Tuesday, June 16, 2015

చైల్డ్ లేబర్

ప్రజాశక్తి - సోపతిలో ప్రచురణ
- రాధ మండువ


రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వచ్చిన తర్వాత ప్రైవేట్ స్కూలు టీచర్లు కూడా బి.ఇడి చేయాలానే రూల్ ని పెట్టింది ప్రభుత్వం.

మాదో ప్రముఖ ప్రైవేట్ స్కూల్. బి.ఇడి క్వాలిఫికేషన్ లేకుండా స్కూల్లో పని చేసే టీచర్లు - రెగ్యులర్ ఎంప్లాయీస్ అందరూ ఇగ్నోలో దూరవిద్యలో చేరారు. గౌరవ వేతనంతో వాలంటీర్ గా రోజుకి ఒకటి లేదా రెండు క్లాసులు చెప్తాను కాబట్టి నేను కాలేజీలో చేరి చదువుకోవచ్చు కదా అనిపించింది. ప్రయాణాలంటే నాకు ఇష్టం లేకపోయినా రోజూ కాలేజీకి వెళ్ళి చదువుకుంటే కాస్త బుర్రని పదును పెట్టుకోవచ్చు అని ఆ నిర్ణయం తీసుకున్నాను.

ఒక్క సంవత్సరం కాలేజీ భాగ్యానికి స్కూటర్ కొనుక్కోవడం ఎందుకు? పోనీ ఎలా వెళితే మంచిది లాంటి తర్జనభర్జనలు విన్న మా పని అమ్మాయి సుశీల "మా తమ్ముడు మల్లి ఆటో తీసుకున్నాడక్కా..... వాడికి చెప్తాను రోజూ మిమ్మల్ని కాలేజీకి తీసికెళ్ళమని" అంది.

అదేమిటీ మల్లి ఆర్టిస్ట్ కదా! బోర్డులు రాయడం లేదా?” అన్నాను.

ఆ పని ఎప్పుడూ ఉండదుగా అక్కా!.... వాడికి బోర్డులు రాసే పనో, బొమ్మలు వేసే పనో వచ్చినపుడు వాడి బావమరిది గాని మా మామ గాని ఆటో నడుపుతారు" అంది. సరే ఇకనేం అనుకుని మల్లి ఆటో మాట్లాడుకున్నాను. దాదాపు ఏడెనిమిది కిలో మీటర్లున్న కాలేజీకి తీసుకెళ్ళి వదిలేయడం, మళ్ళీ సాయంత్రం కాలేజీ వదిలేసే సమయానికి అక్కడనుండి తీసుకురావడం - దీనికి రోజుకి ఎనభై రూపాయలు ఇమ్మని అడిగాడు.

అలా కాదులే మల్లీ.... నాకు కూడా భారం కాకుండా ఉండటానికి ఒక ఉపాయం చెప్తాను. నువ్వు నడిపేది షేర్ ఆటోనే కదా! వెళ్ళే దారిలో నాతో పాటు ఎవరైనా ఆపితే ఎక్కించుకుని వాళ్ళ దగ్గర ఛార్జీ తీసుకో. ఎవరూ రాని రోజు ఎనభై ఇస్తాను. వస్తే మాత్రం వాళ్ళిచ్చింది తగ్గించి తీసుకో" అన్నాను.

సరే అక్కా!” అన్నాడు నవ్వుతూ.

ప్రతిరోజూ ఉదయం మా స్కూల్లో నాకున్న ఒక్క క్లాసునీ తీసుకున్నాక స్కూలు గేటు ముందుకే ఆటో వచ్చేది. దారిలో చాలా మంది ఎక్కేవారు. మల్లి ఎడమ చేత్తో ఆటోను నడుపుతూ కుడి చేయిని వెనక్కి ఉంచేవాడు. అందరూ గబగబా ఛార్జీ డబ్బులు అతని చేతిలోకి వేసేసేవారు. కొంత మంది నోట్లు ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఎంతిచ్చారనైనా కూడా చూడకుండా డాష్ బోర్డుకు కట్టిన సంచీలో వేసేవాడు. నోట్లు ఇచ్చిన పాసింజర్లు దిగాక తమకు రావలసిన చిల్లర అడిగి తీసుకునేవారు. వాళ్ళెంత అడిగితే అంత సంచీలో నుంచి తీసి ఇచ్చేవాడు. ఇదంతా చూస్తున్న నాకు మొదట్లో భలే ఆశ్చర్యం వేసేది. ఎవరైనా మోసం చేస్తారేమోనని అందరినీ జాగ్రత్తగా గమనించేదాన్ని.

