Wednesday, February 4, 2015

ఏమి సేతురా లింగా, సరిగంగ తానాలు జరిపించుదామంటే


'ఏమి సేతురా లింగా' అనే తత్వా్తన్ని బాలమురళి గారి గొంతులో చాలా మంది వినే ఉంటారు. ఈ పాటలోని భావాన్నే వేరే మాటలతో వేటూరి సుందర్రామ్మూర్తి గారి చేత అద్భుతంగా రాయించి, బాలు, శైలజల చేత అంతకన్నా అద్భుతంగా పాడించి, వీటన్నిటినీ మించి ఈ పాటని సినిమా సందర్భానికి అత్యద్భుతంగా అన్వయించారు 'జననీ జన్మభూమి' అనే సినిమాలో కె.విశ్వనాధ్ గారు.

"సరిగంగ తానాలు జరిపించుదామంటే" - అని మొదలై "సామీ ఓ సామీ నేనేమి సెయ్యాలో సెప్పవేమి" అంటూ సాగుతుంది ఈ పాట. 'ఏమి సేతురాలో' ఉన్న "తుమ్మి పువ్వులకి తూనీగల ఎంగిలి" , "గంగ నీళ్ళకి చేప కప్పల ఎంగిలి" లాంటి భావాలు తన మాటల్లో చెప్పి చివర్లో "నన్నే నీకొగ్గేసి కన్నూ మూదామంటే కన్నోళ్ళ మురిపాల ముద్దులెంగిలి సేసే" అంటూ పై సంగతితో ముక్తాయించి అజ్ఞాత తత్వ్త రచయిత కన్నా తానేమీ తీసిపోనని నిరూపించుకున్నారు వేటూరి గారు. ఇది నిజంగా వేటూరి గారి జీనియస్ కి తార్కాణం.

ఈ దేశంలో ఏ పనికి పూనుకుందామన్నా అన్నీ అవినీతి జాడ్యంతో ఎంగిలై పోయాయి అన్న విషయాన్నీ, వ్యవస్థకి దాసోహమైన పెద్దవాళ్ళ పెంపకం ("కన్నవాళ్ళ ఎంగిలి") అన్న విషయాన్నీ పాటలో ప్రతిఫలింప చేశారు. అద్వైత భావంతో రాసిన తత్వా్తన్ని తీసుకుని దాన్ని లౌకిక విషయానికి అన్వయిస్తూ ఔచిత్యం చెడకుండా రాసిన ఈ పాట సినిమా కథకి అద్భుతంగా సరిపోయింది. ఈ పాట చివర్లో "నావంటి, నట్టేటి నావంటి బతుకుల్లో సుక్కానివైనా నువ్వే" అని ఆ తర్వాత "ఉత్త రేకు సుక్కా నువ్వే" అన్నారు వేటూరి. "రేకుసుక్క" అంటే ఏమిటో అర్థం కాలేదు. ఈ పాటని స్వరపరిచింది కెవి. మహదేవన్

పాట వినండి ఫ్రెండ్స్ https://www.youtube.com/watch?v=bXeNYQ-xKOQ

- రాధ రాజశేఖర్

No comments:

Post a Comment

P