Thursday, April 17, 2014

అవమానం - మ్యూజింగ్స్ - 3


రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అంటూ ఒకటి వచ్చి టీచర్స్ అందరికీ బి.ఇడి ఉండాలని రూల్ పాస్ చేసింది. యాక్ట్ ని కాదంటే ఎట్లా? అదీగాక అందరం బాచిలర్స్ మి అయిపోతాం కదా! భర్త, భార్య, పిల్లలూ ముఖ్యం గా వయసూ అన్నీ పోగొట్టుకుని బాచిలర్స్ అయిపోదాం అనుకుని టీచర్స్ అందరం దూరవిద్యలో బి. ఇడి చదవడానికి రెడీ అయిపోయాం.

ఆదివారం లంచ్ అయ్యాక హాస్టల్ లో పిల్లలందరూ రెస్ట్ తీసుకుంటున్నారు. పరీక్షలు దగ్గరకొచ్చాయి కదా చదువుకుందామనుకుని వార్డెన్ ను పిలిచి 3. 30 దాకా కదలకుండా అందరినీ రెస్ట్ తీసుకోమని చెప్పమ్మా! గొడవ చేయకుండా ఉండమను. పరీక్షలకి చదువుకుంటా తల్లీ! అని చెప్పి గదిలోకి వచ్చి పుస్తకాలు తీశా.

ఒక్కో పాఠాన్ని నలభై నిమిషాల లెసన్ ప్లాన్ అనే ఫ్రేమ్ లో బంధించి పిల్లలకు బోధించాలట. పిల్లలు ఏం ప్రశ్నలు అడుగుతారో, మనం ఏమని సమాధానం చెప్పాలో కూడా మనమే రాసుకోని వెళ్ళి పాఠం చెప్పాలట. రకరకాల ఫిలాసఫర్స్ రకరకాల బోధనా విధానాలను, వ్యూహాలను చెప్తూ గందరగోళపరుస్తున్నారు. అందరినీ ఒకే గాటన కట్టేసి చదువు చెప్పడానికి విద్యార్థులేం గొడ్లా? 'ఏం కష్టమొచ్చింది రమణా ఈ వయసులో' అనుకుంటూ హాలులో సోఫా ప్రక్కన కూర్చుని జాలిగా నా వైపే చూస్తున్న రమణ మహర్షికి మొర పెట్టుకున్నాను.

"అక్క చదువుకుంటుంది రా! అరవబాకండి రా" అంటోంది వార్డెన్. ఆమె మాట ఎవరు వింటారు? ఇహిహి అని ఒకటే నవ్వులు, "అక్కకి చెప్తా" అంటూ ఏడుపు గొంతూ వినిపించాయి.

"అక్కా! నేను నిద్రపోతుంటే నా ముఖాన్ని చూడండి ఏం చేశారో " అని ఏడుస్తూ చెప్తున్నాడు నా గది ముందు నిలబడి సుమిత్.

పుస్తకాలు పక్కన పారేసి వాకిలి దగ్గరకి పరిగెత్తి తలుపు తీశాను. రోహిత్, సుమిత్ ఇద్దరూ నిలబడి ఉన్నారు వాకిట్లో - ఒకడు ఏడుస్తూ ఇంకోడు నవ్వుతూ. బుంగ మీసాలు, గడ్డం, పులిపిరికాయంత పుట్టుమచ్చ ఒకరికీ, మెలితిరిగిన మీసాలూ, మెలికల్లో మచ్చలు ఇంకొకరికీ చక్కగా పెన్ తో వాళ్ళిద్దరి ముఖాల మీద చిత్రించారు ఎవరో. వాళ్ళ వెనుక కిసుక్కు కిసుక్కు మని నవ్వుకుంటూ గుంపు. వీళ్ళ ముఖాలు చూసినందుకు కాదు గాని పిల్లలు కిసుక్కు కిసుక్కు మంటుంటే మాత్రం నాకు నవ్వు ఆగలేదు.

" ఇదేందిరా. ఎవరు గీశారు ఇలా " అన్నాను నవ్వుతూ.

నేను కూడా నవ్వానని ఉక్రోషంతో సుమిత్ పెద్దగా ఏడ్చాడు. జాలేసింది. సుమిత్ ని, రోహిత్ ని నా గదిలోకి రమ్మని మిగతా అందరినీ పంపించాను సీరియస్ గా ముఖం పెట్టి. లోపలకి వచ్చి సోఫాలో కూర్చున్నారు ఇద్దరూ. రోహిత్ కళ్ళల్లో చాలా సంతోషం. సుమిత్ కి ఏడ్చేంతగా దు:ఖం.

