Tuesday, March 22, 2016

రావిచెట్టిల్లు

తెలుగు వెలుగులో నేను రాసిన కథ చదవండి ఫ్రెండ్స్, బొమ్మ చాలా చక్కగా ఉంది, కథ బావుందంటూ చాలా ఫోన్స్ వచ్చాయి నాకు. ఫోన్ చేసిన వాళ్ళల్లో ఎక్కువ మంది వృద్ధులు. (అన్నట్లు మీకో విషయం చెప్పాలి, అదేమిటో నాకు పెద్దవాళ్ళు భలే తొందరగా ఫ్రెండ్స్ అయిపోతారు :) ) వాళ్ళతో మాట్లాడుతుంటే చాలా సంతోషం కలిగింది. బోలెడన్ని ఆశీర్వాదాలు దొరికాయి. మీరూ  చదువుతారని... - మీ రాధ

//రావి చెట్టిల్లు// రాధ మండువ

ఆ ముసలి వాళ్ళిద్దరికీ వంట చేసిపెడుతూ, చేతి సాయంగా నేను దాదాపు ఐదేళ్ళకి పైనే సేవ చేశాను. నా ఆశ, ఆత్రం వల్లే వాళ్ళింట్లో పని పోయింది. ఆ పని ఉన్నన్నాళ్ళూ దాని విలువ నాకు తెలియలేదు. ఇప్పుడు ఎక్కడ పని ఉంటే అక్కడికి వెళ్ళి అడుక్కోని ఎండలో గొడ్డు చాకిరి చేయాల్సొస్తోంది. నెల నించీ మరీ ఒక్కొక్కరోజు పిల్లలకి కడుపు నిండా అన్నం కూడా పెట్టుకోలేక పోతున్నాను. ఇలా ఎందుకు చేశానా అని ఏడ్చుకుంటూ నాలోకి నేను విమర్శగా చూసుకోవడమే సరిపోతుంది... మరీ ఈమధ్య ఎక్కువగా.

తూరుప్పక్క చేల మధ్య పడ్డ రోడ్డుకి మరమ్మత్తులు చేస్తన్నారంట అక్కడకి పోయి పని అడిగి రావాలని లేచి బయల్దేరాను. మళ్ళీ ముసలోళ్ళిద్దరూ కళ్ళమందు మెదిలారు....

2.

వాళ్ళు ఈ ఊరి వాళ్ళు కాదు. నెల్లూరోళ్ళు. ముసలాయన కొడుకుకి పల్లెటూళ్ళంటే ఉన్న ఇష్టం తో ఇక్కడ స్థలం కొని ఆ ఇల్లు కట్టాడంట. ప్రహరీ గోడకి ప్రక్కగా పేద్ద రావిచెట్టు రోడ్డుకి ఆనుకుని ఉంటుంది. ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో నిమ్మ, దానిమ్మ, సపోటా, మామిడి చెట్లు ఉన్నాయి. ప్రతి సంవత్సరం వాటికి కాసే కాయలు సగం నేనే కాజేసేదాన్ని. ముసలాయన ఆ రావి చెట్టు కింద కట్టిన అరుగు మీద కూర్చుని ఎప్పుడూ చదువుకుంటూనో, రాసుకుంటూనో ఉండే వాడు. పెద్ద ఉద్యోగం చేసి రిటైరయ్యాడంట.

"మీ కొడుకు మిమ్మల్ని బాగా చూసుకుంటాడమ్మా ఏ లోటూ లేకుండా" అంటే "మమ్మల్నెవరూ చూసుకోబన్లే అయ్యగారికి ఇరవై వేలు పెన్షన్ వస్తుంది" అంటుంది ముసలావిడ చిరాగ్గా.

'ఓర్నాయనో! డబ్బుంటే చాలా!? ఈమె కుర్చీ మీద నుండి లేవలేదు, ఆయన రావి చెట్టు అరుగు దాటి కిందికి దిగడు. అయినా 'కొడుకు వల్ల అన్నీ అమరుతున్నాయి' అని మనసులో కూడా అనుకోని వాళ్ళ మనస్తత్వానికి ఆశ్చర్యపడేదాన్ని.

