Wednesday, June 15, 2016

మూడు లడ్లు - నాటకం



వచ్చే మంగళవారం ఏడో తరగతి పిల్లల చేత వేయిస్తున్నా ఈ నాటకం. చదవండి ఫ్రెండ్స్... టీచర్లూ మీరు మీ పిల్లల చేత వేయించొచ్చు ఈ నాటకం. ఇలా ఓ ఇరవై నాటకాల దాకా రాశాను. చిన్నగా టైప్ చేసి మీతో షేర్ చేసుకుంటాను. :)

//మూడు లడ్లు (పిల్లల కోసం హాస్య నాటకం)// - సి్క్రప్ట్ - రాధ మండువ

రంగం - 1
*********
సుధక్కా! ఓ సుధక్కా!

ఆఁ ఎవరూ.... రమా.... రా రా లోపలకి రా!

కమ్మని వాసన బయటకి వస్తోంది. లడ్లు చేస్తున్నట్లున్నావుగా?

అవును రమా! పండక్కి నువ్వేం చేస్తున్నావ్?

అరిశలు చేశాను. కొన్ని లడ్లు కూడా చేస్తే బావుంటుందని చూస్తే ఇంట్లో యాలక్కాయలు లేవు. నాలుగు యాలక్కాయలుంటే ఇస్తావని వచ్చా!

అవునా! రా వంటింట్లోకి. ఇస్తా. (డబ్బాలోంచి తీసి) ఇవిగో.

సరే వస్తా సుధక్కా చాలా పని ఉంది.

అలాగే

బయట పిసినారి శీనయ్య ఇంటి లోపల నుండి వచ్చే లడ్ల వాసన పీలుస్తా సుధ ఇంటి ముందు నిలబడి ఉంటాడు. యాలక్కాయలు తీసుకోని బయటకి వచ్చిన రమ శీనయ్యని చూసి

ఏంది శీనయ్యా... తెగ గాలి పీలుస్తున్నావ్?

మంచి లడ్లు వాసన వస్తుంటేనూ...

(వెటకారంగా) ఈ పండక్కన్నా ఏవైనా చేసుకుంటారా? లేకపోతే ఇలా గాలి పీల్చేసి చాల్లే అనుకుంటావా?

అంటూ ఒక వైపుకు వెళ్ళిపోతుంది. శీనయ్య మరో వైపుకి వెళతాడు.

రంగం - 2
*******

శీనయ్య భార్య కాంతమ్మ ఏదో వంట పనిలో ఉంటుంది

ఏమే! ఏమేవ్!

ఆఁ ఏందీ? (అక్కడే కూర్చుని నిర్లక్ష్యంగా)

పండక్కి ఊళ్ళో అందరూ పిండివంటలు చేసుకుంటున్నారు.

ఆఁ

మనం కూడా చేసుకుందామా?

గబుక్కున లేచి శీనయ్య దగ్గరకి గబగబా వచ్చి వేగంగా తలాడిస్తూ...

ఆఁ ఆఁ ఆఁ చేసుకుందాం. చేసుకుందాం

ఏం చేసుకుందాం, లడ్లు చేసుకుందామా?

ఆఁ మీ ఇష్టం. ఏదైనా సరే.

సరే అయితే లడ్లు చేసుకోవాలంటే ఏమేం సామాన్లు కావాలో చెప్పు. రామయ్య కొట్టుకెళ్ళి తెస్తాను.

(కాంతమ్మ వేగంగా) కిలో శనగపిండి, కిలో చక్కెర, లీటరు నూనె, యాలక్కాయలు, జీడిపప్పు, కిస్ మిస్... నెయ్యీ...

ఉండవే ఉండు... (పేపర్ పెన్నూ తీసి రాసుకుంటా) ఇప్పుడు చెప్పు - నిదానంగా చెప్పు.

కాంతమ్మ నిదానంగా ఒక్కొక్కటే మళ్ళీ చెప్తుంది. శీనయ్య రాసుకుంటాడు. కాంతమ్మ కొంచెం లోపలకి పోయి అక్కడున్న పెద్ద సంచి, ఒక స్టీలు డబ్బా తెచ్చి డబ్బాని సంచిలో వేస్తూ

ఇదిగోండి సామాన్లన్నీ ఈ సంచిలో వేసుకోండి. నూనె ఈ డబ్బాలో పోయించుకు రండి.

అలాగే (వెళ్ళిపోతాడు)

రంగం - 3
*******

రామయ్య కొట్టు. అన్నీ సర్దుకుంటూ ఉంటాడు.

రామయ్యా! మేము పండక్కి లడ్లు చేసుకుంటున్నాం.

