Monday, January 12, 2015

నిర్వేదం

ఆంధ్రభూమి వారపత్రిక ప్రచురణ 

మెలకువ వచ్చింది. అయినా కళ్ళు తెరుపుడు పడటం లేదు. పదహారు గంటల ప్రయాణం వల్ల అలిసిపోయిన శరీరం ఇప్పుడు తేలికయింది కాని జెట్ లాగ్ వదలక కళ్ళు మూతలు పడిపోతున్నాయి. వేకువఝాము అయినట్లుంది. సన్నజాజి పూల పరిమళంతో వీచే చల్లటి గాలి, మంచుకు తడిసిన మా ఊరి నేల మట్టి వాసన, అమ్మ ప్రేమ, పాల వెంకటస్వామి, మా ఊరి వాళ్లు, మా మేనమామ కూతురు మాధవి - నా మనసులో ఎప్పుడూ ఉండే ఈ గుర్తులు - ఇక్కడకొస్తే ప్రత్యక్షానుభూతిగా మారి ఆనందాన్ని కలిగిస్తాయి కాని ఈసారెందుకో దిగులుగా ఉంది.

అమ్మ వంటింట్లో పని చేసుకుంటున్నట్లుంది. మట్టి రోడ్డు మీద డొక్కు సైకిలు వస్తున్న శబ్దం. పాలు పోయించుకునే వెంకటస్వామిదే ఆ సైకిలు. లేచి కూర్చుని కిటికీలోంచి చూశాను. వెంకటస్వామి సైకిల్ ఆపి బెల్లు కొట్టాడు. అమ్మ పాలు తెచ్చి పోసింది. వెంకటస్వామి అంటే నాకు చిన్నప్పటి నుండీ ఎంతో ఇష్టం. అతనిచ్చే పాల డబ్బులతోనే అమ్మ నన్ను చదివించింది. 'లెక్క తర్వాత చూసుకుందాం లేమ్మా' అని నా ఫీజుకి అవసరం అంటే చాలు డబ్బులిచ్చేవాడు.

అబ్బాయి గారు వచ్చారంటగామ్మా? వచ్చి ఆర్నెల్లు కూడా కాలేదే మళ్లీ ఏమైనా పని మీదొచ్చాడా” అన్నాడు.

తెలియదు వెంకటసామీ ఆఫీసు పనేమైనా పడిందేమో... రాత్రి పొద్దుపోయింది వచ్చేప్పటికి. నిద్రపోతున్నాడు. రేపు పలకరిద్దువులే" అంది అమ్మ.

సరేలేమ్మా పడుకోనీయండి" అంటూ వెంకటస్వామి వెళ్ళిపోయాడు.

మట్టిరోడ్డుకి అవతలగా చేలో బర్రెల కోసం వేసిన పాక, ఒకప్పుడు మా పేదరికానికి గుర్తుగా పాక ప్రక్కన సర్ది పెట్టిన మసిబారిన పాత్రలూ, దిష్టిబొమ్మలా గడ్డివాము, తన బిడ్డతో పాటు పోషిస్తున్న యజమానులకీ పాలు ఇచ్చానన్న తృప్తితో నెమరేసుకుంటున్న బర్రె, బొజ్జ నిండిన ఆనందంతో పాకలోకి, పాక బయట కట్టేసిన తన అమ్మ దగ్గరకి గెంతులేస్తున్న దూడ - కళ్ళతో దృశ్యాన్ని తాగిన ఆనందం హృదయంలోకి చేరి దిగులుని తొలగించినట్లయింది. చిన్నప్పుడు నిద్ర రాకపోతే జోకొడుతున్న అమ్మ చేయి అంత మృదువుగా మారిపోతున్న నా మనసు ఒక్కొక్క పొరనూ విప్పుకుంటోంది.

***

"అత్తయ్యకి ఆరోగ్యం బాగా లేకపోతే అక్కడ ఎన్ని హాస్పిటల్స్ లేవు? మొన్న ఫోన్ లో 'ఇప్పుడు బాగానే ఉన్నాను' అని కూడా చెప్పారు కదా? బాగా లేకపోతే ఆవిడని ఇక్కడకి తీసుకొచ్చి చూపించండి. అంతేగాని చేస్తున్న ఉద్యోగాలు వదిలేసి వెళ్ళి సేవలు చేయాలా?”

వసంత మాటలకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదు.

అది కారణం కాదు వసంతా! నాకెందుకో ఇక్కడ ఉండాలనిపించడం లేదు. ఆఫీసులో పని చేయలేకపోతున్నాను. జాబ్ వదిలేస్తే ఇక్కడ ఉండలేము అందుకే అమ్మ దగ్గరకి వెళదామంటున్నాను"

అదేమిటండీ - నాకసలు అర్థం కానిది అదే - ఉద్యోగం చేయకుండా ఏం చేస్తారు? మీరు మీ గురించే కాని మమ్మల్ని గురించి ఆలోచించరా? శ్రవణ్ - పదవతరగతి దాకా ఇక్కడ చదివిన వీడు అక్కడకి వచ్చి అడ్జస్ట్ అవగలడా? అయినా కూర్చుని తినడానికి మనకేమైనా కొండలున్నాయా?”

"ఏదో తెలీని బరువుని మోస్తున్న ఫీలింగ్ వసంతా! ఇదీ అని నీకు వివరించలేకపోతున్నాను. అక్కడ మంచి కాలేజీలు లేవా? వాడికి లేని అభ్యంతరం నీకెందుకు చెప్పు?”

వాడికేం తెలుసండీ... మీరు శలవు తీసుకోని కొన్ని రోజులు అక్కడ ఉండి రండి. మీ అమ్మని చూసుకోని వస్తే ఈ బరువులూ గిరువులూ అన్నీ పోతాయి"

అర్థం చేసుకోలేని వారితో మాట్లాడటం అనర్థానికే దారి తీస్తుందని నాకు ఆమెతో అనుభవమే కాబట్టి అప్పటికి నేనేమీ మాట్లాడలేదు.

పోయిన నెలాఖర్లో జాబ్ రిజైన్ చేసిన రోజు ఇంట్లో పెద్ద వాదనే జరిగింది.

"బద్దకానికి మోక్షం పేరు చెప్పుకుని 'ఇదంతా మాయ' అనడం ప్రతి వారికీ ఇప్పుడు ఫ్యాషన్ అయింది. ఏంటండీ మాయ? ... ఆశ్రమానికి వెళ్లిన వాళ్లు దేవుడిని దర్శించుకుని రాకుండా ఎవరో ఒకావిడ కనపడిందంట.... ఏదో తెలియని ఆకర్షణంట... కనపడితే పడింది ఆమె వెంటపడిపోవటం ఏమిటి? అది కాదా మాయ? ఏ గుండెపోటో వచ్చి ఆమె పోతే దానికి మీకెందుకు 'బరువు'? ఆశ్రమం, ఆశ్రమం అంటూ వెళ్లి మీరు చేసిన నిర్వాకం ఎవరైనా వింటే ఏమనుకుంటారు?” ఆమె ముఖంలో కనిపిస్తున్న వ్యంగ్యం, వికృతం నాలో ద్వేషాన్ని కలిగించింది.

"నోర్ముయ్ - ఛీ! ఛీ! నువ్వు అర్థం చేసుకోలేవని తెలిసీ నీకు చెప్తున్న నాకు ఉండాలి బుద్ధి" విసురుగా బయటికి వెళ్లిపోయాను.