ఆవిడ చూడటానికి అమాయకురాలని దూరంగా ఉండి చూసేవాళ్ళు అంటారు గాని ఒట్టి స్వార్థపరురాలనిపిస్తుంది నాకు. భారీ మనిషి. వంద కిలోల బియ్యం బస్తా మాదిరి గట్టిగా ఉంటుంది. కొడుకు స్పెషల్ గా ఆర్డర్ ఇచ్చి చేయించిన ఇనప కుర్చీలో బిర్రుగా డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని కదలదు. ఏం కావాలన్నా ముసలాయన లేచి ఇవ్వాల్సిందే.

భర్తకి పోటీగా ఎప్పుడూ రాస్తుండేది. “ఏం రాస్తున్నావమ్మా?” అని దగ్గరకి వెళ్ళి చూడబోతే "నీకేమి అర్థం అవుతుందే, పేరుకే నీది డిగ్రీ, అఆ లు కూడా సరిగ్గా రాయలేవు, నోరు మూసుకుని పని చేసుకో ఫో" అనేది రాస్తున్న పుస్తకం మూసేస్తూ.

“హ!హ!హ! ఏం రాస్తుందీ!? నీ గురించే.... హేమ ఇవాళ కూరలో కరివేపాకు వేయలేదు, వంకాయ పచ్చడి చేసింది, సాంబార్ బాగా లేదు, ఎర్ర చీర కట్టిందీ... ఇవే కదా రాసేది మీ అమ్మ గారు" అని నవ్వించేవాడు ముసలాయన.

“మీరూరుకోండీ.... మీకెందుకూ నేనేం రాస్తే.... అయినా పనోళ్ళతో ఏంటి మీకు మాటలు.... అసలు వాళ్ళకి అర్థం కాకుండా నాతో ఇంగ్లీషులో మాట్లాడండీ...” అనేది అరుస్తా. ఆయన ఇంకా పెద్దగా నవ్వేవాడు. నాకు నవ్వు ఆగేది కాదు.

కొడుకు కోడలు టౌనులో ఉంటారు. వారానికో రెండు వారాలకో ఒకసారి కొడుకు వచ్చి చూసి పోతాడు. వచ్చేప్పుడు ఇంటికి కావలసినవన్నీ కారునిండా వేసుకోని వస్తాడు. వచ్చిన ప్రతిసారీ నాకు కృతజ్ఞతలు చెప్పుకుంటాడు. 'మా అమ్మానాన్నలని బాగా చూసుకుంటున్నావు హేమా! నీ రుణం తీర్చుకోలేనిది' అంటాడు పాపం. కోడలు నాలుగైదు నెలలకొకసారి మొక్కుబడిగా వచ్చేది. అత్త ఎదురుగ్గా కుర్చీలో కూర్చుని ఏవో చీరల గురించీ, నగల గురించీ పొడిపొడిగా మాట్లాడేది.

ముసలాయనైతే కోడలు వైపు చూసి నవ్వి పేపర్లో తల దూరుస్తాడు. “బాగున్నావా? ఇహిహి" అని ముసలమ్మే తపతపలాడేది.

భార్యకి భయపడేవాడు ముసలాయన. "వయసులో ఉన్నప్పుడు నా మీద ఎంత దాష్టీకం చేసేవాడో ఇప్పుడు చూడు హేమా, నోట్లో నాలుక లేని వాడిలా ఎలా ఉన్నాడో" అని హుషారుగా ఉన్నప్పుడు ఆయన మీద నాకు చాడీలు చెప్పేది.

ఇద్దరూ ఒకేసారి భోజనానికి కూర్చునే వారు. “ఇతరుల మీద ఆధారపడకుండా ఇలా తిరుగుతున్నప్పుడే చనిపోతే బావుండు" అనుకునే వారు అప్పుడప్పుడూ. ఈ విషయం లో మాత్రం ముసలామె భర్త మాటకి "ఊ" అనేది తప్ప ఇక ఏ విషయంలోనూ ఆయనతో ఆమె ఏకీభవించేది కాదు.


