Sunday, October 19, 2014

సీమతల్లి


నిన్న వాన కురిసెళ్ళిపోయిందిగా లాస్ట్ పాండ్ లో నీళ్ళొచ్చాయోమో చూద్దామని బయలుదేరాము. గుట్ట దారంతా బండలు, ముళ్ళ పొదలూ, పిచ్చి మొక్కలూ.... దివ్యంగా వెలిగిపోతున్న రిషికొండ నిర్మలమైన సాయంకాలపుటెండలో అందంగా gigantic గా అన్ని contours తో స్పష్టంగా కనపడుతోంది. ఆ కొండ ఎన్నెన్ని మార్పులు చూపిస్తుందో తనలోనివి! లోతులు, ఎత్తులు, పల్లాలు, చెట్లు, రంగులు - ఎప్పుడో ఏదో జరిగి మమ్మల్ని చైతన్యంలో ముంచి తేల్చి వెళ్ళిపోయిన అనుభవమే ఇక్కడికి తెచ్చి పడేసిందనిపిస్తోంది ఆ కొండని చూస్తుంటే.

బారుగా కొమ్మలు చాపుకుని ఉన్న చింత చెట్టు కిందకి పోగానే ఎండ శాంతమైనట్టనిపించిది. ఒక్క నిమిషమే ఆగి చుట్టూ చూశాను. వెళ్ళి పోతున్న సూర్యుడిని తన ఆకులలో దాచుకోవాలనేమో కవ్విస్తూ దారి వైపున్న కుర్ర మర్రి చెట్టు మిలమిలా మెరుపులు చిందిస్తోంది. ఆ ఆకులని చూస్తూ, వాటి పచ్చదనానికి నవ్వుకుంటూ ముందుకు నడుస్తుంటే 'మమ్మల్ని చూడవా' అంటూ గడ్డి పువ్వులు వంగరంగేసుకుని వంగిపోతున్నాయి. గ్రామఫోను రికార్డు మొక్కల తీగలు కావాలనే కాళ్ళకి అడ్డం పడుతున్నాయి. గుట్ట మీదనుంచి లోయలోకి దిగేప్పుడు పాపం పడతానేమోనని సహచరుడు చెయ్యి అందించాడు.

దిగగానే "వోమ్మో! రొంతసేపాగి అలుపు తీర్చుకో" అంటూ గుట్ట నాకు నీడ గొడుగేసింది. తడిచిన నా ముఖాన్ని చల్లగాలి చల్లగా తాకింది. కళ్ళు మూతలు పడ్డాయి ఆ ఆర్థ్రతకి. 'సత్తువ తెచ్చుకుంటావా కాసేపు కూర్చుని' అన్న మాటలకి 'నాకు నిస్సత్తువే లేదే ఎందుకు కూర్చోవడం' అంటూ కళ్ళతో నవ్వాను.

'నిశాదేవితో సరాగాలాడాలని తొందరగా కొండల వెనక్కి పరిగెత్తుతున్న భానుడి కంటే ముందే ఆ కుంటని చేరి, కిరణాలతో తళతళలాడే నీటి చుక్కలని చూడొద్దూ ఆగితే ఎట్టా' అనుకుంటూ గబగబా నడిచాం.

తెల్లని బుల్లి ఉమ్మెత్త పూలలోని మధువుని తాగుతున్న ఎర్రనల్ల చుక్కల సీతాకోకచిలుక మా అలికిడికి ఎగిరిపోయింది. క్షమించమని సీతాకోకచిలుకకీ సీతాఫలం చెట్టుకీ చెప్పి నాలుగాకులు కోసుకుని వాసన పీలుస్తూ నడిచాను. పొదలను తప్పించుకుంటూ, రాళ్ళెక్కి దిగి రాళ్ళల్లో మొలకలుగానే ఎండిపోతున్న శనక్కాయల పంటని దిగులుగా చూస్తూ కుంట దగ్గరకి ఆత్రంగా వెళితే "థయ్ నీ యమ్మ పిచ్చి గొర్రెల్లారా! నా పేనం తీయడానికి నన్నీడకీడ్చకొచ్చారే తెగ తాగదామని!? సీమనేలతల్లి చారలగా చీలిపోతాంది గొంతెండకపోయి. మీకు కుంటలో నీళ్ళు దాపెట్టేదానికి ఆయమ్మ యాట్నుండి తెచ్చిద్ది!!?” అంటున్నాడు గొర్రెల తాత.

డొక్కలెండిపోయిన గొర్రెలు తలలు నేలకేసి రాసుకుంటూ గుట్టనెక్కుతున్నాయి. తాత తన పుల్లల్లాంటి కాళ్ళని తాటిస్తూ వాటిని అదిలిస్తున్నాడు.

అప్పుడు కలిగిందండీ నాకు నిస్సత్తువ, కూలబడ్డాను నీటి తడే లేని "లాస్ట్" పాండ్ ని నిండుగా నిండిన కన్నీళ్ళతో చూస్తూ.....

No comments:

Post a Comment

P