Monday, June 22, 2015

అపుటాఫ్ ఆర్డర్

నవ తెలంగాణ - సోపతిలో ప్రచురణ
- రాధ మండువ


ప్రయత్నించాను. ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాను - ఆ పది నంబర్లనూ గుర్తుకు తెచ్చుకోవడానికి. ఊహు! గుర్తు రావడం లేదు.

***

రాత్రి వాణి జర్మనీ నుండి ఫోన్ చేసింది. "నీతూ, ప్రభాకర్ నిన్నొక్కసారి ఫోన్ చేసి మాట్లాడమని చెప్పాడు. నేను ఈ కొత్త ప్రాజెక్ట్ హడావుడి, జర్మనీ ప్రయాణపు సర్దుడులో పడి పూర్తిగా మర్చిపోయాను. సారీ" అని మళ్ళీ తనే "అతను చేసి కూడా నెలయిపోయిందే" అంది కంగారు కంగారుగా.

ఏమయింది? ఇప్పుడెందుకంత కంగారు, నేను చేయనని నీకు తెలుసు కదే" అన్నాను. 'ప్రభాకర్' అన్న మాట నాలో కలిగించిన కంగారుని దాచిపెడుతూ...

కాదు నీతూ, తప్పకుండా చెయ్యి. జాబ్ రిజైన్ చేయాలనుకుంటున్నాట్ట, 'ఇక్కడ నుంచి వెళ్ళేముందు ఒక్కసారి నీతూని క్షమించమని అడగాలి, బై చెప్పాలి' అన్నాడే... అయ్యో నా ఈ మతిమరుపు నన్నెప్పుడో ఇబ్బందుల్లో పడేస్తుంది నిజంగా.... మరీ ఈ మధ్య చాలా విషయాలు మర్చిపోతున్నాను. నువ్వు కూడా మమ్మల్ని మర్చిపోయావు. ఫోన్ కూడా చేయడం లేదు" అంది వాణి.

దాని మాట తీరుకి నవ్వుకునే నేను ఇప్పుడు మౌనంగా ఉన్నాను.

నిత్యా, వింటున్నావా" అంది.

వద్దు వాణీ, నేను ఫోన్ చేయను. దయచేసి మర్చిపోయిన గాయాన్ని రేపకు. ఇంతకు ముందు నీకు నేను చాలా సార్లు చెప్పాను అతను చేస్తే నువ్వు కూడా తీయొద్దని, ఒకవేళ తీసినా నా గురించి ఏమీ మాట్లాడొద్దని" అన్నాను నిర్లిప్తంగా.

"కాదే, అతని మాటలు వింటుంటే నిజంగానే వెళ్ళిపోతున్నారనిపించింది. ఇన్ ఫాక్ట్ నీకు ఆ రోజు వెంటనే ఫోన్ చేశాను కూడా, నువ్వు లిఫ్ట్ చేయలేదు. ఇక ఈ పనుల్లో పడి మర్చిపోయాను" అంది.

ఆ విషయం వదిలెయ్, నువ్వు అక్కడ ఎలా ఉన్నావ్?" అన్నాను. నా గొంతులో దు:ఖం నాకే స్పష్టంగా వినిపిస్తుంటే ఇక అదేం మాట్లాడగలదు.

సర్లే అయితే, నీ ఇష్టం. ఉంటాను మరి, నేను బాగానే ఉన్నాను, మళ్ళీ చేస్తాను" అని పెట్టేసింది. ఎక్కువ మాట్లాడితే నేనెక్కడ బోరుమంటానో అని భయపడినట్లుంది. నేను చాలా కఠినమైపోయానని, అతని గురించి ఆలోచించడమే మర్చిపోయానని దానికేం తెలుసు?

అవునా, మర్చిపోయానా? అయితే అతని ఫోన్ నంబర్ కోసం ఎందుకీ తాపత్రయం? అతని చేత క్షమాపణ చెప్పించుకోవాలనే తపన నాలోలోపల దాగి ఉందేమో!

అవును చెప్పించుకోవాలి. అతను క్షమాపణ చెప్పాలి.