3.

ఆలోచనల్లో పడి ఆ ఇల్లున్న వీధిలోకి వచ్చాను. నాకు తెలియకుండానే నా కాళ్ళు ఇటువేపు లాక్కువచ్చాయి. ముసలాయన ఎప్పటిలాగే రావి చెట్టు కింద ఎత్తరుగు మీద కూర్చుని పేపర్ చదువుకుంటున్నాడు. ప్రహరీ గోడ మీదుగా నన్ను చూస్తాడేమో, పలకరించాల్సొస్తుందేమోనన్న ఇబ్బందితో చూసీ చూడనట్లుగా చూసుకుంటూ గబగబా ఇంటిని దాటి ముందుకెళ్ళాను.

“ఏందే హేమా బాగున్నావా ఏడకీ...” అడిగింది పద్మ ఎదురొచ్చి.

సంవత్సరంలో ఆరు నెలలు ఆ రావిచెట్టు రాల్చే ఆకులు ఊడ్వటానికి ఊరికి దూరంగా మిట్టమీద కొత్తగా కట్టిన ఇందిరమ్మ నగర్ లో ఉండే పద్మని పెట్టుకున్నారు. ఎప్పుడన్నా నాకు ఇబ్బందై రాకపోతే పద్మే వంట చేసి పెట్టేది వాళ్ళకి.

“కూరకి - రామక్కోళ్ళ తోట కాడికి పోయి - నాలుగు టమాటాలు తెచ్చుకుందామని పోతన్నాలే గాని అమ్మగారు అయ్యగారు ఎట్లున్నారు?” అన్నా.

“అట్నించేగా వస్తన్నావు... లోపలకి పోయి పలకరించి రాకపోయావా? ” అంది.

“ఆఁ తర్వాతెప్పుడన్నా వచ్చి పలకరిస్తాలే... బాగానే ఉన్నారుగా" అని "వాళ్ళబ్బాయి వస్తే నాకు చెప్తావా పద్మా?” అన్నాను ఏమీ బయట పడకుండా.

“నీకు తెలియదా! వాళ్ళబ్బాయి ఏదో పని మీద అమెరికాకి పోయాడంట. వస్తే చెప్తాలే" అంది నా వైపు పరిశీలనగా చూస్తూ.

నేను మానెయ్యగానే పద్మ పక్కింట్లో ఉండే రామిగాడి కొత్త పెళ్ళాం లావణ్యని పనికి కుదిర్చిందంట.

నా మొగుడొచ్చి గోల చేశాడని పనిలోంచి తీసేశారని అందరూ అనుకుంటున్నారు కాని ముసిలోళ్ళు ఇక నన్ను రానియ్యరన్న సంగతి పద్మకి తెలియదా? నేను చేసిన పని చెప్పి ఉంటారేమో అనుకోగానే నా తల వాలిపోయింది.

"అబ్బ, ఎండ మండిపోతంది తల్లా!” అని - ఇంకేం అడుగుతుందో ఏమో అనుకుని కొంగుని తలపైకి లాక్కుని - గబగబా అక్కడ నుండి ముందుకి నడిచాను.


4.

నన్నింకేమి రానిస్తారు ఇంట్లోకి? పోగొట్టుకున్నాను మంచి పనిని. కళ్ళల్లో నీళ్ళు ఊరాయి.

మాది కూడా ఈ ఊరు కాదు. మా చిన్నమ్మోళ్ళూరు. ముసలోళ్ళని చూసుకోవడానికి మనిషి కావాలంటే మా చిన్నమ్మ నన్ను పిలిపించింది. నా తాగుబోతు మొగుడిని వదిలిచ్చుకోని బిడ్డలిద్దర్నీ తీసుకోని వచ్చాను.