ఎవరో తెలియని ఆమె - శివాని - మరణంతో క్రుంగి ఉన్న నాకు ఇప్పుడు వసంత మాట్లాడిన మాటలకి జీవితం అంటేనే కంపరం కలిగింది. దాదాపు రెండు నెలల నుంచీ ఇంట్లో ఘర్షణ – పొద్దున పళ్ళు తోముకునే సీను నుంచి రాత్రి పడుకునే దాకా ప్రతి విషయం లోనూ వాదనే. తల్చుకుంటుంటే శరీరం అంతా అశాంతి సుడులు సుడులుగా తిరుగుతోంది.

ఎప్పుడు ఇండియాకి వచ్చినా నాలుగైదు జతలు తప్ప ఎక్కువ బట్టలు సర్దుకోని నేను బట్టలన్నింటినీ సర్దుకోవడం చూసి ఏడవడం మొదలు పెట్టింది. 'ఉద్యోగం మానేశారన్న కోపంతో నోరు జారాననీ, క్షమించమనీ ప్రాధేయపడింది.

వసంత కళ్లల్లోని బాధ, మా వాదనలు వింటూ బిక్కముఖం వేసుకున్న నా కొడుకు శ్రవణ్ నా కళ్ళ ముందు.....

***

అబ్బాయ్! లేచావా?” అంది అమ్మ గదిలోకి వస్తూ. అమ్మని మనసారా అప్పుడే చూసుకుంటున్నట్లుగా చూశాను.

ముఖం కడుక్కో కాఫీ తాగుదువు" అంది.

లేచి బాత్ రూమ్ లోకి వెళ్ళాను. చల్లని నీళ్ళు ముఖాన పడుతుంటే హాయిగా ఉంది. స్నానం చెయ్యాలనిపించింది. స్నానం చేసి వచ్చేప్పటికి అమ్మ వేడి వేడి ఇడ్లీ, కాఫీ గదిలోకే తెచ్చి ఇచ్చింది.

త్వరగా తిని రా అబ్బాయ్ - ఆదెమ్మ వచ్చింది నీ కోసం. వాళ్ళ మనవడికి ఏదన్నా ఉద్యోగం వేయిస్తావేమో అడగడానికి. నీ ఎరికలో ఎక్కడన్నా ఉద్యోగం వేయించావంటే పాపం ఆదెమ్మ దిగులు తీరుతుంది" అంది అమ్మ.

కూతురూ, అల్లుడూ యాక్సిడెంట్ లో పోతే ఆ బిడ్డని పెంచి పెద్ద చేసి చదివించింది ఆదెమ్మత్త. ఎన్ని అగచాట్లు పడిందో అమ్మ ప్రత్యక్షంగా చూసి ఉంటుంది. కష్టసుఖాలు తెలిసిన అమ్మ మా అమ్మ. పగలంతా పొలంలో వంగి పని చేసుకుని వచ్చే అమ్మ వీపు ఎండకి ఎండి నల్లగా సంకటి మాడు చెక్కలా ఉండేది. అమ్మ వీపుని తెల్లగా చెయ్యాలని ఆరాటంతో ఆమె స్నానం చేస్తున్నప్పుడు నా చిన్ని చేతులతో రుద్దేవాడిని.

నువ్వు గూడా నన్ను కష్టపడి చదివించావుగా అమ్మా నాన్న చచ్చిపోతే! ఇవాళ నువ్వేం సుఖపడుతున్నావే? ఎవరన్నా వండిపెడితే ఇంత తినేసి కృష్ణా, రామా అనుకోవాల్సిన వయసులో ఇక్కడ ఒంటరిగా గొడ్డునీ, గోదనీ, పొలాల్నీ, ఇంటినీ చూసుకుంటున్నావు. అమెరికా డబ్బు వస్తుందని ఇక్కడ ఆస్తులు కొని 'మాకు ఇండియాలో ఎకరాలెకరాల పొలం, ఇళ్ళ స్థలాలు, బిల్డింగ్ లూ, అపార్టుమెంటులూ ఉన్నాయ'ని చెప్పుకుంటూ మేమున్నాము - భారాన్నంతా నీ వీపు మీద వేసి.

అమ్మా! నీ వీపు ఇంకా నల్లబడుతుందే ఈ బరువుకి.... టిఫిన్ గొంతు దాటి లోపలకి పోనంటోంది. ప్లేట్లోనే చెయ్యి కడిగేసి హాల్లోకి వచ్చాను.

ఆదెమ్మ గోడకి ఆనుకోని కూర్చోనుంది కింద నేల మీద.

బాగున్నావా నాయనా! మా సాగర్ ని నువ్వు చదివిన చదువే చదివించా బాబూ! అమెరికాలో ఏదైనా ఉద్యోగం వేయించావంటే నా కష్టాలు తీరతాయి"

తొందర తొందరగా ఎక్కడెక్కడికో ఎగబాకాలని ఎందుకు అందరికీ ఇంత ఆకాంక్ష? నేను మాత్రం? లాగుతున్న నాగరికతని మన్నించి దాని ప్రకారమేగా ఇన్నాళ్లూ నడిచింది? ఫేసుబుక్కుల్లో చాటింగులూ, సెల్ ఫోన్లలో గంటలు గంటలు మాటలూ, కార్లల్లో ప్రయాణాలు, ఒళ్ళంతా వాసనలు వెదజల్లే సెంటులూ - నాగరికతా ముల్లులని నేను గుచ్చిపించుకోలేదా?

గుచ్చుకుంటుందని తెలిశాక వెంటనే తీసేసుకోవాలి గాని దాన్ని మన్నించాలా వద్దా అని ఆలోచిస్తారా? అది ఎటువైపునుంచొచ్చింది, ఎంత వేగంతో వచ్చింది అనుకుంటూ తర్కిస్తారా?

ఏమంటావు నాయనా ఆనందూ?” అంది ఆదెమ్మ.

లేదత్తా! అమెరికాలో ఉద్యోగం ఇప్పించలేము" అన్నాను ముక్తసరిగా. అలా ఎలా అనగలిగానో ఆశ్చర్యం కలిగింది. ఆమెని ఎంతో ఆప్యాయంగా పలకరించే నేను అలా మాట్లాడేటప్పటికి ఆమె ఒక్క క్షణం ముఖం ముడుచుకుంది.

కొంచెం ఆగి తెప్పరిల్లినట్లయి “నాకన్నీ తెలుసు నాయనా! ఎవరో బ్రోకర్లని పట్టుకుంటే పనవుతుందంట. ఆ బ్రోకర్ల విషయాలు నీకు తెలుస్తాయని మావోడు చెప్పాడు" అంది.
"అలాగే అత్తా! వాళ్ళ ఫోన్ నంబర్లూ, వివరాలూ అన్నీ ఇస్తా - సాగర్ ని ఒకసారొచ్చి కనపడమను" అన్నాను.
ఫోన్ నంబర్లు ఇవ్వడం కాదు నాయనా! నువ్వే వాళ్ళతో మాట్లాడి ఉద్యోగం చూడమని చెప్పు నీకు పుణ్యం ఉంటుంది. ఇప్పుడే వాడిని పంపుతా ఉండు" అంటూ హడావుడిగా లేచి వెళ్ళింది.

నువ్వు మాట్లాడబ్బాయ్ వాళ్ళతో...... ఫోన్ నంబరిస్తే వాడికేం చేతనవును మాట్లాడటం" అంది అమ్మ.

లేదమ్మా! నేనింక అమెరికా వెళ్ళాలనుకోవడం లేదు. ఇక్కడే ఉండిపోవాలనుకుంటున్నా" అన్నాను.

