Saturday, April 11, 2015

మట్టి కాదా!?

నవతెలంగాణా - సోపతి ఆదివారం ప్రచురణ

- రాధ మండువ

వారం రోజులుగా మా కాలేజీలోని పదకొండవ తరగతి పిల్లలు పోలవరం డామ్ రావడం మంచిదా కాదా అనే విషయాన్ని గురించి డిస్కస్ చేస్తున్నారు. ప్రతి నెలా ఆఖరి వారం ఏదో ఒక టాపిక్ తీసుకుని ప్రాజెక్ట్ చేయాలి వీళ్ళు. పన్నెండవ తరగతిలో వచ్చే బోర్డు ఎగ్జామ్స్ బాగా రాయడానికి ఈ ప్రాజెక్టులు ఉపయోగపడతాయని మా లెక్చరర్స్ అభిప్రాయం.

అక్కడున్న జనాలకి కావలసిన సదుపాయాలు సమకూర్చిన తర్వాతే డామ్ కడతారు. ఆ డామ్ కట్టడం వల్ల కొన్ని వేల ఎకరాల భూమికి సాగునీరు అందుతుంది" అంటున్నారొకరు.

నువ్వు ఆ ప్రదేశంలో ఉండి నీ భూమినీ, ఇంటినీ తీసుకుని నిన్ను వేరే చోటికి పంపిస్తే తెలుస్తుంది దానిలోని బాధేమిటో!” అన్నారు ఇంకొకరు.

సమాజానికి ఉపయోగపడే పనికి 'అనుబంధాలు' అనే పేరుతో అడ్డం పడితే అభివృద్ధి ఎలా సాధ్యపడుతుంది?” అన్నారు మరొకరు.

పోలవరం ప్రాజెక్టు రావాలని సానుకూలంగా కొందరు ప్రతికూలంగా కొందరు గ్రూపులుగా విడివడి వాదనలు చేసుకుంటున్నారు.

మధ్యాహ్నం అయింది. బయట సూర్యుని వేడి వల్లో లేక వేడి వేడిగా సాగుతున్న వాదనలతోనో మా కాలేజీ ఓపెన్ ఆడిటోరియం వేడెక్కింది. వర్షం లేక ఆడిటోరియం చుట్టూ ఉన్న ఎండిపోతున్న చెట్లు 'నీళ్ళ ప్రాజెక్టుని' గురించి మాట్లాడుకుంటున్న మమ్మల్ని దిగులుగా చూస్తున్నాయనిపించింది నాకు.

నవ్వుకున్నాను.

ఏంటి సునీతా? డిస్కషన్ బాగా హాట్ హాట్ గా ఉన్నట్లుంది. నవ్వుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తున్నట్లున్నావుగా" అంది ప్రవీణ అక్కడకి వస్తూ... ఆమె ఆ ప్రాజెక్ట్ కి ఇన్ చార్జి. ఇద్దరం సైన్స్ టీచర్లం. ఒకే కాలనీలో ఉంటాం. ఒక వారం నా కార్లో, మరో వారం ప్రవీణ కార్లో కాలేజీకి వస్తాము ఫ్యుయల్ ని సేవ్ చేసుకోవాలని. తను నాకు మంచి ఫ్రెండ్ కూడా.

అవును. కూర్చో విందువు గాని" అన్నాను.

లంచ్ టైమయింది. క్యాంటీన్ కి వెళదాం దా" అంది.

ఈలోపు లంచ్ బెల్ మో్రగడంతో పిల్లలు కూడా డిస్కషన్ ఆపి క్యాంటిన్ కి బయలుదేరారు.

లంచ్ తర్వాత కూడా డిస్కషన్ కొనసాగింది. సాయంత్రం ఇంటికి వస్తున్నప్పుడు ప్రవీణ "పోలవరం ప్రాజెక్టు రావడం వలన ప్రజలకి ముఖ్యంగా రైతులకి ఎంతవరకు ఉపయోగమో ముందు ముందు తెలుస్తుంది కాని సునీతా, ఈ రకంగా నైనా అక్కడున్న పేద జనానికి అన్ని సదుపాయాలూ కలిగిన జీవితం దొరుకుతుందనిపిస్తుంది నాకు.

