Sunday, December 28, 2014

డొనేషన్

కథ
- రాధ మండువ

“ఏవమ్మా! ఆదిలక్ష్మమ్మా! ఇంట్లో ఉన్నావా?”
“అమ్మ లేదు అమ్మమ్మా! ఏం కావాలి?”
“అబ్బాయ్ రామూ! ఇంట్లోనే ఉన్నావే? కాలేజీకి పోలా?”
“లేదమ్మమ్మా! ఇప్పుడు సెలవలు"
“ఆఁ ఇంటర్ అయిపోయింది గదూ! డిగ్రీకి చేరుతున్నావా లేక ఎమ్ సెట్ రాసి ఇంజనీరింగ్ చేరుతున్నావా?”
“డిగ్రీ చదువుకుని బి ఎడ్ చేస్తాలే అమ్మమ్మా. ఇంజనీరింగ్ చదవాలంటే మాకు చాలా కష్టం - అంత ఫీజు కట్టుకోలేం"
“అదేంటబ్బాయ్! గవర్నమెంట్ స్కాలర్ షిప్ ఇస్తుందిగా?”
“ఇస్తుంది గాని ఇంజనీరింగ్ పుస్తకాలకీ, పరీక్ష ఫీజుకే చాలా ఖర్చవుతుంది"
“నువ్వు ఇంజనీరింగ్ చదువుకో. మా అమ్మాయి మొన్న అమెరికా నుంచి ఫోన్ చేసి 'అమ్మా! ఎవరైనా పేద పిల్లలుంటే చూడమ్మా చదివిద్దాం. ఇక్కడ అందరూ మేము ఫలానా వాళ్ళని డిగ్రీ చదివిస్తున్నాం ఫలానా వాళ్ళని ఇంజనీరింగ్ చదివిస్తున్నాం అని ఆ పిల్లల ఫొటోలు చూపిస్తూ గొప్పలు పోతున్నారు. మనం ఆ మాత్రం చదివించలేమా? నీకు తెలిసిన వాళ్ళుంటే చెప్పమ్మా' అని ఎంత ఇదిగా అడిగిందో. పిచ్చిపిల్ల దానికి ఎంత తాపత్రయమో పిల్లలని చదివించాలని. నీకెందుకు నువ్వు ఇంజనీరింగ్ లో చేరు. నీ పుస్తకాలకి కావలసిన డబ్బులు మా అమ్మాయి ఇస్తుంది గాని"
“..............”
“ఏంటబ్బాయ్! ఏం మాట్లాడవూ!? నేను చెప్పిన మాట మీ అమ్మకి చెప్పు. వస్తానబ్బాయ్ - అయ్యో! నా మతిమండా! వచ్చిన పనే మర్చిపోయాను. కరివేపాకు కాస్త కోసివ్వు నాయనా"
“ఇదిగో అమ్మమ్మా!”
“మా నాయనే - నేను చెప్పిన మాట మీ అమ్మానాన్నలకి చెప్పి ఇంజనీరింగ్ లో చేరు నాయనా"
“అలాగే అమ్మమ్మా!”
***
“ఒరేయ్ అబ్బాయ్, రామూ! ఎవరదీ రామేనా రోడ్డున పోయేదీ!? చీకట్లో ఏమీ కనిపించడం లేదూ”
“నేనే అమ్మమ్మా! ఏంటీ?”
“దా అబ్బాయ్ కాలేజీలో చేరావా?”
“చేరాను”
“ఒకసారి లోపలకి రా, అమ్మాయి అమెరికా నుంచి డబ్బులు పంపింది తీసుకుందువుగాని”
“ఇంటికెళ్ళి అమ్మని పంపిస్తా అమ్మమ్మా”
“మీ అమ్మ లేకపోతే ఏంలే. ఎవరదీ భాగ్యం...”
“ఆఁ నేనే కాంతమ్మొదినా”
“ఈమధ్య మనుషులు ఆనడం లేదు భాగ్యం. ఇట్లా లోపలకి రా, నీతో పనుంది. నువ్వు కూడా రారా అబ్బాయ్”
“ఏందొదినా”
“మా అమ్మాయి రాముని చదివిస్తోంది భాగ్యం. డబ్బు పంపింది. 5 వేలు. 'అంతా ఒకేసారి ఇస్తే ఇంట్లో వాడుకుంటారేమోనే అమ్మా! ఇప్పుడు రెండు వేలిచ్చి మళ్ళీ ఫీజు కట్టే ముందు ఒక వెయ్యి, ఫీజుకి రెండు వేలు ఇవ్వు' అని ఎంతో వివరంగా చెప్పింది. పాపం దానికి ఈ అబ్బాయి చదువు మీదే ధ్యాస అనుకో - ఇదిగో ఈ రెండు వేలూ లెక్కేసి రాముకి నీ చేత్తో ఇస్తావని పిలిచా”
“ఇటివ్వు - ఇదిగో రామూ తీసుకో”
“థాంక్యూ అమ్మమ్మా!”
“ఆఁ జాగ్రత్త నాయనా, కావలసిన పుస్తకాలు కొనుక్కో”
“సరే అమ్మమ్మా”