ఏమిటీ? ఏమిటిరా నువ్వనేది? ఉద్యోగం మానేశావా ఏమిట్రా? మరి కోడలు, మనవడు ఏరీ?” అంది ఆందోళనగా గొంతు పెద్దది చేసి.

వాడి చదువయ్యాక వస్తారులేమ్మా!" అన్నాను నిర్లిప్తంగా.

అమ్మ ఏమీ మాట్లాడలేదు.

ఆదెమ్మ వచ్చింది మనవడిని వెంటబెట్టుకుని. వాడు నన్ను చూస్తున్నాడు. అబ్బురంతో కూడిన చూపులు - అమెరికాలో ఉద్యోగం చేస్తుంటే గొప్పగా ఊహించుకుని ఆశ్చర్యంతో, కొంచెం మూర్ఖత్వంతో కూడిన ఆ పిల్లవాడి చూపులు - ఇలా చూసే వాళ్ళనెంత మందినో ఇంబిసైల్స్ గా తయారు చేస్తున్నాం ఇంకా ఉన్నవీ లేనివీ కల్పించి చెప్పి. అసలు ఈ హీరో వర్షిప్పుని పెంచి పోషించింది చాలా వరకు సినిమాలు, పత్రికలు ఇంకా భజన చేసేవాళ్ళు. దీనికి రియాక్షన్ గా - పాడే వాళ్ళుంటే తిట్టే వాళ్ళుండరా? - హేళన, విమర్శతో కూడిన ఇంకో సెగ్ మెంట్ మొదలైంది. నిజంగా ఉన్నది ఉన్నట్లుగా చూసేవాళ్ళు, తమని తాము తేరిపార చూసుకునే వాళ్ళు కరువయ్యారు సమాజంలో.

ఆ అబ్బాయి చదువు గురించి యాంత్రికంగా అడిగి పంపించేశాను. ఉద్యోగం గురించి అసలు మాట్లాడలేదని అసంతృప్తి - అవ్వ మనవడు - ఇద్దరి కళ్ళల్లో.

అమ్మ దిగులుగా నా కళ్ళల్లోకి చూసి అక్కడనుండి వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఎండ ఎక్కువయింది. చిన్నగా వడగాల్పులు మొదలయ్యాయి. నిస్త్రాణంగా వెనక్కి వాలి కూర్చున్నాను సోఫాలో. అమ్మ కళ్ళల్లోని బాధ నన్ను కలవరపెడుతోంది.

నాలోని మార్పు వీళ్లందరినీ బాధిస్తున్నదెందుకు? వాళ్ల సంగతి తర్వాత ముందసలు నేను శాంతిగా ఉన్నానా? ఉంటే సమాజం పట్ల రోత, ప్రపంచమంతా మాయలో పడి ఉందన్న ఆలోచనతో దిగులు, వ్యతిరేక భావనలు ఎందుకు? ఏమిటిది? నాలో ఈ మార్పు ఆరు నెలల క్రితం అరుణాచలంలో ఆ సంఘటన జరిగినప్పటినుండే...... శివాని గుర్తొచ్చి కళ్లు తడి అయ్యాయి........

***

మా ఆఫీసులో పనిచేసే మిత్రుడు రమేష్ 'గురుచరణ సన్నిధిలో' అనే పుస్తకం ఇచ్చి చదవమన్నాడు. రమణమహర్షి గురించిన ఆ పుస్తకం చదవగానే అరుణాచలం చూడాలనిపించింది. మాధవి కూడా తన భర్త పోయినప్పటి నుండీ ప్రతి సంవత్సరం అక్కడికి వెళుతుందని తెలుసు కాని నేను ఆ ఆశ్రమాన్ని గురించి ఎప్పుడూ ఆసక్తి చూపించలేదు. చాడ్విక్, కోహెన్ ల అనుభవాలతో ఉన్న ఆ పుస్తకం చదవగానే నా మనసు రమణుడి వైపు ఆకర్షింపబడటం నాకు వింతగానే ఉండింది.

రమేష్ సాయంతో తిరువణ్ణామలై వెళ్లడానికి అన్ని ఏర్పాట్లూ చేసుకున్నాను. మద్రాస్ ఏర్ పోర్టులో దిగి అటునించి ఆశ్రమానికి వెళ్లాను. ఆశ్రమ నిర్వాహకులు సాదరంగా ఆహ్వానించి భోజన సమయం కావడంతో భోజనశాలకి తీసికెళ్లారు. అక్కడి ప్రదేశాల గురించి అడిగినదే తడవుగా నాకొక గైడ్ ని ఏర్పాటు చేశారు.

చక్కటి కాటేజ్. కొత్త రోజ్ ఉడ్ చెక్క వాసన, రంగు ఉన్న బల్ల, కుర్చీ. ఎదురుగ్గా అరుణాచల కొండ - ప్రశాంతంగా ఉంది. ఎంతో మంది మోక్షానుభావాలు పొందిన వారు ఇక్కడ ఉండి ఉంటారు. స్నానం చేసి కుర్చీ బాల్కనీలో వేసుకుని కూర్చున్నాను. చెట్లమీద చేరి నెమళ్లు చేస్తున్న క్రీంకారాలు వినిపిస్తున్నాయి. ఆ శబ్దం నాకు భలేగా ఉంది. కొండని చూస్తూ, ఆ శబ్దాలు వింటూ అలాగే కూర్చున్నాను.

మూడవుతుండగా గైడ్ వచ్చాడు. పేరు వడివేలన్. ఇద్దరం నడుస్తూ ఆశ్రమానికి వచ్చాం. గేటులోపలకి రాగానే చల్లని గాలులు మమ్మల్ని తాకాయి. పెద్ద హాలులో పూజ జరుగుతోంది. గైడ్ మెడిటేషన్ హాలు చూపించాడు. లోపల రమణుడు ఫొటోలోంచి అందర్నీ చూస్తున్నాడు. ఆయన కళ్లు దయతో వెలిగిపోతున్నాయి. హాలులో అందరూ ధ్యానంలో ఉన్నారు. నేను కూడా ఆ ఫొటోనే చూస్తూ కూర్చున్నాను.

నాన్న గుర్తొచ్చాడు. మేమనుభవించిన పేదరికం, కష్టాలు, అవమానాలు అన్నీ ఒక్కొక్కటిగా గుర్తొస్తున్నాయి. రమణుడి కళ్ళల్లోనుండి ఏదో శక్తి నాలో ప్రవేశించి నాకు తెలియకుండా నా లోపల మిగిలి ఉన్న జ్ఞాపకాల ఆవేదనల బరువుని బయటకి తీసుకుని వస్తోంది. అప్రయత్నంగా నా కళ్లు నీళ్లతో నిండిపోయాయి. అక్కడ ఉండలేక బయటకొచ్చి కళ్లు తుడుచుకున్నాను.

"ఏడుపునీ, దు:ఖాన్నీ, బాధనీ నిరాకరించకుండా వాటి అంతు తేల్చుకునే శక్తి కలగాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలేమో కదండీ!”

ఎదురుగ్గా బాదం చెట్టు చుట్టూ కట్టిన చప్టాకి ఆనుకుని కూర్చుని ఉన్న ఆవిడ - ఎవరితో అంటుందీ మాటలు? నా చుట్టూ, వెనక చూసి నన్నేనా అన్నట్లుగా ఆమె వైపు చూశాను. ఆమె నా వైపే చూస్తుంది. లోపల చూసిన రమణుడి చూపులే. అయితే ఈమె కళ్లు సౌందర్యంతో కూడి ఉండి నన్ను ఏదో లోకంలో పడేస్తున్నట్లు చేస్తున్నాయి. ఆమెకి దగ్గరగా నడిచాను.

