Wednesday, June 15, 2016

మృత్యువూ-మహాదృశ్యమూ


నీ కోసం వచ్చే దారిలో
ఓ చిన్నిమొక్క నవ్వుకుంటూ
తన మీద వాలిన పక్షిని పట్టుకుని ఉంది

ఆకాశం నిర్మలమై తననుండి విడివడి
సాగిపోతున్న నల్లమబ్బులను తదేకంగా చూస్తోంది


అప్పుడే నిద్ర లేచిన ఉదయం
ఏకాగ్రతగా చల్లదనానికి వెచ్చని రంగులద్దుతోంది
పారుతున్న ఏరు నాలోకి తొంగిచూసి
మరొకటేదీ కానరానివ్వకుండా హత్తుకుంటోంది

నాకెదురు రారాదూ!
మీ ఊరి వరకేలే నడుద్దాము
భళ్ళున పగిలిన గాజు ముక్కలను
ఒక్కోటీ ఏరుకుని పారవేద్దాము

ఒకరితో ఒకరం మమేకమయే ఆ సమయంలో
మాటలని గంపలుగా చేసి దొర్లించొద్దు సుమా!
సందేహాల తెరల్లో ఊరికినే కదిలిపోయి
కలల సౌధాన్ని ముక్కలు చేసీ విసరొద్దు!!

నీకో రహస్యం చెప్పనా!?
సాయంత్రం వరకూ నడిచాక
చివరి చీకటి దారి ఒంపు దాటాక
నక్షత్రకాంతిపువ్వులను చూశాక
నీకో విషయం తెలుస్తుంది -

జీవితంలో నిశ్చలమై కదులుతున్న మృత్యువూ
లోతైన శా్వసలోని సమస్తవర్ణాలసమ్మిళిత మహాదృశ్యమూ
ఇక్కడే పక్కపక్కనే చేరి దర్శనమిస్తాయని!!!

*****
- రాధ మండువ

మూడు లడ్లు - నాటకం



వచ్చే మంగళవారం ఏడో తరగతి పిల్లల చేత వేయిస్తున్నా ఈ నాటకం. చదవండి ఫ్రెండ్స్... టీచర్లూ మీరు మీ పిల్లల చేత వేయించొచ్చు ఈ నాటకం. ఇలా ఓ ఇరవై నాటకాల దాకా రాశాను. చిన్నగా టైప్ చేసి మీతో షేర్ చేసుకుంటాను. :)

//మూడు లడ్లు (పిల్లల కోసం హాస్య నాటకం)// - సి్క్రప్ట్ - రాధ మండువ

రంగం - 1
*********
సుధక్కా! ఓ సుధక్కా!

ఆఁ ఎవరూ.... రమా.... రా రా లోపలకి రా!

కమ్మని వాసన బయటకి వస్తోంది. లడ్లు చేస్తున్నట్లున్నావుగా?

అవును రమా! పండక్కి నువ్వేం చేస్తున్నావ్?

అరిశలు చేశాను. కొన్ని లడ్లు కూడా చేస్తే బావుంటుందని చూస్తే ఇంట్లో యాలక్కాయలు లేవు. నాలుగు యాలక్కాయలుంటే ఇస్తావని వచ్చా!

అవునా! రా వంటింట్లోకి. ఇస్తా. (డబ్బాలోంచి తీసి) ఇవిగో.

సరే వస్తా సుధక్కా చాలా పని ఉంది.

అలాగే

బయట పిసినారి శీనయ్య ఇంటి లోపల నుండి వచ్చే లడ్ల వాసన పీలుస్తా సుధ ఇంటి ముందు నిలబడి ఉంటాడు. యాలక్కాయలు తీసుకోని బయటకి వచ్చిన రమ శీనయ్యని చూసి

ఏంది శీనయ్యా... తెగ గాలి పీలుస్తున్నావ్?

మంచి లడ్లు వాసన వస్తుంటేనూ...

(వెటకారంగా) ఈ పండక్కన్నా ఏవైనా చేసుకుంటారా? లేకపోతే ఇలా గాలి పీల్చేసి చాల్లే అనుకుంటావా?

అంటూ ఒక వైపుకు వెళ్ళిపోతుంది. శీనయ్య మరో వైపుకి వెళతాడు.

రంగం - 2
*******

శీనయ్య భార్య కాంతమ్మ ఏదో వంట పనిలో ఉంటుంది

ఏమే! ఏమేవ్!

ఆఁ ఏందీ? (అక్కడే కూర్చుని నిర్లక్ష్యంగా)

పండక్కి ఊళ్ళో అందరూ పిండివంటలు చేసుకుంటున్నారు.

ఆఁ

మనం కూడా చేసుకుందామా?

గబుక్కున లేచి శీనయ్య దగ్గరకి గబగబా వచ్చి వేగంగా తలాడిస్తూ...

ఆఁ ఆఁ ఆఁ చేసుకుందాం. చేసుకుందాం

ఏం చేసుకుందాం, లడ్లు చేసుకుందామా?

ఆఁ మీ ఇష్టం. ఏదైనా సరే.

సరే అయితే లడ్లు చేసుకోవాలంటే ఏమేం సామాన్లు కావాలో చెప్పు. రామయ్య కొట్టుకెళ్ళి తెస్తాను.

(కాంతమ్మ వేగంగా) కిలో శనగపిండి, కిలో చక్కెర, లీటరు నూనె, యాలక్కాయలు, జీడిపప్పు, కిస్ మిస్... నెయ్యీ...

ఉండవే ఉండు... (పేపర్ పెన్నూ తీసి రాసుకుంటా) ఇప్పుడు చెప్పు - నిదానంగా చెప్పు.

కాంతమ్మ నిదానంగా ఒక్కొక్కటే మళ్ళీ చెప్తుంది. శీనయ్య రాసుకుంటాడు. కాంతమ్మ కొంచెం లోపలకి పోయి అక్కడున్న పెద్ద సంచి, ఒక స్టీలు డబ్బా తెచ్చి డబ్బాని సంచిలో వేస్తూ

ఇదిగోండి సామాన్లన్నీ ఈ సంచిలో వేసుకోండి. నూనె ఈ డబ్బాలో పోయించుకు రండి.

అలాగే (వెళ్ళిపోతాడు)

రంగం - 3
*******

రామయ్య కొట్టు. అన్నీ సర్దుకుంటూ ఉంటాడు.

రామయ్యా! మేము పండక్కి లడ్లు చేసుకుంటున్నాం.

(రామయ్య ఆశ్చర్యపోతూ) మీరా!!? లడ్లా!!!!?

అవును. సామాన్ల కోసం వచ్చా.

సరే ఏం కావాలి?

కిలో శనగపిండెంత?

యాభై రూపాయలు

యాభై రూపాయలా!!? సరేలే ఈ ఐదు రూపాయలకి పెట్టు.

ఐదు రూపాయలకి ఎట్లా వస్తుందయ్యా?

ఎంతొస్తే అంత పెట్టు.

అహ! కుదరదు ఐదు రూపాయలకి ఏమీ రాదు.

సరే అయితే పది రూపాయలకి పెట్టు

(రామయ్య పొట్లంలో రెండు మూడు గుప్పిళ్ళు వేసి పొట్లం కట్టి) ఊ! ఇదిగో

(శీనయ్య శనగపిండి పొట్లాన్ని సంచీలో వేసుకుని పది రూపాయలు ఇచ్చి ) కిలో చక్కెర ఎంత?

నలభై రూపాయలు

ఇదేందయ్యా ఏదడిగినా నలభై, యాభై అంటావూ.... సరే రెండు రూపాయలకి పెట్టు

ఏందయ్యో నాతో తమాషాలాడ్డానికి వచ్చావా పొద్దున్నే. రెండు రూపాయలకి పిల్లోళ్ళు తినే పిప్పరమెంటు గూడా రాదు

సరే పోన్లే ఈ ఐదు రూపాయలకి పెట్టు. (కోపంగా డబ్బు నాణాలను లెక్కపెట్టి రామయ్యకి ఇస్తాడు)

(రామయ్య ఖర్మ ఖర్మ అని గొణుక్కుంటా చక్కెర పొట్లం కట్టి ఇచ్చి) ఇంకా ఏం కావాలి?

(శీనయ్య లిస్ట్ బయటకి తీసి చూసుకుంటా) శనగపిండి కొన్నాను, చక్కెర కొన్నాను. లీటరు నూనె... రామయ్యో లీటరు నూనె ఎంతయ్యా?

నూరు రూపాయలు

నూరా? ఇరవైకి పొయ్యి. ఇదిగో డబ్బా

(రామయ్య - ఇంతోటి నూనెకి డబ్బా చూడు ఎంతుందో అని గొణగుతూ) అమ్మో పొద్దున్నే భలే బేరం దొరికింది. రోజూ నీలాంటి వాళ్ళు వస్తే బేరం అయినట్లే... ఇందా నూనె.

ఆ... అదీ... ఇదిగో ఇరవై. ఇంకా ఏం కొనాలి .. యాలకలు, జీడిపప్పు, కిస్ మిస్ .... వద్దులే... అయ్యన్నీ లేకపోయినా లడ్లు బాగానే ఉంటాయిలే.. ఈ చివరిదేందబ్బా నెయ్యి... అమ్మో నెయ్యి ఖరీదు గదూ ... అస్సలొద్దు. సరే రామయ్యా వస్తా... (వెళ్ళిపోతాడు)

రంగం - 4
*******

కాంతమ్మ ఏదో గిన్నె కలబెట్టుకుంటూ ఉంటుంది.

ఏమేవ్!

ఆఁ ఆఁ వచ్చారా? తెచ్చారా?

ఆఁ ఇదిగో సంచి.

(కాంతమ్మ సంచిలోపలకి తల పెట్టి చూసి తలని బయటకి తీసి సంచి తెరిచి అతనికి చూపిస్తూ) ఇంతేనా?

ఆఁ అంతే

వీటికి ఎన్ని లడ్లు వస్తాయయ్యా?

ఎన్నొస్తే అన్ని చెయ్యి. అదిగో ఆ పొట్లాలు కట్టిన పేపర్లు ఇటియ్యి ఏం రాశారో చదువుకుంటా.

(కాంతమ్మ శనగపిండి, చక్కెర గిన్నెల్లోకి వేసి పేపర్ తెచ్చి) ఇవిగో పేపర్లు... చదువుకో...

(శీనయ్య పేపర్ చదువుతా) మదనపల్లిలో బస్సు కింద పడి ఇద్దరి మృతి.... అబ్బబ్బ ఎప్పుడు చావు వార్తలే.. ఇంతోటి దానికి పేపరెందుకు కొని చదవడం ఈ జనం!? ఆఁ ఏమేవ్ అయ్యాయా?

అప్పుడే ఎలా అవుతాయీ! పిండి కలుపుతున్నా.. నూనె కాగుతోంది

(శీనయ్య పేపర్ ని వెనక్కి తిప్పి) పిసినారి పుల్లయ్య సినిమా వంద రోజులు... అహహ... సినిమాలు ఎందుకు చూడటం డబ్బు దండగ.... ఏమేవ్ అయిందా?

ఆఁ ఆఁ అవ్వొచ్చె అవ్వొచ్చె

(శీనయ్య మరో పేపర్ ని తీసి) ఆడవారి చైన్లు లాగాక రైలు చైన్ లాగి దర్జాగా దిగి వెళ్ళిపోయిన దొంగ.... ఆడవాళ్ళకి చైన్లు ఉంటాయి సరే.... రైళ్ళకెందుకు చైన్లూ...... ఏందో... ఏమోలే మనకెందుకు? ఏమేవ్ అయినయ్యా?

ఆఁ అయ్యాయి.

ఆఁ అయినయ్యా? (ఒక్కసారిగా గబుక్కున లేచి) ఇటు తీసుకురా ఇటు తీసుకురా

(కాంతమ్మ మూడు లడ్లున్న ప్లేట్ తీసుకుని వచ్చి) మూడు లడ్లు అయ్యాయి.

ఆ!! మూ....డు అయినయ్యా... అబ్బ!! నాకు రెండు ఇటిచ్చి నువ్వొకటి తిను.

(కాంతమ్మ కోపంగా) అదేం. మీకు రెండేమి నాకు ఒకటేమి?

నేను రామయ్య కొట్టుకెళ్ళి సామాను తెచ్చాను కాబట్టి నాకు రెండు అన్నాను తప్పా?

నేను రెక్కలు పోయేట్లు పిండి కలిపాను లడ్లు వత్తాను కాబట్టి నేనే రెండు తీసుకోవాల

అదేం కుదరదు నాకు రెండు నీకొకటి

అహ! నాకు రెండు మీకొకటి

నాకు రెండు నీకొకటి.

అహ నాకు రెండు మీ కొకటి (కాంతమ్మ పెద్దగా అరుస్తుంది)

సరే సరే అరవగాకు. నేనొకటి చెబుతా విను

ఏందీ... మీరు చెప్పేదీ...

మనిద్దరం ఒక పందెమేసుకుందాం. పందెంలో గెలిచిన వారికి రెండు లడ్లు ఓడినవారికి ఒక లడ్డు.

ఏమిటా పందెం?

ఈ లడ్ల ప్లేటుని మధ్యలో పెట్టుకుని ఇద్దరం కదలకుండా పడుకుందాం.... కదలకుండా పడుకోవాల.

ఊఁ

ఎవరు ముందు కదిలితే వాళ్ళు ఓడిపోయినట్లు

సరే అయితే... నేనసలు కదలనే కదలనుగా (నడుము ఊపుతూ కాంతమ్మ అంటుంది)

చూద్దాం!

ఆఁ చూద్దాం!

తలుపులు వేసేసి లడ్ల ప్లేటును ఇద్దరి మధ్యలో పెట్టుకుని పడుకుంటారు

రంగం - 5
*******

రాత్రంతా అలాగే పడుకున్నారు. తెల్లవారుతుంది.

(పాలు పోసే గోపాలం వీధిలో అరుస్తూ) “పాలమ్మా పాలూ.... పాలు పాలూ .... పాలు పాలూ... (వీళ్ళింటి తలుపు కొడుతూ) ఓ శీనయ్యో పాలయ్యా... పాలు పాలూ... అబ్బబ్బ ఈయన పోయించుకునే పావుగిద్ద పాలకి ఎంత సేపు చేస్తాడో... ఏమయ్యో శీనయ్యో, ఏమమ్మా కాంతమ్మా.... కాంతమ్మో... ఎవరూ పలకడం లేదే .. ఏమోలే (పాలమ్మా పాలూ అనుకుంటా వెళ్ళిపోతాడు)

(వీధిలో కూరగాయల సరోజ) వంకాయలు, బెండకాయలు, దొండకాయలు, ప...చ్చి మిరపకాయలూ....

(వీళ్ళ తలుపు కొట్టి)

ఓ కాంతమ్మో పచ్చి మిరపకాలు కావాలంటివే తెచ్చానమ్మా.... కాంతమ్మో.... ఓ కాంతమ్మో... ఏమయినారబ్బా! ఓ శీనయ్యా! నువ్వన్నా ఉంటివా లోపలా.... ఏమయ్యో.... పచ్చిమిరపకాయలయా్య...

(పాలమ్మా పాలూ అంటూ దూరంగా అరుస్తున్న గోపాలాన్ని చూసి) ఓ గోపాలం మామో! ఇటు రా... (గోపాలం దగ్గరకొచ్చాక) వీళ్ళని చూశా!? పాలు పోశా!?

పొయ్యలా... ఇంట్లో ఎవరూ లేరట్లుంది.

నువ్వు భలేటోడివేలే ... ఎవరూ లేకపోతే లోపల గడెందుకేసుంటుంది బయటేసుంటుంది గాని.... (అప్పుడే అటు నడుస్తూ పోతున్న రమని సుధని చూసి) ఓ రమక్కో, సుధక్కో ఇటు రాండి.
(వాళ్ళు దగ్గరకొచ్చాక, ఇంటి వైపు చూపిస్తూ) వీళ్ళని చూశారా?

(రమ వీళ్ళని చూసి) ఆఁ నిన్న చూశా. సుధక్కోళ్ళింటి ముందు. తర్వాత కనపళ్ళా... (అందరూ అక్కడే నిలబడి ఇంటివైపు చూస్తుంటారు)

(సరోజ దూరంగా వెళుతున్న రామయ్యని చూసి) ఓ రామయ్యసెట్టో ఇటురా... (దగ్గర కొచ్చాక) కాంతమ్మనీ, శీనయ్యనీ చూశా...?

ఆఁ నిన్న శీనయ్య నా కొట్టు కి వచ్చాడు. లడ్లు చేసుకుంటున్నామని సా...మా...ను కూడా తెచ్చాడు (సామాను అనే పదాన్ని విరగదీస్తూ)

సరోజ : అయితే ఏమయ్యారబ్బా!?