ఏ రోజూ కూడా ఎవ్వరూ కూడా అతనికి డబ్బులు ఇవ్వకుండా ఉండటం కాని చిల్లర తీసుకునేప్పుడు ఎక్కువ తీసుకోవడం కాని జరగలేదు. ఆటోలో ఎంతమంది ఎక్కారో లెక్క వేసుకునే వాడేమో అంతమంది ఇచ్చిన డబ్బులు తగ్గించి మిగతాది నా దగ్గర తీసుకునేవాడు. పాసింజర్స్ నీ, నిదానంగా జాగ్రత్తగా ఆటోను నడిపే మల్లినీ, అతని ప్రశాంతతని గమనిస్తూ ఉండటం వల్లనేమో నాకు ప్రయాణం చేస్తున్నంత సేపూ హాయిగా ఉండేది.

దారిలో రెడ్ సిగ్నల్ పడితే ఆగినప్పుడూ, పాసింజర్స్ ని దించడానికి స్టాఫ్ దగ్గర ఆగినప్పుడూ పళ్ళు, తినుబండారాలు అమ్ముకునే వాళ్ళు మా ఆటో దగ్గరకి చేరి కొనమని వేధించేవారు. మల్లి రేర్ వ్యూ అద్దం లోంచి వెనక్కి చూసేవాడు. ఎవరైనా కొనండన్నట్లు ఉండేవి అతని చూపులు. ఎవరైనా కొంటే సరే లేకపోతే తనే కొనేవాడు. మొదటి నాలుగైదు రోజులూ అది గమనించిన నేను పాపం మల్లికెందుకు ఖర్చు అని నాకు అవసరమున్నా లేకపోయినా కొనడం మొదలుపెట్టాను.

చిన్నపిల్లలు వస్తే మాత్రం కొనేదాన్ని కాదు. పైగా చదువుకోవాల్సిన అవసరం గురించి స్కూల్లో చేరడం గురించి గట్టిగా చెప్పేదాన్ని. వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళకున్న బాధలు చెప్పి కొనమని వాళ్ళెంత అడుక్కున్నా కొనేదాన్ని కాదు. “అబద్ధాలాడకండి, ఈసారి కనపడ్డారంటే పోలీసులకి చెప్తాను" అని బెదిరించేదాన్ని. మరీ కొంతమందిని వాళ్ళ గడ్డాలు పట్టుకుని అబ్బాయిలైతే "స్కూలుకెళ్ళాలి నాయనా" అనీ అమ్మాయిలైతే "తల్లీ" అనీ బతిమాలుకునేదాన్ని.

మల్లి నవ్వుకునేవాడు నా తాపత్రయాన్ని చూసి. సంచిలోంచి డబ్బులు తీసి తను కొనుక్కుని, వాళ్ళని పంపించేవాడు. “అలా కొనొద్దు మల్లీ! ఇలా చేస్తే వాళ్ళు ఇక స్కూలుకెళ్ళరు" అని మల్లిపై కోప్పడితే 'మా వాడికి ఈ పిప్పరమెంట్లు ఇష్టం లేక్కా!' అనో 'జామకాయలు మా ఆవిడకి ఇష్టమ'నో ఏదో ఒకటి చెప్పేవాడు.

సంవత్సరం ఎలా గడిచిపోయిందో తెలియకుండానే పరీక్షలు దగ్గరకొచ్చేశాయి. రికార్డులు రాసేప్పుడు మల్లిని బొమ్మలు గీసివ్వడం, హెడ్డింగ్ లు అందంగా రాసివ్వడం లో సహాయం అడగడానికి అతని ఇంటికి వెళ్ళాను. మల్లి భార్య ఇంటిని చక్కగా తీర్చిదిద్దుకుంది. మల్లి గీసిన చిత్రాలు గోడల మీద వేళ్ళాడుతున్నాయి. అతని కొడుకు కూడా ముచ్చటగా ఉన్నాడు. పక్కనే సుశీల ఇల్లు. ఇంట్లో మొగుడు సారాయి తాగి పడి ఉన్నాడంట. నన్ను తన ఇంటికి పిలవడానికి మొహమాట పడింది.