నిజమేనండీ! లోపల ఆయన్ని చూడగానే ఎందుకో తెలియకుండా కలిగిన దు:ఖాన్నే భరించలేక బయటికి పరిగెత్తాను. ఇక వాటిని నిరాకరించకుండా చూడగలగడం - ఆ ఊహే భయంగా ఉంది" అన్నాను.

ఆవిడ నన్ను చూస్తూ నవ్వింది. ఆ నవ్వులోని సమ్మోహనం నా లోలోపలున్న పొరనిదేన్నో కెలికినట్లయింది.

టీ కోసం ఒక్కొక్కరే లోపలకి వెళుతున్నారు.

మీరు టీ తాగి రాండి సార్ నేను గోమాత సమాధి చోటులో కూర్చుని ఉంటాను" గోడకి అవతల కనిపిస్తున్న గోమాత విగ్రహం వైపు చూపిస్తూ అన్నాడు గైడ్.

అలాగే అన్నట్లుగా తల ఊపి "మీరు టీ తాగరా?” అన్నాను ఆమెని.

పదండి" అంది.

టీ తాగుతూ ఇద్ద్రరం ఒకరినొకరు పరిచయం చేసుకున్నాం. ఆమె పేరు శివాని. బెంగుళూరులో సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తుంది. భర్త గురించి ఆడిగితే 'ఆయన కూడా సాఫ్ట్ వేర్ జాబే' అని మాట మార్చి నా కుటుంబం గురించి అడిగింది. ఆవిడకి ఈసారి ఆశ్రమంలో గది దొరకలేదట. బయట టౌన్ లో హోటల్ లో ఉన్నానని చెప్పింది. గైడ్ నా కోసం ఎదురు చూస్తున్నాడన్న సంగతే గుర్తు లేదు. అరగంటసేపయినా మేము అక్కడే కూర్చుని ఉన్నాము. భోజనాల గది ఖాళీ అవడం గమనించిన ఆమె
"వెళదాం పదండి" అంది.

నాకు ఆవిడని వదలాలనిపించడం లేదు. ఆమె వ్యక్తిత్వమో, సౌందర్యమో లేక ఆమె దయ గల చూపో ఏదో మరి నన్ను ఆకర్ష ణకి లోను చేస్తోంది.

భోజనశాల మెట్లు దిగుతూండగా "ఎక్కడకి వెళతారు ఇప్పుడు?” అన్నాను ఆత్రంగా.

ఆమె నన్ను నిశితంగా ఒక్క క్షణం చూసి "గిరి ప్రదక్షిణానికి వెళుతున్నాను. వస్తారా?” అంది.

స్కందాశ్రమానికీ, విరూపాక్ష గుహకీ తీసికెళతానన్న గైడ్ గుర్తొచ్చాడు. “వస్తాను. ఒక్క క్షణం ఆగండి గైడ్ ని తీసుకొని వస్తాను" అంటూ వెనక్కి పరిగెత్తాను.

వడివేలన్, ఈరోజు ఆమెతో గిరిప్రదక్షిణకి వెళదామా?” అన్నాను.

అలాగే సార్" అన్నాడు వడివేలన్.

నేను, వడివేలన్ ఆశ్రమం ముందున్న చెప్పుల స్టాండ్ లోని చెప్పులు తీసుకున్నాము.

నేను చెప్పులు లేకుండానే నడుస్తానండీ" అంది.

అమ్మో! 13 మైళ్లట గదా కొండ చుట్టూ తిరిగిరావాలంటే! అంత దూరం చెప్పులు లేకుండా....”

నాకలవాటేనండీ" అంది క్లుప్తంగా.

"వచ్చేప్పటికి ఆశ్రమం మూసేస్తారు. డిన్నర్ ఏ హోటల్లోనో తినాలి మీకు ఫర్వాలేదా?” అంది.

ఆమెతో డిన్నర్ వరకూ ఉండొచ్చు అన్న అందమైన ఊహ నన్ను ఉద్వేగభరితుడిని చేసింది. నేను ఆమెనే చూస్తూ నడుస్తున్నాను. ఆమె నాతో రమణుడిని గురించి చెప్తూ కొండవైపే చూస్తోంది. దారి పొడవునా కొండ యొక్క అన్ని కోణాల్నీ చూస్తూ పార్వతీ పరమేశ్వరుల శృంగార కలయికని వర్ణిస్తోంది.

అదిగోండి ఇక్కడ శివుడు పార్వతికి దగ్గరగా వచ్చాడు. ఇక్కడ చూడండి ఆవిడ అలిగినట్లుంది ఆయనకి దూరంగా వెళ్లిపోయింది"

రెండు భాగాలుగా కనపడుతున్న కొండని పార్వతీపరమేశ్వరులుగా భావించి ఆమె మాట్లాడుతున్నట్లు అర్థం అయి నేను కూడా ఆసక్తిగా వింటున్నాను. “ఆహా! ఈ కోణం లోంచి చూడండి ఆవిడ ఒళ్లో శివుడు తల పెట్టుకుని పడుకున్నట్లుగా లేదూ!? ఇక్కడ ఆమెలో ఒదిగిపోతున్నాడండీ... లేదు లేదు ఆమె ఆయనలో అర్థభాగమవుతోంది" పరిగెత్తి పరిగెత్తి కొండని వర్ణిస్తోన్న ఆవిడని అందుకోలేక నాకు ఆయాసం వస్తోంది. వడివేలన్ మాత్రం ఆమెతో పాటుగా వడివడిగా నడుస్తూ ఆమె శివుడూ, పార్వతీ అంటున్నప్పుడంతా కొండకి దణ్ణాలు పెడుతున్నాడు.

ఒకచోట ఒక్కసారిగా ఆగి “ఏక శరీరులయ్యారు" అంది. ఆమె శరీరం చిగురుటాకులా కంపిస్తోంది. ఆ ప్రదేశంలో రెండు కొండలూ ఒకదానిలో ఒకటి ఐక్యం అయి ఒకే కొండగా కనిపిస్తోంది. కొండ శిఖరం పైన చంద్రుడు అర్థచంద్రాకారంలో శివుడి సిగలో ఉన్నట్లుగా భాసిల్లుతున్నాడు. అద్భుతంగా ఉన్న ఆ దృశ్యాన్ని చూసిన నేను కూడా అప్రయత్నంగా రెండు చేతులెత్తి కొండకి నమస్కరించాను.

ఉద్వేగం వల్లనో మరెందు చేతనో వణుకుతున్న ఆమెని చూస్తూ “చిన్నగా వెళ్లొచ్చుగా శివాని గారూ!” అన్నాను.

ఆమె ఏమీ మాట్లాడలేదు గాని అక్కడనుండి నిదానంగా నడిచింది. నేను అడిగిన ఏవో రెండు మూడు ప్రశ్నలని విననట్లుగా ముందుకి సాగిపోతున్న ఆవిడని, ఆవిడ మనస్థితిని అర్థం చేసుకున్న వడివేలన్ ఆమెని మాట్లాడించవద్దన్నట్లుగా సైగ చేసి నా ప్రశ్నలకి సమాధానం చెప్పాడు. నేను నిశ్శబ్దంగా వాళ్లని అనుసరించాను.

దాదాపు తొమ్మిదవుతుండగా అరుణాచలేశ్వరుని ఆలయానికి వచ్చాం. గుడి ముందు నిలబడి ముందుగా గుడికీ తర్వాత కొండవైపు తిరిగి కొండకీ నమస్కరించింది.