సుధ: కిటికీలో నుంచి చూద్దాం పాండి.

అందరూ వెనక్కి వెళతారు. మొదట సుధ చూసి...

సుధ: ఉన్నారు.. పడుకోని ఉన్నారు.

రమ: (సుధ మీదుగా తొంగి చూసి) మధ్యలో లడ్ల ప్లేటు గూడా ఉంది.

సరోజ: ఇటు రాండమ్మో! నన్ను చూడనీయండి. (వాళ్ళు తొలగగానే కిటికీ లో నుండి చూస్తా ) వామ్మో! చచ్చిపోయారా ఏందీ!!?

గోపాలం: ఆఁ ఏదీ నన్ను చూడనియ్యమ్మే! (సరోజ పక్కకి రాగానే చూసి) చూడబోతే చచ్చిపోయినట్లే ఉంది.

రామయ్య: (గోపాలం మీదుగా చూస్తూ) అయ్యో! చేసుకున్న లడ్లు గూడా తినకుండా చచ్చిపోయారే పాపం.

సరోజ: తలుపులు పగలగొట్టి లోపలకి పోదాం పాండి.

(ఈలోపు ఇంకో నలుగురైదుగురు చేరతారు. తలుపులు పగలగొట్టి (తలుపులునట్టుగా, భుజంతో తోసి పగలగొట్టినట్లుగా నటించాలి) లోపలకి పోతారు)

సరోజ: (వాళ్ళ మంచం/బల్ల ప్రక్కన కూలబడుతూ) అయ్యో! కాంతమ్మా! చచ్చిపోయావా కాంతమ్మా! నాకు నాలుగు రూపాయల బాకీ తీర్చకుండానే పోయావా?

పాల గోపాలం: నువ్వుండమ్మేయ్, నాకు పది రూపాయలు బాకీ ఈ శీనయ్య..

(ఆడవాళ్ళంతా అయ్యో కాంతమ్మా, అయ్యో శీనయ్యా అంటుంటారు)

రామయ్య: అరవబాకండి....అరవబాకండీ.... వీళ్ళ కళ్ళు కదులుతున్నాయి.

అందరూ: ఆఁ

రామయ్య: ఇదిగో గోపాలం నీ దగ్గర అగ్గిపెట్టె ఉందా?

గోపాలం: ఉందయ్యా (తలపాగాలో పెట్టుకున్న అగ్గిపెట్టె తీసి ఇస్తాడు)

(రామయ్య అగ్గిపుల్లని గీసి శీనయ్య కాలికి తాకిస్తాడు)

శీనయ్య: అయ్యో! అమ్మో! అబ్బ! కాల్చావు గదయ్యా రామయ్యా!

కాంతమ్మ: ఓ.... నాకు రెండు లడ్లో! మీరే ముందు కదిలారో. నేనే పందెం గెలిచానో. నాకు రెండు లడ్లో... (అని గెంతుతూ లడ్ల ప్లేట్ తీసుకుని) ఇదిగో మీకు ఒక లడ్డు నాకు రెండు లడ్లు...

అందరూ: ఆఁ లడ్ద కోసం పందెమా? ఖర్మ ఖర్మ!

************

//జెన్ కవితలు//

ఆగిన పవనంరాలిన కుసుమం
పాడే పిట్ట, నల్లటి కొండ
ఇదీ బౌద్ధం!


1) The wind has settled, the blossoms have fallen;
Birds sing, the mountains grow dark --
This is the wondrous of Buddhism

- Ryokan

***

కీచురాళ్ళ ధ్వని -
తమ జీవితం క్షణికం
అన్నట్లుండదు!

2) Nothing in the cry
of cicadas suggests they
are about die

Basho

***

బంధనారహిత పరమస్వేచ్ఛ -
కడకు ఎవరికీ అందకుండా
ప్రశాంత సముద్రం
శూన్యపు శిఖరంలా

3) Finally out of reach -
No bondage, no dependency.
How calm the ocean,
Towering the void.

- Tessho

***

కడవలో నీళ్ళు - నీళ్ళల్లో చంద్రుడూ
ఇన్నాళ్ళూ కాపాడుకున్నాను.
కావడి విరిగింది - కడవ పగిలింది.
నీళ్ళూ లేవు - చంద్రుడూ లేడు.

4) In this way and that I have tried to save
the old pail
Since the bamboo strip was weakening and
about to break
Until at last the bottom fell out.
No more water in the pail!
No more moon in the water!

- Chiyono

***

ఓ పువ్వు పూసింది
అంతా -
ఉన్నదున్నట్టుగానే
తనకు తానుగా
తానే అయి ఉంది.
ఇంకేమీ అక్కర్లేదు.

5) Everything
just as it is,
as it is,
as is.
Flowers in bloom
Nothing to add.

Robert Aitken

***

Sunday, June 12, 2016

ఆ స్థితి

ఇప్పుడు ఈ క్షణంలో నా గురించి నేను ఎంత ఆలోచించుకుంటున్నా వెలితి? ఏదో స్థితిలో ఎప్పుడో కలిగిన ఆనందపు క్షణాన్ని మళ్ళీ పొందాలనుకోవడం, ఆ స్థితిని ఇప్పుడున్న స్థితితో పోల్చి చూసుకోవడం... ఏమిటిదంతా? పేరు పెట్టలేని ఆ స్థితిలో ఉన్నప్పుడు (ముఖ్యంగా రాసేప్పుడు లేదా మనకి నచ్చిన పని చేసేప్పుడు) ఎంత చురుకు మెదడుకి! ఆలోచిస్తున్న విషయంలో ఎంత గాఢత!!
ఉండాల్సిన విషయాల మీద ఎంత ఆసక్తి - సరియైన సమయంలో సరియైన ప్రమాణంలో!!!

***

ఆ స్థితి ఎప్పుడూ ఉండాలంటే ఏం చేయాలయ్యా అంటే "ఏమీ చెయ్యకూడదు" అనిజవాబు నీ దగ్గర్నుంచి. "అసలేంటి నీ మైండ్ లో జరుగుతోంది? ఇప్పుడు, ఇప్పటి స్థితి ఆలోచించుకో, మిగిలింది వదిలెయ్యి" అంటున్నావు.

"నేను నిజాయితీగా ఆలోచించుకుంటున్నాను ముసలాయనా?”

"ఏదో కావాలన్న తపన/స్వార్థం నాలో ఉందా లేదా అని honesty గా ఆలోచించుకుంటున్నాను' అని నువ్వు అన్నంత మాత్రాన లేకుండా పోతుందా? అసలు honesty అనే పదానికి అర్థం పర్థం ఉన్నాయా? Dishonesty లేకపోవడం లోనే ఉంది అంతా"

"ఏమంటున్నావయ్యా జెకె? ఏమీ అర్థం కావడం లేదు... ఏమిటీ!!? 'dishonesty లేకపోవడం అనేది ఒక సుగుణం అవదు, మహా అయితే సహజగుణం అవ్వొచ్చేమో!' అంటున్నావా? అయితే ఇప్పుడు నేనేం చేయాలి ఎప్పుడూ సంతోషంగా ఉండాలంటే!?”

“................”

"ఉన్నస్థితిని ఉన్నట్టుగా ఉండక ఎక్కడికి పారిపోవడం? అద్భుత సృష్టిలో భాగమై జీవిస్తున్న మానవుడికి ఇంకా ఏం కావాలని పరుగులు?' అంటున్నావా? అయినా అడగనా నా ఫేస్ బుక్ ఫ్రెండ్స్ ఏమంటారో? వాళ్ళ అనుభవాలేమిటో!!?”

“................”

సరే ఇక మాట్టాడను. క్షమించు.

***

నేను - నువ్వు

భావోద్వేగంతో మనసుని
తడుముతున్న నిన్ను
వసంతయామిని కోయిలలా
ఆర్తిగా తాకుతున్నాను.

నీ మనసు పొరల్లోని సంచలనాన్ని
తర్జుమా చేయడానికి
నువ్వు తడపడుతున్నప్పుడు
నీ ముందు వాలిపోయాను

నన్ను నువ్వు చుట్టుకుంటూ
నీ వేళ్ళనుండి జారవిడుస్తున్నపుడు
కస్తూరిపువ్వుల పరిమళమై
అలంకరించుకున్నాను

కొంగొత్తగా చెలరేగుతున్న
నీ ఊహల సముదాయాన్ని
గమనిస్తూ నన్ను నీ గుండెల్లో
స్మృతిగా దాచిపెట్టుకోనిచ్చాను.

కలకలం, కలవరం లేకుండా
నిశ్శబ్దంగా నాలోకి ప్రవహిస్తున్న
నిన్ను నేను గుర్తుపట్టేసి
ప్రేమతో కౌగలించుకున్నాను.

అద్భుతమైన లోకాలని నువ్వు
నా ద్వారా పరిచయం చేస్తూ
నీ గుండె ఆగి కాలం స్తంభించినప్పుడు
నీ పెదవులపై ఓ అలలా నర్తించాను

నన్ను విశ్వసంగీతంగా మలచి
భగవంతునికి అర్పిస్తున్నపుడు
అద్వితీయమైన మౌనమూర్తినై
శాంతిగా సెలవు తీసుకున్నాను.

ఆ దేవదేవుని స్తుతించే
చివరి స్వరం నువ్వైనప్పుడు
నీతో నేను కలిసిపోయి మళ్ళీ
నీ గుండెలపైనే కీర్తిపుష్పంగా వాలాను.

***

'నాకు మాత్రమే' అర్థమయ్యే నిన్ను
'నేను మాత్రమే' అనుభూతించగలను
మహోజ్వలితనై నిను ప్రేమించగలను

*****
- రాధ మండువ

సహస్ర - నా మనవరాలుతో (మా అక్క మనవరాలు) సంభాషణ:

"హల్లో రాధ నానీ"

"ఊఁ చెప్పు. స్కూల్ మొదలైందా!?"

"ఇంకాలేదు కాని రాధ నానీ, హేమక్క (మా పని అమ్మాయి కూతురు) ఏ స్కూల్లో చదువుకుంటుందీ!?"

"రిషీవ్యాలీ రూరల్ సెంటర్లో, ఇక్కడకి దగ్గర్లో ఉందిలే. ఏం?"

"మరీ హేమక్కని నేను బెంగుళూరు తెచ్చుకోని మా స్కూల్లో చేర్పిస్తా"

"ఎందుకమ్మా, ఇక్కడ చదువుకుంటుందిలే"

"అహ! రిషీవ్యాలీలో బాగా చదువుకోవడం లేదు, అందుకే అక్కడ పనిమనిషిగా చేస్తోంది కదా! బెంగుళూరులో చదువుకుంటే ఏదైనా ఉద్యోగం చేసుకుంటుంది"

"మరి పని?"

"మనమే చేసుకుందాం, రాజు తాత చెప్పాడు కదా మన పని మనమే చేసుకోవాలనీ"

"అలాగేలే తల్లీ, హేమక్కని ఇక్కడే మంచి స్కూల్లో చేర్పించమని వాళ్ళమ్మతో చెప్తాలే.. మరి వాళ్ళమ్మ బాధపడతుంది కదా వాళ్ళమ్మాయిని మీ ఇంటికి పంపిస్తే.. సరేనా?"

"ఊఁ సరే రాధ నానీ"

*****

(కళ్ళనీళ్ళు పెట్టుకున్నాను. "ఈ పిల్లకి చదువురావడం లేదమ్మా, అందుకే పని నేర్పిస్తూ ప్రైవేట్ గా చదివిస్తున్నాను అని ఎలా చెప్పడం?"

మా హేమ - నేను




సఫరింగ్్

'నచ్చని' భావన - సరిపడకపోవడం (అసహనం, శతృత్వం, అసహ్యం, కోపం, ద్వేషం ఎన్ని పదాలో...) అంటే ఏమిటి? ఇది ఎందుకు సఫరింగ్ ని కలిగిస్తుంది? ఈ బాధని గాఢంగా, అలర్ట్ గా ఉండి అనుభవిస్తే ఈ ప్రశ్నలకి సమాధానం దొరుకుతుందేమో!?

'నచ్చాలి' అన్న కాన్సెప్ట్ ఉంది కాబట్టీ దానికి వ్యతిరేకంగా జరుగుతుంది కాబట్టీ ఈ బాధ కలుగుతుందా? కాదేమో! ఏమీ చేయకుండా ఊరికినే కూర్చుని - ఎవ్వరితో సంబంధ బాంధవ్యాలు నెరపకుండా ఒంటరిగా ఉన్నా ఈ సఫరింగ్ జరుగతున్నది
కదా!? కాబట్టి అది కాదన్నమాట కారణం.

మరేమిటి?

అంతఃచ్చేతనలో ఉన్న సహజ మానవ స్వభావం, చేతనలో వ్యక్తమయ్యే సంకల్పం బావుంటే - అంటే మనలో ఉన్న conscious goodness and conscious divine వల్ల అన్ని సంబంధాలు మంచిగా ఉంటాయి! తద్వారా ఈ పైన చెప్పినవన్నీ మాయమవుతాయి!

కదా!?

****

- రాధ మండువ

నీ కోసం


ప్రతి క్షణంలోనూ ఆనందమున్నఆవలతీరానికి వద్దామనుకుంటానా
మరు క్షణమే ఓ అల విరిగి ఒడ్డును తాకినట్లైన అనుభూతితో
వణికిపోతున్నాను

చీకటి తెరలో చిక్కుకునిపోయి నీ ఆసరా కోసం దిక్కులు చూస్తూ
వద్దనుకుంటూనే విడిచి వచ్చిన దారిలోకి తిరిగి
చేరుతున్నాను

నిట్టూర్చి మళ్ళీ నిన్ను తల్చుకోగానే ఏర్పడిన ఓ కొత్తరహదారిలో
నన్ను తాకుతున్ననీ పిలుపుని వింటూ తడబడుతూ మెల్లగా
ప్రయాణిస్తున్నాను

ఈ మార్గానికి మొదలూ గమ్యమూ రెండూ లేవు అదేమిటో!

***

స్వామీ! నాకో సందేహం - నాలోనే నువ్వు దాగి ఉన్నావని!
అవునా... ఉంటే ఇవ్వరాదుటయ్యా
నాకిక్కడే దర్శనం!!!

***

- రాధ మండువ

స్నేహితుడు

నిద్ర రానివ్వని నిన్న రాత్రి
కళ్ళ మీద ఓ మేఘాన్ని ఒత్తి వెళ్ళింది
కన్నీటిని తుడిచేస్తూ
గాలి తన చేతితో నా చెంపలని తాకింది

భాషలో చేర్చలేని భావాలు
మనసు దర్పణంలో కదిలిపోతూ
ఆవేదనని మిగిలిస్తున్నాయి
ఫర్వాలేదులే స్నేహితుడా
పురా జ్ఞాపకాలు గాఢమై
మరింత లోతైన స్మృతులని మోసుకొచ్చాయి

ప్రేమించమని అడిగానంతే కదా!
సరేనని కబుర్లు చెప్తూ
ప్రేమించడం మర్చిపోయావేమిటీ!?


పోన్లే, నావని దిగి వెళ్ళకు
వినడం అయినా నేర్చుకుంటాను
ఖాళీల మధ్య శబ్దాన్ని చేర్చి
నిశ్శబ్ద సంగీతాన్ని సృష్టించుకుంటాను!

***

- రాధ మండువ

Thursday, April 14, 2016

రిషీవ్యాలీలో ఓ సాయంత్రం

అద్వితీయమైన శాంతినిస్తూ అత్యధికమైన చురుకుదనం / అవేర్ నెస్ ఇచ్చే ఆశ్రమమే ఆశ్రమం. ఆ ప్రశాంతతలో మనకో "ఎరుక" కలుగుతుంది. అందుకు వెళుతుంటారు ఆశ్రమాలకి. ఎవరికైనా (బాబాలు / స్వాములు) దాసోహం అంటూ వాళ్ళేం చేసినా తలాడించే ఎరుక కాదు "అది".

కదా!?

రిషీవ్యాలీలో ఓ సాయంత్రం - మా స్టూడెంట్ తాషి (మా అబ్బాయి గౌతమ్ క్లాస్ మేట్) తీసిన ఫోటో ఇది.

***

చేతన




ఫ్రెండ్స్ కో కవిత

మాకు సెలవలు ఇచ్చేశారు ఫ్రెండ్స్, ఈ సెలవల్లో రమణాశ్రమానికి ఆ తర్వాత విపాసన కి వెళ్ళొస్తాను ఓ నెల రోజులు. ఈ నెలలో ఓ మూడు నాలుగు కథలు పబ్లిష్ అవుతున్నాయి. వీలున్నప్పుడు షేర్ చేసుకుంటాను.

