
ఉంటే వెళ్ళి కిటికీ ప్రక్కన
కూర్చుంది శిరీష, దాని
ప్రక్కన నేను కూర్చున్నాను.
మళ్ళీ కబుర్లల్లో
పడిపోయాము. ప్రయాణమంతా
శిరీష నా మీద మీద కొచ్చి
పడుతోంది. “ఏమిటే,
సరిగ్గా కూర్చో”
అన్నాను.
ఊళ్ళో బస్ దిగాక
“ఇక చచ్చినా ఆ సీట్లో కూర్చోనమ్మో!”
అంది.
“ఎందుకూ?”
అన్నాను.
“ఏమో!
భయంగా ఉంది” అంది
శిరీష.
“కొత్తగా
ఇదేమిటే? ఇంతకు
ముందు కూర్చోలేదా ఏమిటీ?”
అన్నాను.
శిరీష ఏడవలేక
నవ్వినట్లుగా నవ్వింది.
మేము పెద్దగా
నవ్వాము.
***
పరీక్షలు
దగ్గరకొచ్చాయి. ఆ
రోజు శిరీష రాలేదు.
పరీక్ష ఫీజు కట్టమని
మాకు నోటీసు వచ్చింది.
బస్టాండ్ కి
వచ్చేప్పుడు శ్రావణి,
పద్మిని ఏవేవో
మాట్లాడుకుంటున్నారు.
'ఫీజుకి ఎన్ని
బాధలు పడాలో, ఈ
వంకతో అమ్మ బావని ఎన్ని
తిడుతుందో' అని
ఆలోచించుకుంటూ దిగులుగా
వాళ్ళతో పాటు నడిచాను.
వెనక సీట్లో
శ్రావణి, పద్మిని
కూర్చున్నారు. బస్
అంతా నిండిపోయింది.
డ్రైవర్ ప్రక్కనున్న
సీట్ లో మాత్రం ఈ కొత్త కండక్టర్
స్త్రీలకని చెప్పి ఎవరినీ
కూర్చోనివ్వడు కాబట్టి అది
ఖాళీగా ఉంది. అక్కడికెళ్ళి
కూర్చుందామా అనుకున్నాను
కాని శిరీష గుర్తొచ్చింది.
ఆ రోజు నుండీ శిరీష
ఆ సీట్లో తను కూర్చోదు,
మమ్మల్ని కూర్చోనివ్వదు.
'కూర్చుంటే ఏమవుతుంది?'
అని అన్నామని ఏడ్చి
గోల చేసింది.
“పోన్లే,
పాపం దానికి భయంగా
ఉందంటుందిగా, సీటు
లేకపోతే నిలబడనన్నా నిలబడదాం
గాని దాన్ని భయపెట్టడం ఎందుకు?”
అన్నాను. అది
గుర్తొచ్చి నవ్వుకున్నాను.
“శిరీష లేదు
కదే అక్కడ కూర్చో” అంది పద్మిని.
నేను వెళ్ళి ఆ సీట్
లో కూర్చున్నాను. బస్
బయలుదేరింది. ఎవరిదో
చెయ్యి వెనక నుంచి నా ఎడమ చేతి
భుజం క్రిందుగా తాకుతోంది.
ఉలిక్కిపడి వెనక్కి
తిరిగి చూశాను. ఆ
కొత్త కండక్టరు! వాకిట్లో
నిలబడి నేను కూర్చున్న కిటికీ
రాడ్ ని పట్టుకుని నిలబడి
ఉన్నాడు. అతను
నా వైపు చూడటం లేదు. ఏదో
పొరపాటున తగిలిందేమోలే అనుకుని
తల తిప్పుకున్నాను.
మళ్ళీ చెయ్యి
ఇంకొంచెం క్రిందుగా...
ఇవతలకి జరిగి
కూర్చున్నాను.
కొంచెం సేపయ్యాక
ఈసారి స్పష్టంగా అతని చెయ్యి
నా వైపుకు జరగడం చూశాను.
ఒక్కసారిగా శిరీష
అక్కడ ఎందుకు కూర్చోనంటుందో,
మమ్మల్ని ఎందుకు
కూర్చోనివ్వడం లేదో అర్థమయింది.
