Thursday, April 14, 2016

గాడిద మూతిగుడ్డ

తమాషా కథ :D
పాత సంవత్సరం (academic year) చివర్లో కొంత మంది టీచర్లు, పిల్లలు వెళ్ళిపోతుంటారు, కొత్తవాళ్ళు వస్తుంటారు. ఇలాంటి విషయాలు ప్రతి సంస్థలో జరిగే విషయాలే కాని అందరూ 'అసలు వాళ్ళు' చెప్పేదాకా తెలియనట్లే ఉండటం మర్యాద కదా!? నాలుగు రోజుల క్రితం ఓ టీచర్ "మీకు తెలుసా!? ఫలాన వాళ్ళు వెళ్ళిపోతున్నారట" అంటే... ఓ సామెత చెప్పి కథ చెప్పాను. ఆ కథ ముతకది లెండి - దాన్ని చక్కనైన కథ, పద్ధతైన కథ, నలుగురికీ చెప్పగలిగే కథగా తయారు చేస్తే ఎలా ఉంటుందీ అన్న ఆలోచనతో రాసిన ఈ కథ - తమాషా కథ  ఫ్రెండ్స్ చదువుతారని...

//గాడిద మూతిగుడ్డ//
- రాధ మండువ

అనగనగా ఒక రాజు. ఆ రాజుకి ఇద్దరు భార్యలు. పెద్ద భార్యకి ఒక వెంటు్రక, రెండో భార్యకి రెండెంటు్రకలు. ముందు పెద్ద భార్య రాజ్యానికి వచ్చింటది గదా... రాగానే కొన్నాళ్ళకి ఆమెకి 'కూడా' జుట్టంతా ఊడిపోయి ఒకెంటు్రక మిగిలింది. అది రాజు చూసి విసుక్కుని బాగా వత్తైన జుట్టున్న పిల్లని వెతికించి తెచ్చుకుని చిన్నరాణిగా చేసుకున్నాడు. అదేం ఖర్మమో రాజ్యానికి వచ్చిన కొన్ని రోజులకే చిన్న భార్యకి 'కూడా' జుట్టూడిపోయి రెండెంటు్రకలు మిగిలాయి.

'ఇంక ఎంతమందిని చేసుకున్నా ఇంతేలే' అనుకున్న రాజు ఈ 'ఒంటెంటుక రెండెంటు్రకల విషయం' ఎవరికీ తెలియకుండా ఉండాలని తన ఆంతరంగికుడైన మంగలిని పిలిపించాడు. పిలిపించి జడ ఉన్న రెండు విగ్గులు తయారుచెయ్యమన్నాడు. 'ముందు తయారుచేసిన విగ్గుకే సరైన కూలీ ఇప్పించలేదు ఇక ఇప్పుడు జడలతో రెండు విగ్గులా!?' అని మనసులో ఏడ్చుకుని రాజుగారిని ఏమీ అనలేక విగ్గులు తయారుచెయ్యడానికి రాజు ఎదురుగ్గా కూర్చున్నాడు.

విగ్గులు తయారయ్యాయి. రాజు రాణులిద్దరికీ చెరోటి తగిలించాడు. 'విషయం' ఎవ్వరికీ తెలియకూడదని రాణులని, మంగలిని హెచ్చరించాడు. "అయ్య బాబోయ్ ఇంతకు ముందు నా వల్ల ఏమైనా బయటికి వచ్చిందా!? మీరెవరినైనా అనుమానించొచ్చేమో కాని నన్ను అనుమానించకండి" అన్నాడు మంగలి.

“అవును నిజమే, ఇదిగో కూలి" అంటూ కొంత డబ్బిచ్చి మంగలిని పంపేశాడు రాజు.

