Tuesday, March 22, 2016


ఆహా! నేను అనుసృజన చేసిన కథే - మళ్ళీ చదువుకుంటుంటే ఎంత బావుందీ!!? సారీ ఫ్రెండ్స్ నేను ఆత్మముగ్దత్వం పొందుతున్నాననుకునేరు! ఎడిటర్ గారి చేతిలో పడి కథ బేతాళ కథగా మారి భలే ఉంది అనుకుంటున్నాను. :)

మార్చి నెల కొత్తపల్లిలో నేను అనుసృజన చేసిన అర్కడీ గైడార్ (Arkady Gaidar's Hot Stone) కథ చదవండి ఫ్రెండ్స్, కథని భేతాళ కథగా మార్చి ఇంత మంచి వాక్యాలు రాసిన Narayana Sarma గారికి కృతజ్ఞతలు (నిజంగా కొకు గుర్తొచ్చారు సర్) - విక్రం చిరునవ్వు నవ్వుతూ "బేతాళం, ఈ కథ మానవ స్వభావంలో ఉన్న వైరుధ్యాన్ని ఆవిష్కరిస్తున్నది. మనిషి ఒకవైపున క్రొత్త ఆనందాన్ని కోరుకుంటూనే, మరొకవైపున తనకు లభించిన జీవన రసాన్ని ఆస్వాదిస్తుంటాడు. తను ఒక వైపున కష్టపడుతూనే, మరొకవైపున జీవితంలో కష్టం ఎప్పుడూ ఉంటుందని కూడా చూస్తాడు. పరస్పర విరుద్ధమైన ఈ రెండు భావనల మధ్యా ఉన్న సంఘర్షణ ఎన్నటికీ తెగదు. రాయిని బ్రద్దలు కొట్టి వెనక్కి పోయేంత ధైర్యం ఆలోచనాపరులకెవ్వరికీ ఉండదు. అయితే త్వరపడి ఎవరినీ ఊరికే నిర్ణయించుకోనీక, లోతుగా ఆలోచించే శక్తిని మనుషుల్లో ప్రేరేపిస్తూండచ్చు ఆ రాయి- అంతకు మించి అదేమీ చేయట్లేదు" అన్నాడు -

బొమ్మలు కూడా చాలా బాగా కుదిరాయి. థాంక్ యు అడవి రాముడూ!

******

కథ చదవండి. ఇంత మంచి పిల్లల పత్రికకి చందాలు కట్టండి ఫ్రెండ్స్. చందా కట్టడానికి, సెట్స్ ఆర్డర్ చేయడానికి లింక్ https://www.instamojo.com/kottapalli/


*******

నిప్పురాయి - అనుసృజన - రాధ మండువ

రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ చెట్టెక్కాడు విక్రం. అక్కడున్న బేతాళాన్ని భుజాన వేసుకొని చెట్టు దిగబోయాడు. అంతవరకూ కదలక మెదలక ఉన్న బేతాళం అకస్మాత్తుగా ప్రాణం ఉన్నదాని మాదిరి ఒళ్ళు విరుచుకున్నది. ఏదో ఆలోచనలో ఉన్న విక్రం ఉలిక్కిపడేట్లు, మాట్లాడటం మొదలు పెట్టింది :

"చూడు విక్రమ్! ప్రపంచంలో అంతటా దు:ఖం నిండి ఉన్నది. కావాలనుకున్న సంతోషాలన్నీ ఒక జీవితంలో ఎవరికీ దొరకవు. ఇంకో అవకాశం రమ్మంటే కూడా అందరికీ రాదు. అలాంటి అవకాశం వచ్చినా కూడా ఉపయోగించుకోని మనుషుల గురించి 'అర్కడీ గైడార్' అనే రష్యావాడొకడు చెప్పాడు. శ్రమ తెలీకుండా ఉండేందుకు నీకు ఆ కథ చెబుతాను, విను " అంటూ ఇలా చెప్పసాగింది.

1

"అలనాటి రష్యాలోని ఒక గ్రామంలో బక్క పలుచటి ముసలివాడు ఒకడు ఉండేవాడు. యాపిల్ పండ్ల తోటల్లో దొంగలు పడకుండా కాపలా కాసి జీవనం సాగించేవాడతను.

అతను యవ్వనంలో ఉండగా ఆ దేశంలో అనేక కష్టాలుండేవి. వాటినన్నిటినీ అతను అనుభవించినట్లు ఆ గ్రామంలో అందరికీ తెలుసు.

ఆ కష్టాల వలనేనేమో, అతనికి వయసుకి మించిన ముసలితనం వచ్చింది. అతని బుగ్గల మీదనేగాక, పెదవుల పైభాగాన- నుదుటి మీద కూడా- గాట్లు, మచ్చలు, ముడతలు ఉండేవి. అతను నవ్వినప్పుడు కూడా అతని ముఖంలో దు:ఖం, విచారం కనపడేవి వాటి వల్ల.

అయితే ఒకరోజున, ఇవాష్కా కుడ్రియాష్కిన్ అనే ఆ ఊరి పిల్లవాడు ఒకడు, అతను కాపలా ఉన్న యాపిల్ పండ్ల తోటలోకి దూరాడు దొంగతనంగా. అయితే ఆ ప్రయత్నంలో వాడి లాగూ ముళ్ళకంచెకు చిక్కుకున్నది. దాంతో వాడు కంచెకి అవతలగా ఉన్న రేగు ముళ్ళ పొద మీద బొక్క బోర్లా పడి, బాధతో గట్టిగా కేక వేశాడు. అలా ముసలాయనకు దొరికిపోయాడు వాడు.

ముసలాయన చూసేసరికి ఇవాష్కా చేతులు చీరుకుని పోయాయి; లాగూ పీలిక క్రిందికి వ్రేలాడుతున్నది; వాడి కళ్ళ వెంట నీరు వాన ధార మాదిరి కారిపోతోంది.

మామూలుగా అయితే అలా దొరికిన వాళ్లను ముసలివాడు దురదగొండి బెత్తాలతో కొడతాడు. ఆ తర్వాత వాళ్లను తీసుకెళ్ళి బడిలో మాష్టారుకి ఒప్పచెప్తాడు.

అయితే ఇప్పుడతనికి ఈ చిన్ని బాబుని ఏమీ అనాలనిపించలేదు. అతని కళ్ళనీళ్ళు తుడిచి, పండ్లతోట వాకిలి గుండా పరిగెత్తి పొమ్మన్నాడు.

అయితే ఇవాష్కా అప్పటికే బాగా భయపడిపోయి ఉండటం వల్లనో ఏమో, పరిగెత్తలేక గబగబా నడుస్తూ వెళ్ళిపోయాడు.


2


ఇవాష్కా నిజంగానే చాలా అభిమానస్తుడు. అతను అట్లా నడుస్తూ నడుస్తూ నేరుగా అడవిలోకి వెళ్ళిపోయాడు. చేసిన పని తలుచుకుంటున్న కొద్దీ అతని తల సిగ్గుతో మరింత వాలిపోయింది.

మధ్యాహ్నం వరకూ దారీ తెన్నూ లేకుండా తిరిగిన అతను దోవ తప్పిపోయాడు. కొండ పాదాన్ని ఆధారం చేసుకుని నడుస్తుండగా ఒకచోట చిత్తడి చిత్తడిగా ఉన్న బురద దారి ఎదురయింది అతనికి. బాగా అలిసిపోయి అక్కడే ఉన్న ఓ బండరాయి మీద కూర్చున్నాడు-

ఏదో చురుక్కుమన్నది పిర్రమీద. బండ మీద కూర్చున్న వాడల్లా "అబ్బా!” అని మూలిగి, ఒక్క ఉదుటున లేచి అవతలకి దూకాడు. రాయి మీదున్న పురుగేదో తనని కుట్టిందనుకొని, దాని కోసం వెతికాడు. పురుగేమీ లేదు!

'మరేంటి?' అనుకుంటూ అట్లా బండరాయి మీద చెయ్యి పెట్టగానే ఈసారి అతని అరచెయ్యి కాలింది! దాంతో అతనికి అర్థమైంది- ఆ రాయి 'నిప్పురాయి'! ఈసారి ఇవాష్కా దాన్ని ముట్టుకోకుండా దగ్గరికి వంగి పరిశీలనగా చూశాడు- దాని మీద ఏవో కొన్ని అక్షరాలు దుమ్ముకొట్టుకుని మసకమసకగా కనిపించాయి!

వెంటనే తన చిరిగిపోయిన లాగూ పీలికని లాగి, దాంతో అక్షరాల మీదున్న మట్టిని తొలగించి, రాయిమీద రాసి ఉన్న దాన్ని గట్టిగా చదివాడు: “తమ జీవితంలో ఆనందాన్ని రుచి చూడని వాళ్ళెవరైనా ఈ రాయిని రెండుగా పగలగొడితే వాళ్ళు తమ యవ్వనాన్ని తిరిగి పొందుతారు"

అది చదివి ఇవాష్కా చాలా నిరాశపడ్డాడు. అతడికి ఇప్పుడు అతని వయసు 8 సంవత్సరాలే. తనకి ఇప్పుడే కొత్త జీవితం ఎందుకు, ఏం చేసుకోను?


"మళ్ళీ ఒకటో తరగతిలో చేరాలో ఏమో!" అనుకుని వాడికి చాలా భయం వేసింది కూడా.

"ఇలా కాకుండా ఇది నన్ను ఒకటో తరగతి నుండి పై తరగతులకి తీసుకుని వెళ్ళగలిగితే ఎంత బాగుండేది కదా! ఇప్పుడు దీంతో నాకేం పని లేదు!" అనుకొని, వాడు దాన్ని అక్కడే వదిలేసి ఇంటి ముఖం పట్టాడు.

దారిలో యాపిల్ పండ్ల తోట మీదుగా వెళ్తూ చూసాడు- ముసలి తాత దగ్గుతూ, ఆయాసపడుతూ కంచెకి తెల్లరంగు వేస్తున్నాడు. అతన్ని చూడగానే ఇవాష్కాకు చాలా దయ కలిగింది. 'ఈ తాత నన్ను దురదగొండి ఆకులతో కొట్టి మాష్టారుకి ఒప్పచెప్పి ఉండాల్సింది - అయినా ఆ పని చేయకుండా నన్ను ఊరికే వదిలేశాడు. ఇప్పుడు నేను ఇతనికి సాయం చేస్తాను- నిప్పురాయి సంగతి చెప్తాను. దాన్ని వాడుకుంటే అతను మళ్ళీ యువకుడైపోతాడు. ఇంక దగ్గనక్కర్లేదు; ఆయాసపడనక్కరలేదు; కుంటుతూ నడవనక్కర్లేదు' అనుకున్నాడు.