నేను వచ్చినప్పుడు వంట చేయడానికి ఒక మనిషి ఉండింది. ముసలమ్మకి కాలు మీద కురుపు లేచి నడవలేని స్థితిలో ఉంటే నన్ను నర్సు పనికన్నట్లుగా పెట్టుకున్నారు. మంచం లోనే అన్నీ చేయవలసి వచ్చింది. చీదరించుకోకుండా చేశాను.

అబ్బ! ఆరు నెలలు టిబి అనీ, జాండిస్ అనీ తెగ మందులు మింగింది. కొడుకు రోజూ వచ్చి చూసి పోయేవాడు. ఈమెకి కురుపు తగ్గిపోయే సమయానికి నా అదృష్టం బాగుండి వంటామె మానేసింది. నేనే చేసుకుంటానని ఆ ఇంట్లో పూర్తి పనికి కుదురుకున్నాను.

వాళ్ళని అంత బాగా చూసుకున్న దాన్ని ఆ దరిద్రపు దొంగతనం ఆలోచన నాకెందుకు కలిగిందో... కలిగాక ఆ అలవాటు వదల్లా... వాళ్ళు రూమ్ కి తాళం వేసుకునే దాకా నాకు 'తప్పు చేస్తున్నానన్న' భావన కూడా కలగ లేదు. వాళ్ళు తినగా ఏమన్నా మిగిలితే డైనింగ్ టేబుల్ మీద పాచి పోవాల్సిందే కాని ఇవ్వడం తెలియకపోతే ఏం చేయాల తీసుకోక? అని అనుకునేదాన్ని.

వాళ్ళకి అన్నీ ఎంత ప్రేమగా అమర్చాను? ముసలమ్మకి ఎంత సేవ చేశాను? అయినా వాళ్ళ నోటితో 'ఇదిగో ఈ పండు తీసుకోని పోయి పిల్లలకి పెట్టుకో, ఈ పాత చీర తీసుకో' అనే వారు కాదు.

ప్రేమ ఇవ్వడం తెలియని మనుషులు. పోనీ ప్రేమ తీసుకునే వారా అంటే అదీ లేదు. ఏదో యాంత్రికంగా పెట్టింది తినడం, చేస్తానన్న పనులు చేసేసి వెళ్ళిపోయిందా లేదా అని చూడటం అంతే. పని బాగా చేయకపోయినా పెద్దగా అడిగే వాళ్ళు కాదు. జీతం డబ్బులు మాత్రం ఒకటవ తేదీ నాడు తుచ తప్పకుండా చేతిలో వేసేవారు.

నా మొగుడితో నాకున్న బాధలు చెప్పబోతే - ముసలామె 'చ్చ్! చ్చ్! చ్చ్!' అనేది సగం వినకుండానే. ముసలాయన పేపర్లోనుండి తల కూడా ఎత్తేవాడు కాదు.

నా మొగుడికి నేను రెండో పెళ్ళాన్ని. మొదటి పెళ్ళాం వదిలిపెట్టి పోయింది. అదేందో వాడి రాత - ఇద్దరం చదువుకున్నోళ్ళమే దొరికాం. వాడు కూడా డిగ్రీ వెలగబెట్టాడులే. పెయింట్ పని చేస్తాడు. టీచర్ ట్రైనింగ్ చేసిన ఆ మొదటామెకి అదృష్టం బాగుండి గవర్నమెంట్ టీచర్ గా ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం రాగానే విడాకులు తీసుకుంది.

ఉద్యోగం ఉందన్న గర్వంతో మొగుడ్ని వదిలి పెట్టిందన్నారు జనం . కూటికి కూడా జరుగుబాటు లేక బాధపడుతున్న మా అమ్మ - లోకం మాటలని నమ్మి నన్ను వీడికి కట్టబెట్టింది.