ఈ రకంగా నైనా ప్రభుత్వం వాళ్ళని పట్టించుకుంటుంది. హాయిగా మనలాగే బ్రతుకుతారు కదా!" అంది.

నేనేమీ మాట్లాడలేదు.

2.


ఎంత వేడిని గుమ్మరించినా విసుగు లేకుండా, విశ్రాంతి లేకుండా సాగిపోతున్న మనుషులని చూసి విస్మయపడుతూ ముఖం ఎర్రగా చేసుకున్న సూర్యుడు పశ్చిమ కొండల్లోకి సాగిపోతున్నాడు. ప్రవీణని వాళ్ళింటి దగ్గర డ్రాప్ చేసి ఇంటికొచ్చాను. వాచ్ మెన్ సురేష్ గేటు తీశాడు.

బేస్ మెంట్ లో కారు పార్క్ చేస్తున్న నా దగ్గరకి పరిగెత్తుకొచ్చిన సురేష్ "మేడమ్ ! వీధి చివరిల్లు ఖాళీ అయిందండీ. ఇవాళ సామానంతా తీసుకెళ్ళిపోయారు. ఓనర్ గారు మిమ్మల్ని మాట్లాడటానికి రమ్మన్నారు" అన్నాడు.

నా ముఖం వికసించింది. “చాలా థాంక్స్ సురేష్, ఫ్రెషప్ అయి వస్తాను వెళదాం... నువ్వు కూడా వస్తే బావుంటుంది. వాళ్ళతో మాట్లాడుదువు గాని" అంటూ గబగబా మా అపార్ట్ మెంట్ లోపలకి వెళ్ళాను.

మామగారు సోఫాలో కూర్చుని ఏదో పుస్తకం చదువుకుంటున్నారు. అత్తగారు తన గదిలో ఉన్నట్లున్నారు. మామగారికి విషయం చెప్పి గబగబా తయారై సురేష్ ని తీసుకుని ఆ ఇంటికి వెళ్ళాను. ఇల్లు ఎలా ఉంది అనేది నాకు ముఖ్యమైన విషయం కాదు, అదీ గాక ఆ ఏరియాలో అన్ని ఇళ్ళూ బాగానే ఉంటాయని తెలుసు కాబట్టి వెళ్ళగానే ముందు ఓనర్ కి అడ్వాన్స్ ఇచ్చే లోపలకి వెళ్ళాము. అనుకున్నట్లుగానే ఇల్లు సదుపాయంగా ఉంది.

మా అమ్మకి ఈ ఇల్లు నచ్చుతుంది సురేష్" అని "థాంక్స్ అండీ" అన్నాను ఓనర్ తో ఆనందంగా ఇల్లంతా కలియతిరుగుతూ.

ఇంటికి రాగానే కుక్కర్ స్టవ్ మీద పడేసి అమ్మకి ఫోన్ చేశాను. వీకెండ్ ఊరికి వస్తున్నానని, సామాన్లు సర్దుకోమని చెప్పాను.

ఎందుకులేమ్మా? నా ఆరోగ్యం బాగానే ఉందిగా. ఇప్పుడు రాత్రిపూట కూడా రంగమ్మ నా దగ్గరే ఉంటోంది, తనింటికి కూడా వెళ్ళడం లేదు" అంది.

ఊరుకోమ్మా! సంవత్సరం నుండి మా కాలనీలో అందరికీ చెప్పిపెట్టి వెతుకుతుంటే ఇన్నాళ్ళకి ఇల్లు దొరికింది. ఇంకేమీ మాట్లాడకుండా తయారయి ఉండు" అని ఫోన్ పెట్టేశాను.