నిజంగానే రిజైన్ చేశాడా? నిజమేనేమో, మొన్నీ మధ్య శ్రీనివాస్ సార్ బజార్లో కనపడి అన్నారు "నువ్వు ఇక్కడ పని చేసినప్పుడున్న పరిస్థితి లేదమ్మా ఈ సంవత్సరం ఈ ఏరియాలో కాలేజీలు ఎక్కువైపోయి మన కాలేజీలో స్టూడెంట్స్ బాగా తగ్గిపోయారు. వీళ్ళు లెక్చరర్స్ కి సరిగ్గా జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నారు, నీకు తెలిసిన కాలేజీల్లో ఎక్కడైనా ఖాళీలుంటే చెప్తావా!" అని.

ప్రభాకర్ కూడా వేరే ఉద్యోగం చూసుకున్నాడా? ఎవరిస్తారు ఇతనికి? అందునా అవిటి వాడు. ఖచ్చితంగా రిజైన్ చేసి ఉండడు. జీతాలు ఇవ్వడం లేదుగా, డబ్బు అవసరమై చేసి ఉంటాడు. నాతో మాట్లాడటానికి ముఖం చెల్లక వాణికి చేసి ఉంటాడు.

ఎందుకిలా ఆలోచిస్తున్నాను 'అతను కేవలం డబ్బు కోసమే నాతో స్నేహం చేశాడ'ని ఈ రెండేళ్ళల్లో వందల సార్లు అనుకోవడం వల్లనా!?

ఆలోచనలని భరించలేక లేచి వంటిట్లోకి వెళ్ళాను. పని చేసుకుంటున్న రంగమ్మ ఫ్లాస్క్ ని చేతిలోకి తీసుకుని కాఫీని మగ్ లోకి వంచనా అన్నట్లు నా వైపు చూసింది. తల ఊపాను. మగ్ లోకి కాఫీ వంచుతున్న రంగమ్మ ముఖంలో దిగులు స్పష్టంగా కనిపిస్తోంది. నాలుగు రోజుల క్రితం రంగమ్మ తన మనవడిని కాలేజీలో చేర్చడానికి డబ్బు కావాలని అడిగింది. ఇవ్వనన్నాననేమో మౌనంగా, దిగులుగా ఉంది అనుకున్నాను. మగ్ తీసుకుని వరండాలోకి వచ్చి కూర్చున్నాను.

వెళ్ళిపోతున్నాడా అయితే? అతనితో నా స్నేహం తెగాక అతను చేసినా నేను ఫోన్ తీసేదాన్ని కాదు, అప్పట్లో అతని నంబర్ నేను రిజెక్ట్ లో పెట్టేశానని తెలుసు కనుక వాణికి చేసి ఉంటాడా?

అదిగో ఈ ఆలోచన వచ్చినప్పటి నుండీ ఆ అంకెలని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం. ఒకప్పుడు నేను మర్చిపోలేని నంబర్లవి. ఎలా మర్చిపోయాను. వద్దనుకున్నవి కాలపు మడతల్లోకి జారిపోయి, నాశనమైపోతాయేమో!

వాణిని నంబర్ అడగొచ్చు కాని.... వద్దు వద్దు. కళ్ళు మూసుకున్నాను.

అతను పరిచయమైన కొత్తల్లో ఎక్కడో రాసి పెట్టుకున్నట్లు గుర్తు, ఊహు! లేదు. ఫోన్ లో ఎంటర్ చేసుకున్నాను కాని రాసుకోలేదు. ఆఁ గుర్తొచ్చింది. అతను నన్ను అవమానంగా 'ఆ మాట' అన్నప్పుడు రాసి పెట్టుకున్న డైరీ పేజీ - దానిలో రాసుకున్న వాక్యం కిందనే అతని నంబర్ రాసుకున్నాను.

గభాల్న లేచి గదిలోకి వెళ్ళి పాత డైరీ బయటికి లాగి ఆ పేజీ కోసం వెతికాను.