ఇలాంటి వెధవలని వదిలేసిపోవడమేనా చేయవలసింది ఆడవాళ్ళూ.... వాళ్ళ గురించి నలుగురికీ చెప్పి నానా యాగీ చేయవలసిన బాధ్యత లేదా!!? వదిలేసిన మనిషి వీడి గురించి చెప్పి రచ్చ చేసినట్లైతే నా గొంతు కోసేది కాదు కదా మా అమ్మ!?

ఈ ఊరికి చేరి ఇక్కడ కుదురుకోగానే మళ్ళీ నా వెనకే వచ్చి ఇంట్లో చేరాడు. బాగా జీతం వస్తుంది. ఇంట్లోకి కావలసిన బియ్యం, పప్పులు, పండ్లు ఒకటని కాదు ఏది దొరికిదే అది దొరికిచ్చుకుని తెచ్చుకుంటున్నానుగా... 'చావనీయ్ లే' అని వాడికి కూడు వేసేదాన్ని.

వస్తువులు పోతున్నాయని తెలిసినా ముసలోళ్ళు నన్నేమీ అడగలేదు. నేను మానేస్తే జరగదు కనుక గుటకలు మింగుకుని ఉన్నారో లేక కనిపెట్టలేకపోయారో తెలియలేదు.

స్టోర్ రూమ్ కి తాళం వేయడానికి ముందు రోజు "ఇక్కడ పెట్టిన బిస్కెట్ పా్యకెట్ ఏమయింది హేమా?” అని అడిగింది ముసలామె. “నాకేం తెలుసు?” అన్నాను నిర్లక్ష్యంగా చూస్తూ.

తర్వాత రోజు నేను వెళ్ళేప్పటికి స్టోర్ రూమ్ తాళం వేసి ఉంది. ముందురోజు కొడుకు వచ్చి పోయాడుగా, అది అతనిచ్చిన ఐడియా అయి ఉంటుంది అనుకున్నాను.

“ఏందమ్మో తాళాలేసుకున్నారు?” అన్నాను దాష్టీకంగా.

“అబ్బాయేందో ముఖ్యమైన కాగితాలు పెట్టుకున్నాడంట హేమా గదిలో - తాళం వేసి ఉంచమన్నాడు" అంది ముసలమ్మ నట్టునట్టుగా.

నేను మెదలకుండా ఊరుకున్నాను. ముసలాయన నన్ను వంటకి కావలసినవి తీసుకోమని, తీసుకున్నాక మళ్ళీ తాళం వేసేవాడు. వంట చేసినంత సేపూ ముసలమ్మ రాసుకోవడం ఆపి కళ్ళజోడులోంచి అప్పుడప్పుడూ నా వైపు చూస్తూ ఉండేది.

ఇంక నా చేతులు కట్టేసినట్లయింది. వచ్చిన జీతం డబ్బులు చీటీకి కట్టడానికి సరిపోయేవి. బాగా జరుగుబాటుంది కదాని చీటీ వేసి ఎత్తి కమ్మలు కొనుక్కున్నాను.

ఇంట్లో మొగుడితో మళ్ళీ గొడవలు మొదలయ్యాయి. సంపాదించిందంతా తాగుడికి ఖర్చు పెట్టుకోని ఇంట్లో పడి తినడం మరిగిన వాడికి తిండి ఎక్కడ నుంచి తెచ్చి పెట్టేది?

"కుక్కకేసినట్లు పచ్చడి మెతుకులు వేస్తన్నావే? డబ్బులన్నీ ఏం చేస్తన్నావే?” అని పైనబడి కొట్టడం, బూతులు తిట్టడం.

ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్నప్పుడు నా చెవులకున్న కమ్మలు కాజేసి నాలుగు రోజులు కనపడకుండా పోయాడు. ఏడ్చి ఏడ్చి నాకు కళ్ళు వాచిపోయాయి.

ఐదో రోజు రాత్రి పదిగంటలప్పుడు పూలరంగడిలా కొత్త చొక్కా లుంగీ కట్టి తాగొచ్చి వాగుతుంటే రోకలి బండ తీసుకోని వెంట బడ్డాను.