"ఏమైంది? ఎవరు గీశారు?" అన్నాను.

"నా ముఖం మీద రాఘవ్ గీశాడక్కా! వీడి ముఖమ్మీదేమో కార్తిక్, కిశోర్ ఇద్దరూ గీశారు అన్నాడు మెలితిరిగిన మీసాల వాడు నవ్వుకుంటూ.

" వెళ్ళి ముగ్గురినీ పిలుచుకురా " అన్నాను.

రోహిత్ లోపలకి వెళ్ళి ముగ్గురినీ వెంటబెట్టుకు వచ్చాడు. నేను అడక్కముందే కలగాపులగం గా ఎక్స్ ప్లనేషన్ ఇవ్వడం మొదలుపెట్టారు.

వీళ్ళ ముగ్గురు తప్ప అందరూ నిద్రపోయారట. వీళ్ళకి నిద్ర రాలేదు. బోరు కొట్టింది. రాఘవ్ 'వీళ్ళందరి ముఖాల మీద అందంగా పెయింట్ వేద్దాం రా. మనం కూడా మన ముఖాలకి వేసుకుందాం. అందరూ నిద్ర లేచి ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుని నవ్వుకుంటారు' అని అన్నాడట. సరే అంటే సరే అనుకుని రోహిత్ కి వేసి సుమిత్ కి వేస్తుంటే పులిపిరి కాయంత పుట్టుమచ్చ డార్క్ గా రాలేదని కిశోర్ గట్టిగా గీశాడట. సుమిత్ కి మెలకువ వచ్చింది. అద్దం లో చూసుకుని పెద్దగా అరవడం మొదలుపెట్టాడు. ఈ లోపు మిగతా అందరూ లేచి వీళ్ళ ముఖాలు చూసి ఒకటే నవ్వడం. నవ్వుతున్నారని సుమిత్ అవమానం గా ఫీలయిపోయి ఏడ్చాడుట.

"సారీ సుమిత్! నువ్వు ఏడుస్తావనుకోలా" అన్నాడు కిశోర్.

"సరే. ఏది ఏమైనా నిద్ర పోయేటప్పుడు అలా చేయకూడదు కదా! సరదాగా ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు పెయింట్ చేసుకోవచ్చు గాని. ముగ్గురూ నాకు ఎక్స్ ప్లనేషన్ లెటర్స్, రోహిత్ కీ, సుమిత్ కీ అపాలజీ లెటర్స్ రాయండి. ఇంకెప్పుడూ ఇలా చేయమని కూడా రాయండి. ఇప్పుడు చేసినందుకు రెండు రోజులు సైలెంట్ లంచ్ ముగ్గురికీ - సరేనా" అన్నాను.

"సరే అక్కా!" అన్నారు ముగ్గురూ.

"వెళ్ళండి వెళ్ళి ముఖాలు కడుక్కోండి" అని చెప్పి అందరినీ పంపించాను.

వెళ్తున్న రోహిత్ ని "రోహిత్ ఒకసారి ఇలా రా" అని పిలిచి "వాళ్ళు నీ ముఖం మీద పెయింట్ వేసినందుకు ఏడుపు రాలేదా?" అని అడిగాను.

"లేదక్కా! భలే నవ్వు వచ్చింది" అన్నాడు. వాడిని చూస్తే నాకు చాలా ఆనందం కలిగింది.

జీవన గమనంలో మనల్ని ఎంతో మంది అసూయతోనో, వారి లేకి బుద్ధుల వలనో ఏదో ఒకటి అంటుంటారు. ఎదురుగ్గానో, చాటుగానో మనల్ని అవమానపరుస్తూనే ఉంటారు. అలాంటి వారిని ద్వేషిస్తాం లేదా బాధపడతాం. అలా కాకుండా రోహిత్ లాగా నవ్వుకుంటూ ఉంటే జీవితం నవ్వుల పంట అవుతుంది కదా అనిపించింది నాకా క్షణం.

******



2 comments:

  1. రోహిత్ అలా సరదాగా తీసుకోవడ బావుంది.

    ReplyDelete
  2. కొంత మంది పిల్లలు భలే easy going గా ఉంటారు కదా లలిత గారూ, వాళ్ళని చూసి నేనైతే ఎన్నో విషయాలు నేర్చుకుంటాను. మీకు ధన్యవాదాలు

    ReplyDelete

P