Tuesday, March 22, 2016

శేఫాలిక

//శేఫాలిక// - ఈ వారం నవతెలంగాణాలో నేను రాసిన కథ.

"రాధగారూ, లివ్ ఇన్ రిలేషన్ షిప్ టాపిక్ తీసుకొని ఏదైనా కథ రాయకూడదా!?" అనిVanaja Tatineni గారు చాలా నెలల క్రితం నాతో అన్నారు. రాశాను, తృప్తిగా రాలేదు. నానేశాను చాలా రోజులు. మొన్నామధ్య దాన్ని బయటకి తీసి ముందు వెర్షన్ ని fb లో పెట్టాను కూడా ఓ గంట సేపు. కాని అస్సలు నచ్చలేదు. ఈ హాస్పిటల్, ఈ టీచర్ కా్యరెక్టర్ ఇవన్నీ ఏమీ లేకుండా రాసిందనమాట ముందు వెర్షన్. ఈ లోపు Revathi Ravuri గారు చదివేశారు. వెంటనే మెసేజ్ పెట్టారు, చెప్పాను ఎందుకు తీసేశానో. కొన్ని మార్పులు చేర్పులు చేసి పెట్టండి. కథ బావుంది అన్నారు. సో మళ్ళీ దాని మీద కాస్త పని చేసి క్రాఫి్టంగ్ చేసుకుని గుడిపాటి వెంకట్ గారికి (నవ తెలింగాణాకి) పంపాను. సరే, పత్రికలో వేసుకున్నారనుకోండి. వేస్తున్నట్లు చెప్పొద్దూ... ఇప్పుడే వనజగారు మెసేజ్ పెడితే తెలిసింది ఈరోజు ఈ కథ వచ్చినట్లు. వనజగారికి థాంక్స్ చెప్పుకుంటూ... వెంకట్ గారిని విసుక్కుంటూ... (అయినా ఆయనంటే నాకు చాలా గౌరవం లెండి ఫ్రెండ్స్), కథని చదవమని మిమ్మల్ని కోరుకుంటూ - మీ రాధ శేఫాలిక
- రాధ మండువ

గుట్టమీద శిధిలమైపోతున్న మర్రిచెట్టు క్రింద కూర్చున్నాను. చిక్కపడుతున్న చీకటి నన్ను మింగేస్తున్నా నాకు లేవాలనిపించలేదు. మూలికల వాసన. అలాగే వాలిపోయి నిద్రలోకి జారుకున్నాను. ఎంత సేపు నిద్రపోయానో మరి - లేచి చూసేప్పటికి నా చుట్టూ చిమ్మచీకటి అలుముకుని ఉంది. ఎంత సుఖమైన నిద్ర. ఏదో కొత్తదనం. దిగంతాల వరకు వ్యాపించిన ఆ తిమిరం సన్నగా గుసగుసలాడుతోంది.

ఎక్కడున్నాను నేను? మాయమైపోయానా!? లేదే.... ఇక్కడే ఉన్నాను. కాళ్ళు చేతులు విదిలించుకుని చూసుకున్నాను. నా దేహమేనా ఇది? ఇలా చూసుకుంటుంటే ఏదో కొత్తగా ఉంది. చీకటిని తొలగిస్తూ ఒక్కసారిగా వెలుగు. అరె, ఏమిటా వెలుగు? చంద్రుడు! నాకు దగ్గరగా కనిపిస్తూ వెలుగుల్ని విరజిమ్ముతున్నాడు. ఎదురుగ్గా నది నా ముందు ప్రత్యక్షమైంది! నీళ్ళపై నుంచి వినపడుతున్న సన్నని సంగీతం మాధుర్యం కొలుపుతోంది. అనంతమైన ఆ నీరు ఎంత స్వచ్ఛంగా ఉందీ!? వెళ్ళాలి, నా నదిని దాటి, శుభ్రం చేసుకుంటూ...

నా ముందు నాలాంటి వారే నదిలోకి పరిగెత్తుతున్నారు. కొందరు నిశ్శబ్దంగా, కొంతమంది గోలగోలగా, మరికొంత మంది గంభీరంగా... నా వెనక కూడా ఎవరో వస్తున్నారు. నర్స్, ఆ సెలైన్ సరిచెయ్... పట్టుకో, నెమ్మది... ఎవరో మాట్లాడుకుంటున్నారు. గభాల్న మెలకువ వచ్చింది.