నేను కాబట్టి ఈ మనిషిని ఉద్ధరిస్తున్నాను అన్న నాలోని భావన, అహం వల్లే నేడు నాకీ దు:ఖం కలిగిందేమో!”

ఆ వాక్యం కింద అతని ఫోన్ నంబర్, అప్రయత్నంగా వేసిన నంబర్!


***


ఉదయం నుంచి ఆ నంబర్ ని చూడటం ఏ వెయ్యోసారో అయి ఉంటుంది. డయల్ చేయాలని సెల్ చేతిలోకి తీసుకోనూ... వద్దని మళ్ళీ పేజీ మూసేయనూ. పేజీనైతే మూసేయగలను కాని కళ్ళ ముందు ప్రత్యక్షమవుతున్న నంబర్లని ఏం చేయను?

ఇంత సేపూ వాటిని చేజిక్కించుకోవాలని తపించిన మనసు ఇప్పుడు వాటిని చెరిపేయాలన్న ప్రయత్నంలో పడింది.

రహస్యంగా ఉన్న క్రీనీడలన్నీ అంకెల్లో చేరి నన్ను చూస్తున్నట్లుగా ఉంది. ఆ పది అంకెలే అనేకానేక ఏక కేంద్రక వృత్తాలుగా ఒక దాని మీద ఒకటి పడుతూ, ఒకటి తర్వాత మరోటి సంఘటనల వలయాలుగా తిరుగుతూ ఏవేవో నైరూప్య చిత్రాలుగా మారిపోతున్నాయి. ఎప్పుడో గతకాలపు అరల్లో దాచిపెట్టపడిన జ్ఞాపకాలూ, నిద్రగా అణగారిపోయిన ప్రశ్నలూ మళ్ళీ వెల్లువై పోటెత్తుతున్నాయి.

జవాబు ఉన్నా లేనట్లయిన ఈ ప్రశ్నలకి సమాధానాలు దొరకవు. ఇవి మౌనంతో ఎప్పుడో చంపేసుకున్న ప్రశ్నలు.

అప్పుడేమీ చేయలేక గుండెల్లో దాచుకున్న కోపం నాలో ఎగదన్నినట్లైంది. డైరీలోని కాగితాన్ని లాగి ముక్కలు ముక్కలుగా చించేశాను. అవును... ఇలా అదృశ్యమైపోవలసిందే, ఎవరికీ చెప్పుకోలేని ఆ జ్ఞాపకాల ఆవేదన నశించాల్సిందే.

ఆవేశం తగ్గడానికి నెమ్మదిగా గాలి పీల్చుకున్నాను. ఎందుకీ ఆవేశం? జరిగిన దాన్లో నా తప్పేమీ లేదనీ, తప్పంతా అతనిదేననీ, అదే సత్యమనీ అనుకున్నాక కూడా బాధ పడుతున్నానంటే నేననుకుంటున్న సత్యం అసత్యమా?

నిజమే... జరిగినదాన్లో నా తొందరపాటూ, మనుషుల్ని అంచనా వేయడంలో నా అసమర్థత, అవసరం లేకపోయినా సహాయం చేయబోవడం, నేను లేకపోతే ఎక్కడుండే వాడో అనుకోవడం... ఇవన్నీ నా తప్పులే. కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగాయి.

నన్ను ఆక్రమించుకుని ఉన్న సంఘర్షణ, లేదనుకున్నా మనసు పొరల్లో దాగి ఉన్న ఆ ఆవేదన కన్నీళ్ళ రూపంలో జారిపోతోంది.... బరువెక్కిన కాళ్ళని మంచం మీదకి చేర్చి జారగిలపడ్డాను.

కళ్ళు మూసినా తెరిచినా కనపడుతున్న ఆ అంకెలు నన్ను వదలడం లేదు. ఏమిటిది? స్నేహానికి అర్థం తెలియని, దానికి అర్హత లేని ఈతని కోసం ఎందుకింత ఆందోళన? ....