“నన్ను కొట్టేదానికి కూడా తిరగబడతన్నావా!? వాళ్ళ ఉద్యోగం చూసుకోనే నీకు బలుపు ఎక్కువయింది. ఆ ముసలోడి సంగతి తేలుస్తా" అంటా వాళ్ళింటి మీదకి పోయాడు.

ఈ తాగుబోతోడు వాళ్ళనేమంటాడోనని నిద్రపోతున్న మా చిన్నమ్మోళ్ళని, ఊరోళ్ళందరినీ లేపి వాళ్ళని వెంటేసుకుని వెళ్ళేప్పటికే "నా పెళ్ళాన్ని పనిలోంచి తీసేశావా సరే లేకపోతే మిమ్మల్ని నేనేం చేస్తానో నాకే తెలియదు" అని పెద్ద పెద్దగా అరుస్తా ముసలాయన్ని నానా మాటలూ అంటా ఉన్నాడు.

ఊళ్ళో వాళ్ళంతా "ఏందాయన్ని నువ్వు చేసేది ఫా" అంటా వీడ్ని తన్ని ఊళ్ళో లేకుండా తోలారు.

తెల్లవారి పనికి వెళ్ళేప్పటికి లోపల గడేసుకుని "పనికి వద్దులే హేమా! మేము అబ్బాయి దగ్గరకి వెళుతున్నాం" అన్నాడు ముసలాయన కిటికీ లోంచి.

పాపం! భయపడి ఉంటారు. 'ముందు వీడిని వదిలించుకోని రావాల. అప్పుడు పనికి రానిస్తారు, ఇన్నేళ్ళు వాళ్ళకి నేను చేసిన సాయాన్ని మర్చిపోరులే' అనుకున్నాను. అప్పటికప్పుడే చిన్నమ్మని తీసుకోని పోయి నా మొగుడి మీద పోలీసు కంప్లయింట్ ఇచ్చి అటునుండి అటే లాయరు దగ్గరకి వెళ్ళి విడాకులకి కూడా రాసుకున్నాను.

కోర్టుకి, లాయర్లకి డబ్బులు పోసేదెందుకు అనుకుని నా మొగుడి అమ్మనాన్న వచ్చి పోలీసులకెదురుగ్గా రాజీ చేయించి వాడిని తీసుకోని పోయారు.

ఆ దరిద్రం వదిలేప్పటికి రెణ్ణెళ్ళు పట్టింది.

పని నాకు ఇవ్వమని అడుగుదామని రావిచెట్టింటికి వెళ్ళాను. ముసలాయన నన్ను వాకిట్లో చూసి పలకరింపుగా నవ్వి తల పేపర్లోకి దూర్చాడు.

“బాగున్నారా అయ్యగారూ?” అన్నాను.

“ఆఁ బాగున్నా. నువ్వు బాగున్నావా?” నా సమాధానం అక్కర్లేదన్నట్లుగా మళ్ళీ తల పేపర్లోకి పెట్టేశాడు.

లోపలకి పోదామని తలుపు లాగాను. నన్ను చూసిన ముసలామె "ఎవరూ.... హేమా! ఎందుకొచ్చా? ఫో! ఫో!” అని కుక్కను తరిమినట్లు పెద్దగా అరిచింది.

దిమ్మెరకి పోయాను. “ఏందమ్మో! ఫో అంటున్నావూ... పలకరిద్దామని వస్తే" అన్నాను.

“ఏం పలకరించక్కర్లేదులే ఫో! అమ్మాయ్ లావణ్యా అయ్యగారిని లోపలకి పిలువు" అని వంటింట్లో పని చేసుకుంటున్న కొత్త పనిమనిషికి చెప్పి "ఏమండీ! ఏమండీ! మీరు లోపలకి రండి" అని తచ్చడ తచ్చడగా అరుస్తా ముసలాయన్ని కేకేసింది.

“అవునులే ఇన్నాళ్ళూ మీకు చేసిన సాయం గాలిలోకి పోయింది" అన్నాను.