తర్వాత రోజు కాలేజీ నుంచి బజారుకి వెళ్ళి అమ్మకి కావలసిన ఫర్నిచర్ అంతా కొన్నాను. సురేష్, ప్రవీణల సాయంతో ఇంటిని అలంకరించాను. ఆ వీకెండ్ ఊరికి వెళ్ళేప్పటికి అమ్మ తనతో పాటు తెచ్చుకోవలసినవన్నీ సర్దుకుంది కాని ఆమె ముఖంలో సంతోషం లేదు.

'ఊరు వదిలి వెళుతుంటే ఎవరికైనా దిగులు సహజమేలే' అనుకున్నాను. నాకు దగ్గరగా ఉంటే అమ్మకి కావలసినవన్నీ తెచ్చిపెట్టుకుని బాగా చూసుకోవచ్చు అనే ఆలోచనలతో నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను.

అమ్మకి నేనొక్కదాన్నే... ఆమెకి పెళ్ళయిన ఇరవై ఏళ్ళకి పుట్టాను నేను. నా చిన్నప్పుడే నాన్న చనిపోయాడు. అమ్మ గవర్నమెంట్ టీచర్. అమ్మకి నేను, నాకు అమ్మ లోకంగా బ్రతికాము. నా పెళ్ళయ్యాకే అమ్మకి దూరంగా వెళ్ళాను. అప్పుడంటే అమ్మకి ఆరోగ్యం బావుండేది కాబట్టి పెద్ద దిగులు అనిపించలేదు. నేను కూడా సంసార బాధ్యతల్లో పడిపోయాను. ఆరేడు నెలలుగా అమ్మకి ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి. మా ఇంట్లో పదిహేను రోజుల కంటే ఎక్కువ ఉండలేదు. మొహమాటంగా, తినీ తినకుండా, ఏదో పోగొట్టుకున్నట్లుగా ఉంటుంది.

ఏం చేయాలో తెలియక సతమతమవుతుంటే నా సమస్యకి పరిష్కారం మా ఆయనే చెప్పాడు "మనింటికి దగ్గరగా ఒక ఇల్లు అద్దెకి తీసుకున్నావంటే ఆమె తనింట్లో తను ఇష్టం వచ్చినట్లుగా ఉండొచ్చు, ఆమెకి కావలసినవన్నీ చూసుకోవడానికి నీకు వీలుగా కూడా ఉంటుంది" అని.

ఆయన సలహా నాకు చాలా నచ్చింది. అయితే మేముండేది చాలా పోష్ ఏరియా. అంత త్వరగా ఇల్లు దొరకదు. ఇప్పటికి ఇది దొరికింది.

ఆ ఇల్లు ఎంత కష్టం మీద దొరికిందో అమ్మకి కథలాగా చెప్తుంటే నవ్వుతూ చూసింది నా వైపు. ఆ రాత్రి చాలా హాయిగా నిద్రపోయాను. అసలు మా ఊరికొస్తేనే ఆ సిటీలోని రణగొణధ్వనులు ఉండవు కాబట్టి ప్రశాంతంగా నిద్రపోతాను. ఆ రాత్రి అయితే అమ్మని నా దగ్గరకి తీసుకు వెళుతున్నానన్న ఆనందంతోనేమో ఒళ్ళెరగకుండా నిద్రపోయాను.

తర్వాత రోజు అమ్మ ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పి వచ్చింది. రంగమ్మ అమ్మ వెళ్ళిపోతుందని ఏడుపు ఆపుకోలేకపోతోంది. "వద్దమ్మా, మీకు ఏం కావాలన్నా చేసి పెట్టేదానికి నేనుంటిని, ఎందుకు వెళ్ళడం మనకి తెలియని దేశానికి?" అంది అమ్మతో.

కాదులే రంగమ్మా, అమ్మని డాక్టర్ దగ్గరకి తీసుకెళ్ళాలంటే నా దగ్గరుంటేనే కదా సౌకర్యంగా ఉండేది?" అన్నాను.