అక్షర గులాబీల సుగంధాన్ని మీ మనసు్సలో అలుముకోనీండి. అక్షరాలు రాసే వారిని అభినందించండి.

మీ అభినందనలే మరిన్ని అక్షరాలకి ఆధారాలవుతాయి కదా!? :)

***

// ఫ్రెండ్స్ కి ఓ కవిత//
రాధ రాజశేఖర్

ఎదుటి వ్యక్తి మనసులోంచి
సూటిగా తాకిన అభినందన
'చేతన' ని కుదుపుతుంది

ఎడతెగకుండా మాట్లాడుతున్న
విదూషకుడు హఠాత్తుగా
మౌనం వహిస్తాడు

క్షణాల్లోంచి వింత వింత సుమాలు పూస్తాయి
మనశ్శరీరాలు తేలిపోతున్నట్లుగా ఉంటాయి

'నా' గురించి ఏవో వివరాలు అడుగుతున్న స్వరాలు
ఎప్పుడూ మనసులో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి

ముగించుకుని వెళ్ళాల్సిన దానిని
పెంచుకుని వెళుతున్నానన్న ఆశ్చర్యం
ఆనందంగా మారుతూ ఉంటుంది

మనుషులు చూపించిన అభిమానం
దిగంతాలు దాటి జగమంతా విస్తరిస్తుంది

మనుషుల మీద నమ్మకం
మరోసారి మల్లెపువ్వులా గుబాళిస్తుంది

***

నీలంరాజు లక్ష్మీప్రసాద్ గారి పుస్తకాలు

నీలంరాజు లక్ష్మీప్రసాద్ గారి పుస్తకాలు


సంకలన బాధ్యతలు పూర్తి చేశాక పుస్తకం ప్రింట్ అయి వస్తే కలిగే సంతోషం  :)  ఇప్పుడే పోస్ట్ లో వచ్చాయి రెండు పుస్తకాలు...

నీలంరాజు లక్ష్మీప్రసాద్ గారి రెండు పుస్తకాలు ప్రచురించబడ్డాయి. 


ఈ పుస్తకాలు అన్ని నవోదయ, విశాలాంధ్ర బుక్ స్టాల్స్ లో దొరుకుతాయి.

గాడిద మూతిగుడ్డ

తమాషా కథ :D
పాత సంవత్సరం (academic year) చివర్లో కొంత మంది టీచర్లు, పిల్లలు వెళ్ళిపోతుంటారు, కొత్తవాళ్ళు వస్తుంటారు. ఇలాంటి విషయాలు ప్రతి సంస్థలో జరిగే విషయాలే కాని అందరూ 'అసలు వాళ్ళు' చెప్పేదాకా తెలియనట్లే ఉండటం మర్యాద కదా!? నాలుగు రోజుల క్రితం ఓ టీచర్ "మీకు తెలుసా!? ఫలాన వాళ్ళు వెళ్ళిపోతున్నారట" అంటే... ఓ సామెత చెప్పి కథ చెప్పాను. ఆ కథ ముతకది లెండి - దాన్ని చక్కనైన కథ, పద్ధతైన కథ, నలుగురికీ చెప్పగలిగే కథగా తయారు చేస్తే ఎలా ఉంటుందీ అన్న ఆలోచనతో రాసిన ఈ కథ - తమాషా కథ  ఫ్రెండ్స్ చదువుతారని...

//గాడిద మూతిగుడ్డ//
- రాధ మండువ

అనగనగా ఒక రాజు. ఆ రాజుకి ఇద్దరు భార్యలు. పెద్ద భార్యకి ఒక వెంటు్రక, రెండో భార్యకి రెండెంటు్రకలు. ముందు పెద్ద భార్య రాజ్యానికి వచ్చింటది గదా... రాగానే కొన్నాళ్ళకి ఆమెకి 'కూడా' జుట్టంతా ఊడిపోయి ఒకెంటు్రక మిగిలింది. అది రాజు చూసి విసుక్కుని బాగా వత్తైన జుట్టున్న పిల్లని వెతికించి తెచ్చుకుని చిన్నరాణిగా చేసుకున్నాడు. అదేం ఖర్మమో రాజ్యానికి వచ్చిన కొన్ని రోజులకే చిన్న భార్యకి 'కూడా' జుట్టూడిపోయి రెండెంటు్రకలు మిగిలాయి.

'ఇంక ఎంతమందిని చేసుకున్నా ఇంతేలే' అనుకున్న రాజు ఈ 'ఒంటెంటుక రెండెంటు్రకల విషయం' ఎవరికీ తెలియకుండా ఉండాలని తన ఆంతరంగికుడైన మంగలిని పిలిపించాడు. పిలిపించి జడ ఉన్న రెండు విగ్గులు తయారుచెయ్యమన్నాడు. 'ముందు తయారుచేసిన విగ్గుకే సరైన కూలీ ఇప్పించలేదు ఇక ఇప్పుడు జడలతో రెండు విగ్గులా!?' అని మనసులో ఏడ్చుకుని రాజుగారిని ఏమీ అనలేక విగ్గులు తయారుచెయ్యడానికి రాజు ఎదురుగ్గా కూర్చున్నాడు.

విగ్గులు తయారయ్యాయి. రాజు రాణులిద్దరికీ చెరోటి తగిలించాడు. 'విషయం' ఎవ్వరికీ తెలియకూడదని రాణులని, మంగలిని హెచ్చరించాడు. "అయ్య బాబోయ్ ఇంతకు ముందు నా వల్ల ఏమైనా బయటికి వచ్చిందా!? మీరెవరినైనా అనుమానించొచ్చేమో కాని నన్ను అనుమానించకండి" అన్నాడు మంగలి.

“అవును నిజమే, ఇదిగో కూలి" అంటూ కొంత డబ్బిచ్చి మంగలిని పంపేశాడు రాజు.

రోజులు పాపం ప్రశాంతంగా గడుస్తున్నాయి రాజుగారికి. ఒకరోజు రాజు ఉయ్యాల బల్ల మీద తీరిగ్గా కూర్చుని రాణులతో చదరంగం ఆడుతున్నాడు. ఆ సమయంలో అంతఃపురపు చాకలి ఉతికిన బట్టల్ని తీసుకుని వచ్చాడు. ప్రభువులవారు హుషారుగా ఉన్నారని గమనించిన చాకలి "ప్రభూ, ఇంట్లో దరిద్రం ఎక్కువయింది. నా తల్లీ, తండ్రీ ముసలి వాళ్ళవ్వడంతో మందులకీ మాకులకీ ఖర్చు పెరిగింది. నా పిల్లలు పెద్దవారయ్యారు, మూరెడు బట్టతో లాగూలు కుట్టించేవాడిని ఇప్పుడు బారెడు కావలసి వస్తోంది" అన్నాడు.

జీతం పెంచమంటున్నాడేమో అనుకున్న రాజు “నిజమేనయ్యా, నీకు జీతం పెంచడానికి మంత్రిగారు ఒప్పుకోరే, అదీగాక నీకు పెంచితే అందరికీ పెంచాలి కదా!?” అన్నాడు.

“అయ్యో, ప్రభూ, అది తెలుసుకోలేనంత తెలివి లేని వాడినా? జీతం పెంచమనడం లేదు. మా ఇంటిదానికి అంతఃపురంలో ఉద్యోగం వేయించండి, రాణులమ్మలిద్దరికీ సేవ చేసుకుంటూ పడి ఉంటది" అన్నాడు.

చాకలి మాటలు వినగానే పెద్ద రాణి ముఖం చాటంతయ్యింది. “ఆఁ నిజమే ప్రభూ, చాన్నాళ్ళ నుండీ నాకు కాళ్ళూ, మోకాళ్ళూ నొప్పులు పుడతన్నయ్, చేతికిందకి మనిషి ఉంటే మంచిదనీ, మీకు చెబ్దామనీ అనుకుంటూనే ఉన్నాను" అంది.

అది విని చిన్నరాణి కూడా "అవును అక్కాయ్, నిజమే. నాక్కూడా చాన్నాళ్ళ నుండీ చేతులూ, మోచేతులూ నొప్పులు పుడతన్నయ్, కాలి కిందకి ఒక మనిషి ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను" అంది.

“విన్నావుగా వీరీ, నీ భార్యని రేపే వచ్చి పనిలో చేరమను. ఒక పూట పెద్దావిడ దగ్గర రెండో పూట రెండో ఆవిడ దగ్గర పని చేయవలిసి ఉంటుంది" అన్నాడు.

సరేనంటూ సంతోషంగా వెళ్ళిపోయాడు చాకలి. మరుసటి దినం చాకలి పెళ్ళాం వెంకి పనిలోకి వచ్చింది. వెంకి భలే హుషారైన మనిషే గాని నోట్లో నువ్వు గింజ నాననివ్వదు పైగా నలుగురికీ చెప్పకపోతే కడుపుబ్బిపోతుంటుంది ఆ పిల్లకి.

సరే మన ఈ వెంకికి రెండో రోజే ఒకటె్రండెంటు్రకల గురించి తెలిసిపోయింది. ఇద్దరు రాణులూ 'విషయం' బయటకి పొక్కితే తల తీసేస్తామని వెంకిని హెచ్చరించారు. పని చేసుకుంటున్న వెంకికి సాయంకాలం నాలుగయ్యేప్పటికి కడుపుబ్బిపోసాగింది. భరించలేక పరిగెత్తుకుంటూ రేవుకి వెళ్ళింది. రేవులో బట్టలుతుక్కుంటున్న చాకలి దగ్గరకెళ్ళి గభాల్న 'విషయం' చెప్పేసింది.

కడుపుబ్బరం తీరాక వెంకికి భయం పట్టుకుంది. ఈ 'విషయం' ఎవరికైనా తెలిస్తే నా తల తీసేస్తారంట, గోడకే చెవులుంటాయంటారు, రేవుకి ఉండవా!? పా, ఎవరన్నా ఉన్నారేమో చూద్దాం" అంది. ఇద్దరూ రేవంతా వెతికారు. “ఇక్కడెవురూ లేరు మన గాడిద తప్ప... భయపడమాక" అన్నాడు చాకలి - భార్యకి ధైర్యం చెప్తూ.

“వామ్మో, గాడిద మాటే మర్చిపోయానయ్యో, అది ఎవరికైనా చెప్పుద్దేమో, అది మనదే అయినా చెప్పగూడదని దానికేం తెలుసూ, గాడిదయ్యే!?” అంది వెంకి వణికిపోతూ.

“ఊరుకో, గాడిదెందుకు చెప్పిద్దీ!!?” అన్నాడు చాకలి.

“ఏమో! నేను చెప్పొద్దనుకున్నా, చెప్పలా? ఎందుకైనా మంచిది దీని మూతికి గుడ్డ కట్టయ్యో!” అంది గాడిదని గట్టిగా పట్టుకుని.

సరేనని గాడిద మూతికి బట్ట కట్టాడు చాకలి. వెంకి తృప్తిగా తలాడించి అంతఃపురానికి వెళ్ళిపోయింది. పనంతా అయ్యాక చీకట్లు పడుతుండగా చాకలి బట్టల మూటల్ని గాడిద మీద వేసుకుని ఊళ్ళోకి రాసాగాడు. పొలాల్లో పనులు చేసుకుని ఇంటికొస్తున్న రైతులు ఊళ్ళోకీ, పాలు పిండుకోవడానికి ఊరి బయటుండే కొట్టాల దగ్గరకి ఆడవాళ్ళూ వచ్చే సమయమది.

దారిలో చాకలిని కలిసిన ఒక రైతు మూతికి గుడ్డ కట్టి ఉన్న గాడిదని ఆశ్చర్యంగా చూస్తూ "ఏంది వీరీ, గాడిద మూతికి గుడ్డెందుకు కట్టావ్!!?” అని అడిగాడు.

“ఎవురికీ చెప్పబాకయ్యో, చెబితే తలలు తెగుతాయంట. ఇదీ 'విషయం'. ఈ 'విషయం' మాయావిడ నాకు చెప్తుంటే ఈ గాడిద వింది. ఇదెక్కడ అందరికీ చెప్పిద్దోనని దీని మూతికి గుడ్డ కట్టమంది" అన్నాడు చాకలి. రైతు పెద్దగా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. కాసేపటికి చాకలికి ఎదురొచ్చిన ఒక ఆడామె "ఎందుకు గాడిద మూతికి గుడ్డ కట్టావ్ వీరీ!!?” అంది నడుమున చెయ్యేసుకుని నిలబడి. చేసేదేమీ లేక ఆవిడకీ 'విషయం' చెప్పాడు.

అట్లా దారిలో కలిసిన వారందరూ చాకలిని అడగనూ, అతను 'తలలు తెగుతాయి' అంటూనే 'విషయం' చెప్పనూ...

తెల్లారేటప్పటికి 'విషయం' రాజుగారి చెవిన పడింది. రాజు కోపంగా అంతఃపురానికి వచ్చి 'విషయం' ఎలా బయటకి పోయిందని రాణులిద్దరినీ అడిగాడు. 'నీవల్లే' నంటే, 'నీవల్లే' ననుకుంటూ ఇద్దరు రాణులూ విగ్గులు విగ్గులు పట్టుకుని లాక్కున్నారు. అవి కాస్తా ఊడాయని చిందులు తొక్కుతున్న రాజు మీద ఇద్దరు రాణులకీ కోపం వచ్చి, జుట్టు లాక్కునే ఛాన్స్ లేకపోయిందే అని ఉక్రోషపడుతూ రాజు జుట్టు పట్టుకున్నారు.

అంతే ...

“ఆఁ" అంటూ ఇద్దరు రాణులూ రాజుగారిని చూస్తూ అవాక్కైపోయి కింద పడ్డారు.

ఏం జరిగిందో మీరే ఊహించి చెప్పండి మరి! - మీ రాధ :)

*******

రమణాశ్రమం - ధ్యానం


హాయ్ ఫ్రెండ్స్, ధ్యానం ఏమో కాని ఎండలు మండించాయి బాబూ... రమణుడికి సహస్ర సారీలు చెప్పుకుని నిన్న పరిగెత్తి పారిపోయి వచ్చేశాము. మూడు సార్లు గిరిప్రదక్షిణ చేసేప్పటికి నల్లగా మారిపోయిన ఫేస్ కి కాస్త రెస్‌్ట ఇచ్చి వచ్చా మిమ్మల్ని పలకరిద్దామని...

సెలవల్లో హాయిగా, కూల్ గా ఇంట్లో కూర్చుని ఉదయాన్నే ధ్యానం చేసుకుంటూ, మంచి సంగీతం వింటూ, ఫేస్ బుక్ ఫ్రెండ్స్ ని పలకరించుకుంటూ, పుస్తకాలు చదువుకుంటూ ఉండటం అంత మంచి పని ఇంకోటి లేదు. కదా!?

"ఔను" అంటోంది ఈ బుజ్జిది, పచ్చికల్లో దాక్కున్నదల్లా లేచి మరీ... :) అన్నట్లు ఈ బుజ్జిలేడి 'బేంబీ' కథ "వనసీమలలో" చదివారా!? చదవకపోతే తప్పకుండా చదవండి. చాలా మంచి పుస్తకం "మంచిపుస్తకం" వారి దగ్గరో, కినిగే వాళ్ళ దగ్గరో దొరుకుతుంది.