ఆకలవుతుంది ప్రసాదం తిందాం" అంటూ ప్రక్కనే ఉన్న ఓ హోటల్లోకి నడిచి మూలనున్న టేబుల్ దగ్గర కూర్చుంది. 'ప్రసాదమా?' అని మనసులో నవ్వుకుంటూ ఆమె ఎదురుగ్గా కూర్చున్నాను. వడివేలన్ కౌంటర్ దగ్గరగా ఉన్న ఓ కుర్చీలో కూర్చుని ఓనర్ తో కబుర్లు చెప్తున్నాడు.

ఇన్నికి నమ్మలది దా కోయిల్ లో పూజ – ప్రసాదం వాంగికోంగో" అంటూ సర్వర్ చిన్న విస్తరాకు దోనెలో పొంగలి అందించాడు ఇద్దరికీ. నేను ఆశ్చర్యంగా ఆమెవైపు చూశాను.

ఇక్కడ ప్రసాదం పెడతారని ఆమెకి తెలుసా!!?

ప్రసాదం చాలా బావుంది ఆనంద్ గారూ! తినండి" అంతే -- అవే ఆవిడ నాతో మాట్లాడిన ఆఖరి మాటలు. ఉద్వేగం తగ్గిపోతే శక్తి తగ్గిపోయినట్లుగా ఉంది ఆమె గొంతు.

తింటూ తింటూ అలాగే టేబుల్ మీదకి వాలిపోయింది.

అయ్యో! ఏమయింది శివాని గారూ? శివాని గారూ" నా అరుపులకి అందరూ గుమిగూడారు. వడివేలన్ ఒక్క దుముకుతో నా పక్కకి చేరాడు.

ఆమె ప్రాణాలు అరుణాచలేశ్వరునిలో కలిసిపోయాయి.

ఎవరో పోలీసులకి ఫోన్ చేశారు. వడివేలన్ తమిళంలో అన్నీ వివరంగా చెప్తున్నాడు. పోలీసులు నన్ను కూడా కొన్ని ప్రశ్నలడిగి నా అడ్రస్, ఫోన్ నంబరు తీసుకున్నారు. ఆంబులెన్స్ లోకి ఎక్కించడానికి స్ట్రెచ్చర్ మీద పడుకోబెడుతున్నప్పుడు ఒక్క క్షణం ఆమె చేతిని ఆప్యాయంగా తడిమాను.

ఆమెని తీసికెళ్లిన తర్వాత షాక్ లో ఉన్న నన్ను వడివేలన్ ఆశ్రమానికి ఆటోలో తీసుకు వచ్చాడు. 'పొద్దున్నే వస్తాన'ని చెప్పి అతను వెళ్లాక మంచం మీద పడి వెక్కి వెక్కి ఏడ్చాను. నా లోపలి సెగలు చెమటలుగా ధారాపాతంగా..... కాళ్లూచేతులూ వణికిపోతున్నాయి.

జెట్ లాగ్ మత్తూ, విపరీతమైన బాధతో తల తిరిగిపోతోంది. నాలో అతి తీవ్రంగా కలుగుతున్న మరణ భయాన్ని, నా శరీర మరణాన్ని స్పష్టంగా చూస్తున్నాను. “నేను ఎవరు? నేను ఎవరు?” అరుణాచలేశ్వరుని కొండ శిఖరాన్ని ఎక్కి అరుస్తున్నాను. గొంతు తడారిపోతోంది. అయినా అరుస్తూనే ఉన్నాను.

సార్! సార్!” తలుపు చప్పుడవుతోంది.

సార్ ఉళ్ల ఇరికారా ఇల్లియా" తమిళంలో ఎవరో మాట్లాడుతున్నారు. తలుపు దబ దబా బాదుతున్నారు. లేచి తలుపు తీశాను. ఎదురుగా గైడ్ -

ఎన్నాయిచ్చి సార్ - ఏమయింది సార్" అన్నాడు.

మంచి నీళ్లు అన్నట్లుగా సైగ చేశాను. నన్ను దాటి లోపలకి వెళ్లి టేబుల్ మీదున్న నీళ్లు తెచ్చిచ్చాడు.

సార్! ఒళ్లు కాలిపోతోంది. జ్వరందా వచ్చింది. డాక్టర్ దగ్గరకి వెళదాం రాండి" అన్నాడు వడివేలన్.

"డాక్టర్ వద్దులే వడివేలన్. ఇక్కడ ఉండాలనిపించడం లేదు సాయంత్రం ఊరికి వెళ్లిపోతాను కారు ఏర్పాటు చేయగలవా?” అన్నాను దిగులుగా.

అప్పుడు నాలో ప్రవేశించిన దిగులు ఇప్పటివరకూ పోలేదు. ఈ సంఘటన గురించి వసంతతో తప్ప ఎవరికీ చెప్పలేదు. ఆ తర్వాత నాలో నాకే తెలియని సంఘర్షణ. దాన్ని గురించి క్లారిటీ లేక సరిగ్గా చెప్పుకోలేక సతమతమవుతున్నాను. భార్యగా వసంత అర్థం చేసుకోలేకపోతోందని బాధ ఇంకొక వైపు.

***

అబ్బాయ్! ఏందిరా అలా కూర్చున్నావు? అబ్బాయ్!” అమ్మ ఆందోళనగా పిలుస్తుంది. గతంలోంచి బయటకొచ్చి అమ్మ వైపు వేదనగా చూశాను.

దా నాయనా అన్నం తిందువుగాని దా" అంది అమ్మ కూడా దిగులుగా.భోజనం చేస్తూండగా "అబ్బాయ్! అమ్మకి నిజం చెప్పు ఏం జరిగింది? కోడలు నువ్వు తగాదాలు పడ్డారా?” అంది నన్నే పరిశీలనగా చూస్తూ.

నాలోని నా బాధ ఏమిటో నాకే తెలియడం లేదమ్మా నీకేం చెప్పగలను?

అదేం లేదమ్మా! ఇంత సంపాదించీ సంతోషం లేని జీవితం ఎందుకమ్మా? డబ్బవసరాల కోసం నిన్ను వదిలి వెళ్ళి ఇష్టం లేని పని ఇన్నాళ్ళూ చేశాను. ఇక చెయ్యక్కర్లేదని, చేయలేనని తెలిసిపోయిందమ్మా! దిక్కులేని దానిలా నిన్ను ఇక్కడ వదిలేసి ఇంకా ఎందుకమ్మా అక్కడ?” అన్నాను.


సరేలేయ్యా! ఇవ్వన్నీ ఆలోచించకుండా హాయిగా ఉండు. ఇక్కడ పనులన్నీ చక్కబెట్టుకోని నేను నీ దగ్గరకే వచ్చి ఉంటానులే. అందరం ఒకేచోట ఉందాం. నాకోసం ఉద్యోగం మానేస్తే ఎట్టా" అంది.

'అసలు నాకు పని చేయాలనే లేదమ్మా' అంటే అమ్మకేం అర్థం అవుతుంది? 'ఉద్యోగం చేయక ఏం చేస్తావురా?' అంటే ఏం సమాధానం చెప్పాలో నాకే తెలియక అమ్మ మీద వంక పెడుతున్నాను కాదా? 'ఏమమ్మా ఉన్నది చాలదా'? 'ఏముందిరా? ఎన్ని కోట్లు సంపాదించావేం?' లోపల నుండి ఎవరెవరివో అరుపులు అమ్మ గొంతుతో కలిసి.