మల్లి నాకెంతో మర్యాద చేశాడు. బొమ్మలు గీసివ్వడమే కాకుండా ఆ పూట ఆసక్తిగా అన్ని విషయాలూ అడిగి తెలుసుకుని తనే బి.ఇడి చేసినంత ఆనందపడ్డాడు.

ఎగ్జామినేషన్ సెంటర్ గా మదనపల్లి బిటి కాలేజీ పడింది. మల్లి "పర్వాలేదక్కా నేను తీసుకెళతాగా" అన్నాడు.


2.

ఆరోజు మొదటి పరీక్ష రోజు. పెందరాడే బయలుదేరాం. వరసగా పాసింజర్స్ ని ఎక్కించుకుంటున్నాడు. దిగేవాళ్ళు దిగుతుంటే ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారు. అంగళ్ళు దగ్గర ఉన్న మా కాలేజీని దాటింది ఆటో. చేనేతనగర్ దగ్గరకు రాగానే సిగ్నల్ పడింది.

పదికి రెండు పదికి రెండు" అంటూ ఓ అమ్మాయి జామకాయలు పట్టుకుని వచ్చింది. ఆటోలో నేను, నా కుడి ప్రక్కన నలుగురైదుగురు కూర్చుని ఉన్నారు. నేనేదో చదువుకుంటూ ఆ అమ్మాయిని పట్టించుకోలేదు. యధాప్రకారం ఎవరైనా కొన్నారా లేదా అని గమనించిన మల్లి గ్రీన్ లైట్ పడ్డా కూడా పట్టించుకోకుండా గభాల్న సంచీలోంచి పది రూపాయలు తీసి రెండు జామకాయలు కొని ఆ తర్వాతే బయలుదేరాడు.

నాకు భలే కోపం వచ్చింది మల్లి పైన, కాని నా పరీక్షల ఆందోళనలో ఉన్న నేను పరీక్ష అయ్యాక అతనితో ఈ విషయం గురించి సీరియస్ గా మాట్లాడాలనుకున్నాను. ఎన్ టి ఆర్ సర్కిల్ దగ్గరకొచ్చేటప్పటికి ఎదురుగ్గా ఎల్లో సిగ్నల్ కనిపిస్తోంది. వేగంగా వెళ్ళాలని మల్లి ప్రయత్నించినా రెడ్ సిగ్నల్ పడనే పడింది.  
అబ్బా!” అన్నారు ఆటోలు ఉన్న నలుగురూ మల్లితో సహా. ఇక అక్కడ కనీసం ఐదు నిమిషాలైనా ఆగాల్సిందే.

ఈ సొసైటీ కాలనీలోంచి పోనిద్దామన్నా వీలు లేకుండా ఉందే" అంటా ప్రక్కకి తిరిగి చూశాడు మల్లి. చూస్తున్న అతను ఒక్కసారిగా "ఏయ్!” అన్నాడు. ఏమిటోనని కంగారుగా నేను వంగి అటువైపు చూశాను.

ఆ పిల్లవాడికి పన్నెండు పదమూడేళ్ళుంటాయేమో.... ఆగి ఉన్న కార్ల అద్దాల మీద కొట్టి అడుక్కుంటున్నాడు. కారు అద్దం కిందికి దిగడం, ఆ అబ్బాయి చేతిలో చిల్లర పడటం కనిపించింది.

ఏయ్" ఈసారి ఇంకా కోపంగా అరిచాడు మల్లి. ఎప్పుడూ కోపంతో వినని అతని గొంతు కొత్తగా అనిపించి అతని వైపు ఆశ్చర్యంగా చూశాను. కోపం వల్లనేమో అతని దవడ ఎముక బిగుసుకుపోయి ఉంది.

ఛీ! ఛీ! గవర్నమెంట్ వీళ్ళ కోసం ఎంత చేస్తున్నా బుద్ధి లేదు. చిన్నప్పటి నుంచీ డబ్బులు సంపాదించడం అలవాటయితే ఇక స్కూళ్ళకెందుకు వెళతారు?” అన్నాను విసుగ్గా.