2.

కళ్ళు తెరిచాను. నా గదిలోకి వచ్చిన నర్సులు ఇద్దరు ఆమెని స్టె్రచర్ మీద నుంచి మంచం మీదకి చేరుస్తున్నారు. లేచి కూర్చున్నాను. ఆవిడ మత్తులో ఉంది. అబ్బ! ఎంత అందంగా ఉందావిడ. విప్పారిన మల్లెపువ్వుని అరచేతిలోకి తీసుకున్నప్పుడు కనిపించేంత సౌకుమార్యం.

ఏమయింది ప్రమీలా?” అన్నాను నర్సుతో.

మీలాగే ఆత్మహత్య కేసు. ఆడవాళ్ళు ధైర్యంగా ఉండాలని ఎన్ని కథలు, ఎన్ని సినిమాలు వచ్చినా ప్రయోజనం లేదులెండి అనితా మేడమ్, ఏమిటో మన బతుకులు!" అంది.

ప్రమీల మాటలకి బాధేసింది. ఆ పని చేసి బతికి బయటపడ్డాక అదెంత హీనమైన పనో తెలిసినదాన్ని కదా!

ఆమెని పడుకోబెట్టి నర్సులు వెళ్ళిపోయారు. సమయం ఏడవుతోంది. నాకొచ్చిన కల గురించి ఆలోచిస్తూ ఆమె వైపు చూశాను. ఒక్కతే అలా నిస్సహాయంగా పడి ఉంది. ఆమెతో ఎవరూ రాలేదేమో! ఎంతందంగా ఉందీ? మరోసారి అనుకున్నాను. కాసేపటికి ప్రమీల వచ్చి నా టెంపరేచర్ చూసి జ్వరం లేదు. టిఫిన్ రాగానే తినేసి టాబ్లెట్స్ వేసుకోండి మేడమ్ అంది.

"ప్రమీలా, ఆమెకి ఎవరూ లేరా?”

"ఉన్నారు మేడమ్. ఈమె ఏర్ హోస్టెస్ , అతనేమో పైలట్ అంట. ఇద్దరూ భార్యాభర్తలు కాదు - లివ్ ఇన్ రిలేషన్ షిప్ అంట. అతనితో కొడుకు పుట్టాక ఎందుకో మరి విడిపోయారంట. ఆ పిల్లాడు ఇప్పుడు ఈమెని వదిలి తండ్రి దగ్గరకి పోయాడని భరించలేక నిద్రమాత్రలు మింగేసింది" అంది.

అయ్యో, ప్రమాదేమేమీ లేదు కదా!?” అన్నాను.

లేదు, షి ఈజ్ ఆల్ రైట్, మీరేమీ ఆలోచించకుండా పడుకోండి, అలా కూర్చోవద్దు" అంది.

చాలా అందంగా ఉంది కదా!?” అన్నాను.

అవును, ఏర్ హోస్టెస్ కదా మరి, పేరు కూడా భలే ఉంది 'శేఫాలిక' అంట" అంది ప్రమీల.

మా పెద్దబ్బాయి టిఫిన్, ఒకేసారి మధ్యాహ్నానికి కూడా భోజనం తెచ్చాడు. ప్రక్క మంచం మీద పడుకుని ఉన్న ఆమెని గురించి అడిగి తెలుసుకుని "అయ్యో, ఇలాంటి పనులు చేయకూడదమ్మా ఆడవాళ్ళు... ధైర్యంగా నోరు తెరిచి మాట్లాడాలి, సమస్యని ఎదుర్కొని నిలబడాలి" అన్నాడు దిగులుగా. వాడి తల నిమిరి "పొరపాటు చేశాన్రా, సారీ, ఇవన్నీ మనసులో పెట్టుకోకుండా బాగా చదువుకో" అన్నాను. నేను టిఫిన్ తినిందాకా ఉండి ఖాళీ డబ్బాలు తీసుకుని కాలేజీకి వెళ్ళిపోయాడు. టాబ్లెట్ వేసుకుని పడుకున్నాను.


3.

మూడు గంటలప్పుడు ఆమె కళ్ళు తెరిచి మూలుగుతోంది. గభాల్న లేచి నర్స్ లుండే డెస్క్ దగ్గరకి వెళ్ళి ప్రమీలని పిలిచాను.