వెంటనే ముసలివాడి దగ్గరికి వెళ్ళి నిప్పురాయి సంగతి చెప్పాడు. ముసలివాడు సంతోష పడ్డాడు. ఇవాష్కాకి తన పట్ల ఉన్న అక్కరకి మెచ్చుకున్నాడు. అయితే తాను అప్పటికప్పుడే తోటని వదిలి రాయి దగ్గరికి రావడానికి మటుకు ఒప్పుకోలేదు- “ఇప్పుడు నేను పనిలో ఉన్నాను. ఈ కాపలా పనిని వదిలి రాలేను. అయితే నువ్వు మంచి పిల్లవాడివి. ఒక పని చేసి పెట్టు. శ్రమ అనుకోకుండా నువ్వు ఇప్పుడే పోయి, ఆ రాయిని ఏదో ఒక రకంగా కొండమీదకి చేర్చు- సాయంత్రంగా నేను వచ్చి రాయిని బద్దలు కొడతాను" అన్నాడు.


3

విషయం చెప్పగానే తాత ఎగిరి గంతేస్తాడనీ, 'ఏదీ, ఆ రాయిని చూపించు!' అని తనమీదికి దూకుతాడనీ, వెంటనే తనను బయలుదేరదీస్తాడనీ అనుకున్న ఇవాష్కా జావ కారి పోయాడు: 'అయినా సాయంత్రం వస్తానన్నాడులే' అని మనసుని సముదా-యించుకుని, ముసలాయన దగ్గర నుండి రెండు దళసరి గోనె సంచులని అడిగి ఇప్పించుకుని, వెనక్కి వెళ్ళాడు. అసలు రాయిని బురదలోంచి బయటికి లాగటమే చాలా కష్టమైంది.

ఆ తర్వాత “హా! హమ్మయ్య! ఇప్పుడు ఇంక ఈ రాయిని కొండ మీదికి దొర్లించుకుంటూ వెళతాను. తాత వచ్చి దీన్ని బద్దలు చేస్తాడు; మళ్ళీ కుర్రవాడైపోతాడు. పాపం, 'అతని జీవితమంతా కష్టాలమయం' అని అందరూ చెప్పుకుంటారు. ఇకనైనా అతని జీవితంలోకి కొంచెం సంతోషం వస్తుంది" అని రాయిని కొండ మీదకల్లా నెట్టాడు ఆ పిల్లాడు.

అంతా అయ్యాక అలిసిపోయి, అక్కడే పడుకుని, ముసలాయన కోసం నిరీక్షించసాగాడు.

సాయంత్రానికి వచ్చాడు ముసలాయన. ఊరికే చేతులూపుకుంటూ వచ్చిన ఆయన్ని చూసి ఇవాష్కా ఆశ్చర్యపోయాడు- "ఏ సుత్తో, సమ్మెటో, గునపమో తీసుకు-రాకుండా, ఒట్టి చేతులతో వచ్చావేంటి? ఈ బండ రాయిని నీ చేతులతో బద్దలు చేయగలనని అనుకుంటున్నావా?” అని అడిగాడు.

ముసలివాడు ఇవాష్కా దగ్గరకి వచ్చి అతని తల మీద చేయి వేసి నిమురుతూ "లేదు బిడ్డా! నేను ఈ రాయిని బద్దలు కొట్టాలనుకోవడం లేదు" అన్నాడు. ముసలివాడు తన తలని నిమరడంలో ఉన్న ప్రేమని ఇవాష్కా అనుభవిస్తున్నాడు.

తాత కొనసాగించాడు- “లేదు మనవడా! నేను కొత్త జీవితం మొదలు పెట్టడాన్ని కోరుకోవడం లేదు. నీ దృష్టిలో నేను ఒక ముసలివాడిని, అనాకారిని, ఎప్పుడూ ఆనందానికి నోచుకోనివాడిని. కానీ నిజంగా చూస్తే నేను నా జీవితంలో ఎంతో ఆనందాన్ని అనుభవించాను. ప్రజల క్షేమం కోసం, స్వేచ్ఛ కోసం ఎన్నో మంచి పనులు చేశాను. కష్టాలు పడ్డాను. నా దేశ ప్రజలందరూ స్వేచ్ఛగా జీవించాలని నేను కన్న కలలన్నీ సాకారమయ్యాయి- ఇంతకంటే నా జీవితంలో సంతోషం ఏముంటుంది?

నా జీవితం కఠినంగా గడిచింది. ఐనప్పటికీ అది అర్థవంతంగాను, ఉపయోగకరంగాను, నిజాయితీగాను గడిచింది. ఇప్పుడు నాకు ఇంకొక జీవితం, ఇంకో యవ్వనం అవసరం లేదు” అన్నాడు.

తాత అన్న మాటల్లో ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు ఇవాష్కాకి. అయినా తాత ముఖంలోని గంభీరతను చూసి అతనేమీ బదులు చెప్పలేదు.

అస్తమిస్తున్న సూర్యుడిని చూస్తూ ఇద్దరూ కొంతసేపు మౌనంగా కూర్చున్నారు. గాలి ప్రశాంతంగా వీస్తోంది. నిప్పురాయి కూడా చల్లబడినట్లనిపించింది.

కాసేపయ్యాక ఇద్దరూ లేచి కొండ దిగుతుండగా “అయితే తాతా, ఈ రాయిని కొండ మీదకి ఎందుకు చేర్చమన్నావ్ నన్ను?" అడిగాడు ఇవాష్కా.

ముసలివాడు నవ్వాడు. “అది అందరికీ కనపడేటట్లు కొండ మీదనే ఉండాలి. తర్వాత ఏం జరుగుతుందో నీ జీవితకాలంలో చూద్దువుగాని" అన్నాడు.

4


చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పటి నుండీ ఆ రాయి అక్కడే ఉంది. దాన్ని ఎవ్వరూ పగలగొట్టలేదు. చాలామందే వచ్చి చూసారు దాన్ని. అందరూ దాని దగ్గరికి రావడం, కొంచెం సేపు అలా నిలబడి చూడటం, తల పంకించి వచ్చిన దారినే తిరిగి వెళ్ళటం.

మనసు బాగాలేనప్పుడు ఒక్కోసారి పెద్ద ఇవాష్కా కూడా 'రాయిని పగలగొడతాను. మళ్ళీ ఒక కొత్త జీవితం మొదలు పెడతాను' అనుకుంటాడు; అక్కడకి వెళతాడు.

అయితే కొంతసేపు ఆ రాయి ఎదురుగ్గా నిలబడగానే అతని ఆలోచనల్లో మార్పు వస్తుంది. "వద్దులే. మళ్ళీ కుర్రాడిని అవ్వక్కర్లేదు. 'ఇచ్చిన జీవితాన్నే ఉపయోగించుకోలేదు; కొత్త జీవితం కోసం అంతా మళ్ళీ మొదలు పెట్టుకున్నాడు' అని అందరూ నవ్వుతారు" అనుకుని వెనక్కి వెళ్ళిపోతుంటాడు.

తాత ఆ రాయిని అందరికీ కనపడేట్లుగా కొండమీదకి ఎందుకు చేర్చమన్నాడో ఇవాష్కా కుడ్రియాష్కిన్‌కి ఇప్పుడు అర్థం అయింది"

బేతాళం ఈ కథ చెప్పి "ఇంతకీ ఇవాష్కాకు ఏమి అర్థమైందంటావు?! అల్ప సంతోషి ఐన ముసలివాడు 'నాకు ఈ జీవితం చాలు' అనుకొని ఉండచ్చు. కానీ 'మిగిలిన వాళ్లెవ్వరూ కూడా రాయిని బ్రద్దలు కొట్టలేదు' అనటం ఆశ్చర్యంగా ఉంది. మాయ రాయి మనుషుల మనసుల్ని మార్చేస్తున్నదా?!" అన్నది.

విక్రం చిరునవ్వు నవ్వుతూ "బేతాళం, ఈ కథ మానవ స్వభావంలో ఉన్న వైరుధ్యాన్ని ఆవిష్కరిస్తున్నది. మనిషి ఒకవైపున క్రొత్త ఆనందాన్ని కోరుకుంటూనే, మరొకవైపున తనకు లభించిన జీవన రసాన్ని ఆస్వాదిస్తుంటాడు. తను ఒక వైపున కష్టపడుతూనే, మరొకవైపున జీవితంలో కష్టం ఎప్పుడూ ఉంటుందని కూడా చూస్తాడు. పరస్పర విరుద్ధమైన ఈ రెండు భావనల మధ్యా ఉన్న సంఘర్షణ ఎన్నటికీ తెగదు. రాయిని బ్రద్దలు కొట్టి వెనక్కి పోయేంత ధైర్యం ఆలోచనాపరులకెవ్వరికీ ఉండదు. అయితే త్వరపడి ఎవరినీ ఊరికే నిర్ణయించుకోనీక, లోతుగా ఆలోచించే శక్తిని మనుషుల్లో ప్రేరేపిస్తూండచ్చు ఆ రాయి- అంతకు మించి అదేమీ చేయట్లేదు" అన్నాడు.

అలా విక్రంకు మౌనభంగం కలగటంతో బేతాళం అతని పట్టు నుండి చటుక్కున విడివడి, మళ్లీ చెట్టుకొమ్మ మీదికి చేరుకున్నది!

*****

Wednesday, August 19, 2015

ప్రపంచ ప్రసిద్ధ జానపద కథల పుస్తకం

ఫ్రెండ్స్, 
నిన్న దేవేనేని మధుసూదనరావు గారు ఫోన్ చేసి "మీ జానపదకథల పుస్తకాన్ని కొనుక్కున్నానండీ, మీరు మాకు పంపరుగా" అనగానే నవ్వుకున్నాను పెద్దగా.  "అయ్యా, నేనింత వరకూ నా కళ్ళతో చూసుకోలేదు" అన్నాను.  పైకి అలా అన్నాను కాని పుస్తకాన్ని చూడాలని కోరిక ఉంటుంది కదా! విశాలాంధ్ర పబ్లిషింగ్ మేనేజర్ మనోహర్ నాయుడి గారికి ఫోన్ చేస్తుంటే ఆయన ఫోన్ తీయడం లేదు. పోన్లే రేపు చేద్దాం అనుకున్నాను.
ఇప్పుడు స్కూలు నుండి ఇంటికి రాగానే కొరియర్ వచ్చింది. కొరియర్ లో పుస్తకాలు వచ్చాయి.
చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్, అందరూ కొనుక్కోండి. మీరు, మీ పిల్లలు ఈ కథలన్నీ చదవాలనీ, మీ పుస్తకాల ర్యాక్ లో ఈ పుస్తకం తప్పకుండా ఉండాలని కోరుకుంటున్నాను. వాళ్ళ Phone # , Address: Eluru Road, Vijayawada, Andhra Pradesh 520002
Phone: 0866 257 2949, 8662430302, 8331012030
మీ రాధ మండువ


Thursday, August 6, 2015

పిల్లలు - బొమ్మలు

నేను పిల్లల కోసం రాసిన కథలు ఇ పుస్తకంగా కినిగెలో ..... ఫ్రెండ్స్. చదవండి సమయం ఉన్నప్పుడు... మీ పిల్లల చేత చదివించండి. మరేమో వాళ్ళు చదవలేకపోతే మీరే చదవాలి సుమా! మొత్తం ఇరవై ఆరు కథలు. మా అబ్బాయి గౌతమ్ పిడూరి రాసిన రెండు కథలు కూడా ఇందులో చేర్చాను.  