****

చిన్ననాటి ఆటలు - జ్ఞాపకాల మూటలు

శివ జాస్తి గారు, కందుకూరి రాము గార్ల నిర్వహణలో వస్తున్న ఈ పుస్తకం ఆవిష్కరణ ఏప్రిల్ 3 న పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ప్రాంగణంలో జరుగుతోంది. ఈ పుస్తకం కాపీలు నాకు కూడా యాభై వస్తాయి. రిషీవ్యాలీ రూరల్ స్కూళ్ళల్లోనూ, చుట్టుప్రక్కల ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళల్లోనూ ఈ పుస్తకాన్ని నా బహుమతిగా ఇస్తాను. దుండ్రపెల్లి బాబు గారు వేసిన బొమ్మలు చాలా బావున్నాయి. నేనూ ఈ పుస్తక ప్రచురణలో భాగస్వామినవడం చాలా సంతోషంగా ఉంది. శివ గారికి, రాముగారికి, బాబుకి నా కృతజ్ఞతలు.
నాకొచ్చే యాభై పుస్తకాల్లో ప్రచురించే ఈ స్టిక్కర్ చాలా బావుంది కదా! దీన్ని నా బ్లాగ్లో ఓ జ్ఞాపకంగా ఉంచుకోవాలని, మీరూ చూస్తారనీ షేర్ చేసుకుంటున్నాను. - మీ రాధ

Don't Judge People

ఎందుకు జడ్జ్ చేయడం? 
ఒక్కో మనిషీ - ఒక్కో సమయంలో, ఒక్కో మనిషితో, ఒక్కో ప్రదేశంలో, ఒక్కో మూడ్ (మానసికావస్థ) లో - ఒక్కో రకంగా ఉంటాడు అని తెలుసుకుంటే చాలు. అంతే కాకుండా ప్రతి మనిషీ 'నాలాంటి వాడే', అదే సమయంలో 'ప్రత్యేకమైన వాడే (యూనిక్)' అనీ గ్రహిస్తే చాలు. కదా!? ఎందుకు జడ్జ్ చేయడం!!? అండ్ ఆల్ సో హు యా మై టు జడ్జ్!!!?
*****

All of us have qualities that set us apart and make people love us. Click below to see which quality of yours makes people love you.
MEAWW.COM|BY RADHA

ఊపిరి - మ్యూజింగ్స్

నిన్న మార్నింగ్ అసెంబ్లీ నుండి క్లాస్ రూమ్స్ వైపు పిల్లలతో నడుస్తూ

నేను - "పిల్లలూ, రేపు 'ఊపిరి' సినిమాకి వెళుతున్నా"

మేఘన - "ఆఁ మేమక్కా!? మేం కూడా వస్తాం"

నేను - "అహఁ మీకు పర్మిషన్ ఎవరిస్తారు? రెండు రోజుల్లో ఇంటికి సెలవలకి వెళుతున్నారుగా, రెండున్నర నెల సెలవలు, ఇంటికెళ్ళాక వెళ్ళండి. వెళుతున్నానని అందుకే చెప్పా. లేకపోతే ఆశ పడరూ మీరు పాపం"

రాజశేఖర్ (మా ఆయన) - (వెనకనుండి మా మాటలు విని) "నువ్వు కూడా సెలవలిచ్చాక వెళ్ళకూడదా!?"

నేను - "ఊహుఁ రేపే వెళ్ళాలి, వెళ్ళాలంటే వెళ్ళాలి అంతే. టిక్కెట్స్ క్కూడా చెప్పేశా. చూసి రివ్యూ రాయమని చెప్పారు నా ఫేస్ బుక్ ఫ్రెండ్స్"

రాజు - "వామ్మో, వెళ్ళకపోతే 'ఊపిరి' పోయేట్లుందిగా"

నేను - "ఊపిరి' పీల్చుకోవడానికి వెళుతున్నాననుకో"

రాజు - "అంత 'ఊపిరి' సలపని పనులు ఏమున్నాయబ్బా నీకు"

నేను - "ఈ పిల్లలు ఊపిరి తీశారుగా ఇన్నాళ్ళూ చాలదా?"
పిల్లలు - "అక్కా!!!"


***********

Sunday, April 3, 2016

సహస్రం - రాధ మండువ


దాదాపు సంవత్సరం పాటు సాయంకాలాలు - ఆఫీసునుండి ఇంటికి వచ్చాక వివిధ దేశాల జానపదకథలనీ, చిన్నపిల్లల కథలనీ అనువాదం చేసుకుంటూ ధ్యానం చేసుకోవడానికి సమయం కేటాయించుకోలేకపోయాను. పదిరోజులు రమణాశ్రమంలో ఉండి వచ్చాక ఆత్మను దర్శించడంలో ఉన్న ఆత్మానందాన్ని విడవకూడదని అనిపించింది.

ఇంట్లో మా ఆవిడ చూసే టివి సీరియల్ సౌండ్ నీ, మా ఇద్దరి పిల్లల అల్లరినీ ఆపమనడం ఎందుకులే అనుకొని నేనే సాయంకాలం టీ తాగాక బీచ్ కి రాసాగాను. ఇది అందరికీ సౌకర్యంగా ఉంది.

రెండు వారాలు గడిచాయి. ధ్యానం లో చాలా ఆనందాన్ని పొందుతున్నాను. ఆరోజు సూర్యుడు 'తొందరేముందిలే, నిదానంగా వెళతాను' అన్నట్లుగా ఇంకా వెలుగుని విరజిమ్ముతున్నాడు. బీచ్ లో నేను ధ్యానం చేసుకునే ప్రదేశానికి వచ్చే దారిలో కొంతమంది స్కూలు పిల్లలు నీళ్ళల్లో మునుగుతూ, అలలతో ఆడుకుంటూ, నవ్వుకుంటూ గంతులేస్తున్నారు. వాళ్ళని చూస్తుంటే నాకు కూడా కాసేపు సముద్రంలోకి వెళ్ళాలనిపించింది. ప్యాంట్ ని పైకి మడుచుకుని నీళ్ళల్లో నడుస్తూ, అలలు కాళ్ళ దగ్గరకి వచ్చినపుడు వంగి నీళ్ళని తీసుకుని పైకి విసురుతూ నడవసాగాను.

కొంత దూరం నడిచాక నా వెనుక నాలుగుడుగుల దూరంలో ఎవరో స్త్రీ నడవడం, నేను వంగినపుడు ఆమె కూడా వంగి నీళ్ళని తీసుకుని పైకి చల్లడం గమనించాను. ఆగి వెనక్కి తిరిగి ఆమెని పరిశీలనగా చూస్తూ పలకరింపుగా నవ్వాను. నేను ఈ రెండు వారాల్లో ఎప్పుడో ఆవిడని బీచ్ లో చూసినట్లే గుర్తు. అప్పుడు ప్రక్కన ఎవరన్నా ఉన్నారో లేరో గమనం లేదు కాని ఇప్పుడు మాత్రం ఒక్కత్తే ఉంది.

నేను నీళ్ళల్లో నుండి బయటకు వచ్చి నా బ్యాగ్ లో నుండి ధ్యానం చాపని తీసి ఇసుకలో పరుచుకుని కూర్చున్నాను. ఆవిడ మాత్రం అక్కడక్కడే తచ్చట్లాడుతున్నట్లుంది. నేను పట్టించుకోకుండా ధ్యానం లో మునిగిపోయాను.

***

తర్వాత రోజు నా బ్యాగ్ లో నుండి చాపని తీస్తున్నప్పుడు "ఏమండీ, ఎక్స్ క్యూజ్ మీ" అని వినిపించి వెనక్కి తిరిగి చూశాను. ఆమే! ప్రక్కన వేరుశనక్కాయలు అమ్ముకునే అవ్వ గంపతో నిలబడి ఉంది. “మీరు ఏమీ అనుకోకపోతే పది రూపాయలు ఇస్తారా? నేను డబ్బులు తీసుకురావడం మర్చిపోయాను, రేపు మీకు ఇచ్చేస్తాను" అంది.

ఓ ష్యూర్, నో ప్రాబ్లమ్" అంటూ పర్సు లోంచి పది రూపాయల నోటు తీసి ఇచ్చాను.

అవ్వ పది రూపాయలు తీసుకుని వెళ్ళిపోయింది.

"నేను కూడా ధ్యానం చేసుకుంటాను. మధ్యాహ్నం ధ్యానం లో కూర్చుని అన్నం తినడం కూడా మర్చిపోయాను. సాయంత్రం చీకటి పడుతుండగా తెలివి వచ్చింది - అదిగో చూడండి! ఆకాశం సముద్రుడిని దిగంతాలలో వంగి కలుసుకుంటున్న ఆ దృశ్యాన్ని చూడకపోతే రాత్రికి నిద్రపోలేను. ఎక్కడ సూర్యాస్తమయం అయిపోతుందో అనే తొందరలో డబ్బులు తీసుకురావడం మర్చిపోయాను" అంది ఆవిడ అక్కడే నిలబడి.

నేను మొహమాటంగా నవ్వాను.

ఆమె నన్నేమీ పట్టించుకోనట్లుగా సముద్రపు ఆ చివరి అంచుని తీక్షణంగా చూస్తూ "నీలాకాశపు ప్రియురాలి గాఢమైన కౌగిలిలో సముద్రుడు పొందిన నిశ్చలత కదా సమాధి స్థితి అంటే - ఎంతదృష్టవంతుడో!?” అంది.

నేనేమీ మాట్లాడలేదు. ఆమె ముఖాన్నే పరీక్షగా చూస్తూ ఉండిపోయాను. ఆమె నా వైపుకి తిరిగి మళ్ళీ "అన్నం తినలేదు కదా, ఆకలేసి శనక్కాయలు కొనుక్కున్నాను" అని కొన్ని శనక్కాయలు నా చాప మీద పోస్తూ "తినండి" అంది.

అయ్యో, ఫరవాలేదండీ" అంటూ శనక్కాయలని చాపలో ఒక మూలకి నెట్టేసి కూర్చున్నాను.

ఆమె అక్కడనుండి వెళ్ళిపోయిందో, నా ముందే బీచ్ లో అటూ ఇటూ తిరుగుతూ ఉందో నాకు చూడాలనిపించింది. ఊగిసలాడే మాయ తెరను వేస్తున్న నా మనసును చూసి లోలోపలే నవ్వుకుంటూ తలవంచుకుని కళ్ళు మూసుకున్నాను.

***

ఏమండీ, ఏమండోయ్! నేనండీ మధురనీ, మిమ్మల్నే!” కేకలు వినిపించి వెనక్కి తిరిగి చూశాను. ఆమె వేగంగా నా ఎదుటకి వచ్చి నిలబడి "సారీ, మీ పది రూపాయలు తీసుకు రావడం మర్చిపోయాను" అంది.

ఫరవాలేదులెండి, ఇవ్వకపోతే ఏమీ మునిగిపోదు కానీ మీ పేరు మధురా?” అన్నాను. మధురమీనాక్షి నాకిష్టదైవం - ఆమెనే తల్చుకుంటూ...

అవును. మధురవాణి" మూతిని సున్నాలా చుట్టి తలని కొంచెంగా ఊపుతూ, పెదవిని చిన్నగా విరగతీస్తూ అంది.

నాకు నవ్వొచ్చింది కాని ఆపుకున్నాను.

కొంతమందికి 'మధుర' అని చెప్తాను మరికొంతమందికేమో 'వాణి' అని చెప్తాను. బాగా దగ్గర వాళ్ళకే 'మధురవాణి' అని చెప్తా" అంది. కొంటెగా నవ్వుతున్నాయి ఆమె కళ్ళు కాని ఆ కళ్ళల్లో - లోలోతుల్లో నీరసం స్పష్టంగా కనిపిస్తోంది.

అక్కో, ఓ మధురక్కో!” అంటూ పూలమ్ముకునే ఓ పదిహేను పదహారేళ్ళ పిల్లవాడు మా దగ్గరకి పరిగెత్తుకుంటూ వచ్చాడు.

ఇయిగో పూలు తీసుకో, ఇయ్యాల పెందలాడే రమ్మంది అమ్మ – బాహుబలి సినిమాకి పోతన్నాం" అన్నాడు. పళ్ళన్ని బయటపెట్టి సంతోషంగా నవ్వుతున్న వాడి తల నిమురుతూ "వద్దులేరా శీనా, ఇప్పటికే నీకు చానా బాకీ" అంది.

ఇంటికి తీసకపోతే తెల్లారేలకి వాడిపోయే పూలేగా అక్కా, ఏం బాగ్గెం? ఉన్నప్పుడే ఇద్దువులే ఇయిగో పెట్టుకో" అన్నాడు వాడు - తట్టలో మిగిలిని పూలన్నీ ఆమె చేతుల్లో పెడుతూ.

అంత చిన్నపిల్లవాడి మాటల్లో వేదాంతం వినిపించింది నాకు. పేదరికం వాళ్ళకిచ్చే భాగ్యం అదేనేమో అనిపించింది. ఆమె పూలను తీసుకుని తల్లో తురుముకుంది. “నేనుగూడా వస్తా ఉండురా" అని జాకెట్ లోంచి పేపర్ తీసి "బాగా నీరసంగా ఉంటోందండీ, రేపు ఇక్కడకు రాగలనో లేదో మీరే మా ఇంటికి రండి. మీ పది రూపాయలూ ఇచ్చేస్తాను. ఇక్కడకి దగ్గరే... అదిగో ఆ లైట్ స్తంభం దాటిన తర్వాతొచ్చే మొదటీధిలో మూడో నంబరిల్లు. నీలం రంగు రేకు గేటు మీద పసుపురంగుతో మూడు అని నంబర్ వేసి ఉంటుంది. ధ్యానంలో పడి మర్చిపోతారని అడ్రస్ ఈ కాగితంలో రాశా, ఇదిగోండి" అంటూ పేపర్ ని నాకు ఇచ్చింది.

ఆమె ఏమంటుందో అర్థం అయ్యి 'వద్దు' అని అందామని అనుకుంటూనే అప్రయత్నంగా చెయ్యి చాపి ఆ పేపర్ ని అందుకున్నాను.

గబగబా నడుస్తూ వెళ్ళిపోతున్న వాళ్ళని వెనుక నుంచి చూస్తూ నిలబడ్డాను. కొంత దూరమెళ్ళాక ఆమె ఆ పిల్లవాడి భుజాల మీదకి వంగి ఏదో చెప్పింది. వాడు వెనక్కి తిరిగి నన్ను చూసి నవ్వి మళ్ళీ ఆవిడతో మాట్లాడాడు. ఆమె వెనక్కి తిరిగి చేతులు పైకెత్తి తన తల్లో పూలని సర్దుకుంటూ నన్ను చూసి నవ్వింది.

నేను ఆమెని గమనించనట్లుగా నింగి వైపుకి చూపుని మరల్చుకున్నాను. ఆకాశం బూడిదరంగు తెర వేసి చిన్న చిన్న చిత్రాల్లాంటి తెల్లని మేఘాలను ప్రదర్శిస్తోంది. నా మెదడులో ఆమెని గురించిన ఆలోచనలు దారాలు దారాలుగా సాగిపోతున్నాయి. నా కళ్ళు చెమ్మగిల్లి ఇక ధ్యానానికి సహకరించనంటున్నాయి. అలాగే కూలబడినట్లుగా ఇసుకలో కూర్చుండిపోయాను.

***

ఆలోచనలను చెదరగొడుతూ నా సెల్ మో్రగింది. తీసి చూశాను - ఇంటి నుంచి - నా భార్య వేద. “హలో!” అన్నాను.

ఎక్కడున్నారండీ, ఇంతాలస్యమయిందేం?” అంది.

ఈరోజు ధ్యానం చేయకుండానే త్రిపురాంబికను దర్శించాను వేదా. సహస్రనామావళి సమర్పించుకుంటున్నాను" అన్నాను.

లలిత చదువుతున్నారా? మీకేం వచ్చూ!?” అంది.

రోజూ పొద్దున్నే నువ్వు చదువుతుంటే వింటున్నానుగా, గుర్తుకి వచ్చినంతవరకూ చదువుతున్నానులే" అన్నాను.

ఊరుకోండి. లలితా సహస్రనామం అంటే వేళాకోళం కాదు. మొదలు పెట్టారంటే ఫలశ్రుతితో సహా చదవాలి" అంది వేద చిరుకోపంగా.

నేను చిన్నగా నవ్వుతూ "ఆ ఫలశ్రుతేదో నువ్వు చదువు. నేను 'ఈ చీకట్లో దారి తప్పకుండా' నీ దరికి చేరడం అనే ఫలితం నీకు దక్కుతుంది" అన్నాను.

వేద పెద్దగా నవ్వి "సర్లే త్వరగా రండి" అంది.

***

నా చుట్టూ అలుముకున్న చీకట్లను ఛేదిస్తూ బీచ్ రోడ్లో ఒక్కసారిగా లైట్లు వెలిగాయి. లేచి నడవసాగాను. దీపస్తంభం దాటి మొదటి వీధిలోకి తిరిగాను. మూడో నంబర్ ఇల్లు - చిన్నదే. బహుశా ఒక గది ఉంటుందేమో! గది ముందు వరండా. ప్రహరీకున్న రేకు గేటు వరకూ నాలుగు నాపరాళ్ళు - దారి కోసం వేసి ఉన్నాయి. గేటు ప్రక్కన ప్రహరీ మీదికి సన్నని సన్నజాజి తీగ పాకి ఉంది. పూలు కోయకుండా నిర్లక్ష్యంగా వదిలేసినట్లుంది విచ్చిపోయి కొన్ని, వాడిపోయి కొన్ని కొమ్మల్లో వేలాడుతున్నాయి.