మెలకువ రాగానే ఆమెలో ఏమి ఆలోచనలు కదలాడాయో కళ్ళ వెంట నీళ్ళు కారిపోతున్నాయి. ఆమె కన్నీళ్ళని టవల్ తో తుడుస్తూ "ఊరుకోండి ఏం కాలేదు. మీరు బాగానే ఉన్నారు" అంది ప్రమీల. నేను దగ్గరకి వెళ్ళి పలకరించాను. సుదూరంగా దిశల కొసల అంచుని చూస్తున్నట్లున్న ఆమె కళ్ళు నా వైపుకి తిరిగాయి. ఎంత పెద్ద కళ్ళు! ఆ కళ్ళు అశాంతిగా కదులుతున్నాయి. నన్ను చూడటం ఇష్టం లేనట్లు ముఖం కిటికీ వైపుకి తిప్పుకుని పడుకుంది.

సాయంత్రం ఆరవుతుండగా డాక్టర్ వచ్చి మా ఇద్దరినీ చెక్ చేసి వెళ్ళింది. ప్రమీల ఆమె చేతి నుండి సెలైన్ ని తీసి వేసి ఆమెకి నన్ను పరిచయం చేస్తూ "ఈమె పేరు అనిత. గవర్నమెంట్ టీచర్. వీళ్ళ ఇంటాయన పెట్టే బాధలు భరించలేక...” అని ఇంకేమీ మాట్లాడలేక ప్రమీల నా వైపు చూసి మాటలు ఆపేసింది.

నేను నవ్వుతూ "ఈ వార్డ్ లోకి వచ్చేవాళ్ళంతా దుర్బల మనస్తత్వం కలిగిన వాళ్ళేనని ఆమెకి ఈపాటికి అర్థం అయే ఉంటుందిలే ప్రమీలా" అన్నాను. ప్రమీల కూడా చిన్నగా నవ్వింది. ఆమె మాత్రం ఏమీ మాట్లాడలేదు. తన ఆలోచనల్లో తను ఉంది.

గదికి ప్రక్కగా ఉన్న మందారం చెట్టు కిటికీలో నుండి తొంగి చూస్తోంది. కాంపౌండ్ గోడకి ఆనుకుని పొడవుగా పెరిగిన అశోకా చెట్లు గాలికి తలలూపుతున్నాయి. వాటి ప్రక్కనే ఉన్న మర్రిచెట్టు కొమ్మల్లోంచి వినపడుతున్న గరగరల శబ్దం తప్ప అంతటా నిశ్శబ్దం ఆవరించుకుని ఉంది. చీకట్లను పూర్తిగా తొలగిస్తూ చంద్రుడు ఆకాశంలోకి చేరాడు.

ఒక్కసారిగా ఏడుస్తూ "నన్నెందుకు బ్రతికించారు? ఎందుకీ బ్రతుకు? ఎవరి కోసం?” అంది.

నేను గభాల్న ఆమె మంచం మీద కూర్చుని ఆమెని పట్టుకున్నాను. ప్రమీల "ఊరుకోండి మేడమ్, ఎవరి కోసమో బ్రతకడం ఏమిటి? మన కోసం మనం బ్రతకొద్దా? చదువుకున్నారు ఆ మాత్రం తెలియదా!? లేవండి, లేచి ముఖం కడుక్కుని టాబ్లెట్ వేసుకోండి” అంది.

"ఎందుకు తెలియదు? తెలిసినా తెలియనట్లు నటించాను. లోకంలో సగం మంది అంతేనేమో! తమ గురించి తెలుసుకోవాలని అనుకోరు. విశ్లేషించుకోవడానికి అసలంగీకరించరు. తెలుసుకునేప్పటికి చాలా పోగొట్టుకుంటారు. నేను పోగొట్టుకున్నాను - నా బిడ్డని... నా జీవితాన్ని" అంది. ఆమెని పట్టుకుని ఉన్న నేను "లేచి కాసిన్ని మంచినీళ్ళు తాగి టాబ్లెట్ వేసుకోండి, బాధపడకండి" అంటూ ఆమెని లేపి కూర్చోపెట్టాను. ప్రమీల సహాయంతో టాబ్లెట్ మింగి మళ్ళీ పడుకుంది. దాదాపు రెండు గంటల సేపు ఎవరి ఆలోచనల్లో వాళ్ళమున్నాం. మా ఆయన, పెద్దబ్బాయి క్యారియర్ తెచ్చారు. మా పెద్దబ్బాయి చేత టీ తెప్పించాను. కాసేపు కూర్చుని వాళ్ళు వెళ్ళాక "శేఫాలిక గారూ, కాస్త టీ తాగుతారా?” అన్నాను. ఆవిడ లేచి కూర్చుంది. టీ తాగుతూ "మీకూ ఒక్కడే కొడుకా!?” అంది.