Tuesday, July 28, 2015

నా ఫేస్ బుక్ ఫ్రెండ్స్

రాధ మండువ
ధ్యానం చేసుకుంటున్నాను. నా ధ్యాస, ఆలోచనలు అన్నీ ఫేస్ బుక్ మీదే..... అందరినీ ఒకసారి తల్చుకుంటాను....

రమణమూర్తి గారు ఎలా ఉన్నారో? ఆయనకి నచ్చేట్లు ఇప్పటికి రెండు కథలే రాశాను (చందమామోళ్ళవ్వ, చివరిచూపు) మరిన్ని మంచి కథలు రాయాలి అనిపిస్తుంది ఈయన్ని తల్చుకుంటే... సద్విమర్శకులు.

ఈ పద్మాకర్ ఒకరు.... వాళ్ళ పాపకి మంచి కాలేజీలో సీటు కోసం ప్రయత్నిస్తారో లేక అదీ "అలా చూస్తూ" ఉంటారో!? తనకు తెలియకుండానే తాత్త్వికుడు అయినవాడు. ప్రజల ప్రేమికుడు. ఆయన బిడ్డని బాగా చూడు స్వామీ...

షరీఫ్ గారు బాగా బిజీనా? కథ గ్రూప్ మీద శ్రద్ధ పెట్టడం లేదేమిటో ఈ మధ్య? ఇక సత్యప్రసాద్ గారు - అతని గురించి ఎవరేం విమర్శలు చేసినా శ్రద్ధగా విని ఆలోచిస్తారట. ఆ సంయమనం నాకు కూడా కలగాలని కోరుకుంటున్నాను.

అనిల్ ఎస్ రాయల్ గారు, సురేష్ ఎమ్మారెడ్డి గారు, కృష్ణమోహన్ మోచెర్ల గారు, అవినాష్ వేంపల్లి గారు, శ్రీధర్ కొమ్మోజు గారు - వీళ్ళని చూడనే లేదే.... ఫోటోలు పెట్టుకోలేదెందుకో?

హేమచంద్ర గారు కొత్త పెయింటింగ్స్ ఏం పోస్ట్ చేసారో, రజనీ గారు ఎలా ఉన్నారో, ఆయనకి నమస్కారాలు. ఈ బాలాంత్రపు అబ్బాయి - మా స్టూడెంట్ బాగా పెద్దవాడయుంటాడు.

దాసరి అమరేంద్ర గారికి ఏం ఓపికబ్బా!? ఎప్పుడు చూసినా ప్రయాణిస్తూనే ఉంటారు. ఫోటోలు తీస్తూనే ఉంటారు, ఎప్పుడో బెస్ట్ ఫోటో ప్రైజ్ కొట్టేస్తారు.

రాఘవ గారు కవితలు రాయడం లేదేమిటో!! ఇల్లు కట్టడంలో మునిగిపోయారుట.... ఆ పని చాలా కష్టం కదా! అందుకే అంటారు 'ఇల్లు కట్టి చూడు.....' అని.

మురళీ కృష్ణ గారికి ఎంత ఎనర్జీ!!!! బాబోయ్ ఇన్నేసి కథలు, వ్యాసాలు ఎలా రాస్తారో? ఇలాంటి శక్తి ఉన్న వాళ్ళు అందరినీ దీవిస్తే ఆ దీవెనలు నిజమవుతాయట. చెప్పాలి ఆయనకి.

శ్రీ అట్లూరి ఎలా తీస్తారో ఇంత బాగా ఫోటోలు... ఈయన బ్లాక్ అండ్ వైట్ లో ఫోటోలు తీస్తే చూడాలని ఉంది.... కలర్లు కాకుండా

నారాయణ స్వామి గారు ఎలా ఉన్నారో? అందరితో ఫ్రెండ్ షిప్ ఈయనకే సాధ్యం అనిపిస్తుంటుంది.

అఫ్సర్ గారు - ఆయనకి నెనెప్పటికీ కృతజ్ఞురాలిని.... నా కథని మొట్టమొదటగా పబ్లిష్ చేసి కాన్ఫిడెన్స్ కలిగించినందుకు.

శివ సోమయాజులు గారు సంతోషంగా ఉండాలి స్వామీ, మరిన్ని కథలు రాస్తూ...

ఇస్మాయిల్ సుహైల్ గారు అమ్మా నాన్నలని ఎంత అపురూపంగా చూసుకుంటారు... డాక్టర్ గారు గ్రేట్ నిజంగా.

మా గోపిరెడ్డి సార్ ఎలా ఉన్నారో, నిజాలు రాస్తే ఎట్లా? ఊరుకోవయ్యా ఎవరైనా మీ ఇంటి కొచ్చి గొడవలు పెట్టుకుంటారో ఏం పాడో అని చెప్పాలనుకున్నాను, చెప్పాలి. తిరుమల ప్రసాద్, అశోక్ గొప్ప లీడర్స్ అవ్వాలి.

సాదిక్ గారి తోపుడుబండి, వాసిరెడ్డి గారి పబ్లికేషన్స్ బాగుండాలి. శివ అమెరికాలో ఎలా ఉన్నారో? ఆయన పెంపుడు కూతురు (ఆ సిగ్గుసిగ్గుగా నవ్వే పిల్ల - పేరేమిటో గుర్తు రావడం లేదు) భలే పిల్ల, కళ్ళల్లోనే ఉంది తెలివంతా... గొప్పపాపవుతుంది పెద్దయ్యాక...

బత్తుల ప్రసాదరావు గారి చేతి వంట వెజ్ ( నాన్ వెజ్ కాదు) తినాలి ఎప్పటికైనా... సెల్ తోనే మంచి ఫోటోలు తీయడం ఈయనకే సాధ్యం. కాశీ ఎలా ఉన్నాడో?

సుధాకర్ తుల్లిమల్లి గారు ఎలా ఉన్నారో... ఈ మధ్య పెద్దగా కవితలు రాయడం లేదులా ఉంది!

విజయ్ రెడ్డివారి గారూ, ఆర్యకి చక్కని తెలుగు నేర్పాలి సుమా!

అనిల్ బత్తుల సోవియట్ పుస్తకాలన్నింటినీ, ఒక్కటి కూడా మిగల్చకుండా బ్లాగ్ లో పెట్టెయ్యాలి.
జగదీష్ అనువాదం చేస్తానన్నారు .. చేస్తున్నారో లేదో...

కృష్ణమోహన్ పుస్తకానికి సరిపడేన్ని కవితలు రాసేయాలి. అద్భుతమైన ఫోటోలుతో పాటు.

మహేంద్రకుమార్ డాక్టర్ గారు మరిన్ని మెడికల్ కా్యంప్స్ నిర్వహిస్తూ, ఆ అనుభవాలను కథలుగా రాస్తే బావుండును.

మహేష్ కత్తి గారు ఎలా ఉన్నారో? వీళ్ళది వాయల్పాడేనంట. ఈ సినిమా జీవితంలో హాయిగా నవ్వుకుంటూ ఉండే ఆయన్ని ఈయన్నే చూసా... అలాగే సంతోషంగా ఉండాలి.

ఆ 'థూ!' కథ రాసిన సునీల్ గారు మరిన్ని కథలు రాయాలి...

చక్రధర్ అనే అబ్బాయి ఎప్పుడో తీస్తారు గొప్ప సినిమా.... గాఢత ఉన్న అబ్బాయి.

ఇక శ్రీధర్ నీలంరాజుగారు దిగులే లేదు... హాపీ, జీవితాన్ని హాయిగా గడిపేస్తుంటారు. వెరీగుడ్ అనిపిస్తుంటుంది అతన్ని తల్చుకుంటే... కీప్ ఇట్ అప్ శ్రీధర్

ప్రసాద్ ఇంద్రగంటి గారి ఇంగ్లీషు కవితలన్నీ తెలుగులోకి రాయకూడదూ వాళ్ళ చిన్నమ్మాయి ధన్య? భలే రాస్తుంది ఆమె కవితలు, మొన్న రిషీవ్యాలీ వర్క్ షాప్ లో మంచి కవిత రాసి చదివింది.

నరేష్ నున్నా గారు ఎలా ఉన్నారో? ఇంకెలా ఉంటారు... అన్నమయ్యలో లీనమై పోయి ఉంటారు. ఇంతకీ ఆయనకి ఆ తల్లి దర్శనం దొరికిందో, ఇంకా వెతుక్కుంటూనే ఉన్నారో... నేననుకోవడం ఈయనకి దొరికినా ఇంకా వెతుక్కోవడం లోని ఆనందాన్ని పోగొట్టుకోకుండా ఉండటానికి వెతుకుతూనే ఉన్నారనకుంటా... టూ ప్రొఫౌండ్.

భాస్కర్ గారు మరిన్ని కవితలు రాయాలి. ప్రస్తుతం మదనపల్లిలోనే ఉన్నారేమో శివరామ్ గారితో...

మా ఒంగోలోళ్ళు మోహన్ రావిపాటి, సురేష్ పోపూరి, ఇండ్ల చంద్రశేఖర్ బావున్నారు కదా? మూర్తిగారు మళ్ళీ ఏదో దయ్యం కథ రాసే ఉంటారు, చదవాలి. కర్నాటి అర్జున్ గారు హాయిగా నాటక ప్రదర్శనలు ఇస్తూ ఉండి ఉంటారు.

రాజేష్ యాళ్ల – కథ గ్రూప్ ని నాకు పరిచయం చేశారు. బాగున్నారట, ఏదో హాస్య కథ కూడా రాశానని చెప్పారు... మరిన్ని కథలు రాయాలాయన.

కథా ప్రపంచం - ఆయనెవరో మరి? ఎప్పటికైనా తెలిస్తే బావుండు.

బెహరా గారు కావలిలో ఎలా ఉన్నారో? పాప బావుంటుంది... చక్కగా చదివి నాన్నకి మంచి పేరు తెస్తుంది. కట్టా శ్రీనివాస్ గారు ఎలా ఉన్నారో?

కిరణకుమార్ చావా గారు, రెహమాన్ గారు కినిగె వాళ్ళంతా మరిన్ని పుస్తకాలు పెట్టాలి వెబ్ లో...

అనిల్ అట్లూరి గారు ఈ వారం వేదికలో ఏ కథని పరిచయం చేస్తున్నారో?

మణిభూషణ్ గారు బావున్నారా? ఇంకా చెన్నైలోనే ఉన్నారేమో!