మెల్లగా శబ్దం కాకుండా రేకు గేటు తీసుకుని వరండాలోకి వెళ్ళాను. తలుపు సందులోంచి సన్నని వెలుగు బయటకి కనిపిస్తోంది. వెయ్యి రూపాయల నోటుని పర్సులోంచి తీసి మడతతోనే తలుపు సందులో గుండా లోపలకి నెట్టేసి వీధిలోకి వచ్చేశాను. రెండో వీధి మలుపు తిరుగుతుండగా గుర్తొచ్చింది - రేకు గేటు తలుపు మూయలేదని.

'పర్వాలేదండీ, నో ప్రాబ్లమ్' అని ఆమె అంటున్నట్లయి నవ్వుకుంటూ ముందుకి నడిచాను.


*******


Wednesday, March 23, 2016


//రకరకాలు// రాధ మండువ


*అన్ని పోస్ట్ లని చూసి చక్కగా చదివి నచ్చితే లైక్ చేసి మరింతగా నచ్చితే కామెంట్ పెట్టే వాళ్ళు కొంతమంది.

*పాపం బిజీలో ఉండో లేకపోతే మనకి లైక్ చేయని వారి పోస్ట్ లు అడుగున పడిపోయో కనిపించకపోవడం వలన చూడని వారు కొంతమంది.

*పనుల్లో పడి అప్పుడప్పుడూ వచ్చి కనపడినవి చదివేవారు కొందరైతే, 'ఇదిగో ఈ పోస్ట్ చూడండి చాలా బావుంది' అని చెప్తే వచ్చి చూసేవారు కొంతమంది.

*చదువుతారు అయినా చదవనట్లు నటించే వాళ్ళు కొంతమంది, చూసి కూడా దాటేసేవాళ్ళు కొంతమందైతే చూసి, చదివి నచ్చకపోతే లైక్ చేయకుండా వెళ్ళేవాళ్ళు కొంతమంది.

*ఇన్ బాక్స్ ల్లో చాట్ లు చేసుకుని 'నేను లైక్ చేయను మీరూ చేయొద్దు' అని చెప్పుకునే వాళ్ళు కొందరు.

*అకారణంగా శతృత్వాన్ని పెంచుకునే వాళ్ళు కొందరైతే 'వాళ్ళ పోస్ట్ లెందుకు చదవాలి మనవి వాళ్ళు చదవనప్పుడు' అనుకునే వాళ్ళు కొందరు.

*వీళ్ళు మనకి సరిపోరులే అనుకునే వాళ్ళు కొందరైతే వీళ్ళకి భాషాజ్ఞానమే లేదు (తెలుగు/ఇంగ్లీష్) ఇక వీళ్ళని చదివేదేందిలే అనుకునే వారు కొందరు.

*భావాలు నచ్చక వదిలేసేవాళ్ళు కొందరైతే అసూయతో వదిలేసేవారు కొందరు.

*మన పోస్ట్ లే అందరూ చదవాలి అనుకుంటారు కాని ఇతరుల పోస్ట్ లు చదవడానికే రాని వాళ్ళు కొంతమంది. పైగా చదవకపోతే 'చదవలేదని వాళ్ళని డిలీట్ చేస్తున్నాన'ని బెదిరించే వాళ్ళు కొంతమంది.

*మనం 'గొప్ప' అనుకున్న వాళ్ళు ఎవరికైనా లైక్ చేస్తే మనమూ చెయ్యాలి అనుకునే వాళ్ళు కొంతమందైతే అర్థం కాకపోయినా ఎక్కువ లైక్ లు ఉంటే మనమూ ఓ లైక్ పడేస్తే పోలా అనుకునే వాళ్ళు కొంతమంది.

*మొహమాటంతో లైక్ చేసే వాళ్ళు కొంతమంది. నిక్కచ్చిగా ఉండేవాళ్ళు మరికొంత మంది. ప్రతి దానికీ చదవకుండానే లైక్ చేసే వాళ్ళు ఇంకొంతమంది.

*వాళ్ళు మన పోస్ట్ లు చదవనప్పుడు మనకి ఫ్రెండ్స్ గా ఉండటం ఎందుకు అనుకుని బాధతో 'నేను డిలీట్ చేస్తున్నాను చదవని వారిని' అనేవాళ్ళు కొంతమంది.

*దేని కోసమో స్నేహం చేసి అది దొరక్కపోతే వదిలేసేవాళ్ళు కొంతమందైతే, ఆశిస్తున్నది దొరికి సంతృప్తి పడే వాళ్ళు కొంతమంది.

*ఒక వర్గంలో ఉంటే గొప్ప అనుకునే వాళ్ళు కొంతమందైతే, పాపం వాళ్ళ ప్రాపకం కోసం ప్రాకులాడుతూ వాళ్ళు లైక్ చేస్తున్న వాళ్ళకే లైక్ లు చేసేవాళ్ళు కొంతమంది.

*అర్థం చేసుకోలేక అనుమానంతో వదులుకుంటున్న వాళ్ళు కొంతమందైతే వాళ్ళు ఇలాంటివారు వీళ్ళు ఇలాంటివారు అని చెప్పుకుని, చెప్పుడు మాటలు విని వదిలేసేవాళ్ళు కొంతమంది.

- ఆలోచిస్తే అందరిలో నేనున్నాను. నాలో అందరూ ఉన్నారు కదా!? నవ్వుతూ సాగిపోవాలని నా ఫ్రెండ్స్ అందరికీ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్.(పరీక్షల కాలం, రిపోర్ట్స్, హోమ్ వర్క్ హడావుడి, కథలు రాసుకోవాలి, రాసినవి టైప్ చేసుకోవాలి. fb కి రావడం కాస్త తగ్గించుకోవాల్సిన టైమ్ వచ్చింది. రెండు రోజులకొకసారి మిమ్మల్ని పలకరించుకుంటాను :)  - మీ రాధ. (నన్ను మీ ఫ్రెండ్ లిస్ట్ లో నుండి డిలీట్ చేయకండి ప్లీజ్  :) )

Tuesday, March 22, 2016

రావిచెట్టిల్లు

తెలుగు వెలుగులో నేను రాసిన కథ చదవండి ఫ్రెండ్స్, బొమ్మ చాలా చక్కగా ఉంది, కథ బావుందంటూ చాలా ఫోన్స్ వచ్చాయి నాకు. ఫోన్ చేసిన వాళ్ళల్లో ఎక్కువ మంది వృద్ధులు. (అన్నట్లు మీకో విషయం చెప్పాలి, అదేమిటో నాకు పెద్దవాళ్ళు భలే తొందరగా ఫ్రెండ్స్ అయిపోతారు :) ) వాళ్ళతో మాట్లాడుతుంటే చాలా సంతోషం కలిగింది. బోలెడన్ని ఆశీర్వాదాలు దొరికాయి. మీరూ  చదువుతారని... - మీ రాధ

//రావి చెట్టిల్లు// రాధ మండువ

ఆ ముసలి వాళ్ళిద్దరికీ వంట చేసిపెడుతూ, చేతి సాయంగా నేను దాదాపు ఐదేళ్ళకి పైనే సేవ చేశాను. నా ఆశ, ఆత్రం వల్లే వాళ్ళింట్లో పని పోయింది. ఆ పని ఉన్నన్నాళ్ళూ దాని విలువ నాకు తెలియలేదు. ఇప్పుడు ఎక్కడ పని ఉంటే అక్కడికి వెళ్ళి అడుక్కోని ఎండలో గొడ్డు చాకిరి చేయాల్సొస్తోంది. నెల నించీ మరీ ఒక్కొక్కరోజు పిల్లలకి కడుపు నిండా అన్నం కూడా పెట్టుకోలేక పోతున్నాను. ఇలా ఎందుకు చేశానా అని ఏడ్చుకుంటూ నాలోకి నేను విమర్శగా చూసుకోవడమే సరిపోతుంది... మరీ ఈమధ్య ఎక్కువగా.

తూరుప్పక్క చేల మధ్య పడ్డ రోడ్డుకి మరమ్మత్తులు చేస్తన్నారంట అక్కడకి పోయి పని అడిగి రావాలని లేచి బయల్దేరాను. మళ్ళీ ముసలోళ్ళిద్దరూ కళ్ళమందు మెదిలారు....

2.

వాళ్ళు ఈ ఊరి వాళ్ళు కాదు. నెల్లూరోళ్ళు. ముసలాయన కొడుకుకి పల్లెటూళ్ళంటే ఉన్న ఇష్టం తో ఇక్కడ స్థలం కొని ఆ ఇల్లు కట్టాడంట. ప్రహరీ గోడకి ప్రక్కగా పేద్ద రావిచెట్టు రోడ్డుకి ఆనుకుని ఉంటుంది. ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో నిమ్మ, దానిమ్మ, సపోటా, మామిడి చెట్లు ఉన్నాయి. ప్రతి సంవత్సరం వాటికి కాసే కాయలు సగం నేనే కాజేసేదాన్ని. ముసలాయన ఆ రావి చెట్టు కింద కట్టిన అరుగు మీద కూర్చుని ఎప్పుడూ చదువుకుంటూనో, రాసుకుంటూనో ఉండే వాడు. పెద్ద ఉద్యోగం చేసి రిటైరయ్యాడంట.

"మీ కొడుకు మిమ్మల్ని బాగా చూసుకుంటాడమ్మా ఏ లోటూ లేకుండా" అంటే "మమ్మల్నెవరూ చూసుకోబన్లే అయ్యగారికి ఇరవై వేలు పెన్షన్ వస్తుంది" అంటుంది ముసలావిడ చిరాగ్గా.

'ఓర్నాయనో! డబ్బుంటే చాలా!? ఈమె కుర్చీ మీద నుండి లేవలేదు, ఆయన రావి చెట్టు అరుగు దాటి కిందికి దిగడు. అయినా 'కొడుకు వల్ల అన్నీ అమరుతున్నాయి' అని మనసులో కూడా అనుకోని వాళ్ళ మనస్తత్వానికి ఆశ్చర్యపడేదాన్ని.

ఆవిడ చూడటానికి అమాయకురాలని దూరంగా ఉండి చూసేవాళ్ళు అంటారు గాని ఒట్టి స్వార్థపరురాలనిపిస్తుంది నాకు. భారీ మనిషి. వంద కిలోల బియ్యం బస్తా మాదిరి గట్టిగా ఉంటుంది. కొడుకు స్పెషల్ గా ఆర్డర్ ఇచ్చి చేయించిన ఇనప కుర్చీలో బిర్రుగా డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని కదలదు. ఏం కావాలన్నా ముసలాయన లేచి ఇవ్వాల్సిందే.

భర్తకి పోటీగా ఎప్పుడూ రాస్తుండేది. “ఏం రాస్తున్నావమ్మా?” అని దగ్గరకి వెళ్ళి చూడబోతే "నీకేమి అర్థం అవుతుందే, పేరుకే నీది డిగ్రీ, అఆ లు కూడా సరిగ్గా రాయలేవు, నోరు మూసుకుని పని చేసుకో ఫో" అనేది రాస్తున్న పుస్తకం మూసేస్తూ.

“హ!హ!హ! ఏం రాస్తుందీ!? నీ గురించే.... హేమ ఇవాళ కూరలో కరివేపాకు వేయలేదు, వంకాయ పచ్చడి చేసింది, సాంబార్ బాగా లేదు, ఎర్ర చీర కట్టిందీ... ఇవే కదా రాసేది మీ అమ్మ గారు" అని నవ్వించేవాడు ముసలాయన.

“మీరూరుకోండీ.... మీకెందుకూ నేనేం రాస్తే.... అయినా పనోళ్ళతో ఏంటి మీకు మాటలు.... అసలు వాళ్ళకి అర్థం కాకుండా నాతో ఇంగ్లీషులో మాట్లాడండీ...” అనేది అరుస్తా. ఆయన ఇంకా పెద్దగా నవ్వేవాడు. నాకు నవ్వు ఆగేది కాదు.

కొడుకు కోడలు టౌనులో ఉంటారు. వారానికో రెండు వారాలకో ఒకసారి కొడుకు వచ్చి చూసి పోతాడు. వచ్చేప్పుడు ఇంటికి కావలసినవన్నీ కారునిండా వేసుకోని వస్తాడు. వచ్చిన ప్రతిసారీ నాకు కృతజ్ఞతలు చెప్పుకుంటాడు. 'మా అమ్మానాన్నలని బాగా చూసుకుంటున్నావు హేమా! నీ రుణం తీర్చుకోలేనిది' అంటాడు పాపం. కోడలు నాలుగైదు నెలలకొకసారి మొక్కుబడిగా వచ్చేది. అత్త ఎదురుగ్గా కుర్చీలో కూర్చుని ఏవో చీరల గురించీ, నగల గురించీ పొడిపొడిగా మాట్లాడేది.

ముసలాయనైతే కోడలు వైపు చూసి నవ్వి పేపర్లో తల దూరుస్తాడు. “బాగున్నావా? ఇహిహి" అని ముసలమ్మే తపతపలాడేది.

భార్యకి భయపడేవాడు ముసలాయన. "వయసులో ఉన్నప్పుడు నా మీద ఎంత దాష్టీకం చేసేవాడో ఇప్పుడు చూడు హేమా, నోట్లో నాలుక లేని వాడిలా ఎలా ఉన్నాడో" అని హుషారుగా ఉన్నప్పుడు ఆయన మీద నాకు చాడీలు చెప్పేది.

ఇద్దరూ ఒకేసారి భోజనానికి కూర్చునే వారు. “ఇతరుల మీద ఆధారపడకుండా ఇలా తిరుగుతున్నప్పుడే చనిపోతే బావుండు" అనుకునే వారు అప్పుడప్పుడూ. ఈ విషయం లో మాత్రం ముసలామె భర్త మాటకి "ఊ" అనేది తప్ప ఇక ఏ విషయంలోనూ ఆయనతో ఆమె ఏకీభవించేది కాదు.


3.

ఆలోచనల్లో పడి ఆ ఇల్లున్న వీధిలోకి వచ్చాను. నాకు తెలియకుండానే నా కాళ్ళు ఇటువేపు లాక్కువచ్చాయి. ముసలాయన ఎప్పటిలాగే రావి చెట్టు కింద ఎత్తరుగు మీద కూర్చుని పేపర్ చదువుకుంటున్నాడు. ప్రహరీ గోడ మీదుగా నన్ను చూస్తాడేమో, పలకరించాల్సొస్తుందేమోనన్న ఇబ్బందితో చూసీ చూడనట్లుగా చూసుకుంటూ గబగబా ఇంటిని దాటి ముందుకెళ్ళాను.

“ఏందే హేమా బాగున్నావా ఏడకీ...” అడిగింది పద్మ ఎదురొచ్చి.

సంవత్సరంలో ఆరు నెలలు ఆ రావిచెట్టు రాల్చే ఆకులు ఊడ్వటానికి ఊరికి దూరంగా మిట్టమీద కొత్తగా కట్టిన ఇందిరమ్మ నగర్ లో ఉండే పద్మని పెట్టుకున్నారు. ఎప్పుడన్నా నాకు ఇబ్బందై రాకపోతే పద్మే వంట చేసి పెట్టేది వాళ్ళకి.

“కూరకి - రామక్కోళ్ళ తోట కాడికి పోయి - నాలుగు టమాటాలు తెచ్చుకుందామని పోతన్నాలే గాని అమ్మగారు అయ్యగారు ఎట్లున్నారు?” అన్నా.

“అట్నించేగా వస్తన్నావు... లోపలకి పోయి పలకరించి రాకపోయావా? ” అంది.

“ఆఁ తర్వాతెప్పుడన్నా వచ్చి పలకరిస్తాలే... బాగానే ఉన్నారుగా" అని "వాళ్ళబ్బాయి వస్తే నాకు చెప్తావా పద్మా?” అన్నాను ఏమీ బయట పడకుండా.

“నీకు తెలియదా! వాళ్ళబ్బాయి ఏదో పని మీద అమెరికాకి పోయాడంట. వస్తే చెప్తాలే" అంది నా వైపు పరిశీలనగా చూస్తూ.

నేను మానెయ్యగానే పద్మ పక్కింట్లో ఉండే రామిగాడి కొత్త పెళ్ళాం లావణ్యని పనికి కుదిర్చిందంట.

నా మొగుడొచ్చి గోల చేశాడని పనిలోంచి తీసేశారని అందరూ అనుకుంటున్నారు కాని ముసిలోళ్ళు ఇక నన్ను రానియ్యరన్న సంగతి పద్మకి తెలియదా? నేను చేసిన పని చెప్పి ఉంటారేమో అనుకోగానే నా తల వాలిపోయింది.

"అబ్బ, ఎండ మండిపోతంది తల్లా!” అని - ఇంకేం అడుగుతుందో ఏమో అనుకుని కొంగుని తలపైకి లాక్కుని - గబగబా అక్కడ నుండి ముందుకి నడిచాను.