"ఇద్దరు అబ్బాయిలు. వీడు పెద్దవాడు. చిన్నవాడు హాస్టల్ లో ఉండి చదువుకుంటున్నాడు" అన్నాను.

వింటున్న ఆమె ముఖం మళ్ళీ దిగులుగా మారింది. ప్రమీల వచ్చి "మేడమ్, మీకు ఏమైనా టిఫిన్ తెప్పించమంటారా? ఆకలేస్తేనే తినమన్నారు డాక్టర్ గారు?” అంది ఆమెతో.

ఊహు, ఆకలిగా లేదు" అంది. టీ తాగాక దిండ్లకు ఆనుకుని కూర్చుని "మా అబ్బాయి అంటూనే ఉండే వాడు 'ఏంటి మమ్ ప్రతి దానికీ ఇన్ని ప్రశ్నలు వేస్తావు?' అనో 'నువ్వసలు మనుషుల్ని నమ్మవా' అనో 'అబ్బబ్బ ఊపిరాడ్డం లేదు ఈ ఇంట్లో' అనో. నాకర్థం అయ్యేది కాదు. నా రెండు చేతుల మధ్య అయితేనే వాడు క్షేమంగా ఉంటాడు అనుకునేదాన్ని. ఇప్పుడు వాడికి పదహారేళ్ళు. నన్ను అర్థం చేసుకోవలసిన వయసులో - ఎవరినుంచైతే వాడిని దూరంగా ఉంచాలనుకున్నానో అక్కడికి - వాళ్ళ నాన్న దగ్గరకి వెళ్ళాడు నన్ను వదిలి" ఆమె కళ్ళల్లోకి మళ్ళీ తడి చేరింది.

ఊరుకోండి మేడమ్, అవన్నీ మాట్లాడకుండా ప్రశాంతంగా ఉండండి. రాత్రికి వేసుకోవాల్సిన టాబ్లెట్్స తెస్తాను వేసుకుని పడుకుందురుగాని" అని నా వైపు చూస్తూ "మీరు తినేసెయ్యండి మేడమ్, టాబ్లెట్ వేసుకుందురుగాని" అంది ప్రమీల.

ప్రమీల టాబ్లెట్స్ ఇచ్చి వెళుతుంటే "మీరు కూడా ఇక్కడే ఉండండి నర్స్, నాకు చాలా దిగులుగా ఉంది" అందామె. “అలాగేలే, పనయ్యాక మళ్ళీ వస్తా" అంటూ ప్రమీల వెళ్ళిపోయింది. ప్రమీల వెళ్ళాక ఏమైనా మాట్లాడుతుందేమో అనుకున్నాను కాని ఏమీ మాట్లాడకుండా మళ్ళీ పడుకుంది.

కాసేపయ్యాక నేనే "కొంచెం రసం అన్నం తినండి, టాబ్లెట్ వేసుకుందురుగాని" అని క్యారియర్ విప్పి రసం అన్నం కలిపి ఇచ్చాను. వద్దంటూనే తీసుకుని మెల్లగా తినింది. నేను కూడా కాస్త తిని బాత్ రూమ్ లోకి వెళ్ళి క్యారియర్ కడిగి తెచ్చాను. ఆమె కూడా బాత్ రూమ్ కి వెళ్ళి వచ్చింది.

పడుకుంటూ "మేడమ్, ప్రమీల ఇంకా రాలేదే!?” అంది. 'ఆమె తన గురించి మాకు చెప్పాలని అనుకుంటున్నట్లుంది' అని మనసులో అనుకున్నాను కాని పైకి నేనేమీ అడగలేదు. లేచి ఆమె మంచం ప్రక్కన కుర్చీ వేసుకుని కూర్చుని "నేనున్నానుగా ఏం పర్లేదు, పడుకోండి” అన్నాను ఆమె చెయ్యి పట్టుకుని.