పిల్లలిద్దరూ స్కూలుకి వెళ్ళిపోతే ఇంట్లో ఊరికే కూర్చోవడం ఎందుకని ఇంటికి దగ్గరగా ఉన్న చిన్న ప్రైవేట్ కాలేజీలో సైన్స్ లెక్చరర్ గా చేరాను. ప్రభాకర్ కూడా సైన్స్ లెక్చరరే అవడంతో మా ఇద్దరికీ స్నేహం కలిసింది. అతనికి ఒక కాలుకి పోలియో. కాలిని ఈడుస్తూ నడుస్తాడు. కాలేజీ వాళ్ళిచ్చే ఆ కాస్త జీతంతోనే అమ్మనీ, చెల్లెలినీ పోషించవలసిన పరిస్థితి అతనిది. మనిషి ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నట్లు నిర్లిప్తంగా ఉండేవాడు. ఎందుకంటే చెప్పలేను గాని అతనంటే నాకు చాలా జాలి, ఆపేక్ష కలిగాయి.

చదువు చెప్పే ఒక లెక్చరర్ మంచి బట్టలు కూడా లేకుండా అలా హీనంగా ఉండటం చూడలేక ఏదో ఒక మిషతో గిఫ్టుగా బట్టలు ఇచ్చేదాన్ని. తన చెల్లెలికి పెళ్ళి చేస్తున్నప్పుడు అవసరమంటే మొదటి సారి డబ్బు సహాయం చేశాను. అప్పటి నుండీ చాలా సార్లు అతని అవసరాలు కనిపెట్టి మరీ డబ్బు ఇచ్చేదాన్ని.

మా స్నేహబంధం బాగా బలపడింది.

నువ్వే లేకపోతే ఏమయ్యోవాడినో నీతూ? నీకు చాలా రుణపడి ఉన్నాను. అంతా లెక్క రాసి పెడుతున్నాను, చిన్నగా తీరుస్తాను” అనేవాడు. అతను ఇవ్వలేడని తెలుసు నాకు. అతనిలో అతని పట్ల కాన్ఫిడెన్స్ కలిగించాలని "ఫర్వాలేదులే ప్రభాకర్, ఇవ్వొచ్చులే చిన్నగా, ఇవ్వక ఎక్కడకి పోతావ్ " అనేదాన్ని.

అన్ని రోజుల నుంచీ పని చేస్తున్నా అవిటివాడు కాబట్టి ఇక అతనెక్కడికీ వెళ్ళలేడని జీతం పెంచకుండా పని చేయించుకుంటుంటే యాజమాన్యానికి అతని పరిస్థితి చెప్పి జీతం పెంచేట్లు కూడా చేశాను.

చేసిన సాయాన్ని మళ్ళీ ఇప్పుడు తల్చుకుంటుంటేనే చీదరగా ఉంది. అంత దౌర్భాగ్యం ఇంకోటి లేదు....

"పెళ్ళి చేసుకోకుండా ఇలా ఎన్నాళ్ళుంటావ్ ప్రభాకర్, పెళ్ళి చేసుకో... చేసుకో" అని పోరుతుంటే "కుంటివాడిని నన్నెవరు చేసుకుంటారు నీతూ? అయినా నాకు పెళ్ళెందుకు?" అనేవాడు.

"నీకంటూ ఒక సంసారం ఉండాలి, నువ్వు సుఖంగా ఉండాలి. ఇప్పుడు మీ అమ్మ ఉన్నారు, తర్వాత ఎవరు చూస్తారు" అని వాదించే దాన్ని.

"ఆ విషయం తప్ప ఇంకేదైనా చెప్పు. పెళ్ళి చేసుకుని ఆ బంధాల్లో ఇరుక్కుంటే చేయగలిగి ఉన్నానా? ఎందుకా రొష్టు చెప్పు? నీ స్నేహం ఉంటే నాకు చాలు, ఏమీ దిగులు లేదు” అనేవాడు.

అతని క్షేమాన్ని అతని కంటే ఎక్కువగా కోరుకునే నాకు కాని, కొలీగ్స్ కి కానీ చెప్పకుండా హఠాత్తుగా వాళ్ళ ఊరికి వెళ్ళి పెళ్ళి చేసుకుని వచ్చాడు. అందరూ నిష్టూరంగా మాట్లాడారు.