శ్రీనాధ్ రాజు గారు బాగా చదుకున్నారు, పువ్వులు అంటే ఎంతిష్టమో ఈయనకి? మా అబ్బాయి కూడా ఈయనలాగా పెద్ద చదువు చదవాలి స్వామీ...

రవి ENV గారు ఏదైనా కావ్యం రాస్తే బావుండు. శ్రీరామ్ కణ్ణన్ గారు మంచి కథలు రాయొచ్చు కదా, అడగాలి. అవినేని గారు బావున్నారనుకుంటాను.

సి.ఎ ప్రసాద్ గారూ, ఆరోగ్యం జాగ్రత్తండి... బాగానే ఉంటుందిలే పిల్లలతో గడుపుతుంటారుగా...

వివినమూర్తి గారికి మంచి ఆరోగ్యం ఉండాలి స్వామీ...

ఎన్. వేణుగోపాల్ గారు, ప్రభాకర్ గారు, జి ఎస్ రామ్మోహన్ గారు మరిన్ని వ్యాసాలు రాస్తూ, మరిన్ని కథలు రాస్తూ ఉండాలి. వేణుగోపాల్ గారు పంపిన (వాళ్ళమ్మగారి ) పుస్తకం అందిందని చెప్పలేదేమిటో... అందింది సార్.... థాంక్యూ

గోపరాజు రమేష్ గారు, వెంకటరమణకుమార్ కాజ గారు, విజయభాస్కర్ రాయవరపు గారు, దాసరి వెంకట రమణ గారు, పైడిమర్రి రామకృష్ణ గారు, నారంశెట్టి ఉమా గారు, అవ్వారి నాగరాజు గారు, దుర్గారావు గారు, మహమ్మద్ అహమ్మద్ గారు, రామకృష్ణ చెరుకూరి గారు, ఎ ఎమ్ ఖాన్ గారు, కెపి అశోక్ కుమార్ గారు, నాగ్ గారు, కిరణ్ కొత్తగూడెం గారు, కిరణ్ ప్రభ గారు, అన్సాల శ్రీను గారు, చంద్ర కన్నెగంటి గారు, తిరుపాలు గారు, అరుణ్ సాగర్ గారు, సురేష్ వెంకట్ గారు, సాయికుమార్ అనిశెట్టి గారు, పాపారావు గారు, కె.వి కూర్మనాధ్ గారు, మన్నవ గారు, మద్దిరాల గారు, రాజేంద్ర ప్రసాద్ యెలవర్తి గారు, శ్రీనివాస్ భట్టు, రామారావు గారు, రామకృష్ణ పరమహంస గారు, వెంకట్ మన్నేపల్లి, షణ్ముఖచార్య గారు, జ్ఞానేశ్వర్ ఇంకా పేర్లు గుర్తు రావడం లేదే... అందరూ బాగుండాలి స్వామీ....

(అందరికీ ధన్యవాదాలు)

*****

(స్నేహితురాళ్ళ గురించి మరో పోస్ట్ పెడతా ఫ్రెండ్స్)

ధ్యానం



విశ్వానికున్న క్రమబద్ధతను అర్థం చేసుకోవడానికి అనునిత్యమూ కారణరహితంగా జీవించగలమా? ఇదే అత్యున్నతమైన సవ్యత. క్రమత్వం. దీని నుంచే సృజనాత్మక శక్తి కలుగుతుంది. ఈ శక్తిని విడుదల చెయ్యడానికే ధ్యానం.

ధ్యానం యొక్క లోతునీ, సౌందర్యాన్నీ అర్థం చేసుకోవడం అమిత ముఖ్యమైన విషయం. కాల్పనిక సృష్టిని దాటి ఈ ఆలోచనలన్నింటికీ ఆవలగా కాలాన్ని మించినది ఏదైనా ఉందా అని మనిషి అతి ప్రాచీన కాలం నించీ ప్రశ్నిస్తూనే ఉన్నాడు. ఈ బాధలూ, అలజడులూ మనిషి మనిషికీ మధ్య జరిగే యుద్ధాలూ, సంఘర్షణలూ - వీటన్నింటినీ దాటుకుని ఆవలగా ఏమన్నా ఉందా అని అతడు అడుగుతూనే ఉన్నాడు. స్థిరమైనదీ/ అచలమైనదీ / పావనమైనదీ, అత్యంత పరిశుద్ధమైనదీ, ఏ ఆలోచన వల్లా అనుభవం వల్లా స్పృశింపబడనిదీ ఏదైనా ఉందా? - దీన్ని ముఖ్యమైనదిగా భావించి అక్కరపడే వ్యక్తులు ప్రాచీన కాలం నించీ చేస్తున్న విచారణ ఇది. దీన్ని కనిపెట్టడానికి, స్ఫురింపజేసుకొనడానికి ధ్యానం అవసరం. మళ్ళీ మళ్ళీ పునశ్చరణ చేసే ధ్యానం కాదు - దీనికి ఏ అర్థమూ లేదు. అన్ని సంఘర్షణల నించీ, ఆలోచనల వల్ల కలిగే ప్రయాసల నించీ మనసు విడివడినప్పుడు - అప్పుడు ఒక సృజనాత్మక శక్తి ఉంటుంది. ఇదే నిజమైన మతాత్మకమైనది. ధార్మికమైనది. ఆద్యంతాలు లేని దాన్ని దర్శించడమే / స్ఫురింపజేసుకోవడమే ధ్యానం యొక్క నిజమైన లోతూ, సౌందర్యమూ. దీనికి సమస్తమైన నియంత్రణల నించీ స్వేచ్ఛ కావాలి.

పరమ కరుణతో కూడిన తెలివిడిలో పూర్తి భద్రత – పరిపూర్ణమైన రక్షణ – ఉంటుంది. కానీ మనం ఆలోచనలలో, ఆదర్శాలలో, విషయాలలో, విశ్వాసాలలో రక్షణ కోరతాం. అవి ఎంత అహేతుకాలయినా, అసత్యాలయినా సరే - అవే మనకి రక్షణ – వాటినే పట్టుకు వేళ్ళాడతాం. కరుణ ఉన్నప్పుడు దానితో పాటే ఉండే అత్యున్నతమైన తెలివిడి వల్ల రక్షణ ఉంటుంది - ఒకవేళ రక్షణ కావాలని కోరితే.

నిజానికి ఆ పరమ కరుణ, ఆ తెలివిడి ఉన్నప్పుడు రక్షణ కోరడం అనే ప్రశ్నే రాదు.

కాబట్టి అన్ని విషయాలూ ఉద్భవించే ఒక ప్రాధమిక క్షేత్రం, ఒక మూలం ఉంది. అది శబ్దం కాదు. మాట ఎప్పటికీ "అది" కానేరదు. సమస్తమైన కాలీనతల నుండి విడివడి, అన్నింటికీ ప్రధమ మాతృక అయిన ఆ క్షేత్రాన్ని దర్శించడమే / స్ఫురింపజేసుకోవడమే ధ్యానం. ఇదే ధ్యాన మార్గం. ఇది కనుగొన్నవాడే ధన్యుడు.

- జిడ్డు కృష్ణమూర్తి

Monday, June 22, 2015

అపుటాఫ్ ఆర్డర్

నవ తెలంగాణ - సోపతిలో ప్రచురణ
- రాధ మండువ


ప్రయత్నించాను. ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాను - ఆ పది నంబర్లనూ గుర్తుకు తెచ్చుకోవడానికి. ఊహు! గుర్తు రావడం లేదు.

***

రాత్రి వాణి జర్మనీ నుండి ఫోన్ చేసింది. "నీతూ, ప్రభాకర్ నిన్నొక్కసారి ఫోన్ చేసి మాట్లాడమని చెప్పాడు. నేను ఈ కొత్త ప్రాజెక్ట్ హడావుడి, జర్మనీ ప్రయాణపు సర్దుడులో పడి పూర్తిగా మర్చిపోయాను. సారీ" అని మళ్ళీ తనే "అతను చేసి కూడా నెలయిపోయిందే" అంది కంగారు కంగారుగా.

ఏమయింది? ఇప్పుడెందుకంత కంగారు, నేను చేయనని నీకు తెలుసు కదే" అన్నాను. 'ప్రభాకర్' అన్న మాట నాలో కలిగించిన కంగారుని దాచిపెడుతూ...

కాదు నీతూ, తప్పకుండా చెయ్యి. జాబ్ రిజైన్ చేయాలనుకుంటున్నాట్ట, 'ఇక్కడ నుంచి వెళ్ళేముందు ఒక్కసారి నీతూని క్షమించమని అడగాలి, బై చెప్పాలి' అన్నాడే... అయ్యో నా ఈ మతిమరుపు నన్నెప్పుడో ఇబ్బందుల్లో పడేస్తుంది నిజంగా.... మరీ ఈ మధ్య చాలా విషయాలు మర్చిపోతున్నాను. నువ్వు కూడా మమ్మల్ని మర్చిపోయావు. ఫోన్ కూడా చేయడం లేదు" అంది వాణి.

దాని మాట తీరుకి నవ్వుకునే నేను ఇప్పుడు మౌనంగా ఉన్నాను.

నిత్యా, వింటున్నావా" అంది.

వద్దు వాణీ, నేను ఫోన్ చేయను. దయచేసి మర్చిపోయిన గాయాన్ని రేపకు. ఇంతకు ముందు నీకు నేను చాలా సార్లు చెప్పాను అతను చేస్తే నువ్వు కూడా తీయొద్దని, ఒకవేళ తీసినా నా గురించి ఏమీ మాట్లాడొద్దని" అన్నాను నిర్లిప్తంగా.

"కాదే, అతని మాటలు వింటుంటే నిజంగానే వెళ్ళిపోతున్నారనిపించింది. ఇన్ ఫాక్ట్ నీకు ఆ రోజు వెంటనే ఫోన్ చేశాను కూడా, నువ్వు లిఫ్ట్ చేయలేదు. ఇక ఈ పనుల్లో పడి మర్చిపోయాను" అంది.

ఆ విషయం వదిలెయ్, నువ్వు అక్కడ ఎలా ఉన్నావ్?" అన్నాను. నా గొంతులో దు:ఖం నాకే స్పష్టంగా వినిపిస్తుంటే ఇక అదేం మాట్లాడగలదు.

సర్లే అయితే, నీ ఇష్టం. ఉంటాను మరి, నేను బాగానే ఉన్నాను, మళ్ళీ చేస్తాను" అని పెట్టేసింది. ఎక్కువ మాట్లాడితే నేనెక్కడ బోరుమంటానో అని భయపడినట్లుంది. నేను చాలా కఠినమైపోయానని, అతని గురించి ఆలోచించడమే మర్చిపోయానని దానికేం తెలుసు?

అవునా, మర్చిపోయానా? అయితే అతని ఫోన్ నంబర్ కోసం ఎందుకీ తాపత్రయం? అతని చేత క్షమాపణ చెప్పించుకోవాలనే తపన నాలోలోపల దాగి ఉందేమో!