***
"ఏమ్మాయ్ ఆదిలక్ష్మీ! పిల్లాడు చెప్పాడా నేను రాత్రి రెండు వేల రూపాయలు ఇచ్చానని?”
“చెప్పాడక్కా. పుస్తకాలు కొనుక్కుంటానన్నాడు ఇవ్వాళ. నీ పుణ్యాన వాడు ఇంజనీరింగ్ లో చేరాడక్కా. మా అదృష్టం”
“సరే అమ్మాయ్. రేపు ఆదివారం రాముని కాస్త మా దొడ్లో పిచ్చి మొక్కలు పీకేయమని చెప్పమ్మా! పాములు చేరతాయోమోనని భయంగా ఉంది. అసలే కళ్ళు కనపడటం లేదు, వాటి మీద కాలేశానంటే...”
“చెప్తాలే అక్కా! పీకేస్తాడులే”
***
“ఓ అబ్బాయ్! రామూ, రామశాస్త్రీ..... నేనిచ్చిన డబ్బు పెట్టి పుస్తకాలు కొనుక్కున్నావా?”
“అయ్యో! అమ్మమ్మా! ఎందుకు అరుస్తారు, వస్తున్నానుగా.... కొనుక్కున్నాను”
“అన్నీ కొనుక్కున్నావా? డబ్బులు సరిపోయాయా?”
“ఇంకా రెండొందలు పడితే మా నాన్న ఇచ్చాడమ్మమ్మా”
“పోన్లే నాయనా! కాస్త కోమటింటికి వెళ్ళి రెండు కొబ్బరి కాయలు తెచ్చి పెట్టయ్యా పూజకి వేళయింది”
“సరే అమ్మమ్మా”
“ఆ చేత్తోనే వెంకమ్మ గారింట్లో మా రామాయణం పుస్తకం ఉంది తీసుకురా నాయనా. 'ఇస్తాను ఇస్తాను' అంటుంది కాని ఇవ్వదు - తీసుకుపోయి నెల దాటుతోంది”
“ఆఁ తెస్తాను"

***
“ఇదిగో ఆదిలక్ష్మమ్మా! ఏం చేస్తున్నావ్?”
“దాక్కా! కూర్చో!”
“మా అమ్మాయి అమెరికా నుంచి ఇక్కడున్న షాపుల్లోని చీరలు కంప్యూటర్ లో చూసి పంపింది చూడు"
“బాగున్నాయక్కా!”
"ఒక్కోటి ఏడువేలంటమ్మాయ్ - ఎందుకే అంత డబ్బు ఖర్చు అంటే 'అమ్మలకి అందరూ చీరలు పెడుతున్నారమ్మా' అంది. బిడ్డకి నా మీద ఎంత ఆపేక్షో!?”
“ఔనక్కా! అదృష్టవంతురాలివి"
“పిల్లాడు ఎలా చదువుతున్నాడు"
“బాగానే చదువుకుంటున్నాడక్కా"
“అమ్మాయి అక్కడ అమెరికాలో తన ఫ్రెండ్సందరికీ రాము గురించి చెప్పిందట. అదేమిటో ఫాస్టర్ ఛైల్డ్ అంటారటమ్మా - ఇట్లా చదివించే పిల్లలని - మీ ఫాస్టర్ ఛైల్డ్ ఫోటో చూపించమని అందరూ అడుగుతున్నారట. సాయంత్రం రాము రాగానే వాడిదొక ఫోటో తెచ్చియ్యమని చెప్పు. నాయుడి గారమ్మాయి వచ్చిందిగా అమెరికా నుంచి..... ఆ అమ్మాయి చేత ఇచ్చి పంపించమని చెప్పింది"
“సరేలే అక్కా! అబ్బాయి రాగానే పంపుతా"
***
“ఏంరోయ్ రామా! అసలు బొత్తిగా కన్పించడం లేదే, ఏం చేస్తున్నావో, ఎట్లా చదవుతున్నావో ఏమీ చెప్పడం లేదే మాకు. మా అమ్మాయేమో ఎప్పుడు ఫోన్ చేసినా నీ చదువు గురించే అడుగుతుంది. 'పరీక్షలు దగ్గరకొచ్చినయ్ గా అమ్మా ఫీజుకి డబ్బులిచ్చావా? లేదా?' అని ఎన్ని సార్లు అడిగిందో!”
“పరీక్ష ఫీజు కట్టేశానులే అమ్మమ్మా నాన్న ఎక్కడో తెచ్చి ఇచ్చాడు"
“అదేంటిరా అబ్బాయ్! ఎక్కడో తేవడం ఎందుకు? నన్ను అడిగితే నేనివ్వనూ!? మేం చదివిస్తున్నాం కదా నిన్నూ..... ఎవరా పోయేది, రాఘవయ్యా.... కొంచెం ఇటురా"
“ఏవమ్మా?”
“మా అమ్మాయి రాముని చదివిస్తుందని నీకు తెలుసుగా?”
“తెలుసు. ఊళ్ళో అందరూ అనుకుంటున్నారు. ఏమయిందిప్పుడు?”
“ఏమీ లేదు. అబ్బాయి పరీక్ష ఫీజు కట్టాలటా...... ఇదిగో ఈ వెయ్యీ నీ చేత్తో ఇస్తావా?”
“ఆఁ ఇవిగోనోయ్ శాస్త్రీ! అదృష్టవంతుడివి కాబట్టి నిన్ను వీళ్ళు చదివిస్తున్నారు. బాగా చదువుకుని వీళ్ళ పేరు నిలబెట్టు"
“బాగా చెప్పావు రాఘవయ్యా! ఇట్లా చెప్పే వాళ్ళు లేకే పిల్లలు చెడిపోతున్నారనుకో. మా అమ్మాయైతే వీడి చదువు గురించి ఎన్ని సార్లు అడుగుతుందో..... 'రాము బాగా చదువుకుంటున్నాడా - బాగా చదువుకుంటున్నాడా?' అని"
“వెళ్ళొస్తా అమ్మమ్మా"
“ఆ...... మాట్లాడుతుంటే వెళతానంటావే?”
"కాలేజీకి టైమయిందమ్మమ్మా"
“సరేలే వెళ్ళు. ఇదిగో అబ్బాయ్ వెళుతూ వెళుతూ ఈ చీరలు కాస్త చాకలి రంగన్నింట్లో ఇచ్చేసి వెళ్ళు నాయనా"
“టైమయిందమ్మమ్మా! సాయంత్రం వచ్చిన తర్వాత ఇచ్చొస్తా"
“ఊఁ సాయంత్రం మర్చిపోకుండా రా మరి. డబ్బులు జాగ్రత్త నాయనా"