మల్లి విసురుగా తల తిప్పి ఎడమ భుజం మీదుగా నన్ను చూశాడు. అతని చూపులోని తీవ్రతకి నా నోరు మూత పడింది కాని నా అహం బుస్సున పైకి లేచింది. 'టీచర్ నన్న భయం, గౌరవం లేకుండా నా వైపు కోపంగా చూస్తున్నాడే' అనే భావన నాలో. “ఏంటి మల్లీ....” ఇంకా ఏమనేదాన్నో కాని నా మాటలను వినిపించుకోకుండా డబ్బుల సంచిలో చెయ్యి పెట్టి చేతికొచ్చినంత డబ్బు తీసుకోని ఆటో ఇంజన్ ఆపి ఆ పిల్లవాడి వైపు పరిగెత్తాడు.

అందరం మల్లి వెళ్తున్న వైపు చూడసాగాం. నేను బాగా వంగి గమనించసాగాను. ఆ అబ్బాయికి దగ్గరగా వెళ్ళిన మల్లి వాడి చేయి పట్టి లాక్కుని మా ఆటోకి కుడి వైపునున్న భవానీ స్టోర్స్ లోకి తీసికెళ్ళాడు.

గ్రీన్ సిగ్నల్ పడింది. చెవులు బద్దలయ్యేట్లు హారన్లు మోగిస్తూ మా ఆటోని దాటుకుని కార్లు, ఆటోలు, బైక్ లు వెళుతున్నాయి. నేను దిగి ఆటోకి ప్రొటెక్షన్ అన్నట్లుగా డ్రైవర్ సీట్ దగ్గర నిలబడి చేతులూపుతూ సైడ్ తీసుకోని వెళ్ళమన్నట్లుగా సైగలు చేయసాగాను. ఆటో లోపలున్న నలుగురు ఆడవాళ్ళూ కలగాపులగంగా మాట్లాడుకుంటున్నారు.

కాసేపటికే గబగబా వస్తున్న మల్లి. అతని వెనుక యాభై పాపిన్స్ పాకెట్స్ ఉండే అట్ట పెట్టెని గుండెలకి ఆనించుకుని అపురూపంగా పట్టుకుని ఆ బాబు.

మల్లిని చూసిన నేను నా సీట్ లోకి వెళ్ళి కూర్చున్నాను. “ఇవి అమ్మేసెయ్. సరుకు అయిపోతూ ఉండగానే మళ్ళీ అక్కడికే వెళ్ళి సరుకు తీసుకో. లాభం డబ్బులే ఇంటికి తీసుకెళ్ళు సరేనా?” అని అతని తల నిమిరి ఆటో ఎక్కాడు మల్లి.

నేను తలవంచి ఆ ఇద్దరినీ చూస్తున్నాను. “సరే అన్నా" అంటూ తల ఊపుతున్న ఆ బాబు కళ్ళల్లోని నీటి పొర నా దృష్టిలో పడింది. నాలోని అహం ఆ నీటితో తడిసి ఆర్ద్రమైంది కాని లోపల గుండెనెవరో మెలి పెట్టేసినట్లు బాధ.

ఆ బాబుని దాటుకోని ముందుకి దూసుకుపోయిన ఆటో గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఆగింది. "ఆటోని అట్లొదిలేసి పోతే ఎట్లప్పా” అని మల్లితో మాట్లాడుతున్న నలుగురూ దిగారు. వాళ్ళు దిగాక కొంచెం ముందుకు పోయి బిటి కాలేజీ వైపుకెళ్ళడానికి మలుపు తిరిగింది. దూరంగా కాలేజీ గేట్ కనిపిస్తోంది. అప్పుడన్నాను "మల్లీ! నువ్వు చేసింది చాలా తప్పు.... చిన్నపిల్లల చేత పని చేయించడం చాలా చాలా తప్పు" అని.

అప్పటికే గేటు దగ్గరకి చేరాము. అమర్ బుక్ స్టాల్ కి ప్రక్కగా ఆటోని సైడ్ కి తీసి ఆపి వెనక్కి నా వైపుకి తిరిగి చూస్తూ "అక్కా! మీరు పెద్ద పెద్ద చదువులు చదువుకున్నోళ్ళు, గొప్పోళ్ళు. ఇళ్ళల్లో ఎంత పేదరికం ఉంటే బడికి పోకుండా పిల్లలు పనులు చేసుకుంటున్నారో మీకేం తెలుసు? చెప్పినా మీరు నమ్మరు. మనుషుల మీద ఉండాల్సింది నమ్మకం అక్కా! ఇందాక 'డబ్బులకలవాటయ్యారని' ఆ అబ్బాయిని మీరు ఎంత అసహి్యంచుకున్నారు?” అన్నాడు. అతని గొంతులో ఆవేదన.