అవును చెప్పించుకోవాలి. అతను క్షమాపణ చెప్పాలి.

నిజంగానే రిజైన్ చేశాడా? నిజమేనేమో, మొన్నీ మధ్య శ్రీనివాస్ సార్ బజార్లో కనపడి అన్నారు "నువ్వు ఇక్కడ పని చేసినప్పుడున్న పరిస్థితి లేదమ్మా ఈ సంవత్సరం ఈ ఏరియాలో కాలేజీలు ఎక్కువైపోయి మన కాలేజీలో స్టూడెంట్స్ బాగా తగ్గిపోయారు. వీళ్ళు లెక్చరర్స్ కి సరిగ్గా జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నారు, నీకు తెలిసిన కాలేజీల్లో ఎక్కడైనా ఖాళీలుంటే చెప్తావా!" అని.

ప్రభాకర్ కూడా వేరే ఉద్యోగం చూసుకున్నాడా? ఎవరిస్తారు ఇతనికి? అందునా అవిటి వాడు. ఖచ్చితంగా రిజైన్ చేసి ఉండడు. జీతాలు ఇవ్వడం లేదుగా, డబ్బు అవసరమై చేసి ఉంటాడు. నాతో మాట్లాడటానికి ముఖం చెల్లక వాణికి చేసి ఉంటాడు.

ఎందుకిలా ఆలోచిస్తున్నాను 'అతను కేవలం డబ్బు కోసమే నాతో స్నేహం చేశాడ'ని ఈ రెండేళ్ళల్లో వందల సార్లు అనుకోవడం వల్లనా!?

ఆలోచనలని భరించలేక లేచి వంటిట్లోకి వెళ్ళాను. పని చేసుకుంటున్న రంగమ్మ ఫ్లాస్క్ ని చేతిలోకి తీసుకుని కాఫీని మగ్ లోకి వంచనా అన్నట్లు నా వైపు చూసింది. తల ఊపాను. మగ్ లోకి కాఫీ వంచుతున్న రంగమ్మ ముఖంలో దిగులు స్పష్టంగా కనిపిస్తోంది. నాలుగు రోజుల క్రితం రంగమ్మ తన మనవడిని కాలేజీలో చేర్చడానికి డబ్బు కావాలని అడిగింది. ఇవ్వనన్నాననేమో మౌనంగా, దిగులుగా ఉంది అనుకున్నాను. మగ్ తీసుకుని వరండాలోకి వచ్చి కూర్చున్నాను.

వెళ్ళిపోతున్నాడా అయితే? అతనితో నా స్నేహం తెగాక అతను చేసినా నేను ఫోన్ తీసేదాన్ని కాదు, అప్పట్లో అతని నంబర్ నేను రిజెక్ట్ లో పెట్టేశానని తెలుసు కనుక వాణికి చేసి ఉంటాడా?

అదిగో ఈ ఆలోచన వచ్చినప్పటి నుండీ ఆ అంకెలని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం. ఒకప్పుడు నేను మర్చిపోలేని నంబర్లవి. ఎలా మర్చిపోయాను. వద్దనుకున్నవి కాలపు మడతల్లోకి జారిపోయి, నాశనమైపోతాయేమో!

వాణిని నంబర్ అడగొచ్చు కాని.... వద్దు వద్దు. కళ్ళు మూసుకున్నాను.

అతను పరిచయమైన కొత్తల్లో ఎక్కడో రాసి పెట్టుకున్నట్లు గుర్తు, ఊహు! లేదు. ఫోన్ లో ఎంటర్ చేసుకున్నాను కాని రాసుకోలేదు. ఆఁ గుర్తొచ్చింది. అతను నన్ను అవమానంగా 'ఆ మాట' అన్నప్పుడు రాసి పెట్టుకున్న డైరీ పేజీ - దానిలో రాసుకున్న వాక్యం కిందనే అతని నంబర్ రాసుకున్నాను.

గభాల్న లేచి గదిలోకి వెళ్ళి పాత డైరీ బయటికి లాగి ఆ పేజీ కోసం వెతికాను.

నేను కాబట్టి ఈ మనిషిని ఉద్ధరిస్తున్నాను అన్న నాలోని భావన, అహం వల్లే నేడు నాకీ దు:ఖం కలిగిందేమో!”

ఆ వాక్యం కింద అతని ఫోన్ నంబర్, అప్రయత్నంగా వేసిన నంబర్!


***


ఉదయం నుంచి ఆ నంబర్ ని చూడటం ఏ వెయ్యోసారో అయి ఉంటుంది. డయల్ చేయాలని సెల్ చేతిలోకి తీసుకోనూ... వద్దని మళ్ళీ పేజీ మూసేయనూ. పేజీనైతే మూసేయగలను కాని కళ్ళ ముందు ప్రత్యక్షమవుతున్న నంబర్లని ఏం చేయను?

ఇంత సేపూ వాటిని చేజిక్కించుకోవాలని తపించిన మనసు ఇప్పుడు వాటిని చెరిపేయాలన్న ప్రయత్నంలో పడింది.

రహస్యంగా ఉన్న క్రీనీడలన్నీ అంకెల్లో చేరి నన్ను చూస్తున్నట్లుగా ఉంది. ఆ పది అంకెలే అనేకానేక ఏక కేంద్రక వృత్తాలుగా ఒక దాని మీద ఒకటి పడుతూ, ఒకటి తర్వాత మరోటి సంఘటనల వలయాలుగా తిరుగుతూ ఏవేవో నైరూప్య చిత్రాలుగా మారిపోతున్నాయి. ఎప్పుడో గతకాలపు అరల్లో దాచిపెట్టపడిన జ్ఞాపకాలూ, నిద్రగా అణగారిపోయిన ప్రశ్నలూ మళ్ళీ వెల్లువై పోటెత్తుతున్నాయి.

జవాబు ఉన్నా లేనట్లయిన ఈ ప్రశ్నలకి సమాధానాలు దొరకవు. ఇవి మౌనంతో ఎప్పుడో చంపేసుకున్న ప్రశ్నలు.

అప్పుడేమీ చేయలేక గుండెల్లో దాచుకున్న కోపం నాలో ఎగదన్నినట్లైంది. డైరీలోని కాగితాన్ని లాగి ముక్కలు ముక్కలుగా చించేశాను. అవును... ఇలా అదృశ్యమైపోవలసిందే, ఎవరికీ చెప్పుకోలేని ఆ జ్ఞాపకాల ఆవేదన నశించాల్సిందే.

ఆవేశం తగ్గడానికి నెమ్మదిగా గాలి పీల్చుకున్నాను. ఎందుకీ ఆవేశం? జరిగిన దాన్లో నా తప్పేమీ లేదనీ, తప్పంతా అతనిదేననీ, అదే సత్యమనీ అనుకున్నాక కూడా బాధ పడుతున్నానంటే నేననుకుంటున్న సత్యం అసత్యమా?

నిజమే... జరిగినదాన్లో నా తొందరపాటూ, మనుషుల్ని అంచనా వేయడంలో నా అసమర్థత, అవసరం లేకపోయినా సహాయం చేయబోవడం, నేను లేకపోతే ఎక్కడుండే వాడో అనుకోవడం... ఇవన్నీ నా తప్పులే. కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగాయి.

నన్ను ఆక్రమించుకుని ఉన్న సంఘర్షణ, లేదనుకున్నా మనసు పొరల్లో దాగి ఉన్న ఆ ఆవేదన కన్నీళ్ళ రూపంలో జారిపోతోంది.... బరువెక్కిన కాళ్ళని మంచం మీదకి చేర్చి జారగిలపడ్డాను.

కళ్ళు మూసినా తెరిచినా కనపడుతున్న ఆ అంకెలు నన్ను వదలడం లేదు. ఏమిటిది? స్నేహానికి అర్థం తెలియని, దానికి అర్హత లేని ఈతని కోసం ఎందుకింత ఆందోళన? ....

పిల్లలిద్దరూ స్కూలుకి వెళ్ళిపోతే ఇంట్లో ఊరికే కూర్చోవడం ఎందుకని ఇంటికి దగ్గరగా ఉన్న చిన్న ప్రైవేట్ కాలేజీలో సైన్స్ లెక్చరర్ గా చేరాను. ప్రభాకర్ కూడా సైన్స్ లెక్చరరే అవడంతో మా ఇద్దరికీ స్నేహం కలిసింది. అతనికి ఒక కాలుకి పోలియో. కాలిని ఈడుస్తూ నడుస్తాడు. కాలేజీ వాళ్ళిచ్చే ఆ కాస్త జీతంతోనే అమ్మనీ, చెల్లెలినీ పోషించవలసిన పరిస్థితి అతనిది. మనిషి ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నట్లు నిర్లిప్తంగా ఉండేవాడు. ఎందుకంటే చెప్పలేను గాని అతనంటే నాకు చాలా జాలి, ఆపేక్ష కలిగాయి.

చదువు చెప్పే ఒక లెక్చరర్ మంచి బట్టలు కూడా లేకుండా అలా హీనంగా ఉండటం చూడలేక ఏదో ఒక మిషతో గిఫ్టుగా బట్టలు ఇచ్చేదాన్ని. తన చెల్లెలికి పెళ్ళి చేస్తున్నప్పుడు అవసరమంటే మొదటి సారి డబ్బు సహాయం చేశాను. అప్పటి నుండీ చాలా సార్లు అతని అవసరాలు కనిపెట్టి మరీ డబ్బు ఇచ్చేదాన్ని.

మా స్నేహబంధం బాగా బలపడింది.

నువ్వే లేకపోతే ఏమయ్యోవాడినో నీతూ? నీకు చాలా రుణపడి ఉన్నాను. అంతా లెక్క రాసి పెడుతున్నాను, చిన్నగా తీరుస్తాను” అనేవాడు. అతను ఇవ్వలేడని తెలుసు నాకు. అతనిలో అతని పట్ల కాన్ఫిడెన్స్ కలిగించాలని "ఫర్వాలేదులే ప్రభాకర్, ఇవ్వొచ్చులే చిన్నగా, ఇవ్వక ఎక్కడకి పోతావ్ " అనేదాన్ని.

అన్ని రోజుల నుంచీ పని చేస్తున్నా అవిటివాడు కాబట్టి ఇక అతనెక్కడికీ వెళ్ళలేడని జీతం పెంచకుండా పని చేయించుకుంటుంటే యాజమాన్యానికి అతని పరిస్థితి చెప్పి జీతం పెంచేట్లు కూడా చేశాను.

చేసిన సాయాన్ని మళ్ళీ ఇప్పుడు తల్చుకుంటుంటేనే చీదరగా ఉంది. అంత దౌర్భాగ్యం ఇంకోటి లేదు....