మొదటి ఝాము చంద్రుడు ఏమీ తెలియనట్లు అమాయకంగా వెలుగులు చిమ్ముతున్నాడు. సన్నని గాలులు ఆమె ముంగురుల మీద ఊగుతున్నాయి. తమని తాము విరబోసుకుంటూ పువ్వులూ, బారులుగా సాగి చెట్లూ ఒళ్ళు విరుచుకుంటున్నాయి. ఎక్కడా ఏ అలికిడీ లేదు.

కాసేపటికి మా గదిలోకి వచ్చిన ప్రమీల నా మంచం మీద అడ్డంగా పడుకుని కళ్ళు మూసుకుంది. మాలాంటి వాళ్ళని ఆమె ఎంత మందిని చూసి ఉంటుందో కదా అనుకున్నాను ప్రమీలని చూస్తూ. ఉన్నట్లుండి శేఫాలిక మేము ఏమీ అడగకుండానే మాట్లాడటం మొదలు పెట్టింది. ఆమె కథని ఇద్దరం వినసాగాం.


4.


నేను ఏర్ హోస్టెస్ ని. మా ఏర్ లైన్స్ కి కొత్తగా వచ్చిన పైలట్ రాజీవ్ చాలా అందంగా ఉంటాడు. వస్తూనే నవ్వులని మోసుకొచ్చిన అతన్ని నేను ఇష్టపడ్డాను. నాకే కాదు ఏదో సమ్మోహనం అతనంటే అందరికీ. నన్ను ఎప్పుడు చూసినా అతని కళ్ళల్లో మెరిసిన మెరుపుని, మైమరుపుని చూసిన నా కొలీగ్స్ అందరూ మమ్మల్ని అతని ఎదురుగ్గానే 'మీ ఇద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్' అనేవాళ్ళు.

కొన్నాళ్ళకే మా పరిచయం 'కలిసి ఉందాం' అనుకునేంత ఆకర్షణగా మారింది. 'దండలు మార్చుకుందాం ఫ్రెండ్స్ ముందు' అన్నాడు. నాకు వాటిమీద పెద్ద నమ్మకం లేదు. పోన్లే అది అతనికి సంతోషం కలిగిస్తుంటే ఎందుకు కాదనాలి? అనుకున్నాను. అతనే నా ఫ్లాట్ లోకి వచ్చాడు. మరి కొన్నాళ్ళకి 'ఉద్యోగం మానేయరాదూ, బయటికి వెళ్ళిన కొద్దీ ఏవేవో అనవసరమైన మాటలు చెప్తుంటారు' అన్నాడు. పెద్దగా నవ్వి 'ఏం, నాకు తెలీకుండా నీకేమైనా సీక్రెట్ లైఫ్ ఉందా? ఉంటే చెప్పు నేనేమనుకోను' అన్నాను. '! అదేం లేదు' అన్నాడు తడబడుతూ. అప్పుడే నాకు అతని మీద అనుమానం కలిగింది. ఇతనితో లివ్ ఇన్ రిలేషన్ షిప్ పెట్టుకుని తప్పు చేశానా? అని కూడా అనుకున్నాను... అయితే ఆ ఆకర్షణలో నేను నా హృదయం చెప్పింది వినిపించుకోలేదు కాని నింగి నుండి మాత్రం నేలకి దిగలేదు. ఐమీన్ ఉద్యోగం మానలేదు. ఎక్కడో ఏ మూలో నాకు 'అతనితో నేను సేఫ్' అనే భావన కలగలేదనుకుంటా.

ఎవరి దారి వాళ్ళదే, ఎవరి పనులు వాళ్ళవే. నింగిలో కాసేపు ఫ్లైట్ లో కలిసి ఉంటాం కదా... అలాగే ఉంది ఇంట్లో కూడా మా కాపురం. అబ్బాయి పుట్టాక నేల మీద విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు అతనికి వేరే ఎవరితోనో సంబంధాలు ఉన్నాయని గమనించాను. నిలదీశాను చాలా సార్లు. నా మాటలని ఏ మాత్రమూ పట్టించుకోకుండా నవ్వి తమాషాగా మాట్లాడి సంభాషణని మార్చేసేవాడు.

మెటరి్నటీ లీవు ముగిశాక మళ్ళీ నింగిలోకి ఎగిరాను - ఈసారి విసురుగా, వేగంగా, ఎందుకో తెలియని ఆక్రోశంతో.