4.

నన్నింకేమి రానిస్తారు ఇంట్లోకి? పోగొట్టుకున్నాను మంచి పనిని. కళ్ళల్లో నీళ్ళు ఊరాయి.

మాది కూడా ఈ ఊరు కాదు. మా చిన్నమ్మోళ్ళూరు. ముసలోళ్ళని చూసుకోవడానికి మనిషి కావాలంటే మా చిన్నమ్మ నన్ను పిలిపించింది. నా తాగుబోతు మొగుడిని వదిలిచ్చుకోని బిడ్డలిద్దర్నీ తీసుకోని వచ్చాను.

నేను వచ్చినప్పుడు వంట చేయడానికి ఒక మనిషి ఉండింది. ముసలమ్మకి కాలు మీద కురుపు లేచి నడవలేని స్థితిలో ఉంటే నన్ను నర్సు పనికన్నట్లుగా పెట్టుకున్నారు. మంచం లోనే అన్నీ చేయవలసి వచ్చింది. చీదరించుకోకుండా చేశాను.

అబ్బ! ఆరు నెలలు టిబి అనీ, జాండిస్ అనీ తెగ మందులు మింగింది. కొడుకు రోజూ వచ్చి చూసి పోయేవాడు. ఈమెకి కురుపు తగ్గిపోయే సమయానికి నా అదృష్టం బాగుండి వంటామె మానేసింది. నేనే చేసుకుంటానని ఆ ఇంట్లో పూర్తి పనికి కుదురుకున్నాను.

వాళ్ళని అంత బాగా చూసుకున్న దాన్ని ఆ దరిద్రపు దొంగతనం ఆలోచన నాకెందుకు కలిగిందో... కలిగాక ఆ అలవాటు వదల్లా... వాళ్ళు రూమ్ కి తాళం వేసుకునే దాకా నాకు 'తప్పు చేస్తున్నానన్న' భావన కూడా కలగ లేదు. వాళ్ళు తినగా ఏమన్నా మిగిలితే డైనింగ్ టేబుల్ మీద పాచి పోవాల్సిందే కాని ఇవ్వడం తెలియకపోతే ఏం చేయాల తీసుకోక? అని అనుకునేదాన్ని.

వాళ్ళకి అన్నీ ఎంత ప్రేమగా అమర్చాను? ముసలమ్మకి ఎంత సేవ చేశాను? అయినా వాళ్ళ నోటితో 'ఇదిగో ఈ పండు తీసుకోని పోయి పిల్లలకి పెట్టుకో, ఈ పాత చీర తీసుకో' అనే వారు కాదు.

ప్రేమ ఇవ్వడం తెలియని మనుషులు. పోనీ ప్రేమ తీసుకునే వారా అంటే అదీ లేదు. ఏదో యాంత్రికంగా పెట్టింది తినడం, చేస్తానన్న పనులు చేసేసి వెళ్ళిపోయిందా లేదా అని చూడటం అంతే. పని బాగా చేయకపోయినా పెద్దగా అడిగే వాళ్ళు కాదు. జీతం డబ్బులు మాత్రం ఒకటవ తేదీ నాడు తుచ తప్పకుండా చేతిలో వేసేవారు.

నా మొగుడితో నాకున్న బాధలు చెప్పబోతే - ముసలామె 'చ్చ్! చ్చ్! చ్చ్!' అనేది సగం వినకుండానే. ముసలాయన పేపర్లోనుండి తల కూడా ఎత్తేవాడు కాదు.

నా మొగుడికి నేను రెండో పెళ్ళాన్ని. మొదటి పెళ్ళాం వదిలిపెట్టి పోయింది. అదేందో వాడి రాత - ఇద్దరం చదువుకున్నోళ్ళమే దొరికాం. వాడు కూడా డిగ్రీ వెలగబెట్టాడులే. పెయింట్ పని చేస్తాడు. టీచర్ ట్రైనింగ్ చేసిన ఆ మొదటామెకి అదృష్టం బాగుండి గవర్నమెంట్ టీచర్ గా ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం రాగానే విడాకులు తీసుకుంది.

ఉద్యోగం ఉందన్న గర్వంతో మొగుడ్ని వదిలి పెట్టిందన్నారు జనం . కూటికి కూడా జరుగుబాటు లేక బాధపడుతున్న మా అమ్మ - లోకం మాటలని నమ్మి నన్ను వీడికి కట్టబెట్టింది.

ఇలాంటి వెధవలని వదిలేసిపోవడమేనా చేయవలసింది ఆడవాళ్ళూ.... వాళ్ళ గురించి నలుగురికీ చెప్పి నానా యాగీ చేయవలసిన బాధ్యత లేదా!!? వదిలేసిన మనిషి వీడి గురించి చెప్పి రచ్చ చేసినట్లైతే నా గొంతు కోసేది కాదు కదా మా అమ్మ!?

ఈ ఊరికి చేరి ఇక్కడ కుదురుకోగానే మళ్ళీ నా వెనకే వచ్చి ఇంట్లో చేరాడు. బాగా జీతం వస్తుంది. ఇంట్లోకి కావలసిన బియ్యం, పప్పులు, పండ్లు ఒకటని కాదు ఏది దొరికిదే అది దొరికిచ్చుకుని తెచ్చుకుంటున్నానుగా... 'చావనీయ్ లే' అని వాడికి కూడు వేసేదాన్ని.

వస్తువులు పోతున్నాయని తెలిసినా ముసలోళ్ళు నన్నేమీ అడగలేదు. నేను మానేస్తే జరగదు కనుక గుటకలు మింగుకుని ఉన్నారో లేక కనిపెట్టలేకపోయారో తెలియలేదు.

స్టోర్ రూమ్ కి తాళం వేయడానికి ముందు రోజు "ఇక్కడ పెట్టిన బిస్కెట్ పా్యకెట్ ఏమయింది హేమా?” అని అడిగింది ముసలామె. “నాకేం తెలుసు?” అన్నాను నిర్లక్ష్యంగా చూస్తూ.

తర్వాత రోజు నేను వెళ్ళేప్పటికి స్టోర్ రూమ్ తాళం వేసి ఉంది. ముందురోజు కొడుకు వచ్చి పోయాడుగా, అది అతనిచ్చిన ఐడియా అయి ఉంటుంది అనుకున్నాను.

“ఏందమ్మో తాళాలేసుకున్నారు?” అన్నాను దాష్టీకంగా.

“అబ్బాయేందో ముఖ్యమైన కాగితాలు పెట్టుకున్నాడంట హేమా గదిలో - తాళం వేసి ఉంచమన్నాడు" అంది ముసలమ్మ నట్టునట్టుగా.

నేను మెదలకుండా ఊరుకున్నాను. ముసలాయన నన్ను వంటకి కావలసినవి తీసుకోమని, తీసుకున్నాక మళ్ళీ తాళం వేసేవాడు. వంట చేసినంత సేపూ ముసలమ్మ రాసుకోవడం ఆపి కళ్ళజోడులోంచి అప్పుడప్పుడూ నా వైపు చూస్తూ ఉండేది.

ఇంక నా చేతులు కట్టేసినట్లయింది. వచ్చిన జీతం డబ్బులు చీటీకి కట్టడానికి సరిపోయేవి. బాగా జరుగుబాటుంది కదాని చీటీ వేసి ఎత్తి కమ్మలు కొనుక్కున్నాను.

ఇంట్లో మొగుడితో మళ్ళీ గొడవలు మొదలయ్యాయి. సంపాదించిందంతా తాగుడికి ఖర్చు పెట్టుకోని ఇంట్లో పడి తినడం మరిగిన వాడికి తిండి ఎక్కడ నుంచి తెచ్చి పెట్టేది?

"కుక్కకేసినట్లు పచ్చడి మెతుకులు వేస్తన్నావే? డబ్బులన్నీ ఏం చేస్తన్నావే?” అని పైనబడి కొట్టడం, బూతులు తిట్టడం.

ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్నప్పుడు నా చెవులకున్న కమ్మలు కాజేసి నాలుగు రోజులు కనపడకుండా పోయాడు. ఏడ్చి ఏడ్చి నాకు కళ్ళు వాచిపోయాయి.

ఐదో రోజు రాత్రి పదిగంటలప్పుడు పూలరంగడిలా కొత్త చొక్కా లుంగీ కట్టి తాగొచ్చి వాగుతుంటే రోకలి బండ తీసుకోని వెంట బడ్డాను.

“నన్ను కొట్టేదానికి కూడా తిరగబడతన్నావా!? వాళ్ళ ఉద్యోగం చూసుకోనే నీకు బలుపు ఎక్కువయింది. ఆ ముసలోడి సంగతి తేలుస్తా" అంటా వాళ్ళింటి మీదకి పోయాడు.

ఈ తాగుబోతోడు వాళ్ళనేమంటాడోనని నిద్రపోతున్న మా చిన్నమ్మోళ్ళని, ఊరోళ్ళందరినీ లేపి వాళ్ళని వెంటేసుకుని వెళ్ళేప్పటికే "నా పెళ్ళాన్ని పనిలోంచి తీసేశావా సరే లేకపోతే మిమ్మల్ని నేనేం చేస్తానో నాకే తెలియదు" అని పెద్ద పెద్దగా అరుస్తా ముసలాయన్ని నానా మాటలూ అంటా ఉన్నాడు.

ఊళ్ళో వాళ్ళంతా "ఏందాయన్ని నువ్వు చేసేది ఫా" అంటా వీడ్ని తన్ని ఊళ్ళో లేకుండా తోలారు.

తెల్లవారి పనికి వెళ్ళేప్పటికి లోపల గడేసుకుని "పనికి వద్దులే హేమా! మేము అబ్బాయి దగ్గరకి వెళుతున్నాం" అన్నాడు ముసలాయన కిటికీ లోంచి.

పాపం! భయపడి ఉంటారు. 'ముందు వీడిని వదిలించుకోని రావాల. అప్పుడు పనికి రానిస్తారు, ఇన్నేళ్ళు వాళ్ళకి నేను చేసిన సాయాన్ని మర్చిపోరులే' అనుకున్నాను. అప్పటికప్పుడే చిన్నమ్మని తీసుకోని పోయి నా మొగుడి మీద పోలీసు కంప్లయింట్ ఇచ్చి అటునుండి అటే లాయరు దగ్గరకి వెళ్ళి విడాకులకి కూడా రాసుకున్నాను.

కోర్టుకి, లాయర్లకి డబ్బులు పోసేదెందుకు అనుకుని నా మొగుడి అమ్మనాన్న వచ్చి పోలీసులకెదురుగ్గా రాజీ చేయించి వాడిని తీసుకోని పోయారు.

ఆ దరిద్రం వదిలేప్పటికి రెణ్ణెళ్ళు పట్టింది.

పని నాకు ఇవ్వమని అడుగుదామని రావిచెట్టింటికి వెళ్ళాను. ముసలాయన నన్ను వాకిట్లో చూసి పలకరింపుగా నవ్వి తల పేపర్లోకి దూర్చాడు.

“బాగున్నారా అయ్యగారూ?” అన్నాను.

“ఆఁ బాగున్నా. నువ్వు బాగున్నావా?” నా సమాధానం అక్కర్లేదన్నట్లుగా మళ్ళీ తల పేపర్లోకి పెట్టేశాడు.

లోపలకి పోదామని తలుపు లాగాను. నన్ను చూసిన ముసలామె "ఎవరూ.... హేమా! ఎందుకొచ్చా? ఫో! ఫో!” అని కుక్కను తరిమినట్లు పెద్దగా అరిచింది.

దిమ్మెరకి పోయాను. “ఏందమ్మో! ఫో అంటున్నావూ... పలకరిద్దామని వస్తే" అన్నాను.

“ఏం పలకరించక్కర్లేదులే ఫో! అమ్మాయ్ లావణ్యా అయ్యగారిని లోపలకి పిలువు" అని వంటింట్లో పని చేసుకుంటున్న కొత్త పనిమనిషికి చెప్పి "ఏమండీ! ఏమండీ! మీరు లోపలకి రండి" అని తచ్చడ తచ్చడగా అరుస్తా ముసలాయన్ని కేకేసింది.

“అవునులే ఇన్నాళ్ళూ మీకు చేసిన సాయం గాలిలోకి పోయింది" అన్నాను.

“మా ఇంట్లోని సామానంతా నీ ఇంటికి చేరేసుకున్నప్పుడే గాలిలో కలిసిపోయిందిలే నీ సహాయం ఫా, నీతో మేము మాట్లాడలేం గాని" అన్నాడు కఠినంగా ముసలాయన. తలుపు తీసి లోపలకి వెళ్ళి లోపల్నుంచి గడి పెట్టుకున్నాడు.

నాకు నోటి వెంట మాట రాలేదు. నిస్సత్తువగా గడపలు దిగి గేటు తీసుకుని బయటకి వచ్చేశాను.

5.

“ఏంది హేమా ఇటుబడి వచ్చావ్? " అంది చేలో పని చేసుకుంటున్న మా పక్కింటి రామక్క.

బియ్యము, పప్పులు దొంగతనంగా తెచ్చినన్నాళ్ళూ వండిన దాంట్లో రామక్కకి పెట్టేదాన్ని. వాళ్ళు స్టోర్ రూముకి తాళం వేశాక "తిండికి కష్టంగా ఉందక్కా" అంటే - 'ఎందుకులేవే ఆ పన్లు, ఉన్నదేదో సర్దుకు తినాలి. ఇన్నాళ్ళూ నాకు పెట్టావు. కూరకీ నారకీ నా చేలో టమాటాలు తెచ్చుకుందువు గానిలే' అనాల్సింది పోయి "కుక్కర్లోకి బియ్యం కొలిచి పోసుకునేప్పుడు ఎక్కువ పోసుకోవే, వండినవి డైనింగ్ టేబుల్ గిన్నెల్లో సర్దేప్పుడు పొయ్యికాడే అటు తిరిగి నిలబడి నాలుగు ముద్దలు నోట్లో వేసుకో, ముసిలోళ్ళు చూస్తారా ఏమన్నానా?” అన్న రామక్క మాటలు గుర్తొచ్చి టమాటాలు అడగబుద్ధి కాలేదు.

"చేసిన తప్పుడు పనులు గురించి ఆలోచిస్తా ఉంటే కాళ్ళు ఇటు లాక్కొచ్చాయిలే రామక్కా!" అంటా ఆమె తోటని దాటి "దుక్కుల్ని" తప్పించుకోని రోడ్డెక్కాను.

నా పక్కగా కారు ఆగింది. తలుపు తీసుకుని అయ్యగారబ్బాయి దిగాడు.

అప్రయత్నంగా నమస్కారం చేశాను. కళ్ళ వెంబడి నాకు తెలియకుండానే కన్నీళ్ళు తిరిగాయి.

“హేమా, బావున్నావా? ఎక్కడకి ఎండలో పోతున్నావు?” అన్నాడు.

ఇక ఉద్వేగం ఆపుకోలేకపోయాను. నాకు తెలియకుండానే నా నోట్లోంచి మాటలు దొర్లుతున్నాయి. చేసిన పనులూ, దాని వల్ల నాకు కలిగిన బాధ, వాళ్ళ మీద నేను పెట్టుకున్న ఆశలు అన్నీ... అన్నీ... మాట్లాడుతూనే ఉన్నాను. మాట్లాడి మాట్లాడి అలాగే కాళ్ళ మీద కూలబడిపోయాను.

తర్వాత ఏమయిందో నాకు తెలియలేదు.

లేచి చూసేప్పటికి నా చుట్టూ జనం. అమ్మగారు కుర్చీలో నా పక్కనే కూర్చుని ఉన్నారు. అయ్యగారు, వాళ్ళబ్బాయి, ఇంకా మా వాళ్లు కొంతమంది నా ముఖంలోకి చూస్తూ అక్కడే నిలబడి ఉన్నారు. రావి చెట్టు నాకు నీడనిస్తూ నన్ను తన చల్లగాలితో సేద తీరుస్తోంది.

ఇక దిగులేమీ లేదన్నట్లు శాంతిగా కళ్ళు మూసుకున్నాను.

*******

శేఫాలిక

//శేఫాలిక// - ఈ వారం నవతెలంగాణాలో నేను రాసిన కథ.