"పెళ్ళి చేసుకోకుండా ఇలా ఎన్నాళ్ళుంటావ్ ప్రభాకర్, పెళ్ళి చేసుకో... చేసుకో" అని పోరుతుంటే "కుంటివాడిని నన్నెవరు చేసుకుంటారు నీతూ? అయినా నాకు పెళ్ళెందుకు?" అనేవాడు.

"నీకంటూ ఒక సంసారం ఉండాలి, నువ్వు సుఖంగా ఉండాలి. ఇప్పుడు మీ అమ్మ ఉన్నారు, తర్వాత ఎవరు చూస్తారు" అని వాదించే దాన్ని.

"ఆ విషయం తప్ప ఇంకేదైనా చెప్పు. పెళ్ళి చేసుకుని ఆ బంధాల్లో ఇరుక్కుంటే చేయగలిగి ఉన్నానా? ఎందుకా రొష్టు చెప్పు? నీ స్నేహం ఉంటే నాకు చాలు, ఏమీ దిగులు లేదు” అనేవాడు.

అతని క్షేమాన్ని అతని కంటే ఎక్కువగా కోరుకునే నాకు కాని, కొలీగ్స్ కి కానీ చెప్పకుండా హఠాత్తుగా వాళ్ళ ఊరికి వెళ్ళి పెళ్ళి చేసుకుని వచ్చాడు. అందరూ నిష్టూరంగా మాట్లాడారు.

"ఆర్భాటంగా చేసుకునేంతటి వాడిని కాదుగా, ఒకళ్ళని పిలిస్తే అందరినీ పిలవాలి. అందుకని ఎవరికీ చెప్పలేదు. ఏదో గుడిలో దండలు మార్చుకున్నాము" అన్నాడు.

నీతూ, 'వాళ్ళు ఒప్పుకున్నాక ఆలస్యం చేయొద్దులేయ్యా' అని అమ్మ అంది, ఇక్కడకొచ్చాక చెప్పొచ్చులే అని నీతో కూడా చెప్పలేదు" అని గొణిగాడు.

పర్లేదులే, చెప్పకపోతే ఏం.. పెళ్ళి చేసుకోవడానికి ఆ అమ్మాయి ఒప్పుకున్నప్పుడు ఆగడం మంచిది కాదు కూడా" అన్నాను.

"కనీసం నీకైనా చెప్పొచ్చుగా, మొన్నీ మధ్య కూడా వాళ్ళమ్మకి కంటి ఆపరేషన్ అని నీ దగ్గర డబ్బులు తీసుకున్నాడు" అంది వాణి.

ఏమోలేవే పాపం, నాకు చెప్తే అందరికీ చెప్పాలి, అదీగాక 'పెళ్ళి చేసుకోనుగాక చేసుకోను' అని నాతో వాదించిన వాడికి గిల్టీ ఫీలింగ్ ఉంటుంది కదా, అందుకు చెప్పి ఉండడు. ఎలాగోలాగా పెళ్ళి చేసుకున్నాడు, బంధువలమ్మాయే కాబట్టి బాగా చూసుకుంటుంది పాపం" అన్నాను.

మా అందరిలాగా అతనికీ తన కంటూ తన వాళ్ళుంటే మంచిదనీ, ఆ అవిటి కాలికి ఒక అండ ఏర్పడితే చాలునని ఆశించిన నేను చాలా సంతోషపడ్డాను.

సంతోషం ఎక్కువైపోయి మరింత అనురాగం, ఆపేక్ష చూపించడం, తన సంసారం ఏర్పరుచుకోవడానికి మళ్ళీ నన్ను డబ్బు సహాయం అడిగితే వాళ్ళింటికి వెళ్ళి మరీ ఇవ్వడం - ఇవీ నేను చేసిన తప్పులు.

'ఏదో' లేకపోతే ఎందుకు సహాయం చేసిందని వాళ్ళోళ్ళకి - కొత్తగా ఏర్పడిన బంధాలకి అనుమానం కలిగేట్లు చేసిన ఆ డబ్బు మంచి డబ్బు కాదు. అంతకు ముందు ఇచ్చిన వేలకు వేలు మంచివే మళ్ళీ.... అతనికి పెళ్ళయ్యాక ఇచ్చిన డబ్బు మాత్రం తప్పుడుదయింది.... నిందలు వేసింది.

ఇచ్చిన డబ్బు అంకెలు, ఫోన్ నంబర్ లోని అంకెలు కలగాపులగంగా చేరి మనశ్శాంతిని నాశనం చేస్తున్నాయి... తలకి ఒక ప్రక్కనుంచి ఏదో తెలియని నొప్పి వస్తున్నట్లుగా ఉంది. దిండుని ముఖం మీద వేసి వత్తుకున్నాను...


***

ఆరోజు “మా ఇంటికి రావొద్దు నీతూ, మా ఆవిడ చాలా బాధ పడుతోంది" అన్నాడు.

నాకర్థం కాలేదు, ఎందుకు బాధపడటం?” అన్నాను ఆశ్చర్యపోయి. అతను నాకు చెప్పలేక వాణికి చెప్పాడు.

ఆ తర్వాత జరిగిన వాదనలు, నిష్టూరాలు, వాణితో మధ్యరికాలూ - నాకవసరమా!!? ఎక్కడుంది తప్పు? ఆడ మగల మధ్యనున్న స్నేహంలో ఉందా తప్పు... కాదు. కానే కాదు - విశ్వాసావిశ్వాసాల మధ్య సాంగత్యంలో ఉంది. మంచితనాని్న అవసరాల కోసం వాడుకునే హీనత్వంలో, లేకితనంలో ఉంది.

"ఆ అమ్మాయి మనల్ని అలా అనుమానంగా చూస్తున్నప్పుడైనా వాళ్ళ గురించి అర్థం చేసుకోలేకపోయావ్, నేను చెప్తూనే ఉన్నాను విన్నావా! పాపం డబ్బులు లేకపోతే ఎట్లానే అనుకుంటూ సహాయం చేయడం నీ తప్పు" అని వాణితో కూడా చెప్పించుకోవలసి వచ్చింది. నా ఈగో దెబ్బ తిన్నా ఆమె అన్న మాటలు నిజమే కదా!?

ఎంత డబ్బు సహాయం చేశాను నీకు? ఇంత కృతఘ్నుడివా?” అన్నాను. గుండె మంట ఆ మాట నా చేత అనిపించింది.

"ఏమో ఎందుకిచ్చావో ఇచ్చావు. ఇవ్వలేదని నేననలేదే! నీ డబ్బు నీకు తొందరోలోనే ఇస్తాన్లెండి మా సంసారాన్ని ఇలా వదిలేయండి, నాశనం కాకముందే" అన్నాడు. ఏకవచనంతో మొదలైన సంబోధన ముగిసేప్పుడు బహువచనానికి మారింది.

అతనేమంటున్నాడో ఒక్క క్షణం అర్థం కాలేదు. అర్థమయ్యాక కాళ్ళూ చేతులూ వణికిపోయాయి. అతని భార్యకంటే నా గురించి తెలియదు కాని ఇతనేమిటి ఇలా అంటున్నాడు!? అంటే నేను ఇతని పట్ల చూపిస్తున్న ఆపేక్షకి ఇతను కూడా రంగులు పులుముకున్నాడా?

గుండె ఆగిపోతుందేమో అన్నంతగా బాధ.... మాటలు రాక మ్రాన్పడిపోయి అతని వైపు అలాగే చూస్తూ నిలబడ్డాను.

నోర్ముయ్, ఏం మాట్లాడుతున్నావు? నీ సంసారాన్ని ఎవరు చేస్తున్నారు నాశనం?” అంది వాణి కోపంగా.

"సారీ" అని గొణుక్కుంటూ వెళ్ళిపోయాడతను.

అతను వెళ్ళాక "ఏమిటిది నిత్యా, అతని భార్య వాగిన వాగుడికి ఇతన్ని కృతఘ్నుడు అనడం ఏమిటి నువ్వు?” అంది వాణి.

"అతను తన భార్యకి చెప్పుకోలేకపోతే 'తను మనల్ని అనుమానిస్తుంది, ఆమెకెట్లా చెప్పుకోవాలో నాకర్థం కావడం లేదు' అని చెప్పి ఉండాల్సింది. నేను అర్థం చేసుకుని ఉండేదాన్ని. నేను వాళ్ళ కాపురం నాశనం చేసేదాన్నా? ఏమనుకుంటున్నాడు వాణీ నన్నతనసలు? ఆ మాట అతని నోట్లో నుంచి రావొచ్చా" అన్నాను. ఏడుస్తున్న నన్ను వాణి సముదాయించింది.

అక్కడిక ఉండలేక రిజైన్ చేసేశాను. తర్వాత ఓ రెండు మూడు నెలల్లోనే వాణి కూడా సాఫ్ట్ వేర్ జాబ్ కి మారింది.

ఆ మాటని - నన్ను హతాశురాలిగా మార్చిన ఆ మాటని - నేను ఇంతవరకూ ధైర్యంగా ఎదుర్కోలేక పోయాను. ఈ జ్ఞాపకాన్ని ఎవరికీ చెప్పుకోలేక, లోలోపల దాచిపెట్టి దాని అంతు తేల్చుకోలేకపోయాను. నా చుట్టూ ఒక షెల్ ఏర్పరుచుకోని బయటికి రాలేకపోతున్నాను. స్నేహ బంధపు విలువలని అనుమానిస్తున్నాను.


***


చెయ్, ఆ నంబర్ డయల్ చెయ్! మూసిన ద్వారాన్ని బద్దలు కొట్టు. ఈ అంకెలే తాళపు చెవులు. వెళ్ళు.... కొంచెం దూరమే.... నీకూ, అదిగో ఆ టేబుల్ మీద పెట్టిన ఫోన్ అందుకోవడానికీ దూరం అతి దగ్గరే.... నీకు 'కావలసినది' దొరకడానికీ, 'వద్దనుకున్నది' పోవడానికీ నిమిషమే పట్టేది....

లోపల నుంచి చెప్తోన్న గొంతుని అదిమిపట్టి ఒక్కసారిగా లేచి సెల్ ని అందుకున్నాను.

నాలో ఏదో నమ్మకం - రాబోయే ఘర్క్షణ ఏదో ఉంటుందన్న నా అనుమానం తప్పనీ, ఒక వేళ ఉన్నా దాని తాలూకు ఏ ఆందోళనా నాలో ఉండదనీ, మానవత్వం ఉన్న మనిషిగా 'అడిగిన వారికి సహాయం అందించే' నిశ్చలతా, 'మనుషుల పట్ల నమ్మకాన్ని పోగొట్టుకోకూడదనే స్థైర్యం, విశ్వాసం' మరింతగా నాలో కలుగుతాయనీ....

ఒక్కో నంబరే డయల్ చేయసాగాను.

