Thursday, September 11, 2014

ఆక్రోశం


వెంకటాపురం లచ్చి మొగుడు చలపతి చచ్చిపోయాడు.

టౌన్లో తాగి ఇంటికి రావడానికి బస్ స్టాండ్ కి వస్తుంటే చీకట్లో ఏ లారీనో, ఆటోనో గుద్దేసి వెళ్ళిపోయింది.

అది లారీనా, ఆటోనా అని ఆ అర్థరాత్రి ఎవరికి తెలుస్తుంది?

అంబులెన్స్ వచ్చి శవాన్ని లచ్చి ఇంటి ముందు దింపేసి వెళ్ళిపోయింది. శవపంచాయితీ చేయించి శవాన్ని తీసుకొచ్చిన లచ్చి అన్న అలిసిపోయి వరండాలో కింద కూలబడ్డట్లుగా కూర్చున్నాడు.

లచ్చి గుండెలు బాదుకోని ఏడుస్తోంది. ఆమె పిల్లలు నలుగురూ లచ్చి పక్కన నిలబడి బిక్కు బిక్కు మంటూ వచ్చిన జనాన్ని చూస్తున్నారు. అంబులెన్స్ ని చూసి వచ్చిన విలేకర్లు, జనం శవం చుట్టూ గుమిగూడి ఉన్నారు.

జనాలల్లో కాస్త నదురుగా ఉన్నోళ్ళ పక్కకి చేరి లచ్చి పేరు, చచ్చినోడి పేరు, వాళ్ళ పిల్లల పేర్లని అడిగి వార్త రాసుకుంటున్నారు లోకల్ విలేకర్లు. మామూలు వార్తే.... విశేషమేమీ లేదు.

ఈలోగా ఊళ్ళో ఉన్న నలుగురైదుగురు కార్యకర్తలు వచ్చారు. ఊళ్ళో ఏది జరిగినా సహాయానికి ముందుంటారు. ఈ ఊరికి సంబంధించిన వార్తల్లో ఏ పేపర్లో చూసినా, ఏ కార్యక్రమంలో చూసినా వీళ్ళ ముఖాలే ఉంటాయి.

ఎట్లా జరిగిందమ్మా?” అన్నాడు అందులో ఒకరు.

నా కెట్లా తెలుసన్నో? మీకే తెలియాల. అంతకు ముందు ఊళ్ళోనే తాగి ఇంటికొచ్చి ఏదో పెట్టింది తిని పడుకునే వాడు. ఈ పార్టీకి ఓటేస్తే బెల్టు షాపులు తీసేస్తారు, మీ కుటుంబాలన్నీ బాగుపడతయ్యి అంటిరి. సరేనని ఓటేస్తిమి" అంది తల బాదుకుంటా.

ఎత్తేశారుగామ్మా! మంచిదయ్యిందిగా!?” అన్నాడతను.

ఏం మంచిదన్నో కాపురాలు ఇంకా నాశనమయినయ్యి"

వింటున్న విలేకర్లు, కార్యకర్తలు 'ఎట్లా జరిగిందమ్మా అంటే ఏమిటేమిటో మాట్లాడుతుందే.... తెలిసి మాట్లాడుతుందా లేక మొగుడు చచ్చాడని పిచ్చెక్కి మాట్లాడుతుందా' అనుకున్నారు.

ఏందమ్మా నువ్వనేది?” అన్నాడు ఇంకో కార్యకర్త.

ఔ అన్నా! ఇక్కడ మందు దొరక్కపోయేలకి టౌనుకెళ్ళడం మరిగారు. అంతకు మునుపు తాగుడికే కర్చు, ఇప్పుడూ...... బస్ చార్జీలు, మందు, అక్కడే నంజుడికి మాంసాలూ..... డబ్బులు పైసా ఇంటికివ్వడం లేదు.

రోజుకి మూడొందలు కూలి..... అంతా కర్చు పెట్టేస్తన్నాడు.

ఊళ్ళోనే తాగుతున్నప్పుడు ఇంట్లో కర్చుకి కాస్తిచ్చేవాడు. బిడ్డలకి చాలీ చాలకుండా అన్నా మూడు పూటలా పెట్టుకున్నా. టౌనుకి పోబట్టినప్పటినుండి ఒక్కోపూట పస్తులుంటన్నాం....

ఇప్పుడు గూడా చూడన్నా..... ఆ టౌనుకి పోబట్టేగాన్నా ప్రాణాలే పోయినయ్యి!!? నా నలుగురి బిడ్డల గతేందన్నా?”

లచ్చి మాటలకి ఎవ్వరూ ఏం మాట్లాడలేదు. విలేకర్లు గబగబా రాసుకుపోతున్నారు. కార్యకర్తల నోట మాట పడిపోయింది.

'మా యమ్మ చెప్తానే ఉంది 'హోలు మొత్తం దేశమంతా ఎత్తెయ్యాల అప్పుడు బాగుపడతాం గాని ఈ బెల్టు షాపులు ఎత్తేస్తే ఏమొరుగుతుంది?' అని. విన్నానా? మీ మాటలినుకున్నా..... మీరు చెప్పినోడికి ఓటేశా. నా మొగుడేందో బాగుపడతాడనుకున్నా.....

మా నాయన కూడా పచ్చి తాగుబోతు. నా చిన్నప్పుడు ఈ పెబుత్వమే జిల్లా మొత్తంలో సారాయి దొరక్కుండా చేసింది. మా అమ్మ నన్ను - ఇడిగో వీడు.... మా అన్నని పట్టుకోని ఏమేడ్చినా ఏడ్చింది సంతోషంతో..... సారాయి ఎత్తేసిన ఆ సాములోరికి దండేసి మొక్కుకుంటానంది.

మా నాయన వారం రోజులు బాగానే ఉన్నాడు. ఎనిమిదోనాపొద్దు ఇసక లారీ ఎక్కి మదరాసు పోయాడు అక్కడ తాగి రావడానికి. ఇంతవరకూ అతీ గతీ తెలియలా...... పోలీసులు పట్టకపోయారో, దొంగల్లో చేరాడో, యాడైనా యాక్సిడెంటులో చచ్చాడో తెలియలా......అప్పుడు కాబట్టి ఎట్టాకొట్ట మమ్మల్ని సాకింది మా యమ్మ.

ఇప్పుడు ఈ కరువు కాలంలో నా బిడ్డల్ని ఏ గంప కింద పెట్టి సాకేదన్నో, మా కెవరు గతన్నో....”

లచ్చి ఏడుపు గాలిలో తేలి తేలి పోతోంది..... తాగినోడి ఒళ్ళు లాగా.


*****



1 comment:

P