“మా ఇంట్లోని సామానంతా నీ ఇంటికి చేరేసుకున్నప్పుడే గాలిలో కలిసిపోయిందిలే నీ సహాయం ఫా, నీతో మేము మాట్లాడలేం గాని" అన్నాడు కఠినంగా ముసలాయన. తలుపు తీసి లోపలకి వెళ్ళి లోపల్నుంచి గడి పెట్టుకున్నాడు.

నాకు నోటి వెంట మాట రాలేదు. నిస్సత్తువగా గడపలు దిగి గేటు తీసుకుని బయటకి వచ్చేశాను.

5.

“ఏంది హేమా ఇటుబడి వచ్చావ్? " అంది చేలో పని చేసుకుంటున్న మా పక్కింటి రామక్క.

బియ్యము, పప్పులు దొంగతనంగా తెచ్చినన్నాళ్ళూ వండిన దాంట్లో రామక్కకి పెట్టేదాన్ని. వాళ్ళు స్టోర్ రూముకి తాళం వేశాక "తిండికి కష్టంగా ఉందక్కా" అంటే - 'ఎందుకులేవే ఆ పన్లు, ఉన్నదేదో సర్దుకు తినాలి. ఇన్నాళ్ళూ నాకు పెట్టావు. కూరకీ నారకీ నా చేలో టమాటాలు తెచ్చుకుందువు గానిలే' అనాల్సింది పోయి "కుక్కర్లోకి బియ్యం కొలిచి పోసుకునేప్పుడు ఎక్కువ పోసుకోవే, వండినవి డైనింగ్ టేబుల్ గిన్నెల్లో సర్దేప్పుడు పొయ్యికాడే అటు తిరిగి నిలబడి నాలుగు ముద్దలు నోట్లో వేసుకో, ముసిలోళ్ళు చూస్తారా ఏమన్నానా?” అన్న రామక్క మాటలు గుర్తొచ్చి టమాటాలు అడగబుద్ధి కాలేదు.

"చేసిన తప్పుడు పనులు గురించి ఆలోచిస్తా ఉంటే కాళ్ళు ఇటు లాక్కొచ్చాయిలే రామక్కా!" అంటా ఆమె తోటని దాటి "దుక్కుల్ని" తప్పించుకోని రోడ్డెక్కాను.

నా పక్కగా కారు ఆగింది. తలుపు తీసుకుని అయ్యగారబ్బాయి దిగాడు.

అప్రయత్నంగా నమస్కారం చేశాను. కళ్ళ వెంబడి నాకు తెలియకుండానే కన్నీళ్ళు తిరిగాయి.

“హేమా, బావున్నావా? ఎక్కడకి ఎండలో పోతున్నావు?” అన్నాడు.

ఇక ఉద్వేగం ఆపుకోలేకపోయాను. నాకు తెలియకుండానే నా నోట్లోంచి మాటలు దొర్లుతున్నాయి. చేసిన పనులూ, దాని వల్ల నాకు కలిగిన బాధ, వాళ్ళ మీద నేను పెట్టుకున్న ఆశలు అన్నీ... అన్నీ... మాట్లాడుతూనే ఉన్నాను. మాట్లాడి మాట్లాడి అలాగే కాళ్ళ మీద కూలబడిపోయాను.

తర్వాత ఏమయిందో నాకు తెలియలేదు.

లేచి చూసేప్పటికి నా చుట్టూ జనం. అమ్మగారు కుర్చీలో నా పక్కనే కూర్చుని ఉన్నారు. అయ్యగారు, వాళ్ళబ్బాయి, ఇంకా మా వాళ్లు కొంతమంది నా ముఖంలోకి చూస్తూ అక్కడే నిలబడి ఉన్నారు. రావి చెట్టు నాకు నీడనిస్తూ నన్ను తన చల్లగాలితో సేద తీరుస్తోంది.

ఇక దిగులేమీ లేదన్నట్లు శాంతిగా కళ్ళు మూసుకున్నాను.

*******

No comments:

Post a Comment

P