నిజమేలేమ్మా" అంది కాని రంగమ్మ బాగా డీలా పడిపోయింది. తనింట్లో కొడుకు, కోడలు దగ్గర మాటలు పడుతూ ఉండకుండా అమ్మని నమ్ముకుని స్వతంత్రంగా ఉన్న మనిషికి బాధే పాపం" అనుకున్నాను.

"నీకేం సహాయం కావాలన్నా ఫోన్ చెయ్ రంగమ్మా!, అప్పుడప్పుడూ ఇంటి వైపు చూసి పోతుండు” అని కాస్త డబ్బు, ఫోన్ నంబరూ ఇచ్చి పది గంటలకంతా బయల్దేరాము. దారి పొడుగునా నేను మాట్లాడుతున్న మాటలకి అమ్మ '' కొడుతుంది కాని అన్యమనస్కంగానే ఉంది.

3.

రెండు రోజులు మా ఇంట్లో ఉండి మూడో రోజు మంచి ఘడియలు చూసుకుని అద్దె ఇంట్లో పాలు పొంగించాము. అమ్మ తను ఊరి నుండి తెచ్చుకున్న తన సామానంతా సర్దుకుంది. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం అమ్మ దగ్గరకి వెళ్ళి కొంచెం సేపు గడపటం, అమ్మకి కావలసిన సామాన్లు, కూరలు, మందులు తెచ్చివ్వడం చేస్తున్నాను.

మొదటి నెల రోజులూ అమ్మ సంతోషంగానే ఉంది. తర్వాత నెల నుండీ అమ్మకి జలుబు, దగ్గు, విరోచనాలు - ఒకటి తగ్గితే మరొకటి పట్టుకుంటున్నాయి. హాస్పిటల్ లో అన్ని టెస్ట్ లూ చేయించాను.
వాళ్ళు అన్నీ బాగానే ఉన్నాయని, నీళ్ళు మారడం వల్ల అనీ చెప్పారు.

అమ్మ ముఖంలో నవ్వు మాయమయింది. ఊరికి వెళతాననసాగింది.

ఊరుకోమ్మా, ఊళ్ళో ఎవరు చూస్తారు? ఇప్పుడు చూడు... నేను దగ్గరున్నాను కాబట్టి అన్ని టెస్టులూ చేయిస్తున్నాను, నిన్ను చూసుకోగలుగుతున్నాను" అన్నాను.

అక్కడున్నప్పుడు నాకు ఈ రోగాలు లేవు కదే, పెద్దదాన్నవడం వల్ల పనులు చేసుకోలేక నీరసమే గానీ, రంగమ్మ కూడా నా కోసం దిగులేసుకుందట, నన్ను పంపించెయ్ తల్లీ!” అనసాగింది.

ఎప్పుడూ నేను ఏం చెప్పినా వినే అమ్మ ఊరికి వెళ్తానని పట్టు పట్టడంతో నాకు కోపం వచ్చి విసుక్కున్నాను. నేను విసుక్కోగానే అడగడం తగ్గించింది కాని అప్పుడప్పుడూ నసుగుతూనే ఉంది. మనిషి మరీ దిగజారిపోతోంది.

ఇక్కడ హాయిగా జరిగిపోతుంటే ఎందుకు వెళతానంటుందో అర్థం కావడం లేదు ప్రవీణా!” అన్నాను ప్రవీణతో.

మనుషులు తామున్న ప్రపంచానికే అలవాటు పడి బయట బ్రతకలేం అనుకుంటూ ఉంటే ఎలా సునీతా! బయటికి రావాలి, అవసరమైనప్పుడు కొత్త ప్రదేశాల్లో నివసించడం అలవాటు చేసుకోవాలి కదా?” అంది ప్రవీణ.