***
“ఆదిలక్ష్మీ! ఆదిలక్ష్మీ! రాము లేడా?”
“ఇంకా రాలేదక్కా!”
“మొన్ననగా చెప్పా, కాస్త చీరలు చాకలి రంగన్నకిచ్చిరాయ్యా అని. ఇంటి ఛాయలగ్గూడా రాకుండా తిరుగుతున్నాడే?”
"అయ్యో, లేదక్కా! పరీక్షలు దగ్గరకొచ్చాయని వాళ్ళ కాలేజీ వాళ్ళు స్పెషల్ క్లాస్ లు పెడుతున్నారంట. వచ్చేప్పటికి రోజూ పొద్దుపోతోంది"
“ఏం, పొద్దుపోతే రాకూడదా? రంగన్న తీసుకోడా పొద్దుపోతే? పొద్దుపోయిందని మేం డబ్బులు ఇవ్వకుండా ఉన్నామా?”
“................”
“అవునులే ఇచ్చినంత సేపూ ఒక రకం, ఇచ్చాక ఇంకో రకం"
“మీరేం మాట్లాడుతున్నారమ్మమ్మా! మీ మాటలు బయటకి వినపడుతున్నాయి. మీ డబ్బులు తీసుకున్నప్పటి నుండీ పనోడిలాగా నా చేత పనులు చేయించుకుంటున్నారు. పోనీలే పెద్దామెకి చేస్తే ఏం లే అని మేమనుకున్నాము. ఊళ్ళో అందరికీ 'మేం చదివిస్తున్నాం - మేం చదివిస్తున్నాం' అని గొప్పలు చెప్పుకుంటా తిరుగుతున్నారు. మమ్మల్ని అందరూ అడగడమే..... 'కాంతమ్మోళ్ళు చదివిస్తున్నారంటగా నిన్నూ....' అని. దానికీ ఊరుకున్నాం మీ దగ్గర తీసుకున్నాం గదా అని...... ఇప్పుడు ఇంటి మీదికొచ్చి సామెతలు మాట్లాడుతున్నారు. 'కుడి చేత్తో ఇచ్చేది ఎడమ చేతికి కూడా తెలియకుండా చేసేదాన్ని దానం' అంటారు. ఏదో ఒకరోజు మీరిలా అంటారని నాకు తెలుసు కాబట్టే కాలేజీ అయ్యాక బట్టల షాపులో పని చేస్తున్నాను. ఇదిగోండి మీరిచ్చిన మూడు వేలు"
“ఆఁ ఆఁ ఎంత పొగరు?"
“ఏమీ అనుకోకక్కా! అబ్బాయేదో కోపంలో ఉన్నాడు. నేను మీతో తర్వాత మాట్లాడతా వెళ్ళండి"
“ఇదిగో భాగ్యం అన్నీ విన్నావా"
"ఆఁ అదే చూస్తున్నా కాంతమ్మొదినా పాలు తీసుకోని వస్తా ఏమిటా రాము అరుస్తున్నాడూ.... అని ఆగా"
"వాడు ఇంతలేడు ఏం మాట్లాడుతున్నాడో చూడూ.... అందుకే అంటారు 'అపాత్రదానం కూడదని'........ వస్తా. మా అమ్మాయికి ఫోన్ చేయాలి.
*****

No comments:

Post a Comment

P