నిజమే మల్లీ, తప్పుగా అనుకోకు. ఆ అబ్బాయి అడుక్కుంటున్నాడన్న కోపంతో అన్నాను. కాని నీకు తెలుసా మల్లీ! పేదరికం వల్ల చైల్డ్ లేబర్ ఉంది అని అందరూ అనుకుంటారు కాని చైల్డ్ లేబర్ వల్లే చాలా వరకు పేదరికం ఉంది, ఉంటుంది - ఆలోచించు" అన్నాను.

ఏమిటీ!!? నాకర్థం కావడం లేదు మీరేమంటున్నారో" అన్నాడు.

అతనికి ఎలా చెప్పాలో ఒక్క క్షణం అర్థం కాలేదు. ఆశ్చర్యంగా, తెలుసుకోవాలన్న ఆసక్తితో చూస్తున్న మల్లితో "చదువుకున్న నువ్వెలా ఉన్నావో, చదువులేని మీ అక్క జీవితం ఎలా ఉందో కాస్త ఆలోచించు. నువ్వే సత్యాన్ని తెలుసుకుంటావు" అన్నాను.

నా మాటలకి ఇంకా అలాగే చూస్తున్న మల్లిని ఆలోచనల్లోనే వదిలి నేను ఆటో దిగి గేటు వైపు నడుస్తుండగా కైలాష్ సత్యార్థి నా ప్రక్కనే ఉన్నట్లనిపించింది. నా కళ్ళ నిండా కన్నీళ్ళు చేరాయి.

సత్యార్థీ! మేధతో, సమాజ శ్రేయస్సుతో నేనతన్ని జయించగలిగినా హృదయంతో ఆలోచిస్తే 'ఈ క్షణంలో ఉన్న సమస్య'కి పరిష్కారం చూపగలిగిన అతను నన్ను జయించినట్లే అనిపించడం లేదూ!!?” అన్నాను.

కన్నీళ్ళ వల్ల చెరిగిపోయిన అతని రూపు ఏదో చెప్తూ మాయమైపోయినట్లయింది. వినాలని గబగబా కళ్ళు తుడుచుకుంటూ వేగంగా నడుస్తున్న నన్ను చూసిన గేట్ మెన్ 'కాలేజీ' గేటుని బార్లా తెరిచాడు.

*******

2 comments:

 1. పేదరికం వల్ల చైల్డ్ లేబర్ ఉంది అని అందరూ అనుకుంటారు కాని చైల్డ్ లేబర్ వల్లే చాలా వరకు పేదరికం ఉంది, ఉంటుంది - ఆలోచించు
  ---------------
  నాకూ అర్ధం కాలా ! పేదరికం దానికి మూలం అయితే పేదరికం జయించటానికి ఒక మార్గం చూపెట్టకుండా చైల్డ్ లేబర్ ని బాన్ చేస్తే ఏవిధంగా బాన్ నిలుస్తుంది ?

  స్టొరీ కి కామెంట్ ఏమిటి అనుకున్నా కానీ చాలామంది చైల్డ్ లేబర్ ఎందుకు చేస్తున్నారో ఆలోచించరు. ఎందుకో కామెంట్ పెట్టాలనిపించింది.

  ReplyDelete
 2. చదువుకుంటేనే మనిషి అన్ని రకాలుగా ఎదుగుతాడు. అలా కాకుండా చిన్నప్పటి నుండీ పని చేస్తుంటే చదువులేకుంటే ఎలా అభివృద్ధిలోకి వస్తాడు? అతని కుటుంబం (చాలా కుటుంబాలు) పేదరికంలోనే ఉంటాయి. కాదంటారా? ఇక మీరన్నట్లు పేదరికం జయించడానికి మార్గం (చాలా వరకు) చదువే... అందుకే కైలాష్ సత్యార్థి లాంటి ఎంతో మంది పోరాడి మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకొచ్చారు.

  ReplyDelete

P