"ఆర్భాటంగా చేసుకునేంతటి వాడిని కాదుగా, ఒకళ్ళని పిలిస్తే అందరినీ పిలవాలి. అందుకని ఎవరికీ చెప్పలేదు. ఏదో గుడిలో దండలు మార్చుకున్నాము" అన్నాడు.

నీతూ, 'వాళ్ళు ఒప్పుకున్నాక ఆలస్యం చేయొద్దులేయ్యా' అని అమ్మ అంది, ఇక్కడకొచ్చాక చెప్పొచ్చులే అని నీతో కూడా చెప్పలేదు" అని గొణిగాడు.

పర్లేదులే, చెప్పకపోతే ఏం.. పెళ్ళి చేసుకోవడానికి ఆ అమ్మాయి ఒప్పుకున్నప్పుడు ఆగడం మంచిది కాదు కూడా" అన్నాను.

"కనీసం నీకైనా చెప్పొచ్చుగా, మొన్నీ మధ్య కూడా వాళ్ళమ్మకి కంటి ఆపరేషన్ అని నీ దగ్గర డబ్బులు తీసుకున్నాడు" అంది వాణి.

ఏమోలేవే పాపం, నాకు చెప్తే అందరికీ చెప్పాలి, అదీగాక 'పెళ్ళి చేసుకోనుగాక చేసుకోను' అని నాతో వాదించిన వాడికి గిల్టీ ఫీలింగ్ ఉంటుంది కదా, అందుకు చెప్పి ఉండడు. ఎలాగోలాగా పెళ్ళి చేసుకున్నాడు, బంధువలమ్మాయే కాబట్టి బాగా చూసుకుంటుంది పాపం" అన్నాను.

మా అందరిలాగా అతనికీ తన కంటూ తన వాళ్ళుంటే మంచిదనీ, ఆ అవిటి కాలికి ఒక అండ ఏర్పడితే చాలునని ఆశించిన నేను చాలా సంతోషపడ్డాను.

సంతోషం ఎక్కువైపోయి మరింత అనురాగం, ఆపేక్ష చూపించడం, తన సంసారం ఏర్పరుచుకోవడానికి మళ్ళీ నన్ను డబ్బు సహాయం అడిగితే వాళ్ళింటికి వెళ్ళి మరీ ఇవ్వడం - ఇవీ నేను చేసిన తప్పులు.

'ఏదో' లేకపోతే ఎందుకు సహాయం చేసిందని వాళ్ళోళ్ళకి - కొత్తగా ఏర్పడిన బంధాలకి అనుమానం కలిగేట్లు చేసిన ఆ డబ్బు మంచి డబ్బు కాదు. అంతకు ముందు ఇచ్చిన వేలకు వేలు మంచివే మళ్ళీ.... అతనికి పెళ్ళయ్యాక ఇచ్చిన డబ్బు మాత్రం తప్పుడుదయింది.... నిందలు వేసింది.

ఇచ్చిన డబ్బు అంకెలు, ఫోన్ నంబర్ లోని అంకెలు కలగాపులగంగా చేరి మనశ్శాంతిని నాశనం చేస్తున్నాయి... తలకి ఒక ప్రక్కనుంచి ఏదో తెలియని నొప్పి వస్తున్నట్లుగా ఉంది. దిండుని ముఖం మీద వేసి వత్తుకున్నాను...


***

ఆరోజు “మా ఇంటికి రావొద్దు నీతూ, మా ఆవిడ చాలా బాధ పడుతోంది" అన్నాడు.

నాకర్థం కాలేదు, ఎందుకు బాధపడటం?” అన్నాను ఆశ్చర్యపోయి. అతను నాకు చెప్పలేక వాణికి చెప్పాడు.

ఆ తర్వాత జరిగిన వాదనలు, నిష్టూరాలు, వాణితో మధ్యరికాలూ - నాకవసరమా!!? ఎక్కడుంది తప్పు? ఆడ మగల మధ్యనున్న స్నేహంలో ఉందా తప్పు... కాదు. కానే కాదు - విశ్వాసావిశ్వాసాల మధ్య సాంగత్యంలో ఉంది. మంచితనాని్న అవసరాల కోసం వాడుకునే హీనత్వంలో, లేకితనంలో ఉంది.