నాకు తెలీకుండా రాజీవ్ కి ఏవో రహస్యాలు ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది. కనిపెట్టాలనే ఆరాటంలో విచక్షణ కోల్పోయాను. అతని కో పైలట్ ఆకాశ్ తో పరిచయం పెంచుకున్నాను. సమయం చూసుకుని రాజీవ్ గురించి నాకున్న అనుమానాన్ని ఆకాశ్ దగ్గర బయట పెట్టాను.

'రాజీవ్ కి ఇంతకు ముందే మేనమామ కూతురుతో పెళ్ళయింది. ఆమెతో అతనికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు, ఈ సంగతి నీకు చెప్పొద్దని చెప్పాడు. నేను చెప్పానని మాత్రం రాజీవ్ తో చెప్పకు' అన్నాడు ఆకాశ్. విన్న నాకు చిత్రంగా బాధ కలగలేదు పైగా గర్వంగా నవ్వుకున్నాను. నా అనుమానం నిజమైందన్న సంతోషం అది.

అతన్ని గురించి ఆకాశ్ చేత చెప్పించుకుని నేను సాధించింది ఏమీ లేదు కాని కసితో ఉన్న నన్ను...” అంటూ ఆగి నా వైపు అనుమానంగా చూసింది. అప్పటికే ప్రమీల నిద్రపోయినట్లుంది. సన్నగా గురక పెడుతోంది.

ఆమెకి ఏదో చెప్పుకోవాలని ఉంది కాని చెప్పడానికి సందేహిస్తున్నట్లుంది. కాసేపయ్యాక ఆమెనే నిదానంగా చూస్తూ "శేఫాలిక గారూ... ఆగిపోయారెందుకు? చెప్పండి, ఏమీ దాచుకోవక్కర్లేదు, మనస్సు తేలికయిపోతుంది" అన్నాను.

ఆమె నిజమేనన్నట్లు తలాడించింది. ఎలా చెప్పాలా అన్నట్లుగా ఆలోచిస్తూ కాసేపు మౌనంగా ఉండి "రాజీవ్ మీద కసితో ఉన్న నన్ను ఈ ఆకాశం 'ఓదార్పు మేఘం' తో కమ్మేసింది" అంది. ఆమె చెప్తున్నది నాకర్థం అయింది. ఆమె చేతి మీద చెయ్యేసి నిమిరాను. నా కళ్ళల్లోకి చూస్తూ

"రాజీవ్ కి తెలియకుండా ఆకాశ్ తో నేనేర్పరుచుకున్న సంబంధం నాకు నచ్చేది కాదు మేడమ్. నచ్చకపోవడం అనేది మరింత అసహనాన్ని కలిగించేది. ఆ అసహనాన్ని తొందరలోనే వదుల్చుకోగలిగాను కాని ఈ భర్త బంధాన్ని వదులుకోలేకపోయాను. బహుశా పిల్లవాడికి తండ్రిని దూరం చేయకూడదనా!? బంధాలు ఏర్పరచుకోవడానికి అనేక కారణాలుంటాయి అని నాకు నేను నచ్చచెప్పుకున్నానా? లేక నా ఆత్మన్యూనత వల్లనా అంటే చెప్పలేను.

ఏం చెయ్యాలో తెలీని స్థితిలో ఉన్న నేను రాజీవ్ పాత జీవితాన్ని గురించి ఏమీ మాట్లాడలేకపోయేదాన్నిఅయితే ఇంట్లో మా ఇద్దరి మధ్యా అడ్డుగోడలు, మేం మాట్లాడుకునే మాటల్లో అగ్నిశిఖలు. పరస్పర వ్యతిరేక శక్తులు తీవ్రతరం కావాలి. ఒక చోట చేరాలి, అవి సంఘర్షించాలి, అతను బయటపడాలి... ఎదురు చూస్తున్నాను ఆరోజు కోసం. ఏదో తెలియని బాధని అనుభవిస్తూ, అతన్ని మాటలతో హింసిస్తూ... ఒక పక్క ద్వేషిస్తూనే కలిసి కాపురం చేస్తూ... తెలియకుండానే సంవత్సరాలు గడిచిపోయాయి.

ఇంత తీవ్ర ఘర్షణలని చూస్తూ పిల్లవాడు ఏమవుతాడో, వాడి భవిష్యత్తు ఏమిటో అన్న ఆలోచన నాకు కలగలేదు - 'ఏంటి మమ్? నాన్న రాకపోతే రాలేదంటావు వస్తే తగాదా పెట్టుకుంటావు!?' అని బాబు అంటూనే ఉండేవాడు.

