Wednesday, June 15, 2016

మృత్యువూ-మహాదృశ్యమూ


నీ కోసం వచ్చే దారిలో
ఓ చిన్నిమొక్క నవ్వుకుంటూ
తన మీద వాలిన పక్షిని పట్టుకుని ఉంది

ఆకాశం నిర్మలమై తననుండి విడివడి
సాగిపోతున్న నల్లమబ్బులను తదేకంగా చూస్తోంది


అప్పుడే నిద్ర లేచిన ఉదయం
ఏకాగ్రతగా చల్లదనానికి వెచ్చని రంగులద్దుతోంది
పారుతున్న ఏరు నాలోకి తొంగిచూసి
మరొకటేదీ కానరానివ్వకుండా హత్తుకుంటోంది

నాకెదురు రారాదూ!
మీ ఊరి వరకేలే నడుద్దాము
భళ్ళున పగిలిన గాజు ముక్కలను
ఒక్కోటీ ఏరుకుని పారవేద్దాము

ఒకరితో ఒకరం మమేకమయే ఆ సమయంలో
మాటలని గంపలుగా చేసి దొర్లించొద్దు సుమా!
సందేహాల తెరల్లో ఊరికినే కదిలిపోయి
కలల సౌధాన్ని ముక్కలు చేసీ విసరొద్దు!!

నీకో రహస్యం చెప్పనా!?
సాయంత్రం వరకూ నడిచాక
చివరి చీకటి దారి ఒంపు దాటాక
నక్షత్రకాంతిపువ్వులను చూశాక
నీకో విషయం తెలుస్తుంది -

జీవితంలో నిశ్చలమై కదులుతున్న మృత్యువూ
లోతైన శా్వసలోని సమస్తవర్ణాలసమ్మిళిత మహాదృశ్యమూ
ఇక్కడే పక్కపక్కనే చేరి దర్శనమిస్తాయని!!!

*****
- రాధ మండువ

No comments:

Post a Comment

P