నాకేమీ తోచక ఏడుపు వస్తోంది.
ప్రవీణతో చెప్పిన రోజు నేను కాలేజీ నుండి రాగానే నన్ను ఇంటికి కూడా పోనీయకుండా గట్టిగా మొండి పట్టు పట్టి కూర్చుంది. “నేను మనూరొచ్చి నీ దగ్గర ఉండలేను కదమ్మా, దాన్ని నువ్వు కూడా ఒప్పుకోవు. పోనీ మా ఇంట్లో ఉంటావా?” అన్నాను.

వద్దమ్మా! మీ ఇంట్లో నాకు చాలా ఇబ్బంది" అంది.

ఈ ఇంట్లో నీకు బాగానే ఉందిగా అమ్మా" అన్నాను.

ఊరిని వదిలి ఉండలేక పోతున్నానేమోనే, అదీ గాక ఈ వాతావరణం నాకు పడటం లేదు" అంది.

ఎందుకు పడదు? మేమంతా మనుషులం కాదా? అయినా నీ మనుషులు ఎక్కడుంటే అక్కడ ఉండటం అలవాటు చేసుకోవాలి కదా? 'దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులని' గురజాడ అన్నారని నువ్వు మాకు నేర్పలేదా?” అన్నాను. అమ్మ మౌనంగా ఉంది.

"చూడు, మా అత్తమామలు హాయిగా ఎంత దర్జాగా ఉంటున్నారో!” అన్నాను ఆఖరి అస్త్రాన్ని ప్రయోగిస్తూ.

కొంతమంది అలవాటు పడగలరమ్మా, నువ్వు ఇలా తర్కానికి దిగితే నేనేం సమాధానం చెప్పలేను" అంది. ఇంకెలా చెప్పాలో తెలీని నిస్సహాయతతో పెద్దగా ఏడ్చాను.

ఊరుకో తల్లీ సునీ, నేను నీ దగ్గర ఉండాలనే కదా వచ్చాను. ఉండలేక పోతున్నాను. మనూరికి వెళ్ళాలనిపిస్తుంది" అంది అమ్మ దిగులుగా. ఆమె చెక్కిళ్ళ మీద కూడా కన్నీళ్ళు దొర్లాయి.

! ఏమిటిది అమ్మని బాధపెడుతున్నాను? డెబ్భై ఏళ్ళ మనిషితో వాదనేమిటసలు నాకు? ఏమీ మాట్లాడకుండా ఏదో ఒకటి చెప్పి రోజులు గడిపేస్తే అలవాటయ్యి తనే ఉంటుంది అనుకుని నా కళ్ళు తుడుచుకుని అమ్మని ఓదార్చాను. ఇక అప్పటి నుండీ ఆమె "ఊరికి వెళతానే" అంటున్నప్పుడల్లా 'డాక్టర్ గారు ఇప్పుడు ప్రయాణం చేయకూడదన్నారమ్మా' అనో 'స్టూడెంట్స్ కి పరీక్షలయ్యాక తీసుకెళతానమ్మా' అనో 'మా అత్తగారికి బాగుండటం లేదు ఇప్పుడు మనం వెళితే ఎలా?' అనో - ఇలా ఏదో ఒకటి అంటున్నాను కాని అమ్మని మాత్రం ఊరికి తీసుకెళ్ళడం లేదు.

రోజులు గడుస్తుంటే మర్చిపోతుంది అని నేననుకుంటుంటే 'వెళతాను, పోనీ నీకు కుదరకపోతే నన్ను బస్సు ఎక్కించు' అనడం ఎక్కువయింది.

4.

ఆ రోజు సోమవారం. ఆ శని ఆదివారాలు అమ్మ దగ్గర ఎక్కువ సేపు గడపడానికి వీలులేనన్ని పనులు. సోమవారం కాలేజీకి వెళ్ళే ముందు అమ్మకి ఉగాదికని తెచ్చిన చీరలు ఇద్దామని వెళ్ళాను. ఎంత సేపు బెల్ మ్రోగించినా తలుపులు తీయలేదు. నాకేమిటో లోపల ఆందోళనగా ఉంది.