(రామయ్య ఆశ్చర్యపోతూ) మీరా!!? లడ్లా!!!!?

అవును. సామాన్ల కోసం వచ్చా.

సరే ఏం కావాలి?

కిలో శనగపిండెంత?

యాభై రూపాయలు

యాభై రూపాయలా!!? సరేలే ఈ ఐదు రూపాయలకి పెట్టు.

ఐదు రూపాయలకి ఎట్లా వస్తుందయ్యా?

ఎంతొస్తే అంత పెట్టు.

అహ! కుదరదు ఐదు రూపాయలకి ఏమీ రాదు.

సరే అయితే పది రూపాయలకి పెట్టు

(రామయ్య పొట్లంలో రెండు మూడు గుప్పిళ్ళు వేసి పొట్లం కట్టి) ఊ! ఇదిగో

(శీనయ్య శనగపిండి పొట్లాన్ని సంచీలో వేసుకుని పది రూపాయలు ఇచ్చి ) కిలో చక్కెర ఎంత?

నలభై రూపాయలు

ఇదేందయ్యా ఏదడిగినా నలభై, యాభై అంటావూ.... సరే రెండు రూపాయలకి పెట్టు

ఏందయ్యో నాతో తమాషాలాడ్డానికి వచ్చావా పొద్దున్నే. రెండు రూపాయలకి పిల్లోళ్ళు తినే పిప్పరమెంటు గూడా రాదు

సరే పోన్లే ఈ ఐదు రూపాయలకి పెట్టు. (కోపంగా డబ్బు నాణాలను లెక్కపెట్టి రామయ్యకి ఇస్తాడు)

(రామయ్య ఖర్మ ఖర్మ అని గొణుక్కుంటా చక్కెర పొట్లం కట్టి ఇచ్చి) ఇంకా ఏం కావాలి?

(శీనయ్య లిస్ట్ బయటకి తీసి చూసుకుంటా) శనగపిండి కొన్నాను, చక్కెర కొన్నాను. లీటరు నూనె... రామయ్యో లీటరు నూనె ఎంతయ్యా?

నూరు రూపాయలు

నూరా? ఇరవైకి పొయ్యి. ఇదిగో డబ్బా

(రామయ్య - ఇంతోటి నూనెకి డబ్బా చూడు ఎంతుందో అని గొణగుతూ) అమ్మో పొద్దున్నే భలే బేరం దొరికింది. రోజూ నీలాంటి వాళ్ళు వస్తే బేరం అయినట్లే... ఇందా నూనె.

ఆ... అదీ... ఇదిగో ఇరవై. ఇంకా ఏం కొనాలి .. యాలకలు, జీడిపప్పు, కిస్ మిస్ .... వద్దులే... అయ్యన్నీ లేకపోయినా లడ్లు బాగానే ఉంటాయిలే.. ఈ చివరిదేందబ్బా నెయ్యి... అమ్మో నెయ్యి ఖరీదు గదూ ... అస్సలొద్దు. సరే రామయ్యా వస్తా... (వెళ్ళిపోతాడు)

రంగం - 4
*******

కాంతమ్మ ఏదో గిన్నె కలబెట్టుకుంటూ ఉంటుంది.

ఏమేవ్!

ఆఁ ఆఁ వచ్చారా? తెచ్చారా?

ఆఁ ఇదిగో సంచి.

(కాంతమ్మ సంచిలోపలకి తల పెట్టి చూసి తలని బయటకి తీసి సంచి తెరిచి అతనికి చూపిస్తూ) ఇంతేనా?

ఆఁ అంతే

వీటికి ఎన్ని లడ్లు వస్తాయయ్యా?

ఎన్నొస్తే అన్ని చెయ్యి. అదిగో ఆ పొట్లాలు కట్టిన పేపర్లు ఇటియ్యి ఏం రాశారో చదువుకుంటా.

(కాంతమ్మ శనగపిండి, చక్కెర గిన్నెల్లోకి వేసి పేపర్ తెచ్చి) ఇవిగో పేపర్లు... చదువుకో...

(శీనయ్య పేపర్ చదువుతా) మదనపల్లిలో బస్సు కింద పడి ఇద్దరి మృతి.... అబ్బబ్బ ఎప్పుడు చావు వార్తలే.. ఇంతోటి దానికి పేపరెందుకు కొని చదవడం ఈ జనం!? ఆఁ ఏమేవ్ అయ్యాయా?

అప్పుడే ఎలా అవుతాయీ! పిండి కలుపుతున్నా.. నూనె కాగుతోంది

(శీనయ్య పేపర్ ని వెనక్కి తిప్పి) పిసినారి పుల్లయ్య సినిమా వంద రోజులు... అహహ... సినిమాలు ఎందుకు చూడటం డబ్బు దండగ.... ఏమేవ్ అయిందా?