"రాధగారూ, లివ్ ఇన్ రిలేషన్ షిప్ టాపిక్ తీసుకొని ఏదైనా కథ రాయకూడదా!?" అనిVanaja Tatineni గారు చాలా నెలల క్రితం నాతో అన్నారు. రాశాను, తృప్తిగా రాలేదు. నానేశాను చాలా రోజులు. మొన్నామధ్య దాన్ని బయటకి తీసి ముందు వెర్షన్ ని fb లో పెట్టాను కూడా ఓ గంట సేపు. కాని అస్సలు నచ్చలేదు. ఈ హాస్పిటల్, ఈ టీచర్ కా్యరెక్టర్ ఇవన్నీ ఏమీ లేకుండా రాసిందనమాట ముందు వెర్షన్. ఈ లోపు Revathi Ravuri గారు చదివేశారు. వెంటనే మెసేజ్ పెట్టారు, చెప్పాను ఎందుకు తీసేశానో. కొన్ని మార్పులు చేర్పులు చేసి పెట్టండి. కథ బావుంది అన్నారు. సో మళ్ళీ దాని మీద కాస్త పని చేసి క్రాఫి్టంగ్ చేసుకుని గుడిపాటి వెంకట్ గారికి (నవ తెలింగాణాకి) పంపాను. సరే, పత్రికలో వేసుకున్నారనుకోండి. వేస్తున్నట్లు చెప్పొద్దూ... ఇప్పుడే వనజగారు మెసేజ్ పెడితే తెలిసింది ఈరోజు ఈ కథ వచ్చినట్లు. వనజగారికి థాంక్స్ చెప్పుకుంటూ... వెంకట్ గారిని విసుక్కుంటూ... (అయినా ఆయనంటే నాకు చాలా గౌరవం లెండి ఫ్రెండ్స్), కథని చదవమని మిమ్మల్ని కోరుకుంటూ - మీ రాధ 



శేఫాలిక
- రాధ మండువ

గుట్టమీద శిధిలమైపోతున్న మర్రిచెట్టు క్రింద కూర్చున్నాను. చిక్కపడుతున్న చీకటి నన్ను మింగేస్తున్నా నాకు లేవాలనిపించలేదు. మూలికల వాసన. అలాగే వాలిపోయి నిద్రలోకి జారుకున్నాను. ఎంత సేపు నిద్రపోయానో మరి - లేచి చూసేప్పటికి నా చుట్టూ చిమ్మచీకటి అలుముకుని ఉంది. ఎంత సుఖమైన నిద్ర. ఏదో కొత్తదనం. దిగంతాల వరకు వ్యాపించిన ఆ తిమిరం సన్నగా గుసగుసలాడుతోంది.

ఎక్కడున్నాను నేను? మాయమైపోయానా!? లేదే.... ఇక్కడే ఉన్నాను. కాళ్ళు చేతులు విదిలించుకుని చూసుకున్నాను. నా దేహమేనా ఇది? ఇలా చూసుకుంటుంటే ఏదో కొత్తగా ఉంది. చీకటిని తొలగిస్తూ ఒక్కసారిగా వెలుగు. అరె, ఏమిటా వెలుగు? చంద్రుడు! నాకు దగ్గరగా కనిపిస్తూ వెలుగుల్ని విరజిమ్ముతున్నాడు. ఎదురుగ్గా నది నా ముందు ప్రత్యక్షమైంది! నీళ్ళపై నుంచి వినపడుతున్న సన్నని సంగీతం మాధుర్యం కొలుపుతోంది. అనంతమైన ఆ నీరు ఎంత స్వచ్ఛంగా ఉందీ!? వెళ్ళాలి, నా నదిని దాటి, శుభ్రం చేసుకుంటూ...

నా ముందు నాలాంటి వారే నదిలోకి పరిగెత్తుతున్నారు. కొందరు నిశ్శబ్దంగా, కొంతమంది గోలగోలగా, మరికొంత మంది గంభీరంగా... నా వెనక కూడా ఎవరో వస్తున్నారు. నర్స్, ఆ సెలైన్ సరిచెయ్... పట్టుకో, నెమ్మది... ఎవరో మాట్లాడుకుంటున్నారు. గభాల్న మెలకువ వచ్చింది.

2.

కళ్ళు తెరిచాను. నా గదిలోకి వచ్చిన నర్సులు ఇద్దరు ఆమెని స్టె్రచర్ మీద నుంచి మంచం మీదకి చేరుస్తున్నారు. లేచి కూర్చున్నాను. ఆవిడ మత్తులో ఉంది. అబ్బ! ఎంత అందంగా ఉందావిడ. విప్పారిన మల్లెపువ్వుని అరచేతిలోకి తీసుకున్నప్పుడు కనిపించేంత సౌకుమార్యం.

ఏమయింది ప్రమీలా?” అన్నాను నర్సుతో.

మీలాగే ఆత్మహత్య కేసు. ఆడవాళ్ళు ధైర్యంగా ఉండాలని ఎన్ని కథలు, ఎన్ని సినిమాలు వచ్చినా ప్రయోజనం లేదులెండి అనితా మేడమ్, ఏమిటో మన బతుకులు!" అంది.

ప్రమీల మాటలకి బాధేసింది. ఆ పని చేసి బతికి బయటపడ్డాక అదెంత హీనమైన పనో తెలిసినదాన్ని కదా!

ఆమెని పడుకోబెట్టి నర్సులు వెళ్ళిపోయారు. సమయం ఏడవుతోంది. నాకొచ్చిన కల గురించి ఆలోచిస్తూ ఆమె వైపు చూశాను. ఒక్కతే అలా నిస్సహాయంగా పడి ఉంది. ఆమెతో ఎవరూ రాలేదేమో! ఎంతందంగా ఉందీ? మరోసారి అనుకున్నాను. కాసేపటికి ప్రమీల వచ్చి నా టెంపరేచర్ చూసి జ్వరం లేదు. టిఫిన్ రాగానే తినేసి టాబ్లెట్స్ వేసుకోండి మేడమ్ అంది.

"ప్రమీలా, ఆమెకి ఎవరూ లేరా?”

"ఉన్నారు మేడమ్. ఈమె ఏర్ హోస్టెస్ , అతనేమో పైలట్ అంట. ఇద్దరూ భార్యాభర్తలు కాదు - లివ్ ఇన్ రిలేషన్ షిప్ అంట. అతనితో కొడుకు పుట్టాక ఎందుకో మరి విడిపోయారంట. ఆ పిల్లాడు ఇప్పుడు ఈమెని వదిలి తండ్రి దగ్గరకి పోయాడని భరించలేక నిద్రమాత్రలు మింగేసింది" అంది.

అయ్యో, ప్రమాదేమేమీ లేదు కదా!?” అన్నాను.

లేదు, షి ఈజ్ ఆల్ రైట్, మీరేమీ ఆలోచించకుండా పడుకోండి, అలా కూర్చోవద్దు" అంది.

చాలా అందంగా ఉంది కదా!?” అన్నాను.

అవును, ఏర్ హోస్టెస్ కదా మరి, పేరు కూడా భలే ఉంది 'శేఫాలిక' అంట" అంది ప్రమీల.

మా పెద్దబ్బాయి టిఫిన్, ఒకేసారి మధ్యాహ్నానికి కూడా భోజనం తెచ్చాడు. ప్రక్క మంచం మీద పడుకుని ఉన్న ఆమెని గురించి అడిగి తెలుసుకుని "అయ్యో, ఇలాంటి పనులు చేయకూడదమ్మా ఆడవాళ్ళు... ధైర్యంగా నోరు తెరిచి మాట్లాడాలి, సమస్యని ఎదుర్కొని నిలబడాలి" అన్నాడు దిగులుగా. వాడి తల నిమిరి "పొరపాటు చేశాన్రా, సారీ, ఇవన్నీ మనసులో పెట్టుకోకుండా బాగా చదువుకో" అన్నాను. నేను టిఫిన్ తినిందాకా ఉండి ఖాళీ డబ్బాలు తీసుకుని కాలేజీకి వెళ్ళిపోయాడు. టాబ్లెట్ వేసుకుని పడుకున్నాను.


3.

మూడు గంటలప్పుడు ఆమె కళ్ళు తెరిచి మూలుగుతోంది. గభాల్న లేచి నర్స్ లుండే డెస్క్ దగ్గరకి వెళ్ళి ప్రమీలని పిలిచాను.

మెలకువ రాగానే ఆమెలో ఏమి ఆలోచనలు కదలాడాయో కళ్ళ వెంట నీళ్ళు కారిపోతున్నాయి. ఆమె కన్నీళ్ళని టవల్ తో తుడుస్తూ "ఊరుకోండి ఏం కాలేదు. మీరు బాగానే ఉన్నారు" అంది ప్రమీల. నేను దగ్గరకి వెళ్ళి పలకరించాను. సుదూరంగా దిశల కొసల అంచుని చూస్తున్నట్లున్న ఆమె కళ్ళు నా వైపుకి తిరిగాయి. ఎంత పెద్ద కళ్ళు! ఆ కళ్ళు అశాంతిగా కదులుతున్నాయి. నన్ను చూడటం ఇష్టం లేనట్లు ముఖం కిటికీ వైపుకి తిప్పుకుని పడుకుంది.

సాయంత్రం ఆరవుతుండగా డాక్టర్ వచ్చి మా ఇద్దరినీ చెక్ చేసి వెళ్ళింది. ప్రమీల ఆమె చేతి నుండి సెలైన్ ని తీసి వేసి ఆమెకి నన్ను పరిచయం చేస్తూ "ఈమె పేరు అనిత. గవర్నమెంట్ టీచర్. వీళ్ళ ఇంటాయన పెట్టే బాధలు భరించలేక...” అని ఇంకేమీ మాట్లాడలేక ప్రమీల నా వైపు చూసి మాటలు ఆపేసింది.

నేను నవ్వుతూ "ఈ వార్డ్ లోకి వచ్చేవాళ్ళంతా దుర్బల మనస్తత్వం కలిగిన వాళ్ళేనని ఆమెకి ఈపాటికి అర్థం అయే ఉంటుందిలే ప్రమీలా" అన్నాను. ప్రమీల కూడా చిన్నగా నవ్వింది. ఆమె మాత్రం ఏమీ మాట్లాడలేదు. తన ఆలోచనల్లో తను ఉంది.

గదికి ప్రక్కగా ఉన్న మందారం చెట్టు కిటికీలో నుండి తొంగి చూస్తోంది. కాంపౌండ్ గోడకి ఆనుకుని పొడవుగా పెరిగిన అశోకా చెట్లు గాలికి తలలూపుతున్నాయి. వాటి ప్రక్కనే ఉన్న మర్రిచెట్టు కొమ్మల్లోంచి వినపడుతున్న గరగరల శబ్దం తప్ప అంతటా నిశ్శబ్దం ఆవరించుకుని ఉంది. చీకట్లను పూర్తిగా తొలగిస్తూ చంద్రుడు ఆకాశంలోకి చేరాడు.

ఒక్కసారిగా ఏడుస్తూ "నన్నెందుకు బ్రతికించారు? ఎందుకీ బ్రతుకు? ఎవరి కోసం?” అంది.

నేను గభాల్న ఆమె మంచం మీద కూర్చుని ఆమెని పట్టుకున్నాను. ప్రమీల "ఊరుకోండి మేడమ్, ఎవరి కోసమో బ్రతకడం ఏమిటి? మన కోసం మనం బ్రతకొద్దా? చదువుకున్నారు ఆ మాత్రం తెలియదా!? లేవండి, లేచి ముఖం కడుక్కుని టాబ్లెట్ వేసుకోండి” అంది.

"ఎందుకు తెలియదు? తెలిసినా తెలియనట్లు నటించాను. లోకంలో సగం మంది అంతేనేమో! తమ గురించి తెలుసుకోవాలని అనుకోరు. విశ్లేషించుకోవడానికి అసలంగీకరించరు. తెలుసుకునేప్పటికి చాలా పోగొట్టుకుంటారు. నేను పోగొట్టుకున్నాను - నా బిడ్డని... నా జీవితాన్ని" అంది. ఆమెని పట్టుకుని ఉన్న నేను "లేచి కాసిన్ని మంచినీళ్ళు తాగి టాబ్లెట్ వేసుకోండి, బాధపడకండి" అంటూ ఆమెని లేపి కూర్చోపెట్టాను. ప్రమీల సహాయంతో టాబ్లెట్ మింగి మళ్ళీ పడుకుంది. దాదాపు రెండు గంటల సేపు ఎవరి ఆలోచనల్లో వాళ్ళమున్నాం. మా ఆయన, పెద్దబ్బాయి క్యారియర్ తెచ్చారు. మా పెద్దబ్బాయి చేత టీ తెప్పించాను. కాసేపు కూర్చుని వాళ్ళు వెళ్ళాక "శేఫాలిక గారూ, కాస్త టీ తాగుతారా?” అన్నాను. ఆవిడ లేచి కూర్చుంది. టీ తాగుతూ "మీకూ ఒక్కడే కొడుకా!?” అంది.

"ఇద్దరు అబ్బాయిలు. వీడు పెద్దవాడు. చిన్నవాడు హాస్టల్ లో ఉండి చదువుకుంటున్నాడు" అన్నాను.

వింటున్న ఆమె ముఖం మళ్ళీ దిగులుగా మారింది. ప్రమీల వచ్చి "మేడమ్, మీకు ఏమైనా టిఫిన్ తెప్పించమంటారా? ఆకలేస్తేనే తినమన్నారు డాక్టర్ గారు?” అంది ఆమెతో.

ఊహు, ఆకలిగా లేదు" అంది. టీ తాగాక దిండ్లకు ఆనుకుని కూర్చుని "మా అబ్బాయి అంటూనే ఉండే వాడు 'ఏంటి మమ్ ప్రతి దానికీ ఇన్ని ప్రశ్నలు వేస్తావు?' అనో 'నువ్వసలు మనుషుల్ని నమ్మవా' అనో 'అబ్బబ్బ ఊపిరాడ్డం లేదు ఈ ఇంట్లో' అనో. నాకర్థం అయ్యేది కాదు. నా రెండు చేతుల మధ్య అయితేనే వాడు క్షేమంగా ఉంటాడు అనుకునేదాన్ని. ఇప్పుడు వాడికి పదహారేళ్ళు. నన్ను అర్థం చేసుకోవలసిన వయసులో - ఎవరినుంచైతే వాడిని దూరంగా ఉంచాలనుకున్నానో అక్కడికి - వాళ్ళ నాన్న దగ్గరకి వెళ్ళాడు నన్ను వదిలి" ఆమె కళ్ళల్లోకి మళ్ళీ తడి చేరింది.

ఊరుకోండి మేడమ్, అవన్నీ మాట్లాడకుండా ప్రశాంతంగా ఉండండి. రాత్రికి వేసుకోవాల్సిన టాబ్లెట్్స తెస్తాను వేసుకుని పడుకుందురుగాని" అని నా వైపు చూస్తూ "మీరు తినేసెయ్యండి మేడమ్, టాబ్లెట్ వేసుకుందురుగాని" అంది ప్రమీల.

ప్రమీల టాబ్లెట్స్ ఇచ్చి వెళుతుంటే "మీరు కూడా ఇక్కడే ఉండండి నర్స్, నాకు చాలా దిగులుగా ఉంది" అందామె. “అలాగేలే, పనయ్యాక మళ్ళీ వస్తా" అంటూ ప్రమీల వెళ్ళిపోయింది. ప్రమీల వెళ్ళాక ఏమైనా మాట్లాడుతుందేమో అనుకున్నాను కాని ఏమీ మాట్లాడకుండా మళ్ళీ పడుకుంది.

కాసేపయ్యాక నేనే "కొంచెం రసం అన్నం తినండి, టాబ్లెట్ వేసుకుందురుగాని" అని క్యారియర్ విప్పి రసం అన్నం కలిపి ఇచ్చాను. వద్దంటూనే తీసుకుని మెల్లగా తినింది. నేను కూడా కాస్త తిని బాత్ రూమ్ లోకి వెళ్ళి క్యారియర్ కడిగి తెచ్చాను. ఆమె కూడా బాత్ రూమ్ కి వెళ్ళి వచ్చింది.

పడుకుంటూ "మేడమ్, ప్రమీల ఇంకా రాలేదే!?” అంది. 'ఆమె తన గురించి మాకు చెప్పాలని అనుకుంటున్నట్లుంది' అని మనసులో అనుకున్నాను కాని పైకి నేనేమీ అడగలేదు. లేచి ఆమె మంచం ప్రక్కన కుర్చీ వేసుకుని కూర్చుని "నేనున్నానుగా ఏం పర్లేదు, పడుకోండి” అన్నాను ఆమె చెయ్యి పట్టుకుని.

మొదటి ఝాము చంద్రుడు ఏమీ తెలియనట్లు అమాయకంగా వెలుగులు చిమ్ముతున్నాడు. సన్నని గాలులు ఆమె ముంగురుల మీద ఊగుతున్నాయి. తమని తాము విరబోసుకుంటూ పువ్వులూ, బారులుగా సాగి చెట్లూ ఒళ్ళు విరుచుకుంటున్నాయి. ఎక్కడా ఏ అలికిడీ లేదు.