బాబుకి పదో తరగతి అప్లికేషన్ లో తండ్రి పేరు రాయడానికి అతను ఒప్పుకోకపోవడంతో తట్టుకోలేకపోయాను. అన్నాళ్ళూ లోలోపలే దాచుకున్న కోపం బయటకి తన్నుకొచ్చింది. అతన్ని కొడుతూ, రక్కుతూ, పెద్దగా అరుస్తూ 'ఆకాశ్ చెప్పింది నిజమే కదా' అని నిలదీశాను.

నాకు తెలుసని ఊహించని అతను మొదట్లో కంగారు పడ్డాడు. నాకు నచ్చచెప్పవలసింది పోయి 'అది పెద్దవాళ్ళ కోసం చేసుకున్న పెళ్ళి శేఫ్, చెప్తే నువ్వు బాధపడతావని చెప్పలేదు. నువ్వంటే నాకు ఇష్టం. నువ్వు లేకుండా ఉండలేను. బాబుని చూడకుండా అసలుండలేను. అయినా ఆ సంబంధం వేరు, మన సంబంధం వేరు. 'లివ్ ఇన్' అంటే అర్థం తెలియనట్లు ఏమిటీ గోల చెప్పు!?' అన్నాడు. అదేం పెద్ద విషయం కాదు అన్నట్లు, లివ్ ఇన్ అంటే 'కాలక్షేపం' అన్నట్లు మాట్లాడుతున్న అతని మాటలు అసహ్యాన్ని కలిగించాయి.

'లివ్ ఇన్ రిలేషన్ షిప్' అంటే అర్థం నీకు తెలుసా? - అది కేవలం నిజాయితీ మీద మాత్రమే నిలబడే సంబంధం, అరమరికలు లేకుండా ఉండాల్సిన సంబంధం, వివాహ వ్యవస్థకంటే కూడా గౌరవంగా నిలబడవలసిన సంబంధం' అని కోపంగా, కసిగా అతనితో అనాలనుంది. అనలేకపోతున్నాను. ఏమనగలను? ఆకాశ్ తో నాకున్న సంబంధం నా ఎదురుగ్గా నిలబడి వెక్కిరిస్తోంది.

బాబుని చూడకూడదనే కండిషన్ పెట్టి, చూస్తే జైలుకి పంపిస్తానని బెదిరించి రాజీవ్ నించి విడిపోయాను. కాని బాబు నన్ను క్షమించలేకపోయాడు. పెద్దయితే వాడే తెలుసుకుంటాడులే అనుకుని నేను మొండిగానే ఉన్నాను. స్కూలు నుండి అప్పుడప్పుడు తండ్రి దగ్గరకి వెళుతున్నాడని తెలిసినా తెలియనట్లు ఊరుకున్నాను.

నా ధ్యేయం ఒకటే. నా బాబుని చక్కగా తీర్చిదిద్దుకోవాలి. అంతే... ఆ తపనతో పెంచుకున్నాను వాడిని. కాని వాడు... మొన్న... నన్నే నిందిస్తూ ఇంత పెద్ద లెటర్ రాసి పెట్టి తండ్రి దగ్గరకి వెళ్ళిపోయాడు.” మోకాళ్ళ మీదికి వంగిపోయి ఏడుస్తున్న ఆమె వీపు మీద నిమిరాను.

5.

"ఇప్పుడు చెప్పండి నేనెవరి కోసం బ్రతకాలి?” అంది. ఆమె కళ్ళల్లోని తీవ్ర దు:ఖం నన్ను కలవరపెట్టింది.

ఏమిటిది? నిజంగా, సంపూర్తిగా మన హృదయాల్లో లేని ఆశయాలని - ఎవరో ఇలా బ్రతుకుతున్నారనీ, మనమూ అలాంటి సంబంధాలు ఏర్పరుచుకోవాలని - ఆచరించడమంత పొరపాటు పని ఇంకోటి లేదు. పోనీ నా సంగతేంటి? పెద్దలు కుదిర్చిన పెళ్ళి చేసుకుని నేను స్వేచ్ఛగా బ్రతుకుతున్నానా?