ఆఁ ఆఁ అవ్వొచ్చె అవ్వొచ్చె

(శీనయ్య మరో పేపర్ ని తీసి) ఆడవారి చైన్లు లాగాక రైలు చైన్ లాగి దర్జాగా దిగి వెళ్ళిపోయిన దొంగ.... ఆడవాళ్ళకి చైన్లు ఉంటాయి సరే.... రైళ్ళకెందుకు చైన్లూ...... ఏందో... ఏమోలే మనకెందుకు? ఏమేవ్ అయినయ్యా?

ఆఁ అయ్యాయి.

ఆఁ అయినయ్యా? (ఒక్కసారిగా గబుక్కున లేచి) ఇటు తీసుకురా ఇటు తీసుకురా

(కాంతమ్మ మూడు లడ్లున్న ప్లేట్ తీసుకుని వచ్చి) మూడు లడ్లు అయ్యాయి.

ఆ!! మూ....డు అయినయ్యా... అబ్బ!! నాకు రెండు ఇటిచ్చి నువ్వొకటి తిను.

(కాంతమ్మ కోపంగా) అదేం. మీకు రెండేమి నాకు ఒకటేమి?

నేను రామయ్య కొట్టుకెళ్ళి సామాను తెచ్చాను కాబట్టి నాకు రెండు అన్నాను తప్పా?

నేను రెక్కలు పోయేట్లు పిండి కలిపాను లడ్లు వత్తాను కాబట్టి నేనే రెండు తీసుకోవాల

అదేం కుదరదు నాకు రెండు నీకొకటి

అహ! నాకు రెండు మీకొకటి

నాకు రెండు నీకొకటి.

అహ నాకు రెండు మీ కొకటి (కాంతమ్మ పెద్దగా అరుస్తుంది)

సరే సరే అరవగాకు. నేనొకటి చెబుతా విను

ఏందీ... మీరు చెప్పేదీ...

మనిద్దరం ఒక పందెమేసుకుందాం. పందెంలో గెలిచిన వారికి రెండు లడ్లు ఓడినవారికి ఒక లడ్డు.

ఏమిటా పందెం?

ఈ లడ్ల ప్లేటుని మధ్యలో పెట్టుకుని ఇద్దరం కదలకుండా పడుకుందాం.... కదలకుండా పడుకోవాల.

ఊఁ

ఎవరు ముందు కదిలితే వాళ్ళు ఓడిపోయినట్లు

సరే అయితే... నేనసలు కదలనే కదలనుగా (నడుము ఊపుతూ కాంతమ్మ అంటుంది)

చూద్దాం!

ఆఁ చూద్దాం!

తలుపులు వేసేసి లడ్ల ప్లేటును ఇద్దరి మధ్యలో పెట్టుకుని పడుకుంటారు

రంగం - 5
*******

రాత్రంతా అలాగే పడుకున్నారు. తెల్లవారుతుంది.

(పాలు పోసే గోపాలం వీధిలో అరుస్తూ) “పాలమ్మా పాలూ.... పాలు పాలూ .... పాలు పాలూ... (వీళ్ళింటి తలుపు కొడుతూ) ఓ శీనయ్యో పాలయ్యా... పాలు పాలూ... అబ్బబ్బ ఈయన పోయించుకునే పావుగిద్ద పాలకి ఎంత సేపు చేస్తాడో... ఏమయ్యో శీనయ్యో, ఏమమ్మా కాంతమ్మా.... కాంతమ్మో... ఎవరూ పలకడం లేదే .. ఏమోలే (పాలమ్మా పాలూ అనుకుంటా వెళ్ళిపోతాడు)

(వీధిలో కూరగాయల సరోజ) వంకాయలు, బెండకాయలు, దొండకాయలు, ప...చ్చి మిరపకాయలూ....

(వీళ్ళ తలుపు కొట్టి)

ఓ కాంతమ్మో పచ్చి మిరపకాలు కావాలంటివే తెచ్చానమ్మా.... కాంతమ్మో.... ఓ కాంతమ్మో... ఏమయినారబ్బా! ఓ శీనయ్యా! నువ్వన్నా ఉంటివా లోపలా.... ఏమయ్యో.... పచ్చిమిరపకాయలయా్య...

(పాలమ్మా పాలూ అంటూ దూరంగా అరుస్తున్న గోపాలాన్ని చూసి) ఓ గోపాలం మామో! ఇటు రా... (గోపాలం దగ్గరకొచ్చాక) వీళ్ళని చూశా!? పాలు పోశా!?