రోజులు పాపం ప్రశాంతంగా గడుస్తున్నాయి రాజుగారికి. ఒకరోజు రాజు ఉయ్యాల బల్ల మీద తీరిగ్గా కూర్చుని రాణులతో చదరంగం ఆడుతున్నాడు. ఆ సమయంలో అంతఃపురపు చాకలి ఉతికిన బట్టల్ని తీసుకుని వచ్చాడు. ప్రభువులవారు హుషారుగా ఉన్నారని గమనించిన చాకలి "ప్రభూ, ఇంట్లో దరిద్రం ఎక్కువయింది. నా తల్లీ, తండ్రీ ముసలి వాళ్ళవ్వడంతో మందులకీ మాకులకీ ఖర్చు పెరిగింది. నా పిల్లలు పెద్దవారయ్యారు, మూరెడు బట్టతో లాగూలు కుట్టించేవాడిని ఇప్పుడు బారెడు కావలసి వస్తోంది" అన్నాడు.

జీతం పెంచమంటున్నాడేమో అనుకున్న రాజు “నిజమేనయ్యా, నీకు జీతం పెంచడానికి మంత్రిగారు ఒప్పుకోరే, అదీగాక నీకు పెంచితే అందరికీ పెంచాలి కదా!?” అన్నాడు.

“అయ్యో, ప్రభూ, అది తెలుసుకోలేనంత తెలివి లేని వాడినా? జీతం పెంచమనడం లేదు. మా ఇంటిదానికి అంతఃపురంలో ఉద్యోగం వేయించండి, రాణులమ్మలిద్దరికీ సేవ చేసుకుంటూ పడి ఉంటది" అన్నాడు.

చాకలి మాటలు వినగానే పెద్ద రాణి ముఖం చాటంతయ్యింది. “ఆఁ నిజమే ప్రభూ, చాన్నాళ్ళ నుండీ నాకు కాళ్ళూ, మోకాళ్ళూ నొప్పులు పుడతన్నయ్, చేతికిందకి మనిషి ఉంటే మంచిదనీ, మీకు చెబ్దామనీ అనుకుంటూనే ఉన్నాను" అంది.

అది విని చిన్నరాణి కూడా "అవును అక్కాయ్, నిజమే. నాక్కూడా చాన్నాళ్ళ నుండీ చేతులూ, మోచేతులూ నొప్పులు పుడతన్నయ్, కాలి కిందకి ఒక మనిషి ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను" అంది.

“విన్నావుగా వీరీ, నీ భార్యని రేపే వచ్చి పనిలో చేరమను. ఒక పూట పెద్దావిడ దగ్గర రెండో పూట రెండో ఆవిడ దగ్గర పని చేయవలిసి ఉంటుంది" అన్నాడు.

సరేనంటూ సంతోషంగా వెళ్ళిపోయాడు చాకలి. మరుసటి దినం చాకలి పెళ్ళాం వెంకి పనిలోకి వచ్చింది. వెంకి భలే హుషారైన మనిషే గాని నోట్లో నువ్వు గింజ నాననివ్వదు పైగా నలుగురికీ చెప్పకపోతే కడుపుబ్బిపోతుంటుంది ఆ పిల్లకి.

సరే మన ఈ వెంకికి రెండో రోజే ఒకటె్రండెంటు్రకల గురించి తెలిసిపోయింది. ఇద్దరు రాణులూ 'విషయం' బయటకి పొక్కితే తల తీసేస్తామని వెంకిని హెచ్చరించారు. పని చేసుకుంటున్న వెంకికి సాయంకాలం నాలుగయ్యేప్పటికి కడుపుబ్బిపోసాగింది. భరించలేక పరిగెత్తుకుంటూ రేవుకి వెళ్ళింది. రేవులో బట్టలుతుక్కుంటున్న చాకలి దగ్గరకెళ్ళి గభాల్న 'విషయం' చెప్పేసింది.

కడుపుబ్బరం తీరాక వెంకికి భయం పట్టుకుంది. ఈ 'విషయం' ఎవరికైనా తెలిస్తే నా తల తీసేస్తారంట, గోడకే చెవులుంటాయంటారు, రేవుకి ఉండవా!? పా, ఎవరన్నా ఉన్నారేమో చూద్దాం" అంది. ఇద్దరూ రేవంతా వెతికారు. “ఇక్కడెవురూ లేరు మన గాడిద తప్ప... భయపడమాక" అన్నాడు చాకలి - భార్యకి ధైర్యం చెప్తూ.