తల విదిలించుకున్నాను. ఒక్కటి మాత్రం నిజం. ప్రస్తుతం నాకు కోరికలూ, భ్రాంతులూ, కోపాలూ, తాపాలూ ఏమీ లేవు. సమస్యలకు పరిష్కారాలు కలగాలనే ఆశ కానీ కలగకపోతే ఎలా అనే భయము కానీ లేవు. ఇక్కడ కొంత కాలం గడిపాక చూద్దాం - లేచి కంచం సింక్ లో పడేసి గదిలోకి వెళ్ళిపోయాను.

సూట్ కేసులు విప్పి అమ్మకని తెచ్చిన మందులు, బహుమతులు బయట పెట్టాను. ఢిల్లీ ఏర్ పోర్టులో మాధకివ్వడానికని కొన్న కృష్ణుని విగ్రహం చూడగానే వాళ్లింటికెళ్లాలనిపించింది. ఎండకి భయపడి ఏదో

పత్రిక తిరగేస్తూ పడుకుండిపోయాను 'సాయంత్రం వెళ్దాంలే' అనుకుంటూ. బాగా నిద్ర పట్టేసింది.

లేచి అమ్మ ఇచ్చిన టీ తాగుతుంటే "అబ్బాయ్! అత్తయ్య, మామయ్య, మాధవి వచ్చి ఇప్పటి దాకా కూర్చుని పోయారు" అంది.

"లేపకపోయావా అమ్మా" అంటూ లేచి తయారై మామయ్య గారింటికి బయలుదేరాను.

***

ఇది మా ఊరూ, మా అమ్మమ్మ గారి ఊరు కూడా. ఊరిని తల్చుకుంటే చాలు నా ప్రతి అణువూ ప్రేమతో పులకరిస్తుంది. అమెరికాకి వెళ్ళిన కొత్తల్లో నాలుగేళ్ళు ఊరికి రాలేదు కాని తర్వాత రెండేళ్ళకోసారి వస్తూనే ఉన్నాను. వచ్చినప్పుడు ఊరంతా తిరిగి ఊళ్ళో అందరినీ పలకరిస్తేగాని నాకు తృప్తి ఉండదు. పోయిన సారైతే ఉన్నన్నినాళ్లూ శివాని మరణం తాలూకు భయంతోనేమో మూసిన కన్ను తెరవకుండా జ్వ్రరం. అందుకని పెద్దగా ఎవర్నీ కలుసుకోలేదు. కాని ఈసారి కూడా ఎవర్నీ పలకరించాలనిపించడం లేదు. మామయ్య గారింటికెళ్ళేలోపు నలుగురైదుగురు నిలేసి యోగక్షేమాలు అడిగారు. ఏదో తప్పదన్నట్లుగా క్లుప్తంగా సమాధానాలు చెప్పాను.

మామయ్య ఇంటి ముందు నిలబడి ఎవరితోనో మాట్లాడుతున్నాడు. చిన్నప్పుడు నేను, మాధవి ఆడుకున్న ఎత్తరుగుల పాతింటి స్థానంలో అధునాతనంగా కట్టిన ఆ సౌధాన్ని ఎప్పుడు చూసినా సంతోషం ఆవిరై దిగులు కలుగుతుంది. ఆ పాతింటికి చుట్టూ ఉండే ఎత్తైన రాతి ప్రహరీ, పెద్ద పెద్ద చెట్లూ, ఆ మనుషులూ, ఆప్యాయతలూ గుర్తొచ్చి అసలు కోర్ చనిపోయి పిప్పి మిగిలినట్లుగా అనిపించింది.

రారా ఆనందూ! నిదర మత్తు వదిలిందా? వీళ్లిద్దరూ వాకింగ్ కి బయలుదేరారు. ఇదిగో! ఏమే! ఆనందొచ్చాడు" నన్ను చూసి ఆర్భాటం చేస్తున్న మామయ్యని పలకరించాలని కూడా అనిపించలేదు.
నా హోదాతనపు రంగు మిరుమిట్లు గొల్పుతోంది మరి ఈనాడు. ఆనాడు మాధవిని నా కివ్వమని అమ్మ అడిగినప్పుడు చెప్పిన సమాధానం అతను పూర్తిగా మర్చిపోయినా నేను ఎలా మర్చిపోగలను?

మాధవి లోపలెక్కడుందో! ఇంకో క్షణం లో నా ముందుకు రాబోయే మాధవిని తల్చుకోగానే నెగిటివ్ థాట్స్ మాయమవుతున్నట్లనిపిస్తోంది. “బావొచ్చాడా?” ముందు ఆమె మాటలు, తర్వాత ఆమె మెత్తని అడుగుల సవ్వడి నా చెవులు గ్రహించగానే నా కళ్ళల్లో ఆమె తండ్రి పట్ల కనపడుతున్న అసహ్యాన్ని ఆమె చూడకూడదన్నట్లుగా రెండు క్షణాలపాటు నా కళ్ళు మూతలు పడ్డాయి.

బావున్నావా బావా? వసంత, శ్రవణ్ బావున్నారా?” అంది నా ఎదురుగ్గా సోఫాలో కూర్చుంటూ.

బావున్నాము. నువ్వెలా ఉన్నావ్ మాధవీ? సాకేత్ మాట్లాడుతుంటాడు అప్పుడప్పుడూ స్కైప్ లో" అన్నాను కళ్ళు క్రిందకి వాల్చుకుని. బొట్టులేని ఆమె ముఖాన్ని నేరుగా నేనెన్నటికీ చూడలేనేమో!

"ఆంజనేయస్వామి సిందూరం అన్నా పెట్టుకో మాధవీ. బొట్టులేని నీ ముఖాన్ని చూడలేకపోతున్నాను" అన్నాను ఒకసారి.

"పెట్టుకుంటాను బావా! స్టిక్కర్ అలవాటై అది పెట్టుకున్నా నిలవదు. బంధాలు కూడా అంతే కదూ బావా ఉన్నట్లే ఉంటాయి కాని ఉండవు" అంది.

బొట్టు సంగతి మాట్లాడితే బంధాలంటావేం మాధవీ" అన్నాను అప్పుడు విసుక్కుంటూ. అదెంత నిజమో ఇప్పుడు అనుభవమైతే కాని తెలియలేదు. అనుభవం వల్లే మనిషికి అన్నీ అర్థం అవుతాయన్న సంగతి అనుభవంలోకి వచ్చినట్లయింది.

వాడికి పెళ్ళి చేయాలిరా. అమెరికాలో నీ ఎరికలో ఏమన్నా సంబంధాలుంటే చూడు. వీడు గూడా అక్కడికే వచ్చి సెటిలయిపోతాడు" అంటున్నాడు మామయ్య.

ఒట్టి తిరుగుబోతు, తాగుబోతు, దగుల్బాజీ అని తెలిసినా ఆస్తి, రాజకీయ పలుకుబడి ఉందనీ, 'పెళ్ళైతే వాడే మారతాడ'నీ ఎంత మంది చెప్పినా వినకుండా మాధవిని ఓ వెధవకిచ్చి కట్టపెట్టాడు. మాధవి జీవితం మీద చేసిన పెత్తనం చాల్లేదేమో ఇప్పుడు మాధవి కొడుకు సాకేత్ మీద కూడా స్వారీ చేయాలని చూస్తున్నాడు.