కాసేపటికి మా గదిలోకి వచ్చిన ప్రమీల నా మంచం మీద అడ్డంగా పడుకుని కళ్ళు మూసుకుంది. మాలాంటి వాళ్ళని ఆమె ఎంత మందిని చూసి ఉంటుందో కదా అనుకున్నాను ప్రమీలని చూస్తూ. ఉన్నట్లుండి శేఫాలిక మేము ఏమీ అడగకుండానే మాట్లాడటం మొదలు పెట్టింది. ఆమె కథని ఇద్దరం వినసాగాం.


4.


నేను ఏర్ హోస్టెస్ ని. మా ఏర్ లైన్స్ కి కొత్తగా వచ్చిన పైలట్ రాజీవ్ చాలా అందంగా ఉంటాడు. వస్తూనే నవ్వులని మోసుకొచ్చిన అతన్ని నేను ఇష్టపడ్డాను. నాకే కాదు ఏదో సమ్మోహనం అతనంటే అందరికీ. నన్ను ఎప్పుడు చూసినా అతని కళ్ళల్లో మెరిసిన మెరుపుని, మైమరుపుని చూసిన నా కొలీగ్స్ అందరూ మమ్మల్ని అతని ఎదురుగ్గానే 'మీ ఇద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్' అనేవాళ్ళు.

కొన్నాళ్ళకే మా పరిచయం 'కలిసి ఉందాం' అనుకునేంత ఆకర్షణగా మారింది. 'దండలు మార్చుకుందాం ఫ్రెండ్స్ ముందు' అన్నాడు. నాకు వాటిమీద పెద్ద నమ్మకం లేదు. పోన్లే అది అతనికి సంతోషం కలిగిస్తుంటే ఎందుకు కాదనాలి? అనుకున్నాను. అతనే నా ఫ్లాట్ లోకి వచ్చాడు. మరి కొన్నాళ్ళకి 'ఉద్యోగం మానేయరాదూ, బయటికి వెళ్ళిన కొద్దీ ఏవేవో అనవసరమైన మాటలు చెప్తుంటారు' అన్నాడు. పెద్దగా నవ్వి 'ఏం, నాకు తెలీకుండా నీకేమైనా సీక్రెట్ లైఫ్ ఉందా? ఉంటే చెప్పు నేనేమనుకోను' అన్నాను. '! అదేం లేదు' అన్నాడు తడబడుతూ. అప్పుడే నాకు అతని మీద అనుమానం కలిగింది. ఇతనితో లివ్ ఇన్ రిలేషన్ షిప్ పెట్టుకుని తప్పు చేశానా? అని కూడా అనుకున్నాను... అయితే ఆ ఆకర్షణలో నేను నా హృదయం చెప్పింది వినిపించుకోలేదు కాని నింగి నుండి మాత్రం నేలకి దిగలేదు. ఐమీన్ ఉద్యోగం మానలేదు. ఎక్కడో ఏ మూలో నాకు 'అతనితో నేను సేఫ్' అనే భావన కలగలేదనుకుంటా.

ఎవరి దారి వాళ్ళదే, ఎవరి పనులు వాళ్ళవే. నింగిలో కాసేపు ఫ్లైట్ లో కలిసి ఉంటాం కదా... అలాగే ఉంది ఇంట్లో కూడా మా కాపురం. అబ్బాయి పుట్టాక నేల మీద విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు అతనికి వేరే ఎవరితోనో సంబంధాలు ఉన్నాయని గమనించాను. నిలదీశాను చాలా సార్లు. నా మాటలని ఏ మాత్రమూ పట్టించుకోకుండా నవ్వి తమాషాగా మాట్లాడి సంభాషణని మార్చేసేవాడు.

మెటరి్నటీ లీవు ముగిశాక మళ్ళీ నింగిలోకి ఎగిరాను - ఈసారి విసురుగా, వేగంగా, ఎందుకో తెలియని ఆక్రోశంతో.

నాకు తెలీకుండా రాజీవ్ కి ఏవో రహస్యాలు ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది. కనిపెట్టాలనే ఆరాటంలో విచక్షణ కోల్పోయాను. అతని కో పైలట్ ఆకాశ్ తో పరిచయం పెంచుకున్నాను. సమయం చూసుకుని రాజీవ్ గురించి నాకున్న అనుమానాన్ని ఆకాశ్ దగ్గర బయట పెట్టాను.

'రాజీవ్ కి ఇంతకు ముందే మేనమామ కూతురుతో పెళ్ళయింది. ఆమెతో అతనికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు, ఈ సంగతి నీకు చెప్పొద్దని చెప్పాడు. నేను చెప్పానని మాత్రం రాజీవ్ తో చెప్పకు' అన్నాడు ఆకాశ్. విన్న నాకు చిత్రంగా బాధ కలగలేదు పైగా గర్వంగా నవ్వుకున్నాను. నా అనుమానం నిజమైందన్న సంతోషం అది.

అతన్ని గురించి ఆకాశ్ చేత చెప్పించుకుని నేను సాధించింది ఏమీ లేదు కాని కసితో ఉన్న నన్ను...” అంటూ ఆగి నా వైపు అనుమానంగా చూసింది. అప్పటికే ప్రమీల నిద్రపోయినట్లుంది. సన్నగా గురక పెడుతోంది.

ఆమెకి ఏదో చెప్పుకోవాలని ఉంది కాని చెప్పడానికి సందేహిస్తున్నట్లుంది. కాసేపయ్యాక ఆమెనే నిదానంగా చూస్తూ "శేఫాలిక గారూ... ఆగిపోయారెందుకు? చెప్పండి, ఏమీ దాచుకోవక్కర్లేదు, మనస్సు తేలికయిపోతుంది" అన్నాను.

ఆమె నిజమేనన్నట్లు తలాడించింది. ఎలా చెప్పాలా అన్నట్లుగా ఆలోచిస్తూ కాసేపు మౌనంగా ఉండి "రాజీవ్ మీద కసితో ఉన్న నన్ను ఈ ఆకాశం 'ఓదార్పు మేఘం' తో కమ్మేసింది" అంది. ఆమె చెప్తున్నది నాకర్థం అయింది. ఆమె చేతి మీద చెయ్యేసి నిమిరాను. నా కళ్ళల్లోకి చూస్తూ

"రాజీవ్ కి తెలియకుండా ఆకాశ్ తో నేనేర్పరుచుకున్న సంబంధం నాకు నచ్చేది కాదు మేడమ్. నచ్చకపోవడం అనేది మరింత అసహనాన్ని కలిగించేది. ఆ అసహనాన్ని తొందరలోనే వదుల్చుకోగలిగాను కాని ఈ భర్త బంధాన్ని వదులుకోలేకపోయాను. బహుశా పిల్లవాడికి తండ్రిని దూరం చేయకూడదనా!? బంధాలు ఏర్పరచుకోవడానికి అనేక కారణాలుంటాయి అని నాకు నేను నచ్చచెప్పుకున్నానా? లేక నా ఆత్మన్యూనత వల్లనా అంటే చెప్పలేను.

ఏం చెయ్యాలో తెలీని స్థితిలో ఉన్న నేను రాజీవ్ పాత జీవితాన్ని గురించి ఏమీ మాట్లాడలేకపోయేదాన్నిఅయితే ఇంట్లో మా ఇద్దరి మధ్యా అడ్డుగోడలు, మేం మాట్లాడుకునే మాటల్లో అగ్నిశిఖలు. పరస్పర వ్యతిరేక శక్తులు తీవ్రతరం కావాలి. ఒక చోట చేరాలి, అవి సంఘర్షించాలి, అతను బయటపడాలి... ఎదురు చూస్తున్నాను ఆరోజు కోసం. ఏదో తెలియని బాధని అనుభవిస్తూ, అతన్ని మాటలతో హింసిస్తూ... ఒక పక్క ద్వేషిస్తూనే కలిసి కాపురం చేస్తూ... తెలియకుండానే సంవత్సరాలు గడిచిపోయాయి.

ఇంత తీవ్ర ఘర్షణలని చూస్తూ పిల్లవాడు ఏమవుతాడో, వాడి భవిష్యత్తు ఏమిటో అన్న ఆలోచన నాకు కలగలేదు - 'ఏంటి మమ్? నాన్న రాకపోతే రాలేదంటావు వస్తే తగాదా పెట్టుకుంటావు!?' అని బాబు అంటూనే ఉండేవాడు.

బాబుకి పదో తరగతి అప్లికేషన్ లో తండ్రి పేరు రాయడానికి అతను ఒప్పుకోకపోవడంతో తట్టుకోలేకపోయాను. అన్నాళ్ళూ లోలోపలే దాచుకున్న కోపం బయటకి తన్నుకొచ్చింది. అతన్ని కొడుతూ, రక్కుతూ, పెద్దగా అరుస్తూ 'ఆకాశ్ చెప్పింది నిజమే కదా' అని నిలదీశాను.

నాకు తెలుసని ఊహించని అతను మొదట్లో కంగారు పడ్డాడు. నాకు నచ్చచెప్పవలసింది పోయి 'అది పెద్దవాళ్ళ కోసం చేసుకున్న పెళ్ళి శేఫ్, చెప్తే నువ్వు బాధపడతావని చెప్పలేదు. నువ్వంటే నాకు ఇష్టం. నువ్వు లేకుండా ఉండలేను. బాబుని చూడకుండా అసలుండలేను. అయినా ఆ సంబంధం వేరు, మన సంబంధం వేరు. 'లివ్ ఇన్' అంటే అర్థం తెలియనట్లు ఏమిటీ గోల చెప్పు!?' అన్నాడు. అదేం పెద్ద విషయం కాదు అన్నట్లు, లివ్ ఇన్ అంటే 'కాలక్షేపం' అన్నట్లు మాట్లాడుతున్న అతని మాటలు అసహ్యాన్ని కలిగించాయి.

'లివ్ ఇన్ రిలేషన్ షిప్' అంటే అర్థం నీకు తెలుసా? - అది కేవలం నిజాయితీ మీద మాత్రమే నిలబడే సంబంధం, అరమరికలు లేకుండా ఉండాల్సిన సంబంధం, వివాహ వ్యవస్థకంటే కూడా గౌరవంగా నిలబడవలసిన సంబంధం' అని కోపంగా, కసిగా అతనితో అనాలనుంది. అనలేకపోతున్నాను. ఏమనగలను? ఆకాశ్ తో నాకున్న సంబంధం నా ఎదురుగ్గా నిలబడి వెక్కిరిస్తోంది.

బాబుని చూడకూడదనే కండిషన్ పెట్టి, చూస్తే జైలుకి పంపిస్తానని బెదిరించి రాజీవ్ నించి విడిపోయాను. కాని బాబు నన్ను క్షమించలేకపోయాడు. పెద్దయితే వాడే తెలుసుకుంటాడులే అనుకుని నేను మొండిగానే ఉన్నాను. స్కూలు నుండి అప్పుడప్పుడు తండ్రి దగ్గరకి వెళుతున్నాడని తెలిసినా తెలియనట్లు ఊరుకున్నాను.

నా ధ్యేయం ఒకటే. నా బాబుని చక్కగా తీర్చిదిద్దుకోవాలి. అంతే... ఆ తపనతో పెంచుకున్నాను వాడిని. కాని వాడు... మొన్న... నన్నే నిందిస్తూ ఇంత పెద్ద లెటర్ రాసి పెట్టి తండ్రి దగ్గరకి వెళ్ళిపోయాడు.” మోకాళ్ళ మీదికి వంగిపోయి ఏడుస్తున్న ఆమె వీపు మీద నిమిరాను.

5.

"ఇప్పుడు చెప్పండి నేనెవరి కోసం బ్రతకాలి?” అంది. ఆమె కళ్ళల్లోని తీవ్ర దు:ఖం నన్ను కలవరపెట్టింది.

ఏమిటిది? నిజంగా, సంపూర్తిగా మన హృదయాల్లో లేని ఆశయాలని - ఎవరో ఇలా బ్రతుకుతున్నారనీ, మనమూ అలాంటి సంబంధాలు ఏర్పరుచుకోవాలని - ఆచరించడమంత పొరపాటు పని ఇంకోటి లేదు. పోనీ నా సంగతేంటి? పెద్దలు కుదిర్చిన పెళ్ళి చేసుకుని నేను స్వేచ్ఛగా బ్రతుకుతున్నానా?

బానిసత్వం లో మగ్గిపోయి కృంగిపోయి బ్రతకలేక నేను చావాలనుకున్నాను, స్వేచ్ఛ పేరుతో మోసపోయి బ్రతకలేక ఆమె చావాలనుకుంది. ఏమీ తేడా లేదు. ఇద్దరి బాధా ఒకటే...

ఇద్దరు మనుషులు కలిసి జీవించాలనుకునే వ్యవస్థ... పేరేదైనా కానివ్వండి... మనుషుల స్వభావాలు ఔన్నత్యంగా లేకపోతే క్షోభ తప్పదు కదా!

ఆమె అడిగిన దానికి ఏమీ సమాధానం చెప్పకుండా బదులుగా ఆమెకి నా కథంతా చెప్పాను. 'ఇలా ప్రతి దానికీ ఆఖరికి ఏమైనా కొనుక్కోవాలంటే డబ్బు కూడా ఇవ్వకుండా కట్టడి చేసే మగాళ్ళు ఉంటారా!' అన్నట్లు ఆశ్చర్యంగా నన్ను చూస్తున్న ఆమెతో అన్నాను - "ప్రమాదం నుండి బయటపడ్డప్పటి నుండీ నాకు గంగానది కళ్ళముందు కనపడుతోంది శేఫాలిక గారూ. రకరకాల కల్మషాలు కడుపులోకి వచ్చి చేరుతున్నా ప్రక్కలకి నెట్టేస్తూ అనంతంగా, స్వచ్ఛంగా ముందుకు సాగుతున్న గంగ నీరే పదే పదే గుర్తుకొస్తోంది" అన్నాను. మాట్లాడుతున్న నన్నే తదేకంగా చూసింది. అర్థమైందన్నట్లు తలాడించింది. మెల్లగా వాలిపోయి వెల్లకిలా పడుకుంది. అత్యంత తీవ్ర దు:ఖాన్నించి తేరుకున్నట్లుగా ఆమె ముఖం అలిసిపోయి ఉంది.

నాలుగో ఝాము ముగిసింది. చంద్రుడు మందగమనంతో సాగిపోతున్నాడు. చల్లని పిల్లగాలుల రాగాలు వింటూ చెట్ల ఆకులు నృత్యం చేస్తున్నాయి. చెప్పవలసినదీ, వినవలసినదీ ఏమీ లేదన్నట్లు మా ఇద్దరి మధ్యా నిశ్శబ్దం.

కాసేపటికే తొలి ఛాయలను చీల్చుకుంటూ మెల్లగా పైకి చేరుతున్న సూర్యుని కాంతి ఆమె హృదయం మీదకి చేరి నా కళ్ళల్లో ప్రతిఫలించింది.

అప్పుడన్నాను... ఒక్కో పదాన్నీ ఒత్తి పలుకుతూ... "ఊఁ ఏం జరిగిందని ఇలాంటి పిచ్చి పని చేయడం మనం!? వెళదాం, తిరిగి వెళ్ళిపోదాం. మనకి కావలసిన రీతిలో మనం సంతోషంగా జీవిద్దాం నదిలా"

వింటున్న ఆమె ప్రక్కకి ఒత్తిగిల్లి రగ్గుని మీదికి లాక్కుని పడుకుంది వెచ్చగా.

6.

నేను కూడా లేచి ప్రమీల ప్రక్కనే చోటు చేసుకుని పడుకున్నాను. మళ్ళీ కల, కాసేపటికి ఏవేవో మాటలు... "శేఫాలికా! ఆర్ యు ఓకె?... డాక్టర్ గారూ, శేఫ్ కి ఏమీ ప్రమాదం లేదు కదా!?” అని అతను, “ఐయామ్ సారీ మమ్!" అంటూ ఆమె కొడుకూ ఆమెని తట్టి లేపుతూ అంటున్న మాటలు నాకు వినపడుతున్నాయి.

కాసేపట్లో నా భర్తాపిల్లలూ వస్తారు నాకు టిఫిన్ తీసుకుని... ఇడ్లీలు తెస్తానన్నాడు పెద్దబ్బాయి. మా వాళ్ళని తలుచుకోగానే ఆమె భర్తనీ (?), కొడుకునీ చూడాలనిపించింది కాని లేవాలనిపించలేదు. ఏదో ప్రశాంతత నన్ను అలాగే నిద్రలోకి జార్చింది.


********