ఏం మాట్లాడతాడు ఇన్నేళ్ళ తర్వాత!? 'జరిగిన దానికి క్షమాపణలు' అంటాడా? అసలు వాటిని నేను ఆశిస్తున్నానా? నేను ఉద్యోగం మానేసిన రోజు ఫోన్ చేసి అతనిచ్చిన ఎక్స్ ప్లనేషన్ లూ, మొహమాటపు సమాధానాలూ - ఇవన్నీ సమసిపోయి, మౌనంలో కలిసిపోయాక – మళ్ళీ ఏ క్షమాపణలు మా స్నేహాన్ని నిలుపుతాయి? మళ్ళీ కొత్త ప్రారంభానికి ఏ మాటలు తోరణాలుగా నిలుస్తాయి? ఏ ధ్వనులు మానసిక తంత్రుల్ని మీటుతాయి?

నంబర్ కలిసింది. బీప్.. బీప్.. బీప్.. అని మో్రగి మ్రోగి నా ఆలోచనల తెరల్ని అమాంతం క్రిందికి జారే్చస్తూ ఒక స్వరం చెప్పింది.

..............”

వింటూ నవ్వాను - మొదట పెదవులు విచ్చుకునేట్లు... తర్వాత పెద్దగా... అ తర్వాత విరగబడి - నైరూప్య చిత్రాల రహస్యాలు చిద్రమయ్యేట్లు.....



***


వంటింట్లో పని చేసుకుంటున్న రంగమ్మ నా గది వాకిట్లోకొచ్చి నిలబడి నవ్వుతున్న నన్ను ఆపేక్షగా చూస్తూ తను కూడా నవ్వుకుంటోంది.

"రంగమ్మా నీ మనవడిని కాలేజీలో చేర్చడానికి డబ్బు కావాలని అడిగావుగా, ఎంత కావాలి?” అన్నాను.

నన్ను డబ్బులు మాత్రం అడగొద్దు అని నాలుగు రోజుల క్రితమే అంతలా విసుక్కున్న నేను 'ఎంత కావాలి?' అని అడుగుతుంటే ఆశ్చర్యంగా చూస్తూ "రెండేలమ్మా, నెల నెలా జీతంలో రెండేసొందలు పట్టుకుందువు గాని" అంది.

"అలాగేలే, సాయంత్రం వెళ్ళేప్పుడు తీసుకెళ్ళు" అన్నాను.

ఆనందంగా నవ్వుతున్న రంగమ్మని చూస్తుంటే నా మనసు తేలిగ్గా ఉన్నట్లనిపించింది.


*******

Tuesday, June 16, 2015

చైల్డ్ లేబర్

ప్రజాశక్తి - సోపతిలో ప్రచురణ
- రాధ మండువ


రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వచ్చిన తర్వాత ప్రైవేట్ స్కూలు టీచర్లు కూడా బి.ఇడి చేయాలానే రూల్ ని పెట్టింది ప్రభుత్వం.

మాదో ప్రముఖ ప్రైవేట్ స్కూల్. బి.ఇడి క్వాలిఫికేషన్ లేకుండా స్కూల్లో పని చేసే టీచర్లు - రెగ్యులర్ ఎంప్లాయీస్ అందరూ ఇగ్నోలో దూరవిద్యలో చేరారు. గౌరవ వేతనంతో వాలంటీర్ గా రోజుకి ఒకటి లేదా రెండు క్లాసులు చెప్తాను కాబట్టి నేను కాలేజీలో చేరి చదువుకోవచ్చు కదా అనిపించింది. ప్రయాణాలంటే నాకు ఇష్టం లేకపోయినా రోజూ కాలేజీకి వెళ్ళి చదువుకుంటే కాస్త బుర్రని పదును పెట్టుకోవచ్చు అని ఆ నిర్ణయం తీసుకున్నాను.

ఒక్క సంవత్సరం కాలేజీ భాగ్యానికి స్కూటర్ కొనుక్కోవడం ఎందుకు? పోనీ ఎలా వెళితే మంచిది లాంటి తర్జనభర్జనలు విన్న మా పని అమ్మాయి సుశీల "మా తమ్ముడు మల్లి ఆటో తీసుకున్నాడక్కా..... వాడికి చెప్తాను రోజూ మిమ్మల్ని కాలేజీకి తీసికెళ్ళమని" అంది.

అదేమిటీ మల్లి ఆర్టిస్ట్ కదా! బోర్డులు రాయడం లేదా?” అన్నాను.

ఆ పని ఎప్పుడూ ఉండదుగా అక్కా!.... వాడికి బోర్డులు రాసే పనో, బొమ్మలు వేసే పనో వచ్చినపుడు వాడి బావమరిది గాని మా మామ గాని ఆటో నడుపుతారు" అంది. సరే ఇకనేం అనుకుని మల్లి ఆటో మాట్లాడుకున్నాను. దాదాపు ఏడెనిమిది కిలో మీటర్లున్న కాలేజీకి తీసుకెళ్ళి వదిలేయడం, మళ్ళీ సాయంత్రం కాలేజీ వదిలేసే సమయానికి అక్కడనుండి తీసుకురావడం - దీనికి రోజుకి ఎనభై రూపాయలు ఇమ్మని అడిగాడు.

అలా కాదులే మల్లీ.... నాకు కూడా భారం కాకుండా ఉండటానికి ఒక ఉపాయం చెప్తాను. నువ్వు నడిపేది షేర్ ఆటోనే కదా! వెళ్ళే దారిలో నాతో పాటు ఎవరైనా ఆపితే ఎక్కించుకుని వాళ్ళ దగ్గర ఛార్జీ తీసుకో. ఎవరూ రాని రోజు ఎనభై ఇస్తాను. వస్తే మాత్రం వాళ్ళిచ్చింది తగ్గించి తీసుకో" అన్నాను.

సరే అక్కా!” అన్నాడు నవ్వుతూ.

ప్రతిరోజూ ఉదయం మా స్కూల్లో నాకున్న ఒక్క క్లాసునీ తీసుకున్నాక స్కూలు గేటు ముందుకే ఆటో వచ్చేది. దారిలో చాలా మంది ఎక్కేవారు. మల్లి ఎడమ చేత్తో ఆటోను నడుపుతూ కుడి చేయిని వెనక్కి ఉంచేవాడు. అందరూ గబగబా ఛార్జీ డబ్బులు అతని చేతిలోకి వేసేసేవారు. కొంత మంది నోట్లు ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఎంతిచ్చారనైనా కూడా చూడకుండా డాష్ బోర్డుకు కట్టిన సంచీలో వేసేవాడు. నోట్లు ఇచ్చిన పాసింజర్లు దిగాక తమకు రావలసిన చిల్లర అడిగి తీసుకునేవారు. వాళ్ళెంత అడిగితే అంత సంచీలో నుంచి తీసి ఇచ్చేవాడు. ఇదంతా చూస్తున్న నాకు మొదట్లో భలే ఆశ్చర్యం వేసేది. ఎవరైనా మోసం చేస్తారేమోనని అందరినీ జాగ్రత్తగా గమనించేదాన్ని.

ఏ రోజూ కూడా ఎవ్వరూ కూడా అతనికి డబ్బులు ఇవ్వకుండా ఉండటం కాని చిల్లర తీసుకునేప్పుడు ఎక్కువ తీసుకోవడం కాని జరగలేదు. ఆటోలో ఎంతమంది ఎక్కారో లెక్క వేసుకునే వాడేమో అంతమంది ఇచ్చిన డబ్బులు తగ్గించి మిగతాది నా దగ్గర తీసుకునేవాడు. పాసింజర్స్ నీ, నిదానంగా జాగ్రత్తగా ఆటోను నడిపే మల్లినీ, అతని ప్రశాంతతని గమనిస్తూ ఉండటం వల్లనేమో నాకు ప్రయాణం చేస్తున్నంత సేపూ హాయిగా ఉండేది.

దారిలో రెడ్ సిగ్నల్ పడితే ఆగినప్పుడూ, పాసింజర్స్ ని దించడానికి స్టాఫ్ దగ్గర ఆగినప్పుడూ పళ్ళు, తినుబండారాలు అమ్ముకునే వాళ్ళు మా ఆటో దగ్గరకి చేరి కొనమని వేధించేవారు. మల్లి రేర్ వ్యూ అద్దం లోంచి వెనక్కి చూసేవాడు. ఎవరైనా కొనండన్నట్లు ఉండేవి అతని చూపులు. ఎవరైనా కొంటే సరే లేకపోతే తనే కొనేవాడు. మొదటి నాలుగైదు రోజులూ అది గమనించిన నేను పాపం మల్లికెందుకు ఖర్చు అని నాకు అవసరమున్నా లేకపోయినా కొనడం మొదలుపెట్టాను.

చిన్నపిల్లలు వస్తే మాత్రం కొనేదాన్ని కాదు. పైగా చదువుకోవాల్సిన అవసరం గురించి స్కూల్లో చేరడం గురించి గట్టిగా చెప్పేదాన్ని. వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళకున్న బాధలు చెప్పి కొనమని వాళ్ళెంత అడుక్కున్నా కొనేదాన్ని కాదు. “అబద్ధాలాడకండి, ఈసారి కనపడ్డారంటే పోలీసులకి చెప్తాను" అని బెదిరించేదాన్ని. మరీ కొంతమందిని వాళ్ళ గడ్డాలు పట్టుకుని అబ్బాయిలైతే "స్కూలుకెళ్ళాలి నాయనా" అనీ అమ్మాయిలైతే "తల్లీ" అనీ బతిమాలుకునేదాన్ని.

మల్లి నవ్వుకునేవాడు నా తాపత్రయాన్ని చూసి. సంచిలోంచి డబ్బులు తీసి తను కొనుక్కుని, వాళ్ళని పంపించేవాడు. “అలా కొనొద్దు మల్లీ! ఇలా చేస్తే వాళ్ళు ఇక స్కూలుకెళ్ళరు" అని మల్లిపై కోప్పడితే 'మా వాడికి ఈ పిప్పరమెంట్లు ఇష్టం లేక్కా!' అనో 'జామకాయలు మా ఆవిడకి ఇష్టమ'నో ఏదో ఒకటి చెప్పేవాడు.

సంవత్సరం ఎలా గడిచిపోయిందో తెలియకుండానే పరీక్షలు దగ్గరకొచ్చేశాయి. రికార్డులు రాసేప్పుడు మల్లిని బొమ్మలు గీసివ్వడం, హెడ్డింగ్ లు అందంగా రాసివ్వడం లో సహాయం అడగడానికి అతని ఇంటికి వెళ్ళాను. మల్లి భార్య ఇంటిని చక్కగా తీర్చిదిద్దుకుంది. మల్లి గీసిన చిత్రాలు గోడల మీద వేళ్ళాడుతున్నాయి. అతని కొడుకు కూడా ముచ్చటగా ఉన్నాడు. పక్కనే సుశీల ఇల్లు. ఇంట్లో మొగుడు సారాయి తాగి పడి ఉన్నాడంట. నన్ను తన ఇంటికి పిలవడానికి మొహమాట పడింది.