"ఆ అమ్మాయి మనల్ని అలా అనుమానంగా చూస్తున్నప్పుడైనా వాళ్ళ గురించి అర్థం చేసుకోలేకపోయావ్, నేను చెప్తూనే ఉన్నాను విన్నావా! పాపం డబ్బులు లేకపోతే ఎట్లానే అనుకుంటూ సహాయం చేయడం నీ తప్పు" అని వాణితో కూడా చెప్పించుకోవలసి వచ్చింది. నా ఈగో దెబ్బ తిన్నా ఆమె అన్న మాటలు నిజమే కదా!?

ఎంత డబ్బు సహాయం చేశాను నీకు? ఇంత కృతఘ్నుడివా?” అన్నాను. గుండె మంట ఆ మాట నా చేత అనిపించింది.

"ఏమో ఎందుకిచ్చావో ఇచ్చావు. ఇవ్వలేదని నేననలేదే! నీ డబ్బు నీకు తొందరోలోనే ఇస్తాన్లెండి మా సంసారాన్ని ఇలా వదిలేయండి, నాశనం కాకముందే" అన్నాడు. ఏకవచనంతో మొదలైన సంబోధన ముగిసేప్పుడు బహువచనానికి మారింది.

అతనేమంటున్నాడో ఒక్క క్షణం అర్థం కాలేదు. అర్థమయ్యాక కాళ్ళూ చేతులూ వణికిపోయాయి. అతని భార్యకంటే నా గురించి తెలియదు కాని ఇతనేమిటి ఇలా అంటున్నాడు!? అంటే నేను ఇతని పట్ల చూపిస్తున్న ఆపేక్షకి ఇతను కూడా రంగులు పులుముకున్నాడా?

గుండె ఆగిపోతుందేమో అన్నంతగా బాధ.... మాటలు రాక మ్రాన్పడిపోయి అతని వైపు అలాగే చూస్తూ నిలబడ్డాను.

నోర్ముయ్, ఏం మాట్లాడుతున్నావు? నీ సంసారాన్ని ఎవరు చేస్తున్నారు నాశనం?” అంది వాణి కోపంగా.

"సారీ" అని గొణుక్కుంటూ వెళ్ళిపోయాడతను.

అతను వెళ్ళాక "ఏమిటిది నిత్యా, అతని భార్య వాగిన వాగుడికి ఇతన్ని కృతఘ్నుడు అనడం ఏమిటి నువ్వు?” అంది వాణి.

"అతను తన భార్యకి చెప్పుకోలేకపోతే 'తను మనల్ని అనుమానిస్తుంది, ఆమెకెట్లా చెప్పుకోవాలో నాకర్థం కావడం లేదు' అని చెప్పి ఉండాల్సింది. నేను అర్థం చేసుకుని ఉండేదాన్ని. నేను వాళ్ళ కాపురం నాశనం చేసేదాన్నా? ఏమనుకుంటున్నాడు వాణీ నన్నతనసలు? ఆ మాట అతని నోట్లో నుంచి రావొచ్చా" అన్నాను. ఏడుస్తున్న నన్ను వాణి సముదాయించింది.

అక్కడిక ఉండలేక రిజైన్ చేసేశాను. తర్వాత ఓ రెండు మూడు నెలల్లోనే వాణి కూడా సాఫ్ట్ వేర్ జాబ్ కి మారింది.

ఆ మాటని - నన్ను హతాశురాలిగా మార్చిన ఆ మాటని - నేను ఇంతవరకూ ధైర్యంగా ఎదుర్కోలేక పోయాను. ఈ జ్ఞాపకాన్ని ఎవరికీ చెప్పుకోలేక, లోలోపల దాచిపెట్టి దాని అంతు తేల్చుకోలేకపోయాను. నా చుట్టూ ఒక షెల్ ఏర్పరుచుకోని బయటికి రాలేకపోతున్నాను. స్నేహ బంధపు విలువలని అనుమానిస్తున్నాను.