కాని నేను
శిరీషను కానుగా....
విసురుగా లేచాను.
క్రిందికి వంగి
చెప్పు తీసుకుని వాకిట్లో
నిలబడి ఉన్న వాడి ముఖం మీద
ఊపుతూ “ఏందిరా ఎక్కడంటే అక్కడ
తాకుతున్నావు? చెప్పు
తీసుకుని కొడతా వెధవా,
నా ఫ్రెండ్ ని కూడా
ఇట్లాగే చేశావు. ఇక్కడ
ఎవరు కూర్చుంటే వాళ్ళని ఇట్లా
తాకడానికేనా ఈ సీట్ లో స్త్రీలే
కూర్చోవాలి అంటున్నావు దొంగ
వెధవా” అని అరిచాను.
డ్రైవర్ బిత్తరపోయి
బస్సుని రోడ్డు ప్రక్కకి
తీసి ఆపాడు.
కండక్టర్ “ఏయ్,
ఏం మాట్లాడుతున్నావు?
ఎక్కడ నిన్ను
తాకిందీ!? ఇంత
లేవూ చెప్పు తీసుకుని పైకి
దూకుతున్నావే” అని నా మీద
మీదకొస్తున్నాడు. ఈలోపు
పద్మిని, శిరీష,
మా ఊరి వాళ్ళంతా
అక్కడకి వచ్చారు. వాడు
చేసిన పని చెప్పాను.
పద్మిని,
శ్రావణి ఇద్దరూ
కూడా శిరీష అక్కడ కూర్చోవడానికి
ఎలా భయపడేదో అందరికీ చెప్పేప్పటికి
మా ఊరోళ్ళంతా వాడిని తిట్టారు.
వాడు తను చేసిన
పని అస్సలు ఒప్పుకోలేదు.
పైగా మా మీద తన
యూనియన్ వాళ్ళకి కంప్లయింట్
ఇస్తానని ఏదేదో బెదిరిస్తున్నాడు.
మా ఊరోళ్ళు ఆ సీట్లో
కూర్చుని నాకు వెనక సీట్
ఇచ్చారు. బస్
దిగేటప్పుడు వాడు నన్ను
కొరకొరా చూస్తున్నాడు.
ఇంటికొచ్చాక
శిరీషకి జరిగినదంతా చెప్పేప్పటికి
అది నన్ను పట్టుకుని ఏడ్చింది.
“వాడు ఆరోజు నన్ను
కూడా ఇలాగే తాకాడు, నీ
మీద పడిపోయాను, గుర్తుందా?
మీకు చెప్పలేకే
భయమనీ, అక్కడ
కూర్చోవద్దనీ ఏడ్చాను” అంది.
ఊరందరికీ విషయం
తెలిసింది. కొంతమంది
మా ఇంటి ముందు చేరారు.
“ఊరుకో ఎందుకూ
ఏడవడం? ఆ రోజే
నాకు చెప్పినట్లయితే వాడి
అంతు తేల్చేసే వాళ్ళం కదా?
ఈ రోజు చూడు మళ్ళీ
సౌజీ మీద చేతులేశాడు.
ఇలాంటివి జరిగినప్పుడు
దాచకూడదు” అంది శిరీష వాళ్ళ
అమ్మ.
“రేపు వాడి
సంగతేందో చూద్దాం” అన్నారు
మా ఊరోళ్ళంతా
అందరూ వెళ్ళిపోయాక
కుమారత్త మా ఇంటి లోపల కొచ్చి
మా అమ్మతో గుసగుసలాడతూ అంటోంది
“ఆ కండక్టరే” అని.
వాడెవరో నాకర్థం
అయింది. ఆ
సంఘటన తర్వాత అమ్మ బావని బాగా
చూసుకుంటోంది. మనుషులకి
విలువ వాళ్ళు సంపాదించే
డబ్బుతో రాదనీ, ప్రవర్తన
వల్ల వస్తుందని ఆమెకి
గుర్తొచ్చినందుకు సంతోషంగా
ఉంది.
******
No comments:
Post a Comment
P