బానిసత్వం లో మగ్గిపోయి కృంగిపోయి బ్రతకలేక నేను చావాలనుకున్నాను, స్వేచ్ఛ పేరుతో మోసపోయి బ్రతకలేక ఆమె చావాలనుకుంది. ఏమీ తేడా లేదు. ఇద్దరి బాధా ఒకటే...

ఇద్దరు మనుషులు కలిసి జీవించాలనుకునే వ్యవస్థ... పేరేదైనా కానివ్వండి... మనుషుల స్వభావాలు ఔన్నత్యంగా లేకపోతే క్షోభ తప్పదు కదా!

ఆమె అడిగిన దానికి ఏమీ సమాధానం చెప్పకుండా బదులుగా ఆమెకి నా కథంతా చెప్పాను. 'ఇలా ప్రతి దానికీ ఆఖరికి ఏమైనా కొనుక్కోవాలంటే డబ్బు కూడా ఇవ్వకుండా కట్టడి చేసే మగాళ్ళు ఉంటారా!' అన్నట్లు ఆశ్చర్యంగా నన్ను చూస్తున్న ఆమెతో అన్నాను - "ప్రమాదం నుండి బయటపడ్డప్పటి నుండీ నాకు గంగానది కళ్ళముందు కనపడుతోంది శేఫాలిక గారూ. రకరకాల కల్మషాలు కడుపులోకి వచ్చి చేరుతున్నా ప్రక్కలకి నెట్టేస్తూ అనంతంగా, స్వచ్ఛంగా ముందుకు సాగుతున్న గంగ నీరే పదే పదే గుర్తుకొస్తోంది" అన్నాను. మాట్లాడుతున్న నన్నే తదేకంగా చూసింది. అర్థమైందన్నట్లు తలాడించింది. మెల్లగా వాలిపోయి వెల్లకిలా పడుకుంది. అత్యంత తీవ్ర దు:ఖాన్నించి తేరుకున్నట్లుగా ఆమె ముఖం అలిసిపోయి ఉంది.

నాలుగో ఝాము ముగిసింది. చంద్రుడు మందగమనంతో సాగిపోతున్నాడు. చల్లని పిల్లగాలుల రాగాలు వింటూ చెట్ల ఆకులు నృత్యం చేస్తున్నాయి. చెప్పవలసినదీ, వినవలసినదీ ఏమీ లేదన్నట్లు మా ఇద్దరి మధ్యా నిశ్శబ్దం.

కాసేపటికే తొలి ఛాయలను చీల్చుకుంటూ మెల్లగా పైకి చేరుతున్న సూర్యుని కాంతి ఆమె హృదయం మీదకి చేరి నా కళ్ళల్లో ప్రతిఫలించింది.

అప్పుడన్నాను... ఒక్కో పదాన్నీ ఒత్తి పలుకుతూ... "ఊఁ ఏం జరిగిందని ఇలాంటి పిచ్చి పని చేయడం మనం!? వెళదాం, తిరిగి వెళ్ళిపోదాం. మనకి కావలసిన రీతిలో మనం సంతోషంగా జీవిద్దాం నదిలా"

వింటున్న ఆమె ప్రక్కకి ఒత్తిగిల్లి రగ్గుని మీదికి లాక్కుని పడుకుంది వెచ్చగా.

6.

నేను కూడా లేచి ప్రమీల ప్రక్కనే చోటు చేసుకుని పడుకున్నాను. మళ్ళీ కల, కాసేపటికి ఏవేవో మాటలు... "శేఫాలికా! ఆర్ యు ఓకె?... డాక్టర్ గారూ, శేఫ్ కి ఏమీ ప్రమాదం లేదు కదా!?” అని అతను, “ఐయామ్ సారీ మమ్!" అంటూ ఆమె కొడుకూ ఆమెని తట్టి లేపుతూ అంటున్న మాటలు నాకు వినపడుతున్నాయి.

కాసేపట్లో నా భర్తాపిల్లలూ వస్తారు నాకు టిఫిన్ తీసుకుని... ఇడ్లీలు తెస్తానన్నాడు పెద్దబ్బాయి. మా వాళ్ళని తలుచుకోగానే ఆమె భర్తనీ (?), కొడుకునీ చూడాలనిపించింది కాని లేవాలనిపించలేదు. ఏదో ప్రశాంతత నన్ను అలాగే నిద్రలోకి జార్చింది.


********   

No comments:

Post a Comment

P