ఆపుకుందామనుకున్నా ఎగదన్నుకొస్తున్న అసహ్యాన్ని నా ముఖంలో గమనించిన మాధవి "కాసేపు చెరువు గట్టున నడిచొద్దామా బావా? అమ్మకి షుగర్ వచ్చినప్పటినుండీ క్రమం తప్పకుండా వాకింగ్ కి తీసుకెళుతున్నాను" అంది లేస్తూ. కృష్ణుని విగ్రహాన్ని ఆమె చేతుల్లో ఉంచాను.

టీ తాగి వెళదాం ఉండవే. బావున్నావుగా నాయనా? ఒక్కరోజు వాకింగ్ చేయకపోయినా ఊరుకోదు " అంటూ అత్త టీ కప్పు నా చేతికిచ్చింది.

కప్పు తీసుకుని అత్త వైపు చూసి బాగున్నానన్నట్లుగా తలూపాను. మాధవి నిలబడే టీ తాగింది. విగ్రహాన్ని హాల్లోని షోకేస్ లో ఉంచి లోపలకి వెళ్ళి తయారై వచ్చింది. తెల్లని కాటన్ చీర మీద పచ్చని లతలు నిలువునా చీర పైకి పాకి ఉన్నాయి. నుదుటన నల్లని స్టిక్కర్ పెట్టుకోవడం వల్లేమో ఆమె ముఖంలో ఏదో కొత్తదనంతో కూడిన వెలుగు.

ముగ్గురం బయలుదేరాం. అత్త ఏవేవో ఆడుగుతోంది. నేను అడక్కపోయినా ఊళ్లో సంగతులు చెప్తోంది.
ఉన్నట్లుండి “ఉద్యోగం మానేసి ఇక్కడే ఉండి ఏం చేయాలని బావా?” అంది మాధవి.

ఆ ప్రశ్నని ఆమె నుంచి ఊహించని నేను విస్తుపోతూ ఆగి ఆమెని చూశాను.

అమ్మ చెప్పిందా?”

ఊఁ"

మాధవి నా మేనమామ కూతురే కాదు నా నెచ్చెలి. ఇద్దరం ఒకే తరగతి. కలిసి మెలిసి చదువుకునే వాళ్ళం, ఆడుకునేవాళ్లం. ఏది కావాలన్నా మాధవినే అడిగేవాడిని. ప్రతి కష్టమూ మాధవితో పంచుకునేవాడిని. నేను ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరంలో ఉన్నప్పుడు మాధవికి పెళ్ళి సంబంధాలు చూస్తున్నారని తెలిసింది. ఆమెని ప్రేమించానో లేదో తెలియదు కాని మాధవిని నా దగ్గరే అట్టిపెట్టుకోవాలంటే మాత్రం ఆమెని పెళ్ళి చేసుకోవాలని అమ్మ చేత మామయ్యని అడిగించాను.

ఆస్తి లేదు. చదువు ఇంకా కాలేదు. ఉద్యోగం వస్తుందో రాదో తెలియదు. అలాంటి వాడికి ఎట్టమ్మాయ్ ఇచ్చేది. నువ్వే చెప్పు? పోనీ అంతకాలం పిల్లకి పెళ్ళి చేయకుండా ఆపేదానికుందా?” అని అడిగాడు అమ్మని మామయ్య మెత్తగా. అమ్మేం అనగలదు?

మాధవి వేరొకరికి భార్య అయింది. అందరి దృష్టిలో ఈనాడు ఆమె భర్తని కోల్పోయి పుట్టింటికి చేరి ఏమీ లేనిదయింది. ఆమెరికాలో ఉద్యోగం చేసి ఆస్తులు సంపాదించుకుని నేను అన్నీ ఉన్నవాడినయ్యాను - అవునా! అన్నీ ఉన్నవాడినయ్యానా!? ఏవేవో ముళ్ళు గుచ్చిపించుకుని ఆశాంతి పాలయ్యానా!!?......

***

ప్రశాంత దృక్కులతో వీక్షిస్తున్న ఆమెకి నా హృదయం విప్పి చెప్పాలనిపించింది. చెప్పాను. ఆ సంఘటన తర్వాత నాకు జీవితం పట్ల నాలో వచ్చిన ఏదో మార్పు, ఈ మార్పు అర్థం కాక చేసుకున్న గాయాలు, అవి మాన్పుకోవాలని చేస్తున్న ప్రయత్నాలు, మా వాదనలు, ఉన్నట్లున్నా లేని స్వేచ్ఛ శాంతి సంతోషాల కోసమో, మరి దేని కోసమో తెలియని నా తపన – అన్నీ చెప్పాను.

నేను ఎప్పుడు చెరువు గట్టు మీద కట్టిన చప్టా మీద కూర్చున్నానో కాని మాధవి నా ఎదురుగ్గా నిలబడి నన్నే తదేకంగా చూస్తూ నేను చెప్పినదంతా వింటోంది. అత్తయ్య నా పక్కనే కూర్చుని నా చేయి నిమురుతోంది.

తలతిప్పి చెరువు వైపు చూశాను. నీళ్ళు సాయంసంధ్య కెంజాయి రంగుని పులుముకుని కాషాయరంగులో కనిపిస్తున్నాయి. చెరువుకి పడమర ప్రక్కగా వరసగా ఉన్న చింత చెట్ల పైకి పక్షులు చేరుతున్నాయి నిశ్శబ్దంగా.

మాధవీ! శివాని మరణాన్ని అంత దగ్గరగా చూశాక నాలో ఏదో నిస్త్రాణ ఆవహించినట్లయింది. ఇదంతా మాయ అని తెలిసీ ఏమిటీ తాపత్రయం అని ఆలోచిస్తే దు:ఖం - 'ఇప్పుడు ఈ క్షణంలో ఉన్న బాధ రేపు, ఎల్లుండీ లేక జీవితాంతం ఉంటుందని ఊహించుకుని బాధపడొద్దు' అనొద్దు - అందరూ అంటున్నట్లు. ప్రస్తుతమే నా జీవితమనుకుంటున్నాను నేను. అలాంటప్పుడు ఈ బాధ జీవితమంతా ఉండే బాధలా అన్పించడంలో, దాన్ని దాటాలనుకోవడంలో అసహజమేమీ లేదు కదా!” అన్నాను.

వాతావరణం మారి కొన్నాళ్ళు ఇక్కడ విశ్రాంతి తీసుకుంటే ఈ బాధ భవిష్యత్తులో ఉండదులే అనేది ఒక ఫాల్స్ ఓదార్పు మాత్రమే బావా. దాని గురించి కాదు. మునుపు జీవితంలో కోరికల రూపంలో వ్యక్తమైన జీవశక్తి ఇప్పుడు లేదంటున్నావు - బాగానే ఉంది. కాని దాని స్థానంలో నిర్వేదం, నిరాసక్తత చేరుకోవడం గమనించుకున్నావా? దానివల్ల బాధ పడుతున్నావేమో ఆలోచించావా? మేధతో కాదు బావా హృదయంతో ఆలోచించు” అంది మాధవి - నిదానంగా ఒక్కో మాటా వత్తి పలుకుతూ.

ఛళ్ళున చరిచినట్లయింది.

నిర్వేదం, నిరాసక్తత – మనిషిలోని శాంతిని దూరం చేసేటటువంటి వీటిని వదలకుండా ఏవో మెట్లు ఎక్కుతున్నాననే భ్రమలో ఉన్న నేను ఆమె వైపు కళ్ళు విప్పార్చుకుని చూశాను.