***


చెయ్, ఆ నంబర్ డయల్ చెయ్! మూసిన ద్వారాన్ని బద్దలు కొట్టు. ఈ అంకెలే తాళపు చెవులు. వెళ్ళు.... కొంచెం దూరమే.... నీకూ, అదిగో ఆ టేబుల్ మీద పెట్టిన ఫోన్ అందుకోవడానికీ దూరం అతి దగ్గరే.... నీకు 'కావలసినది' దొరకడానికీ, 'వద్దనుకున్నది' పోవడానికీ నిమిషమే పట్టేది....

లోపల నుంచి చెప్తోన్న గొంతుని అదిమిపట్టి ఒక్కసారిగా లేచి సెల్ ని అందుకున్నాను.

నాలో ఏదో నమ్మకం - రాబోయే ఘర్క్షణ ఏదో ఉంటుందన్న నా అనుమానం తప్పనీ, ఒక వేళ ఉన్నా దాని తాలూకు ఏ ఆందోళనా నాలో ఉండదనీ, మానవత్వం ఉన్న మనిషిగా 'అడిగిన వారికి సహాయం అందించే' నిశ్చలతా, 'మనుషుల పట్ల నమ్మకాన్ని పోగొట్టుకోకూడదనే స్థైర్యం, విశ్వాసం' మరింతగా నాలో కలుగుతాయనీ....

ఒక్కో నంబరే డయల్ చేయసాగాను.

ఏం మాట్లాడతాడు ఇన్నేళ్ళ తర్వాత!? 'జరిగిన దానికి క్షమాపణలు' అంటాడా? అసలు వాటిని నేను ఆశిస్తున్నానా? నేను ఉద్యోగం మానేసిన రోజు ఫోన్ చేసి అతనిచ్చిన ఎక్స్ ప్లనేషన్ లూ, మొహమాటపు సమాధానాలూ - ఇవన్నీ సమసిపోయి, మౌనంలో కలిసిపోయాక – మళ్ళీ ఏ క్షమాపణలు మా స్నేహాన్ని నిలుపుతాయి? మళ్ళీ కొత్త ప్రారంభానికి ఏ మాటలు తోరణాలుగా నిలుస్తాయి? ఏ ధ్వనులు మానసిక తంత్రుల్ని మీటుతాయి?

నంబర్ కలిసింది. బీప్.. బీప్.. బీప్.. అని మో్రగి మ్రోగి నా ఆలోచనల తెరల్ని అమాంతం క్రిందికి జారే్చస్తూ ఒక స్వరం చెప్పింది.

..............”

వింటూ నవ్వాను - మొదట పెదవులు విచ్చుకునేట్లు... తర్వాత పెద్దగా... అ తర్వాత విరగబడి - నైరూప్య చిత్రాల రహస్యాలు చిద్రమయ్యేట్లు.....***


వంటింట్లో పని చేసుకుంటున్న రంగమ్మ నా గది వాకిట్లోకొచ్చి నిలబడి నవ్వుతున్న నన్ను ఆపేక్షగా చూస్తూ తను కూడా నవ్వుకుంటోంది.

"రంగమ్మా నీ మనవడిని కాలేజీలో చేర్చడానికి డబ్బు కావాలని అడిగావుగా, ఎంత కావాలి?” అన్నాను.

నన్ను డబ్బులు మాత్రం అడగొద్దు అని నాలుగు రోజుల క్రితమే అంతలా విసుక్కున్న నేను 'ఎంత కావాలి?' అని అడుగుతుంటే ఆశ్చర్యంగా చూస్తూ "రెండేలమ్మా, నెల నెలా జీతంలో రెండేసొందలు పట్టుకుందువు గాని" అంది.

"అలాగేలే, సాయంత్రం వెళ్ళేప్పుడు తీసుకెళ్ళు" అన్నాను.

ఆనందంగా నవ్వుతున్న రంగమ్మని చూస్తుంటే నా మనసు తేలిగ్గా ఉన్నట్లనిపించింది.


*******

No comments:

Post a Comment

P