మల్లి నాకెంతో మర్యాద చేశాడు. బొమ్మలు గీసివ్వడమే కాకుండా ఆ పూట ఆసక్తిగా అన్ని విషయాలూ అడిగి తెలుసుకుని తనే బి.ఇడి చేసినంత ఆనందపడ్డాడు.

ఎగ్జామినేషన్ సెంటర్ గా మదనపల్లి బిటి కాలేజీ పడింది. మల్లి "పర్వాలేదక్కా నేను తీసుకెళతాగా" అన్నాడు.


2.

ఆరోజు మొదటి పరీక్ష రోజు. పెందరాడే బయలుదేరాం. వరసగా పాసింజర్స్ ని ఎక్కించుకుంటున్నాడు. దిగేవాళ్ళు దిగుతుంటే ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారు. అంగళ్ళు దగ్గర ఉన్న మా కాలేజీని దాటింది ఆటో. చేనేతనగర్ దగ్గరకు రాగానే సిగ్నల్ పడింది.

పదికి రెండు పదికి రెండు" అంటూ ఓ అమ్మాయి జామకాయలు పట్టుకుని వచ్చింది. ఆటోలో నేను, నా కుడి ప్రక్కన నలుగురైదుగురు కూర్చుని ఉన్నారు. నేనేదో చదువుకుంటూ ఆ అమ్మాయిని పట్టించుకోలేదు. యధాప్రకారం ఎవరైనా కొన్నారా లేదా అని గమనించిన మల్లి గ్రీన్ లైట్ పడ్డా కూడా పట్టించుకోకుండా గభాల్న సంచీలోంచి పది రూపాయలు తీసి రెండు జామకాయలు కొని ఆ తర్వాతే బయలుదేరాడు.

నాకు భలే కోపం వచ్చింది మల్లి పైన, కాని నా పరీక్షల ఆందోళనలో ఉన్న నేను పరీక్ష అయ్యాక అతనితో ఈ విషయం గురించి సీరియస్ గా మాట్లాడాలనుకున్నాను. ఎన్ టి ఆర్ సర్కిల్ దగ్గరకొచ్చేటప్పటికి ఎదురుగ్గా ఎల్లో సిగ్నల్ కనిపిస్తోంది. వేగంగా వెళ్ళాలని మల్లి ప్రయత్నించినా రెడ్ సిగ్నల్ పడనే పడింది.  
అబ్బా!” అన్నారు ఆటోలు ఉన్న నలుగురూ మల్లితో సహా. ఇక అక్కడ కనీసం ఐదు నిమిషాలైనా ఆగాల్సిందే.

ఈ సొసైటీ కాలనీలోంచి పోనిద్దామన్నా వీలు లేకుండా ఉందే" అంటా ప్రక్కకి తిరిగి చూశాడు మల్లి. చూస్తున్న అతను ఒక్కసారిగా "ఏయ్!” అన్నాడు. ఏమిటోనని కంగారుగా నేను వంగి అటువైపు చూశాను.

ఆ పిల్లవాడికి పన్నెండు పదమూడేళ్ళుంటాయేమో.... ఆగి ఉన్న కార్ల అద్దాల మీద కొట్టి అడుక్కుంటున్నాడు. కారు అద్దం కిందికి దిగడం, ఆ అబ్బాయి చేతిలో చిల్లర పడటం కనిపించింది.

ఏయ్" ఈసారి ఇంకా కోపంగా అరిచాడు మల్లి. ఎప్పుడూ కోపంతో వినని అతని గొంతు కొత్తగా అనిపించి అతని వైపు ఆశ్చర్యంగా చూశాను. కోపం వల్లనేమో అతని దవడ ఎముక బిగుసుకుపోయి ఉంది.

ఛీ! ఛీ! గవర్నమెంట్ వీళ్ళ కోసం ఎంత చేస్తున్నా బుద్ధి లేదు. చిన్నప్పటి నుంచీ డబ్బులు సంపాదించడం అలవాటయితే ఇక స్కూళ్ళకెందుకు వెళతారు?” అన్నాను విసుగ్గా.

మల్లి విసురుగా తల తిప్పి ఎడమ భుజం మీదుగా నన్ను చూశాడు. అతని చూపులోని తీవ్రతకి నా నోరు మూత పడింది కాని నా అహం బుస్సున పైకి లేచింది. 'టీచర్ నన్న భయం, గౌరవం లేకుండా నా వైపు కోపంగా చూస్తున్నాడే' అనే భావన నాలో. “ఏంటి మల్లీ....” ఇంకా ఏమనేదాన్నో కాని నా మాటలను వినిపించుకోకుండా డబ్బుల సంచిలో చెయ్యి పెట్టి చేతికొచ్చినంత డబ్బు తీసుకోని ఆటో ఇంజన్ ఆపి ఆ పిల్లవాడి వైపు పరిగెత్తాడు.

అందరం మల్లి వెళ్తున్న వైపు చూడసాగాం. నేను బాగా వంగి గమనించసాగాను. ఆ అబ్బాయికి దగ్గరగా వెళ్ళిన మల్లి వాడి చేయి పట్టి లాక్కుని మా ఆటోకి కుడి వైపునున్న భవానీ స్టోర్స్ లోకి తీసికెళ్ళాడు.

గ్రీన్ సిగ్నల్ పడింది. చెవులు బద్దలయ్యేట్లు హారన్లు మోగిస్తూ మా ఆటోని దాటుకుని కార్లు, ఆటోలు, బైక్ లు వెళుతున్నాయి. నేను దిగి ఆటోకి ప్రొటెక్షన్ అన్నట్లుగా డ్రైవర్ సీట్ దగ్గర నిలబడి చేతులూపుతూ సైడ్ తీసుకోని వెళ్ళమన్నట్లుగా సైగలు చేయసాగాను. ఆటో లోపలున్న నలుగురు ఆడవాళ్ళూ కలగాపులగంగా మాట్లాడుకుంటున్నారు.

కాసేపటికే గబగబా వస్తున్న మల్లి. అతని వెనుక యాభై పాపిన్స్ పాకెట్స్ ఉండే అట్ట పెట్టెని గుండెలకి ఆనించుకుని అపురూపంగా పట్టుకుని ఆ బాబు.

మల్లిని చూసిన నేను నా సీట్ లోకి వెళ్ళి కూర్చున్నాను. “ఇవి అమ్మేసెయ్. సరుకు అయిపోతూ ఉండగానే మళ్ళీ అక్కడికే వెళ్ళి సరుకు తీసుకో. లాభం డబ్బులే ఇంటికి తీసుకెళ్ళు సరేనా?” అని అతని తల నిమిరి ఆటో ఎక్కాడు మల్లి.

నేను తలవంచి ఆ ఇద్దరినీ చూస్తున్నాను. “సరే అన్నా" అంటూ తల ఊపుతున్న ఆ బాబు కళ్ళల్లోని నీటి పొర నా దృష్టిలో పడింది. నాలోని అహం ఆ నీటితో తడిసి ఆర్ద్రమైంది కాని లోపల గుండెనెవరో మెలి పెట్టేసినట్లు బాధ.

ఆ బాబుని దాటుకోని ముందుకి దూసుకుపోయిన ఆటో గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఆగింది. "ఆటోని అట్లొదిలేసి పోతే ఎట్లప్పా” అని మల్లితో మాట్లాడుతున్న నలుగురూ దిగారు. వాళ్ళు దిగాక కొంచెం ముందుకు పోయి బిటి కాలేజీ వైపుకెళ్ళడానికి మలుపు తిరిగింది. దూరంగా కాలేజీ గేట్ కనిపిస్తోంది. అప్పుడన్నాను "మల్లీ! నువ్వు చేసింది చాలా తప్పు.... చిన్నపిల్లల చేత పని చేయించడం చాలా చాలా తప్పు" అని.

అప్పటికే గేటు దగ్గరకి చేరాము. అమర్ బుక్ స్టాల్ కి ప్రక్కగా ఆటోని సైడ్ కి తీసి ఆపి వెనక్కి నా వైపుకి తిరిగి చూస్తూ "అక్కా! మీరు పెద్ద పెద్ద చదువులు చదువుకున్నోళ్ళు, గొప్పోళ్ళు. ఇళ్ళల్లో ఎంత పేదరికం ఉంటే బడికి పోకుండా పిల్లలు పనులు చేసుకుంటున్నారో మీకేం తెలుసు? చెప్పినా మీరు నమ్మరు. మనుషుల మీద ఉండాల్సింది నమ్మకం అక్కా! ఇందాక 'డబ్బులకలవాటయ్యారని' ఆ అబ్బాయిని మీరు ఎంత అసహి్యంచుకున్నారు?” అన్నాడు. అతని గొంతులో ఆవేదన.

నిజమే మల్లీ, తప్పుగా అనుకోకు. ఆ అబ్బాయి అడుక్కుంటున్నాడన్న కోపంతో అన్నాను. కాని నీకు తెలుసా మల్లీ! పేదరికం వల్ల చైల్డ్ లేబర్ ఉంది అని అందరూ అనుకుంటారు కాని చైల్డ్ లేబర్ వల్లే చాలా వరకు పేదరికం ఉంది, ఉంటుంది - ఆలోచించు" అన్నాను.

ఏమిటీ!!? నాకర్థం కావడం లేదు మీరేమంటున్నారో" అన్నాడు.

అతనికి ఎలా చెప్పాలో ఒక్క క్షణం అర్థం కాలేదు. ఆశ్చర్యంగా, తెలుసుకోవాలన్న ఆసక్తితో చూస్తున్న మల్లితో "చదువుకున్న నువ్వెలా ఉన్నావో, చదువులేని మీ అక్క జీవితం ఎలా ఉందో కాస్త ఆలోచించు. నువ్వే సత్యాన్ని తెలుసుకుంటావు" అన్నాను.

నా మాటలకి ఇంకా అలాగే చూస్తున్న మల్లిని ఆలోచనల్లోనే వదిలి నేను ఆటో దిగి గేటు వైపు నడుస్తుండగా కైలాష్ సత్యార్థి నా ప్రక్కనే ఉన్నట్లనిపించింది. నా కళ్ళ నిండా కన్నీళ్ళు చేరాయి.

సత్యార్థీ! మేధతో, సమాజ శ్రేయస్సుతో నేనతన్ని జయించగలిగినా హృదయంతో ఆలోచిస్తే 'ఈ క్షణంలో ఉన్న సమస్య'కి పరిష్కారం చూపగలిగిన అతను నన్ను జయించినట్లే అనిపించడం లేదూ!!?” అన్నాను.

కన్నీళ్ళ వల్ల చెరిగిపోయిన అతని రూపు ఏదో చెప్తూ మాయమైపోయినట్లయింది. వినాలని గబగబా కళ్ళు తుడుచుకుంటూ వేగంగా నడుస్తున్న నన్ను చూసిన గేట్ మెన్ 'కాలేజీ' గేటుని బార్లా తెరిచాడు.





*******