వాచ్ మెన్ ని కేకేయగానే బెడ్ రూమ్ కిటికీ బోల్టుని లాగేసి కిటికీ తెరిచాడు. అమ్మ తన బెడ్ మీద ప్రశాంతంగా నిద్రపోతున్నట్లుగా పడుకుని ఉంది. అమ్మని అలా చూసి కూడా అలిసిపోయి హాయిగా నిద్ర పోతుందేమోలే అనుకుని కిటికీ తలుపు మీద బాదుతూ "అమ్మా!, అమ్మా!” అని పిలుస్తూనే ఉన్నాను - "నాకేదో భయంగా ఉందమ్మా, తలుపులు పగలగొట్టిస్తాను, ఉండండి" అని వాచ్ మెన్ అనేదాకా....

అపార్ట్ మెంట్ లో ఉన్న వాళ్ళంతా అక్కడ చేరారు. ఎవరెళ్ళి చెప్పారో మా ఆయన, అత్తగారు, మామగారు వచ్చారు. తలుపుల బోల్టులు పగలకొట్టి లోపలకి వెళ్ళాము.

అమ్మ ఈ లోకం నుండి వెళ్ళిపోయింది.

ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిన నేను ఏ లోకం లో ఉన్నానో నాకు తెలియలేదు. విశాలమైన గదులు ఇరుకుగా మారుతున్నాయి. "నేనే, నేనే అమ్మని చంపుకున్నానండీ, 'ఇక్కడ నాకు బాగా లేదమ్మా నన్ను పంపించు తల్లీ' అని అమ్మ అంటున్నా మొండిగా పట్టుబట్టానండీ!" మా ఆయన మీద పడి వెక్కిళ్ళు పడుతున్న నన్ను ఆపడం ఎవరి తరమూ కాలేదు.


5.


అమ్మ పెద్ద కర్మ ఊళ్ళో జరిపించి వచ్చాక 'అమ్మ ఉన్న ఇల్లు ఖాళీ చెయ్యమంటున్నారమ్మా' అన్నాడు మా వాచ్ మెన్ సురేష్.

అమ్మ సామాన్లు సర్దించాను. చీరల క్రింద అమ్మ డైరీ...

వాదన పెట్టుకున్న తర్వాత రోజు “తోచక పోతే ఏమైనా రాసుకోమ్మా" అని నేను అమ్మకి కొనిచ్చిన డైరీ...

'ఏమైనా రాసి ఉంటుందా!?' అనుకుంటూ వణుకుతున్న చేతులతో పేజీ తెరిచాను...

'సునీ! 'నీ మనుషులు ఎక్కడుంటే అక్కడ ఉండాలి' అంటున్నావు కాని నా మట్టిని, దాని మీద పెంచుకున్న అనుబంధాన్ని వదిలి ఉండాలన్నా బాధే కదమ్మా, ఎందుకు అర్థం చేసుకోవు? ఓ టీచర్ గా 'దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు' అని నేను మీకు నేర్పిన మాట నిజమే అయితే ఒక వ్యక్తి గా ఇప్పుడు చెప్తున్నాను - 'దేశమంటే మనుషులతో పాటు మట్టి కూడా!'


6.


అభివృద్ధి సాధించాలంటే లాభ నష్టాలు రెండూ ఉంటాయి. కాబట్టి లాభం ఉందనుకుంటేనే డామ్ లు కట్టాలి. నష్టమనుకున్నప్పుడు ఎందుకా ప్రాజెక్ట్ లు?” అన్న ముగింపు వాక్యంతో పదకొండో తరగతి పిల్లల డిజర్టేషన్ ముగిసింది.


7.


ప్రాజెక్ట్ వర్క్ ని దిద్ది మార్కులు వేసి ఇన్ చార్జి సంతకం కోసం పేపర్లను ప్రవీణకిచ్చాను. ఆ మార్కులని చూసిన ప్రవీణ నన్ను అభావంగా చూసింది.
******                                                                       

No comments:

Post a Comment

P