“వామ్మో, గాడిద మాటే మర్చిపోయానయ్యో, అది ఎవరికైనా చెప్పుద్దేమో, అది మనదే అయినా చెప్పగూడదని దానికేం తెలుసూ, గాడిదయ్యే!?” అంది వెంకి వణికిపోతూ.

“ఊరుకో, గాడిదెందుకు చెప్పిద్దీ!!?” అన్నాడు చాకలి.

“ఏమో! నేను చెప్పొద్దనుకున్నా, చెప్పలా? ఎందుకైనా మంచిది దీని మూతికి గుడ్డ కట్టయ్యో!” అంది గాడిదని గట్టిగా పట్టుకుని.

సరేనని గాడిద మూతికి బట్ట కట్టాడు చాకలి. వెంకి తృప్తిగా తలాడించి అంతఃపురానికి వెళ్ళిపోయింది. పనంతా అయ్యాక చీకట్లు పడుతుండగా చాకలి బట్టల మూటల్ని గాడిద మీద వేసుకుని ఊళ్ళోకి రాసాగాడు. పొలాల్లో పనులు చేసుకుని ఇంటికొస్తున్న రైతులు ఊళ్ళోకీ, పాలు పిండుకోవడానికి ఊరి బయటుండే కొట్టాల దగ్గరకి ఆడవాళ్ళూ వచ్చే సమయమది.

దారిలో చాకలిని కలిసిన ఒక రైతు మూతికి గుడ్డ కట్టి ఉన్న గాడిదని ఆశ్చర్యంగా చూస్తూ "ఏంది వీరీ, గాడిద మూతికి గుడ్డెందుకు కట్టావ్!!?” అని అడిగాడు.

“ఎవురికీ చెప్పబాకయ్యో, చెబితే తలలు తెగుతాయంట. ఇదీ 'విషయం'. ఈ 'విషయం' మాయావిడ నాకు చెప్తుంటే ఈ గాడిద వింది. ఇదెక్కడ అందరికీ చెప్పిద్దోనని దీని మూతికి గుడ్డ కట్టమంది" అన్నాడు చాకలి. రైతు పెద్దగా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. కాసేపటికి చాకలికి ఎదురొచ్చిన ఒక ఆడామె "ఎందుకు గాడిద మూతికి గుడ్డ కట్టావ్ వీరీ!!?” అంది నడుమున చెయ్యేసుకుని నిలబడి. చేసేదేమీ లేక ఆవిడకీ 'విషయం' చెప్పాడు.

అట్లా దారిలో కలిసిన వారందరూ చాకలిని అడగనూ, అతను 'తలలు తెగుతాయి' అంటూనే 'విషయం' చెప్పనూ...

తెల్లారేటప్పటికి 'విషయం' రాజుగారి చెవిన పడింది. రాజు కోపంగా అంతఃపురానికి వచ్చి 'విషయం' ఎలా బయటకి పోయిందని రాణులిద్దరినీ అడిగాడు. 'నీవల్లే' నంటే, 'నీవల్లే' ననుకుంటూ ఇద్దరు రాణులూ విగ్గులు విగ్గులు పట్టుకుని లాక్కున్నారు. అవి కాస్తా ఊడాయని చిందులు తొక్కుతున్న రాజు మీద ఇద్దరు రాణులకీ కోపం వచ్చి, జుట్టు లాక్కునే ఛాన్స్ లేకపోయిందే అని ఉక్రోషపడుతూ రాజు జుట్టు పట్టుకున్నారు.

అంతే ...

“ఆఁ" అంటూ ఇద్దరు రాణులూ రాజుగారిని చూస్తూ అవాక్కైపోయి కింద పడ్డారు.

ఏం జరిగిందో మీరే ఊహించి చెప్పండి మరి! - మీ రాధ :)

*******

1 comment:

  1. raaju gaaridhi kuda vigge..anukuntaa..avunaa radha gaaru..

    ReplyDelete

P