ఆనందూ మీ అమ్మ ఏదో కాస్త వండుకునో, వండుకోలేని రోజు మా ఇంట్లోనో తిని ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు నువ్వు ఉద్యోగం మానేసి వస్తే వండి పెట్టేట్లుందా? పోనీ ఆమెని నీ దగ్గరకి తీసుకెళితే ఆ దేశం కాని దేశం లో ఉండలేదు. శ్రవణ్ కాలేజీ చదువయిందాకా అక్కడే ఉండి వసంతకి నచ్చచెప్పుకుని రావాలిగాని” అత్తయ్య మాటలు సన్నగా వినపడుతున్నాయి.

'నిర్వేదం, నిరాసక్తత'..... మాధవి మాటలు చెవుల్లో మళ్లీ మళ్లీ రింగుమంటున్నాయి. ఏమీ మాట్లాడాలని కాని వాళ్లకి బదులివ్వాలని కాని అనిపించలేదు. కళ్లు మూసుకున్నాను.

నేను ఒకప్పుడు ఇటువంటి బాధనే అనుభవించాను బావా! ఆ బాధని నిరాకరించకుండా చూడగలిగినప్పుడు తెలుస్తుంది జీవితమనే ప్రసాదపు రుచి ఏమిటో!" అంటోంది మాధవి.

ప్రసాదం తినండి బావుంది" శివాని మాటలు ఎక్కడనుండో లీలగా..... అవును...... జీవితం అనేది దేవుడి ప్రసాదం. అపురూపం.

రుచి చూడకుండానే చూశాననుకుంటున్న నేను ఏవేవో సిద్ధాంతాలని ఇతరుల జీవితాలకి అన్వయించి కన్ క్లూషన్స్ తీసి నా ఫిలాసఫీనే కరెక్ట్ అనుకోవడం, ఉన్నతమైన మెట్లు ఎక్కుతున్నానన్న భ్రమతో బాంధవ్యాలు, బాధ్యతలూ నన్ను చివరి మెట్టు వరకూ ఎక్కనివ్వకుండా కిందికి లాగుతున్నాయని బాధ పడటం......

ఏమిటిది?

ఉందో లేదో తెలియని మెట్టు మొదటిదైతేనేం చివరిదైతేనేం? ఉపయోగిస్తుందో లేదో తెలీకుండానే విగ్రహాన్ని పగలగొట్టడం ఎందుకు? అసలు మన హృదయంలో లేని గీతాన్ని ఎందుకు పాడటం? ఏమిటీ వేదన, ఎందుకీ యాతన?

మన కర్మలని ఆచరించకుండా బాధపడుతూ - ఆ బాధకి ఏవేవో కారణాలు వెతుక్కునే మనసు, ఇతరుల పట్ల వ్యతిరేకతలనే చూస్తున్న మనసు నా కళ్ళ ముందున్న తెరలో స్పష్టంగా కనబడుతోంది.

"మాయ అంటే అసత్యము కాదు. అసత్యమనిపిస్తుందంతే. అది సత్యము యొక్క చేష్టాత్మకమైన ముఖం" 'గురుచరణ సన్నిధి' పుస్తకంలో చదివిన భగవాన్ మాటలు అర్థం అవుతున్నాయి.

బావా.... ఏమయిందీ ...?” మాధవి గొంతులో ఆందోళన - నింపాదిగా కళ్ళు విప్పి ఆమె వైపు చూసి ఏమీ లేదన్నట్లుగా తల ఊపాను.

చుట్టూ చీకట్లు అలుముకున్నాయి. కాసేపట్లోనే సూర్యుడు అస్తమించినా చంద్రునికి వెలుగునిస్తూ తన అస్థిత్వాన్ని నిలబెట్టుకున్నాడు.

"వెళదాం బావా! అత్తయ్య ఎదురు చూస్తుంటుంది" ఊరి వైపుకి నడుస్తూ "నువ్వొకసారి మళ్లీ అరుణాచలం వెళ్లి రారాదూ!" అంది మాధవి.

ఊళ్లో సాయంకాలం పూట పాలు పోయించుకోని టౌన్ కి తీసుకెళుతున్న వెంకటస్వామి మమ్మల్ని చూసి సైకిల్ దిగి "బావున్నారా బాబూ?” అని నన్ను పలకరించి "ఎవరిని మాధవమ్మా ఆశ్రమానికి వెళ్లమంటున్నావు?” అన్నాడు మాధవి వైపు చూస్తూ.

"బావనిలే వెంకటసామీ... ఏం నువ్వు కూడా వెళ్తావా బావతో?” అంది.

నాకేడ కుదురుతుందమ్మా? ఈ సంవత్సరం మావోడిని ఇంజనీరింగ్ లో చేర్పించాల. మాకు పనే ఆశ్రమం. వస్తా బాబూ... రేపు నీతో మావోడిని గురించి యివరంగా మాట్లాడాల" సైకిల్ తొక్కుకుంటూ సాగిపోతున్న వెంకటస్వామి మాటలకి చాన్నాళ్లుగా ముడుచుకునిపోయి ఉన్న నా పెదవులు విచ్చుకున్నాయి.

తప్పకుండా వెళ్తాను మాధవీ. 'ఆశ్రమంలో ఓ వారం ఉండి వస్తాన'ని వసంతకి కూడా కాల్ చేసి చెప్తాను" అన్నాను.

వాళ్లని అనుసరిస్తూ ఊరివైపు నడుస్తున్న నాకు ఇప్పుడు మెలకువతో పాటు కళ్లు కూడా తెరుపులు పడ్డట్లుగా ఉన్నాయి.

******


4 comments:

  1. చాల బాగుంది. చదివినంత సేపు మనమే సమాధానం కోసం వెతుకుతున్నట్టు వుంది . పనే ఆశ్రమం మంచి సమాధానం .

    ReplyDelete
  2. ఎక్కడ ఎలా ముంగించాలో అక్కడ అలా ముగించొచ్చుకనక కథ కథగా బావుంది. చదివించేట్టు ఉంది. కాని ఈ కథ నిజజీవితంలో ఆనంద్ లా ఉండేవాళ్లకి మాత్రం ఎలాంటి సమాధానం ఇవ్వదు. ఇవ్వలేదు.

    ReplyDelete
  3. మీరు చాలా పొరబడుతున్నారు. మాయ అంటే ఏదో మిధ్య అనుకుని నిర్వేదంలో కూరుకుని పోయి నిర్వేదం లోకి జారిన ఆనంద్ - మాయ అంటే చేష్ట యొక్క ముఖం అని గమనించాడు, గ్రహించాడు నా కథలోని ఆనంద్. నిజజీవితంలోని ఆనంద్ లు ఈ విషయాన్ని గ్రహించాలని రాసిన కథ ఇది. ఒక్కసారి అది గ్రహించాక దొరికేది ఆనందమే. ఈ కథ గురించి వద్దులే ఏమీ తెలియని ఒక రైతు, తన పని తను నిత్యమూ చేసుకునే రైతు ఈ ఆలోచనాపరులకంటే ఎంతో సంతోషంగా ఉన్నాడు కాదంటారా? ఇక చావు పుట్టుకల ని చూసో, జీవితంలో విడిపోవడాలు గురించి ఆలోచించో అదే శాశ్వతమని నమ్మేవాళ్లకి కలిగే ఈ నిర్వేదంలో ఏమైనా అర్థం ఉందా? అది వాళ్ళకి తొలగాలని రాసిన కథ ఇది. మీరు ఈ కథ ఎటువంటి సమాధానం ఇవ్వలేదు అనడంలో.. అసలు కన్ క్లూషన్స్ తీయడంలో అర్థం ఉందంటారా ఆలోచించండి.

    ReplyDelete

P