పొయ్యలా... ఇంట్లో ఎవరూ లేరట్లుంది.

నువ్వు భలేటోడివేలే ... ఎవరూ లేకపోతే లోపల గడెందుకేసుంటుంది బయటేసుంటుంది గాని.... (అప్పుడే అటు నడుస్తూ పోతున్న రమని సుధని చూసి) ఓ రమక్కో, సుధక్కో ఇటు రాండి.
(వాళ్ళు దగ్గరకొచ్చాక, ఇంటి వైపు చూపిస్తూ) వీళ్ళని చూశారా?

(రమ వీళ్ళని చూసి) ఆఁ నిన్న చూశా. సుధక్కోళ్ళింటి ముందు. తర్వాత కనపళ్ళా... (అందరూ అక్కడే నిలబడి ఇంటివైపు చూస్తుంటారు)

(సరోజ దూరంగా వెళుతున్న రామయ్యని చూసి) ఓ రామయ్యసెట్టో ఇటురా... (దగ్గర కొచ్చాక) కాంతమ్మనీ, శీనయ్యనీ చూశా...?

ఆఁ నిన్న శీనయ్య నా కొట్టు కి వచ్చాడు. లడ్లు చేసుకుంటున్నామని సా...మా...ను కూడా తెచ్చాడు (సామాను అనే పదాన్ని విరగదీస్తూ)

సరోజ : అయితే ఏమయ్యారబ్బా!?

సుధ: కిటికీలో నుంచి చూద్దాం పాండి.

అందరూ వెనక్కి వెళతారు. మొదట సుధ చూసి...

సుధ: ఉన్నారు.. పడుకోని ఉన్నారు.

రమ: (సుధ మీదుగా తొంగి చూసి) మధ్యలో లడ్ల ప్లేటు గూడా ఉంది.

సరోజ: ఇటు రాండమ్మో! నన్ను చూడనీయండి. (వాళ్ళు తొలగగానే కిటికీ లో నుండి చూస్తా ) వామ్మో! చచ్చిపోయారా ఏందీ!!?

గోపాలం: ఆఁ ఏదీ నన్ను చూడనియ్యమ్మే! (సరోజ పక్కకి రాగానే చూసి) చూడబోతే చచ్చిపోయినట్లే ఉంది.

రామయ్య: (గోపాలం మీదుగా చూస్తూ) అయ్యో! చేసుకున్న లడ్లు గూడా తినకుండా చచ్చిపోయారే పాపం.

సరోజ: తలుపులు పగలగొట్టి లోపలకి పోదాం పాండి.

(ఈలోపు ఇంకో నలుగురైదుగురు చేరతారు. తలుపులు పగలగొట్టి (తలుపులునట్టుగా, భుజంతో తోసి పగలగొట్టినట్లుగా నటించాలి) లోపలకి పోతారు)

సరోజ: (వాళ్ళ మంచం/బల్ల ప్రక్కన కూలబడుతూ) అయ్యో! కాంతమ్మా! చచ్చిపోయావా కాంతమ్మా! నాకు నాలుగు రూపాయల బాకీ తీర్చకుండానే పోయావా?

పాల గోపాలం: నువ్వుండమ్మేయ్, నాకు పది రూపాయలు బాకీ ఈ శీనయ్య..

(ఆడవాళ్ళంతా అయ్యో కాంతమ్మా, అయ్యో శీనయ్యా అంటుంటారు)

రామయ్య: అరవబాకండి....అరవబాకండీ.... వీళ్ళ కళ్ళు కదులుతున్నాయి.

అందరూ: ఆఁ

రామయ్య: ఇదిగో గోపాలం నీ దగ్గర అగ్గిపెట్టె ఉందా?

గోపాలం: ఉందయ్యా (తలపాగాలో పెట్టుకున్న అగ్గిపెట్టె తీసి ఇస్తాడు)

(రామయ్య అగ్గిపుల్లని గీసి శీనయ్య కాలికి తాకిస్తాడు)

శీనయ్య: అయ్యో! అమ్మో! అబ్బ! కాల్చావు గదయ్యా రామయ్యా!

కాంతమ్మ: ఓ.... నాకు రెండు లడ్లో! మీరే ముందు కదిలారో. నేనే పందెం గెలిచానో. నాకు రెండు లడ్లో... (అని గెంతుతూ లడ్ల ప్లేట్ తీసుకుని) ఇదిగో మీకు ఒక లడ్డు నాకు రెండు లడ్లు...

అందరూ: ఆఁ లడ్ద కోసం పందెమా? ఖర్మ ఖర్మ!

************

1 comment:

P